రష్యా అదుపులో క్రిమియా, నీతులు వల్లిస్తున్న అమెరికా


Russian army vehicles in Balaclava, Crimea

Russian army vehicles in Balaclava, Crimea

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే స్ధితికి చేరింది. యూరోపియన్ యూనియన్ లో చేరడానికి నిరాకరించినందుకు అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ లో హింసాత్మక చర్యలు రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఆందోళనలు చివరికి అధ్యక్షుడు యనుకోవిచ్ ను దేశం విడిచి వెళ్లిపోయేలా చేశాయి. అనంతరం ఇ.యు, అమెరికా అనుకూల శక్తులు, నాజీ తరహా జాతీయ విద్వేష పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను, పార్లమెంటును స్వాధీనం చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారం చేపట్టిన అధ్యక్షుడిని తప్పించి సొంత తాత్కాలిక అధ్యక్షుడిని నియమించుకున్నాయి.

ఈ నేపధ్యంలో రష్యా చురుకుగా కదిలింది. రష్యన్లు మెజారిటీ సంఖ్యలో నివసించే స్వయంప్రతిపత్తి ప్రాంతం క్రిమియాలో రక్షణ చర్యలు చేపట్టింది. నల్ల సముద్రంలో మూడువైపులా సముద్రంతో చుట్టి ఉండే క్రిమియా, ఉక్రెయిన్ లో భాగమే అయినప్పటికీ సొంత  పార్లమెంటు, రక్షణ బలగాలు కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ నివసించేవారిలో ఎక్కువమంది రష్యన్లు కాగా టాటార్ ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. ఉక్రెయిన్ జాతీయుల (ethnic ukrainians) సంఖ్య చాలా తక్కువ. ఆ మాటకు వస్తే మొత్తం ఉక్రెయిన్ లో కూడా Ethnic Russian లనూ, Ethnic Ukrainian లను విడదీసి చూడడం కష్టం. చివరికి రష్యా భాష, ఉక్రెయిన్ భాష కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. క్రిమియాలో రష్యాకు సైనిక స్ధావరం ఉన్నది.

ఉక్రెయిన్ లో హింసాత్మక ఆందోళనలను చల్లబరచడానికి ఇ.యు, అమెరికాల మధ్యవర్తిత్వంలో ఆందోళనకారులకు, అధ్యక్షుడికి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందం అయితే కుదిర్చారు గానీ దాన్ని అమలు చేయించే బాధ్యతను ఇ.యు, అమెరికాలు గాలికి వదిలేశాయి. పైగా ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఆక్రమించుకుంటున్నా వారిని వదిలి ప్రభుత్వానికే నీతులు చెప్పారు. పెట్రోల్ బాంబులు విసురుతూ, కనిపించిందల్లా తగలబెడుతూ, పోలీసులపై కాల్పులు జరుపుతూ భారీ విధ్వంసం సాగించడంతో ఒప్పందం అమలు కాలేదు. అధ్యక్షుడు యనుకోవిచ్ నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి బదులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సొంత నగరానికి వెళ్లిపోయాడు. అనంతరం అక్కడినుండి రహస్యంగా సరిహద్దులు దాటి రష్యాలో రాజకీయ ఆశ్రయం పొందాడు.

Crimea 2

ఈ విధంగా ఉక్రెయిన్ పూర్తిగా ఇ.యు, అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్ధితి వచ్చింది. ఐరోపా దేశాల నుండి, అమెరికా నుండి వివిధ నాయకులు, మంత్రులు, అధికారులు ఉక్రెయిన్ వచ్చి సంప్రదింపులు జరుపుతూ, సలహాలు ఇస్తూ తామే ప్రభుత్వాన్ని నడిపేస్తున్నారు. ఫలితంగా రష్యా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంషా ఒలాండే తదితర నేతలు సైనిక చర్యకు దిగరాదంటూ రష్యాకు హెచ్చరికలు చేస్తుండగానే ఉక్రెయిన్ లో సైనిక జోక్యానికి రష్యా పార్లమెంటు నుండి అనుమతి పొందాడు.

ఉక్రెయిన్ విషయంలో సైనిక చర్య తీసుకోవడానికి కూడా పార్లమెంటు అనుమతి ఇచ్చిన తర్వాత పుతిన్ కొన్ని క్రియాశీలక చర్యలు తీసుకున్నాడు. స్వయం ప్రతిపత్తి ప్రాంతం క్రిమియాకు రష్యా సైన్యాన్ని పంపాడు. స్ధానికంగా ఉన్న సైనిక స్ధావరం నుండి సైనికులను పంపి వివిధ ప్రభుత్వ భవనాలకు రక్షణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. పశ్చిమ దేశాల సలహాతో క్రిమియా ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకునేందుకు ఉక్రెయిన్ సొంత సైన్యాలను పంపింది. అయితే వారు ఉక్రెయిన్ ప్రభుత్వం అప్పజెప్పిన పని వదిలేసి క్రిమియా ప్రభుత్వానికి తమ విధేయత ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన పలు యుద్ధ నౌకలు సైతం క్రిమియాను వదిలి ఉక్రెయిన్ రేవులకు వెళ్ళేందుకు బయలుదేరాయి. వాటిలో కొన్ని సాంకేతిక లోపాలతో వెనక్కి రాగా మరికొన్ని వెనక్కి వచ్చి క్రిమియా ప్రభుత్వానికి విధేయత ప్రకటించాయి.

