భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు


India GDP

భారత దేశ అభివృద్ధి కధ ఎప్పటికయినా పునరుద్ధరించబడేనా? 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ముందు వరకు సగటున 9 శాతం జి.డి.పి వృద్ధి రేటుతో పశ్చిమ పెట్టుబడులకు చైనా తర్వాత ఫేవరెట్ గా నిలిచిన ఇండియా ఇప్పుడు అందులో సగం వృద్ధి సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. ‘ఫాస్ట్ ట్రాక్’ పేరుతో స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు అనుమతులను భారత చట్టాలను బుల్ డోజ్ చేస్తూ జారీ చేస్తున్నా ఆర్ధిక వ్యవస్ధలో మునుపటి కళ గోచరించడం లేదు. పారిశ్రామిక ఉత్పత్తి బలహీనపడి, పెట్టుబడులకు కరువాసిపోవడంతో కళావిహీనమైన మొఖాలతో ఉన్న ఆర్ధిక మంత్రి, ప్రధాన మంత్రులు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ఒలికిస్తూ ఖాళీ వాగ్దానలతో సరిపుచ్చుతున్నారు.

ఒకటవ, రెండవ త్రైమాసికాల్లో 4.4%, 4.8% వృద్ధి రేటు నమోదు చేసిన ఇండియా మూడో త్రైమాసికంలో అయినా పుంజుకుంటుందన్న ప్రభుత్వ ఆశలు పెద్దగా ఫలించే అవకాశాలు లేవని వివిధ అంచనాలు తెలియజేస్తున్నాయి. రాయిటర్స్ వార్తా సంస్ధ జరిపిన సర్వేలో మూడో త్రైమాసికంలో జి.డి.పి వృద్ధి రేటు మహా అయితే 4.9% నమోదు కావచ్చని తేలింది. శుక్రవారం సాయంత్రం మూడో త్రైమాసికం ఆర్ధిక ఫలితాలను ప్రభుత్వ గణాంక శాఖ వెల్లడి చేస్తేగాని ప్రభుత్వ తాత్కాలిక (ప్రొవిజనల్) అంచనాతో సర్వే ఫలితాలు ఏకీభవిస్తున్నదీ లేనిదీ తెలియదు.

2013-14 సంవత్సరానికి గాను భారత ఆర్ధిక వృద్ధి రేటు 5 శాతం మాత్రమే నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు అంచనా వేసినపుడు మన ప్రధాని, ఆర్ధిక మంత్రి ఉక్రోషపడిపోయారు. ఏ ఆధారంతో ఇండియా వృద్ధి రేటు అంత తక్కువగా అంచనా వేశారని ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు ఆయా దేశాల జి.డి.పి వృద్ధి రేట్లను అంచనా వేసే పద్ధతులను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందని లెక్చర్లు కూడా దంచారు. చివరికి వారి మాటే రుజువైంది. మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2013) 4.4% వృద్ధి రేటు నమోదయితే, రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్ 2013) కాస్త పెరిగి 4.8 శాతం వృద్ధి నమోదయింది. WB, IMF లకు హితోపదేశం చేసిన మన అమాత్యవర్యులు ఈ లెక్కలు వెలువడ్డాక నోరు తెరిస్తే ఒట్టు.

ఇప్పుడిక మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్ 2013) ఆర్ధిక ఫలితాలు వెలువడవలసి ఉంది. లెక్క ప్రకారం ఈ రోజు అనగా ఫిబ్రవరి 28, శుక్రవారం సాయంత్రం Q3 ఆర్ధిక ఫలితాలు వెల్లడించాలి. ఈ గణాంకాలు వెలువడక ముందే రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వే నిర్వహించింది. 2012-13 ఆర్ధిక సంవత్సరం లోని మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత ఆర్ధిక వ్యవస్ధ 4.9 శాతం వృద్ధి చెందిందని ఈ సర్వేలో వెల్లడి అయింది. దీనితో అధికారిక ఫలితాలు ఏకీభవిస్తే గనక రెండో త్రైమాసికం కంటే 0.1 శాతం ఎక్కువ వృద్ధి శాతం నమోదు అయినందుకు మాత్రమే సంతోషించాల్సి ఉంటుంది.

ఆర్ధిక వ్యవస్ధను ఉరకలు పెట్టిస్తామంటూ ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రి చిదంబరంలు గత సంవత్సరం ఫాస్ట్ ట్రాక్ అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా కమిటీ కూడా వేశారు. ఈ విధానం క్రింద 80 బిలియన్ డాలర్ల మేరకు మౌలిక నిర్మాణ రంగంలో పెట్టుబడులకు అనుమతి ఇచ్చామని కూడా చెప్పుకున్నారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. ఆర్భాటంగా చాటుకున్న పెట్టుబడుల అనుమతులు అమలులోకి ఎందుకు రాలేదో చెప్పే నాధులు లేరు.

ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం రాక మునుపు మాన్యుఫాక్చరింగ్ రంగం నుండి జి.డి.పిలో గణనీయమైన వాటా వచ్చేది. ఇప్పుడా రంగం కుంటి నడక నడుస్తోంది. దానికి కారణం లక్షల కోట్ల రూపాయల అవినీతికి అప్పటిలా ఇప్పుడు బహిరంగ దారులు లేకపోవడం. సుప్రీం కోర్టు కొరడా ఝళిపించడంతో బళ్ళారీ ఇనుప గనుల్లో అక్రమ మైనింగు ఆగిపోగా, ఒడిశాలో షా కమిటీ విచారణ వల్ల విచ్చలవిడి ఐరన్ మైనింగ్ కు తెరపడింది. ఇక స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు, బ్యూరోక్రాట్లకు కాసులు కురిపించిన 2జి స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కుంభకోణం తదితర అవినీతి ప్రాజెక్టుల సంగతి చెప్పనే అవసరం లేదు. అనగా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు చూపే ఆర్ధిక అభివృద్ధిలో అవినీతి అత్యవసరమైన దినుసు అని అర్ధం చేసుకోవాల్సిన విషయం. ఈ అవినీతి ప్రాజెక్టులు మూలన పడడంతోటే దేశ ఆర్ధిక వృద్ధి కూడా సగానికి పడిపోవడం బట్టి అవినీతి-అభివృద్ధిల మధ్య ఉండే అవ్యాజానుబంధం ఎంత లోతైనదో గ్రహించవచ్చు.

