ఉక్రెయిన్ సంక్షోభం -టైమ్ లైన్


ఉక్రెయిన్ సంక్షోభం కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం అయింది కాదు. ఇ.యు తో చేసుకోవాలని భావించిన ‘అసోసియేషన్ ఒప్పందం’ ను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించింది లగాయితు మొదలయిన ఆందోళనలు, సంక్షోభం నిజానికి రెండు ప్రపంచ ధృవాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోటీ. ఈ పోటీలో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ కూటమి ఒకవైపు నిలబడగా రష్యా నేతృత్వంలోని యూరేసియా కూటమి మరోవైపు నిలబడి ఉంది. పాత్రధారులు ఉక్రెయిన్ ప్రజలే అయినా వారిని నడిపిస్తున్నది మాత్రం ఈ ఇద్దరు పోటీదారుల ప్రయోజనాలే.

ఆధిపత్య దేశాల పోటీ కాబట్టి అది సమానం అని భావించనవసరం లేదు. ఈ పోటీలో పశ్చిమ దేశాలది తమ ఆధిపత్యాన్ని రష్యా సరిహద్దుల వరకూ విస్తరించుకునే ఆధిపత్య ధోరణి కాగా రష్యాది మాత్రం తమ ప్రయోజనాలను కాపాడుకునే రక్షణాత్మక ధోరణి. రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గినా అది రష్యాకే నష్టకరం. అంతేకాకుండా ప్రపంచంలోని బలాబలాల పొందికలో తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. పశ్చిమ దేశాల అరాచకాలకు పట్టపగ్గాలు లేకుండా పోతుంది. అందుకే రష్యా ప్రతిఘటన న్యాయబద్ధం. ఉక్రెయిన్ సార్వభౌమత్వం పట్ల ఆందోళన ప్రకటిస్తున్న పశ్చిమ దేశాలది కపట నాటకం. ఆ పేరుతో అవి రుద్దుతున్న ఐ.ఏం.ఎఫ్ సంస్కరణలు ఉక్రెయిన్ ను పరాధీనం కావిస్తాయి. రష్యాతో స్నేహం ఉక్రెయిన్ కు లాభదాయకమే కాకుండా సాపేక్షికంగా సమాన ప్రతిపత్తి కలిగినది.

ఈ నేపధ్యం నుండి ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరికించాలి.

నవంబర్ 21, 2013: ఇ.యుతో ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ ను వాయిదా వేస్తూ అధ్యక్షుడు యనుకోవిచ్ నిర్ణయం. ఇ.యుతో ఒప్పందం కారణంగా తమకు కలిగే ఆర్ధిక నష్టాలకు పరిహారం ఇవ్వడానికి ఇ.యు ముందుకు రాలేదని ఆయన ప్రకటించాడు. ఆర్ధిక నష్టం 16 బిలియన్ల డాలర్లకు పైనే ఉండగా ఇ.యు మాత్రం 1 బిలియన్ మాత్రమే ఇవ్వజూపిందని ఆయన తెలిపాడు.

నవంబర్ 22, 2013: ఇ.యు తో ఒప్పందం చేసుకోవాలంటూ నియో నాజీ సంస్ధలు, ప్రతిపక్షాలు కీవ్ వీధుల్లో ప్రదర్శన ప్రారంభించాయి.

నవంబర్ 30, 2013: స్కోబోవా లాంటి తీవ్రవాద నాజీ సంస్ధల కార్యకర్తలు పోలీసులతో వీధిపోరాటాలకు దిగారు. పెట్రోల్ బాంబులు, పిస్టళ్లు, లాఠీలు, గ్యాస్ మాస్క్ లు విరివిగా వినియోగించారు.

డిసెంబర్ 1: కీవ్ లోని ఇండిపెండెన్స్ స్క్వేర్ (అక్కడ మైదాన్ అని పిలుస్తారు) లో ప్రభుత్వ వ్యతిరేక, పశ్చిమ అనుకూల ప్రదర్శకుల హింసాత్మక ఆందోళన. 2004 నాటి ఆరంజ్ విప్లవం కంటే పెద్ద ప్రదర్శన అని పశ్చిమ పత్రికలు ఉప్పొంగిపోతూ వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేశాయి.