రష్యా సైనిక చర్యను అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ విమర్శించాడు. అధ్యక్షుడు ఒబామా స్వయంగా పుతిన్ కి ఫోన్ చేసి సైనిక చర్య పట్ల నిరసన తెలిపాడు. అయితే పుతిన్ అవేమీ పట్టించుకోలేదు. రష్యాను, దాని ఆర్ధిక ప్రయోజనాలనూ సమూలంగా నాశనం చేసే ఉద్దేశ్యంతోనే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ లో రగిల్చిన కుంపటిని ఆర్పకుండా అట్టే ఉంచాలని ఒబామా కోరితే దానిని మన్నించాలా లేక సొంత భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలా అన్నది పుతిన్ ముందున్న ప్రశ్న. దేశభక్తి ఉన్న నాయకులేవరైనా సొంత భద్రతనే చూసుకుంటారు. పుతిన్ చేసింది అదే.

ఈ సందర్భంగా జాన్ కేర్రీ రష్యాపై ఎక్కుపెట్టిన విమర్శలు అత్యంత హాస్యాస్పదంగానూ, సిగ్గుమాలినవిగానూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న హిపోక్రసీ అంతా తెచ్చి కుప్ప పోస్తే అవి జాన్ కేర్రీ విమర్శలని చెప్పవచ్చు. బూటకపు కారణాలతో ఉక్రయిన్ పై సైనిక చర్యకు దిగడం రష్యాకు తగిన పని కాదని జాన్ కెర్రీ విమర్శ. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను ఉల్లంఘించే హక్కు, అధికారం రష్యాకు లేవట.

నవ్విపోదురుగాక! ఏ హక్కుతో అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ పై దాడికి తెగబడి ఆ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించినట్లు? ఏ అధికారంతో ఇరాక్ పై దాడి చేసి ఆరని కాష్టంగా ఆ దేశాన్ని మార్చినట్లు? సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని బూటకపు సాక్ష్యాలు సృష్టించి దాడి చేయడం నిన్న మొన్నటి ఉదంతమే కాదా? లిబియా నేత మౌమ్మర్ గడ్డాఫీ తన ప్రజలపై సామూహిక హత్యాకాండకు బయలుదేరాడని అబద్ధాలు చెప్పి యుద్ధ విమానాలతో దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర ఎప్పటిదని?

వాస్తవం ఏమిటంటే రష్యాను దారికి తెచ్చుకునేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ను మార్గంగా ఎంచుకున్నాయి. ఉక్రెయిన్ ను ఇ.యులో చేర్చుకుంటే రష్యా నేతృత్వంలో నిర్మితం అవుతున్న యూరేసియన్ కూటమిని అడ్డుకోవచ్చన్నది పశ్చిమ దేశాల పధకం. కానీ ఇ.యు ఎటువంటి ప్రతిఫలం చూపకపోవడంతో ఇ.యులో చేరే ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిచ్ చివరి నిమిషంలో వాయిదా (కేవలం వాయిదా మాత్రమే, రద్దు కాదు) చేసుకున్నాడు. ఆ మాత్రానికే ఉక్రెయిన్ లో అలజడులు సృష్టించాయి అమెరికా, ఇ.యులు. అమెరికా ఎం.పిలు,. ఇ.యు అధికారులు అనేకమంది స్వయంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి ఆందోళనకారులను రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇచ్చారు. ఇంకా విధ్వంసం సృష్టించండి అని ప్రోత్సహిస్తూ తినడానికి, తాగడానికీ పోట్లాలు పంచి వెళ్లారు. అప్పుడు వీళ్ళకి ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం గుర్తుకు రాలేదా?

ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్ధితుల్లో అమెరికా, ఇ.యుల ఆధిపత్యాన్ని బలహీనపరచడమే తక్షణ అవసరం. అందుకోసం ప్రపంచంలో వివిధ ప్రాంతీయ కూటములు అవతరించి సొంత ప్రయోజనాల కోసం పాటుపడాలి. తద్వారా పశ్చిమ బహుళజాతి కంపెనీల మార్కెట్ దాహానికి అడ్డుకట్ట వేయాలి. మార్కెట్ దాహంతో తపించిపోతూ అడుగు పెట్టిన చోటల్లా విధ్వంసం సృష్టిస్తూ హింసాత్మక రాజకీయాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాలను సైతం హింసాత్మకంగా కూలదోస్తూ ప్రపంచ శాంతికి భంగకరంగా మారిన పశ్చిమ దేశాల (అమెరికా, ఇ.యు) ఆధిపత్యాన్ని నిలువరించడం ఇప్పటి అవసరం. ఆ పని రష్యా చేసినా, చైనా చేసినా ఆహ్వానించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s