సరుకుల ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తి పెరిగిన ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండు… ఈ కారణాల వలన మూడో త్రైమాసికంలో పరిస్ధితి మరీ దిగనాసిల్లకుండా కాపాడిందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్ రంగం మాత్రం సరిగ్గా దీనికి వ్యతిరేక దిశలో సాగిందని వారి అంచనా.

భారత జి.డి.పిలో మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ లతో సహా పారిశ్రామిక ఉత్పత్తి వాటా దాదాపు పావు భాగం ఉంటుంది. మూడో త్రైమాసికంలో ఈ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోయిందని రాయిటర్స్ సర్వేలో తెలిసింది. అక్టోబర్ – డిసెంబర్ 2013 మధ్య కాలంలో ఇది -1.3 శాతం నుండి -0.6 శాతం వరకూ వృద్ధి చెంది ఉండవచ్చని రాయిటర్స్ సర్వే తెలిపింది. జి.డి.పిలో పావు భాగం కుచించుకుపోతే ఆ లోటు పూడ్వడానికి ఇతర రంగాలు అసాధారణ వృద్ధిని నమోదు చేయాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు.

2013-14 ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్-జనవరి మధ్య కాలంలోనే వడ్డీ రేటును ఆర్.బి.ఐ 3 సార్లు పెంచింది. దీనివల్ల రుణాల ఖరీదు పెరిగిపోవడంతో మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు పెద్దగా రుణాలు తీసుకోలేదనీ, ఆ మేరకు జి.డి.పి వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందనీ కంపెనీలు వాపోతున్నాయి. కానీ ఆర్.బి.ఐ తీసుకున్న చర్యల వల్లనే ద్రవ్యోల్బణం భారీగా నమోదు కాలేదు. పారిశ్రామికవేత్తలకు ఋణ లభ్యత పెంచడానికి వడ్డీ రేట్లు తక్కువ స్ధాయిలో ఉన్నట్లయితే ద్రవ్యోల్బణం తీవ్రమై ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఉండేది. అది కూడా జి.డి.పి వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడవేసేదే. కొనుగోళ్ళు లేనపుడు కంపెనీలు సహజంగా ఉత్పత్తులు తగ్గించుకుంటాయి. అనగా జి.డి.పి తగ్గిపోతుంది.

కాబట్టి జి.డి.పి వృద్ధి, కుచింపు కాదు చూడవలసింది. ఏ చర్య వలన ఎవరు లాభపడుతున్నారన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం. వడ్డీ రేటు పరిశ్రమలకు అందుబాటులో ఉంచితే ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలు పెరగవచ్చు. తద్వారా జి.డి.పి వృద్ధి నమోదు కావచ్చు. కానీ దానివల్ల లబ్ది పొందేదీ అతి కొద్దిమందే అయిన పరిశ్రమాధిపతులే. కానీ వడ్డీ రేటు పెంపుదల వల్ల ద్రవ్యోల్బణం అరికట్టబడితే గనక సరుకుల ధరలు ప్రజలు అందుబాటులో ఉంటాయి. అనగా ప్రజలు లాభపడతారు. ప్రజల సంఖ్య పదుల కోట్లు గనుక లబ్ది పొందేవారి సంఖ్య కొన్ని వేల రెట్లు ఎక్కువ. ఆర్ధిక వ్యవస్ధలో తీసుకోబడే ప్రతి నిర్ణయమూ ఇలా ఎవరికి లబ్ది చేకూరుతుంది అన్న విశ్లేషణ ద్వారా దేశానికి నష్టమా, లాభమా అన్నది నిర్ధారించుకోవచ్చు.

ఇన్ని పరిస్ధితుల్లోనూ దేశీయంగా డిమాండు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాతనే ఇది జరిగే అవకాశం ఉందని వారి అంచనా. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడం, అవి కూడా గతం కంటే ఎక్కువగా ఉండడం, ఎన్నికల నిధులు భారీ మొత్తంలో చేతులు మారడం… ఇత్యాది కారణాలు డిమాండ్ ను పెంచుతాయని ఆర్ధికవేత్తల అభిప్రాయం కావచ్చు. 2014-15లో ఆర్ధిక వృద్ధి 6 శాతం ఉంటుందని ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. జి.డి.పి లెక్కల్లో ప్రజల అవసరాలు తీరే మార్గాలేమీ లేనంత కాలం జి.డి.పి వృద్ధి రేటు ప్రజలకు అందని ద్రాక్షే.

3 thoughts on “భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు

  1. పింగ్‌బ్యాక్: భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు | ugiridharaprasad

  2. ట్టుబడిదారి సమాజం లో పాలనా కుర్చి మీద కూడా పెట్టుబడి పెట్ట బడుతుంది. ఆ పెట్టుబడి మీద లాభాలు ఆశించడం పెట్టుబడి స్వభావం కదా? మరి అలా ఆశించ కుండ రాజకీయ నాయకులను ప్రజా సేవ చెయ్యమనడం ఏపాటి న్యాయమంటారు పెట్టు బడిదారి సమాజంలో?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s