డిసెంబర్ 10: కీవ్ ఆందోళనలకు అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ మద్దతు. ఆందోళనలపై పోలీసులు విరుచుకుపడుతున్నారని ఖండన జారీ చేశారు. వారి ప్రజాస్వామిక హక్కులను గౌరవించడానికి బదులు పోలీసు నిర్బంధం ప్రయోగించడం ఏమిటని ప్రశ్న. (మూడేళ్ళ క్రితం ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఆందోళనలపై అమెరికా పోలీసులు విరుచుకుపడిన సంగతిని ఆయన మర్చిపోయారు. సాధారణ మహిళలపై పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ లతో పాటు కాల్పులు కూడా జరిపించిన అమెరికా చరిత్ర ఆయనకు గుర్తు లేదు.)

డిసెంబర్ 11: అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (ఉప విదేశీ మంత్రి) విక్టోరియా నూలంద్ కీవ్ సందర్శన. మైదాన్ లో ఆందోళనకారులను కలిసి ఆమె మాట్లాడారు. కుకీలు, కూల్ డ్రింక్ లు పంచి పెట్టారు.

డిసెంబర్ 14: అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్, యుద్ధ పిపాసిగా పేరొందిన ప్రముఖుడు జాన్ మెక్ కెయిన్ కీవ్ వచ్చి మైదాన్ లోని ఆందోళనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ మరింత ఉధృతంగా ఆందోళన చేయాలని ప్రోత్సహించారు.

డిసెంబర్ 17: ఉక్రెయిన్ ప్రభుత్వ సార్వభౌమ ఋణ పత్రాలను (ట్రెజరీ బిల్స్) 15 బిలియన్ డాలర్ల మేర కొనుగోలు చేయనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన. ఉక్రెయిన్ ప్రజలకు సరఫరా చేసే గ్యాస్ ధరలను కూడా బాగా తగ్గిస్తూ నిర్ణయం.

జనవరి 22, 2014: పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ, ఇద్దరి ఆందోళనకారుల మరణం. అనేకమంది పోలీసులు ఆసుపత్రి పాలు.

జనవరి 23: ప్రతిపక్షాలకు, అధ్యక్షుడికి మధ్య శాంతి చర్చలు. చర్చల నేపధ్యంలో ఆందోళనలు విరమిస్తామని ప్రతిపక్షాల హామీ.

జనవరి 24: ఆందోళనల విరమణకు తీవ్రవాద గ్రూపుల నిరాకరణ. చర్చల వాతావరణం నేపధ్యంలో భద్రతా బలగాలు వెనక్కి తగ్గిన అవకాశం పురస్కరించుకుని ప్రభుత్వ భవనాలలోకి చొరబడి ఆక్రమించారు. వివిధ మంత్రిత్వ శాఖల భవనాలను ఆందోళనకారులు ఆక్రమించారు. మైదాన్ లో బలగాలు రాకుండా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు నెలకొల్పారు.

జనవరి 28: ఆందోళనలను విరమించడానికి వీలుగా ప్రధాన మంత్రి రాజీనామా. ప్రతిపక్షాల నుండి ప్రధానిని నియమిస్తానని అధ్యక్షుడు యనుకోవిచ్ ఆఫర్. అమెరికా, ఇ.యుల విమర్శల మేరకు నిరసన వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం.

ఫిబ్రవరి 16: అరెస్టు చేసిన ఆందోళనకారులను విడుదల చేయడానికి అధ్యక్షుడు అంగీకారం. 234 మంది విడుదల. కీవ్ సిటీ హాల్ ఆక్రమణను విరమించుకున్న ఆందోళనకారులు. ఆందోళనల నుండి మాత్రం వారు వెనక్కి తగ్గలేదు.

ఫిబ్రవరి 18: పోలీసుల రక్షణ వరుసపై ఆందోళనకారుల దాడి. పార్లమెంటు భవనంపై దాడి చేసి పరిసరాలకు నిప్పు పెట్టడంతో భారీ మంటలు చెలరేగాయి. మైదాన్ నుండి ప్రదర్శకులను తొలగించడానికి పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఘర్షణలు జరిగి 8 మంది మరణించారు.

