2002 నాటి గోధ్రా అనంతర మత కారణకాండకు క్షమాపణలు చెప్పాలా లేదా అన్న సంగతి బి.జె.పి నాయకులు తేల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తప్పులు ఏమన్నా జరిగి ఉంటే శిరసు వంచి క్షమాపణలు కోరడానికి సిద్ధంగా ఉన్నాం అని బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ రోజేమో తమ అధ్యక్షుడు క్షమాపణ చెప్పలేదంటూ ఆ పార్టీ ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నక్వి వివరణతో ముందుకు వచ్చారు. ఇంతకీ బి.జె.పి క్షమాపణ చెప్పినట్లా (కనీసం క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నట్లా), చెప్పనట్లా?
నిజానికి క్షమాపణలు చెప్పడం అంటూ జరిగితే అది చేయాల్సింది రాజ్ నాధ్ సింగ్ కాదు. ముస్లిం మారణ హోమానికి మద్దతు ఇచ్చి ప్రోత్సహించారని బాధితులు చెబుతున్న నరేంద్ర మోడీయే ఆ పని చేయాలి. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని మోడి గతంలో కొన్నిసార్లు చెప్పి ఉన్నారు. ఇటీవల ఎహసాన్ జాఫ్రీ పిటిషన్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చాక మోడి తన బ్లాగ్ లో రాస్తూ ఆనాటి ఘటనలు తనకు బాధ కలిగించాయని చెప్పుకున్నారు. ఆయన రాతలు ప్రధాన మంత్రి పదవి కోసం ఆడుతున్న నాటకాలు మాత్రమే అని బాధితులు కొట్టిపారేశారు.
ఆ తర్వాత మళ్ళీ మొన్న మంగళవారం (ఫిబ్రవరి 25) బి.జె.పి మైనారిటీ మోర్చా జరిపిన సభలో మాట్లాడుతూ బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ క్షమాపణ ప్రసక్తి తెచ్చారు. “మేము తప్పు చేసి ఉన్నట్లయితే, మేము మా తల వంచి క్షమాపణ చెబుతాము” అని అన్నారాయన. చిత్రం ఏమిటంటే మారణకాండలు తమ పాలనలో మాత్రమే జరిగాయా అని ప్రశ్నించడం! మత హింస అనగానే 2002 గుజరాత్ హింసకాండ మాత్రమే ఒక రిఫరెన్స్ గా చెబుతున్నారు తప్ప కాంగ్రెస్ పాలనలో ఎన్నిసార్లు హింసా కాండలు జరగలేదు అని ఆయన ప్రశ్నించారు.
“హితేశ్వర్ సైకియా అని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన పదవిలో ఉండగా అస్సాంలో 24 గంటల్లోనే 5,000 మంది ముస్లింలను చంపేశారు. గుజరాత్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా హితేంద్ర దేశాయ్ ఉండగా మసీదులు, స్మారక చిహ్నాలు తగలబెట్టలేదా? భారత దేశంలో ఇక ఎప్పుడూ మతహింస జరగనేలేదా?” అని రాజ్ నాధ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకులు చంపితే తప్పు కానిది బి.జె.పి పాలకులు చంపితే తప్పెలా అవుతుందని బి.జె.పి నేత ప్రశ్నిస్తున్నారు.
ఏ రాజనీతి శాస్త్రంలో ఇలాంటి నీతి సూత్రం రాయబడి ఉందో తెలియదు గానీ బి.జె.పి అధ్యక్షుడికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. లేకపోతే తమ హయాంలో జరిగిన హింసను సమర్ధించుకోవడానికి ప్రత్యర్ధుల హయాంలో జరిగిన హింసను తెచ్చి చూపుతారా? నేరం ఎవరు చేసినా నేరమే గానీ కాంగ్రెస్ నేరాలకు శిక్ష పడలేదు కాబట్టి బి.జె.పి నేరాలకు కూడా శిక్ష పడకూడదని వాదించడం ఏ నీతి?
ఇక బి.జె.పి ముస్లిం నేత ఇంకా మరిన్ని ఆకులు చదివేశారు? గతంలో తాము తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెబుతాము అన్న కనీస బాధ్యతా గుర్తింపును కూడా ఆయన రద్దు చేసేశారు. “బి.జె.పి అధ్యక్షుడు క్షమాపణ చెప్పలేదు. సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజలు మాతో రావాలని మేము కోరుతున్నాం. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని మేము భావించడం లేదు. గతంకు సంబంధించి ఆయనేమీ క్షమాపణ చెప్పలేదు. అల్లర్లు కాంగ్రెస్ పాలనలోనూ జరిగాయి. కానీ ఆ పార్టీ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పింది?” అన్నారు నక్వీ.
అంటే దేశంలో ఉన్నది ఒక్క కాంగ్రెస్, బి.జె.పి పార్టీలే తప్ప జనం లేరన్నమాట! వీళ్ళకి క్షమాపణలు చెప్పాల్సి వస్తే కాంగ్రెస్ మాత్రమే కనపడుతుంది. ఓట్లు కావలసి వచ్చినపుడు మాత్రం జనం గుర్తుకు వస్తారు. ముస్లింలకు కూడా ఓట్లు ఉన్నాయి గనక ‘అన్ని సెక్షన్లూ మాతో కలిసి రావాలని మా కోరిక’ అని మాటవరసకు అనాల్సి వస్తోంది గానీ లేకపోతే అదీ అనరు.
క్షమాపణ చెప్పడం అంటూ జరిగితే అది ఎవరిని అడుగుతారు? ప్రజల్ని అడుగుతారు. అంతేగానీ రాజకీయ పార్టీలని కాదు గదా? గుజరాత్ మారణకాండలో బలయింది సామాన్య ముస్లింలు. అత్యంత పేదలు. ఎక్కువ మంది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలే. అలాంటి పేదలని కనిపెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దానినే ‘రాజ ధర్మ’ అని అప్పటి ప్రధాని వాజ్ పేయి గారు అన్నది. పాలకుడిగా మోడి రాజధర్మం నిర్వహించలేదని ఆయన అన్నారు. కనీసం అందుకయినా మోడి క్షమాపణ చెప్పాలి.
పోలీసు, పాలనా యంత్రాంగాల చేతులు కట్టేసి బాధితులను కాపాడకుండా, నిందితులకు శిక్షలు పడకుండా అడ్డుకున్నందుకు క్షమాపణ చెప్పడం కాదు, శిక్ష అనుభవించాలి. అది ఎలాగూ జరిగేది కాదు కాబట్టి కనీసం ఓట్ల కోసమైనా క్షమాపణ చెబుదామని రాజ్ నాధ్ సింగ్ చూస్తుంటే ఇతర నాయకులకు అదీ రుచిస్తున్నట్లు లేదు. రాజ్ నాధ్ సింగ్ మాటల్ని పూర్వపక్షం చేసే వివరణ ఇవ్వడానికి మళ్ళీ ముస్లిం నేతే కావాలి?!
రాజకీయాలలో అధిక్షేపణల పర్వాలు తప్ప క్షమాపణ పాఠాలు పనిచెయ్యవు. ప్రజలకు క్షమాపణ చెప్పడంలోని అంతరార్ధం భవిష్యత్తులో తన విషయంలో అనర్ధాలు జరగకుండా తీసుకునే ప్రాధమిక చర్య.
కసాయి వాన్ని నమ్మే నక్వీలు బంగారు లక్ష్మన్ లు, ఫాశ్వన్లు ఉన్నంత కాలం పరిస్థితి మారదు.
http://eemaata.com/em/issues/201403/3567.html?allinonepage=1