
రక్షణ రంగంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మన సైన్యం ‘రక్షణ సంసిద్ధత’ పైనే పలు అనుమానాలు కలుగజేస్తున్నాయి. వాడిపారేసిన జలాంతర్గాములను కొనుక్కొచ్చి నావికా దళాలకు అప్పగిస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతోంది. వరుస ప్రమాదాలతో జలాంతర్గాములు మన నావికా శక్తి డొల్లతనాన్ని చాటడమే కాకుండా విలువైన నావికాధికారుల ప్రాణాలను కూడా తోడేస్తున్నాయి.
ఇతర దేశాలు వాడిన జలాంతర్గాములు, విమాన వాహక నౌకాలతో నిండిన మన నావికా బలగాల పరిస్ధితి ఏమిటో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది.
కొద్ది నెలల క్రితం సింధూరక్షక్ అనే జలాంతర్గామిలో ఉన్నట్లుండి పేలుళ్లు జరగడంతో అరడజను మంది వరకు నావికా అధికారులు చనిపోయారు. వారి శరీర అవశేషాలు కూడా దక్కని ప్రమాదం అది. దాన్ని మర్చిపోకమునుపే మరో జలాంతర్గామి సింధు రత్న లో అగ్ని ప్రమాదం సంభవించింది. కేబుల్స్ లో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు.
1967లో మన నావికా దళంలో ప్రవేశించిన సబ్ మెరైన్ల కోసం మెరికల్లాంటి యువకులను మాత్రమే ఎంపిక చేస్తారు. వారి వయసు పెరిగాక ఇతర విధులకు తరలిస్తారు. అనేక రకాలుగా కఠిన పరీక్షలు విధించి అందులో నెగ్గిన వారినే జలాంతర్గాముల కోసం ఎంపిక చేస్తారు. అలాంటి నావికా సైనికులను యుద్ధంలో కాకుండా ఒట్టి పుణ్యానికి పోగొట్టుకోవడం నిస్సందేహంగా అవాంఛనీయం. ఈ వరుస ప్రమాదాల నేపధ్యంలో నావికా దళాధిపతి రాజీనామా చేశారు గానీ నిజానికి ఇలాంటి పరిస్ధితికి కారణం రాజకీయ నిర్ణయాలలోనే చూడాల్సి ఉంటుంది.
సింధు రత్న సబ్ మెరైన్ లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులు అపూర్వమైన తెగువతో ప్రాణాలకు తెగించి సహచర కామ్రేడ్లను కాపాడినట్లు తెలిస్తే మరింత బాధ కలుగుతుంది. అగ్ని ప్రమాదం గమనించిన వెంటనే ఆ ఇద్దరు నావికా సైనికులు ఇతర సిబ్బందిని ప్రమాదం జరిగిన కంపార్ట్ మెంటు నుండి బలవంతంగా బైటికి గెంటేసి తలుపులు వేసేసుకున్నారు. సబ్ మెరైన్ కార్యకలాపాల్లో ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అని తెలుస్తోంది.
ఏదైనా కంపార్ట్ మెంట్ లో అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ కంపార్ట్ మెంట్ ను మిగిలిన భాగాల నుండి ఒంటరిని (isolate) చేయడం స్టాండర్డ్ ప్రొసీజర్. అయితే ప్రమాదం జరిగిన కంపార్ట్ మెంట్ ని isolate చేయాల్సి ఉండగా ఈ సైనికులు మాత్రం తమను తాము కూడా isolate చేసుకుని మంటలతో పోరాడడానికి సిద్ధపడ్డారు. తద్వారా మంటలను ఆర్పడంలో సఫలం అయ్యారు గానీ తమను తాము కాపాడుకోలేకపోయారు. సబ్ మెరైన్ నూ, ఇతర సిబ్బందిని కాపాడి తాము చనిపోయారు. వారి త్యాగం ఫలితంగా సబ్ మెరైన్ రిపేర్లు పూర్తి చేసుకుని మళ్ళీ విధుల్లో చేరగల స్ధితిలో ప్రమాదం నుండి బైటపడింది. బహుశా వారి త్యాగమే కలచివేసిందో ఏమో నావికాదళాధిపతి మరో రెండేళ్లు సర్వీసు ఉన్నా రాజీనామా చేశారు.
మనుషులు, వారు సైనికులైనా, సామాన్యులైనా ఎప్పుడూ తగిన సేవలకు (దేశభక్తి రీత్యా) సిద్ధంగానే ఉంటారు. కానీ మనిషి కేటగిరీలోకి రాని రాచకీయ నాయకులు, వారి మాస్టర్లే మనుషులను బలిపెడుతుంటారు.
మారణాయుధాల కోణం కంటే వాటి కుంభకోణం భారత్ కు ప్రమాదకరంగా మారింది. నాటి బోఫోర్స్ నుంచి నిన్న మొన్నటి దేశ రక్షణ సామగ్రీల వరకు రాజకీయదారులలో పడి చివరకు భస్మాసుర హస్తంలా మారాయి. దేశభక్తిలో కూడా భుక్తి కక్కుర్తిపడిననాడు ఏదేశం మాత్రం బతికి బట్టకడుతుంది?
ఆ వీర సైనికుల త్యాగం నిరుపమానమైనది. నిజమైన భారతీయులమని నిరూపించుకున్నారు. మన కక్కుర్తి నేతలే…..సైనికుల చావుని కూడా సొమ్ము చేసుకుంటారు. ఐనా అడ్డమైన రాజకీయాలు, చర్చలు పెట్టే మన మీడియా ఇటువంటి వీరుల త్యాగం గురించి జనాలకి విస్తృతంగా తెలిసేలా ప్రచారం చేయాలి.