ఫిబ్రవరి 20: అమెరికా, ఇ.యుల మధ్యవర్తిత్వంతో ప్రభుత్వం, ఆందోళన నేతల మధ్య ఒప్పందం. అయినా ఆందోళనలు తగ్గక పోగా మరింత పెచ్చరిల్లాయి. ఆందోళనకారులు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హింసాత్మక చర్యల్కు తెగబడ్డారు. పెట్రోల్ బాంబులు, తుపాకులు యధేచ్ఛగా ఉపయోగించారు. ప్రభుత్వ బలగాలకు, ఆందోళనకారులకు మధ్య భారీ ఘర్షణ జరగడంతో 60 మందికి పైగా మరణించారు. పోలీసు స్నైపర్లు భవనాల పైనుండి ప్రదర్శకులను కాల్చారని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. ఇరాక్, లిబియా, సిరియాలలో సైతం పశ్చిమ దేశాలు ఇవే ఆరోపణలు చేయడం గమనార్హం.

ఫిబ్రవరి 21: ఇ.యు మధ్యవర్తిత్వం ద్వారా ప్రతిపక్షాలకు, యనుకోవిచ్ కి మధ్య ఒప్పందం. నూతన జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడి అధికారాలు తగ్గించడానికి యనుకోవిచ్ అంగీకారం. అవినీతి కేసులో శిక్ష పడి జైలులో ఉన్న మాజీ అధ్యక్షురాలు యులియా టిమెషెంకో విడుదలకు అంగీకారం. అయినప్పటికీ ఆందోళనకారులు తమ హింసాయుత చర్యల నుండి వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ భవనాలు, అధ్యక్ష భవనం కూడా ఆందోళనకారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు రష్యా సరిహద్దు నగరం ఖార్కివ్ కు పలాయనం.

ఫిబ్రవరి 22: పార్లమెంటు సభ్యుల్లో అనేకమంది అదృశ్యం అయ్యారు. కేవలం ఇ.యు, అమెరికా మద్దతుదారులే మిగిలారు. పాలక పార్టీ పార్టీ ఆఫ్ రీజియన్స్ సభ్యులు లేని పార్లమెంటులో అధ్యక్షుడు యనుకోవిచ్ ను తొలగిస్తూ నిర్ణయం. మాజీ అధ్యక్షురాలు టిమెషెంకో విడుదల.

ఫిబ్రవరి 23: కొత్త స్పీకర్, టిమెషెంకో వర్గీయుడు ఒలెక్సాండర్ తుర్చినోవ్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రతిపక్ష సభ్యులతో కూడిన పార్లమెంటు నిర్ణయం. ఋణ చెల్లింపుల ఎగవేత నుండి తప్పించుకోవడానికి రుణాలు ఇవ్వాలని పశ్చిమ దేశాల ముందు దేబిరింపు. కానీ యనుకోవిచ్ కు రష్యా ఇచ్చినట్లుగా ఇ.యు, అమెరికాల నుండి అక్రమ ప్రభుత్వానికి ఎలాంటి హామీ రాలేదు.

ఫిబ్రవరి 23: క్రిమియాలో రష్యా అనుకూల ఆందోళనలు ప్రారంభం.

ఫిబ్రవరి 24: అధ్యక్షుడు యనుకోవిచ్ అరెస్టుకు అరెస్టు వారంట్ జారీ. ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా ఖండన జారీ చేసింది. ఏ.కె.47 చేబూనిన నల్ల మాస్క్ ధారులుగా కీవ్ ఆందోళనకారులను రష్యా ప్రధాని మెద్వెదేవ్ అభివర్ణించారు.

ఫిబ్రవరి 26: పశ్చిమ దేశాల ఇష్టుడు ఆర్సెనియ్ యట్సెన్యుక్ ను ప్రధానిగా నియమించాలని ఆందోళన నేతల నిర్ణయం.

ఫిబ్రవరి 26: ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులో సైనిక విన్యాసాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు.

ఫిబ్రవరి 27: రష్యా ఆదేశాలపై అమెరికా, ఇ.యు నేతల ఖండన మండనలు. రష్యా సైనిక విన్యాసాలకు అర్ధం ఏమిటని అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్ నిలదీత. ఉక్రెయిన్ పై సైనిక చర్య చేయరాదని రష్యా కు హెచ్చరిక.

