సూర్య రశ్మి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం పైన 19వ శతాబ్దం చివరి నుండే ప్రయోగాలు మొదలయ్యాయి. అప్పట్లో ఈ విషయాన్ని మొదట విన్నపుడు చాలామంది నవ్వారు. ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అన్నట్లు… ఇప్పుడు సోలార్ విద్యుత్తు అద్భుతాలు సృష్టిస్తోంది. ధర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ తదితర శిలాజ ఇంధనం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తు… ఇవన్నీ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తూ భూగోళం వేడెక్కడానికీ, తద్వారా విపరీత ప్రకృతి ఉత్పాతాలకు దారితీయడానికి కారణం అవుతున్నాయి. దానితో అత్యంత శుభ్రమైన సోలార్ విద్యుత్, పవన విద్యుత్ లకు గిరాకీ పెరుగుతోంది.
సూర్య శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫోటో వోల్టాయిక్ పద్ధతి ద్వారా సూర్య రశ్మిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చడం. రెండు ఒక పెద్ద ఏరియాలో పడే సూర్య కిరణాలను ఒకే చోట కేంద్రీకరించబడేలా చేసి తద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని టర్బైన్ లు తిరగడానికి వినియోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం.
రెండో పద్ధతిని Concenrated Solar Power -CSP అంటారు. ప్రపంచంలో అతిపెద్ద సి.ఎస్.పి విద్యుత్ కేంద్రం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మొజవే ఎడారిలో స్ధాపించారు. మొన్న ఫిబ్రవరి 17 తేదీన లాంఛనంగా ప్రారంభం అయిన ఇవాన్పా సోలార్ ఎలక్ట్రిక్ జనరేటింగ్ సిస్టమ్ (ఐ.ఎస్.ఇ.జి.ఎస్) ను మూడు కంపెనీలు ఉమ్మడిగా స్ధాపించాయి. ఇందులో గూగుల్ ఒకటి.
2.2 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఐ.ఎస్.ఇ.జి.ఎస్ విద్యుత్ కేంద్రంలో 40 అంతస్ధుల ఎత్తులో మూడు టవర్లు నిర్మించారు. ఈ టవర్ లపై భాగంలో బాయిలర్ లు ఉంటాయి. టవర్ చుట్టూ భూమిపైన నిర్మించిన హీలియోస్టాట్ అద్దాలపైన పడిన సూర్య కిరణాలు ఈ బాయిలర్ పైన కేంద్రీకృతం అవుతాయి. దానితో బాయిలర్ వేడెక్కి నీటి ఆవిరి పుడుతుంది. ఈ నీటియావిరి ఆ నిర్మాణంలోని పెద్ద పెద్ద టర్బైన్లను కదిలిస్తుంది. తద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు.
ఐ.ఎస్.ఇ.జి.ఎస్ విద్యుత్ కేంద్రం సామర్ధ్యం 392 మెగావాట్లు. ఇది కాలిఫోర్నియా నగరంలోని 140,000 ఇళ్లకు విద్యుత్ అందించడానికి సరిపోతుంది. దాదాపు 5 చదరపు కి.మీ పరిధిలో ఏర్పాటు చేసిన హీలియో స్టాట్ అద్దాలను చూస్తే అక్కడేదో మహా యజ్ఞం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక క్రమ పద్ధతిలో నిర్మించిన అద్దాలు, వాటి మధ్య ఉన్న భారీ టవర్లు, సూర్యుడి కదలికలకు అనుగుణంగా అద్దాలను నియంత్రించేందుకు నెలకొల్పిన కంప్యూటరైజ్డ్ కంట్రోలింగ్ సెంటర్… వీటన్నింటినీ గెట్టీ ఇమేజెస్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఈధాన్ మిల్లర్ ఫోటోలు తీశారు. వాటిని ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.
మనకి ఫోటో వోల్టాయిక్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఉన్నది గానీ సి.ఎస్.పి పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం లేదు. ఉన్నది కూడా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. గుజరాత్ లో నిర్మిస్తున్న ఈ ఫోటో వోల్టాయిక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 220 మెగావాట్లు సామర్ధ్యం కలది. ఇందులో అనేక కంపెనీలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. వాటిలో లాంకో కూడా ఒకటని పత్రికల సమాచారం.
ఎక్కడో లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడి కిరణాలను తన అదుపులో తెచ్చుకోగలిగిన మానవ మేధస్సుకు నిజంగా జోహార్లు చెప్పాల్సిందే.