ఫిబ్రవరి 27: ముసుగులు ధరించిన సైనికులు క్రిమియా ప్రాంతీయ పార్లమెంటును, ప్రభుత్వ భవనాలను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ దేశాల మద్దతు ప్రకటనలు వెలువడుతుండగా ఉక్రెయిన్ చీలికకు తాము ఒప్పుకోబోమని నూతన ప్రభుత్వం ప్రకటించింది.

ఫిబ్రవరి 27: మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ కు ఆశ్రయం మంజూరు చేసిన రష్యా.

ఫిబ్రవరి 28: క్రిమియా వ్యాపితంగా ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలను రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తున్న రష్యా చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. రష్యా దాడి చేయవచ్చన్న అంచనాతో ఉక్రెయిన్ బలగాలు సర్వసన్నద్ధం కావాలని ప్రభుత్వం కోరింది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సాయుధ ఘర్షణ చెలరేగవచ్చన్న భయాలు వ్యాపించాయి.

మార్చి 1: ఒక్క తుపాకి గుండు పేలకుండానే రష్యా, క్రిమియాను అదుపులోకి తీసుకుందని పత్రికలు నిర్ధారించుకున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం గానీ, పశ్చిమ దేశాలు గానీ హెచ్చరికలు చేయడం వినా ఏమీ చేయలేకపోయాయి.

మార్చి 1: మార్చి 30 న క్రిమియా భవిష్యత్తును తేల్చడానికి రిఫరెండం నిర్వహించాలని ప్రాంతీయ పార్లమెంటు నిర్ణయం.

మార్చి 1: అమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ కాల్. సుదీర్ఘ సంభాషణలో క్రిమియాలో రష్యా బలగాలు తమ స్ధావారానికి వెళ్లిపోవాలని ఒబామా డిమాండ్ చేశారు. రష్యన్ల ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత తనపై ఉందని చెబుతూ ఒబామా డిమాండ్ ను పుతిన్ తిరస్కరించారు.

మార్చి 2: అంతర్జాతీయ సహాయం కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటన.

మార్చి 2: తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాల్లోని పలు పట్టణాలు, నగరాల్లో రష్యా అనుకూల ఆందోళనలు చెలరేగాయి. ఖార్కివ్, దోనెట్స్క్ లాంటి నగరాల్లో ప్రాంతీయ ప్రభుత్వ భవనాలను రష్యా అనుకూల ఆందోళనకారులు ఆక్రమించుకున్నారు. రష్యా జెండాలను ఎగురవేశారు. క్రిమియాలో 6,000 రష్యా బలగాలు ఉన్నాయని అమెరికా ప్రకటించింది.

మార్చి 2: క్రిమియాలో రష్యా చర్యకు నిరసనగా త్వరలో రష్యా నగరం సోచిలో జరగబోయే జి8, జి7 సమావేశాలను బహిష్కరించాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీల నిర్ణయం.

మార్చి 3: క్రిమియా తూర్పున చివరి భాగం అయిన కెర్చ్ ను రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనితో మరిన్ని రష్యా బలగాలు క్రిమియా రానున్నాయని ఊహాగానాలు వ్యాపించాయి.

మార్చి 3: మాజీ ఉక్రెయిన్ అధ్యక్షురాలు టిమెశెంకో చర్చల కోసం మాస్కో బయలుదేరి వెళ్ళినట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు పతనం అయ్యాయి. చమురు ధరలు పెరిగాయి.

మార్చి 4: టిమెషెంకో దౌత్యం ఫలితమే ఏమో తెలియదు గానీ ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులో విన్యాసాలు నిర్వహిస్తున్న సైనిక బలగాలు వెనక్కి మళ్ళీ తమ స్ధావరాలకు చేరుకోవాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్రిక్తతలు చల్లబడతాయన్న ఆశాభావంతో ఇండియాతో సహా ఆసియా షేర్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు కూడా లాభాలు నమోదు చేస్తాయని, చమురు ధరలు తగ్గుతాయని రాయిటర్స్ వార్తా సంస్ధ అంచనా వేసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s