సహారా గ్రూపు కంపెనీల అధినేత, క్రికెట్ ఇండియా టీం మాజీ స్పాన్సరర్ అయిన సుబ్రతో రాయ్ కి సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ కోర్టుకు రాకపోవడంపై సుప్రీం ద్విసభ్య బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిగారి ఆరోగ్యం బాగాలేనందున హాజరు కాలేకపోయారన్న సుబ్రతో రాయ్ అడ్వకేట్, సో కాల్డ్ పేరు మోసిన క్రిమినల్ లాయర్ రాం జెఠ్మలానీ విన్నవించినప్పటికీ కోర్టు పట్టించుకోలేదు. కొన్ని పరుష వ్యాఖ్యలు చేస్తూ మార్చి 4 లోపు అమలు చేసేలా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
సుబ్రతో రాయ్ దేశం విడిచి వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టుకు సుబ్రతో రాయ్ కొరకరాని కొయ్యగా మారారు. భారత దేశంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగితే వారు సుప్రీం కోర్టుకు సైతం అతీతంగా పనులు చక్కబెట్టుకోవచ్చని చాటడానికి ఒక ప్రత్యక్ష, సజీవ ఉదాహరణగా ఆయన నిలిచారు. శత సహస్ర కోటీశ్వరులకు పేరు మోసిన క్రిమినల్ లాయర్ల అండదండలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని సుబ్రతో రాయ్ ఉదాహరణ చాటుతోంది. పేరు మోసిన బడా నేరస్ధులకు అండగా ఉండడం ద్వారానే ఆయా లాయర్లు ‘పేరు మోస్తారని’ కూడా సహారా కేసు విప్పి చెప్పే నగ్న సత్యం!
20,000 కోట్ల రూపాయల డబ్బును ఆయా మదుపుదారులకు తిరిగి చెల్లించాల్సిన కేసును సుబ్రతో రాయ్ ఎదుర్కొంటున్నారు. సెబి నిబంధనలకు, దేశ చట్టాలకు విరుద్ధంగా సామాన్య మదుపుదారుల నుండి సహారా కంపెనీకి చెందిన రెండు అనుబంధ కంపెనీలు 17,400 కోట్లకు పైగా డబ్బు సేకరించాయి. ఇది చట్టవిరుద్ధం కాబట్టి మదుపరులకు వెనక్కి ఇచ్చేయాలని సెబి ఆదేశించింది. అందుకు తిరస్కరించిన సహారా, కోర్టుకు ఎక్కింది. కోర్టు మరిన్ని చీవాట్లు పెట్టి 15 శాతం వడ్డీతో కలిపి 24,000 కోట్లు చెల్లించాలని 2012 ఆగస్టులో తీర్పు చెప్పింది.
కోర్టు తీర్పు అమలు చేయకపోగా అమలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని సుబ్రత రాయ్ సెబి కి తేల్చి చేప్పేశాడు. దాంతో సెబి సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు సెబి ని కూడా తప్పు పట్టింది. తీర్పు అమలు చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎందుకు తీసుకోలేదని 2012 డిసెంబర్ లోనే ప్రశ్నించింది. వెంటనే 5,270 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించిన కోర్టు జనవరి, ఫిబ్రవరి (2013) నెలల్లో రెండు విడతలుగా మిగిలింది చెల్లించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలు సంవత్సరం వరకు అమలు చేయకపోయినా కోర్టు వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ పోయింది. తీరా మొన్న డిసెంబర్ లో డబ్బు కట్టేశామ్ అని చెప్పడంతో సెబి నిర్ఘాంతపోయింది. ఎటువంటి సందడి లేకుండా 20,000 కోట్లు తిరిగి చెల్లించామ్ అని చెప్పడం ఏమిటో సెబికి అర్ధం కాలేదు. అయితే ఎక్కడి నుండి డబ్బు తెచ్చి కట్టారో చెప్పాలని, రికార్డులు చూపాలని కోరింది. ‘అది మీకు అనవసరం’ అని సుబ్రత బదులు ఇవ్వడంతో విషయం మళ్ళీ కోర్టుకు వచ్చింది.
ఫిబ్రవరి 20 తేదీన జరిగిన హియరింగ్ లో ద్విసభ్య ధర్మాసనం సహారా కంపెనీపై విరుచుకుపడింది. 20,000 కోట్ల రూపాయలు మదుపుదారులకు ఇంకా చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. తాము చెల్లించేశామని సహారా చేసిన వాదనను సుప్రీం కోర్టు పరిగణించలేదని దానితో స్పష్టం అయింది. సుబ్రతో రాయ్ తో సహా కంపెనీ డైరెక్టర్లు అందరూ తన ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇస్తూ కేసును ఫిబ్రవరి 25 కి వాయిదా వేసింది. అయితే నిన్న ఇతర డైరెక్టర్లు హాజరయినప్పటికీ సుబ్రతో రాయ్ హాజరు కాలేదు. తనను వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని లాయర్ ద్వారా కోర్టును కోరాడు. దీనిని సుప్రీం కోర్టు తిరస్కరిస్తూ ఈ రోజుకు వాయిదా వేసింది.
ఈ రోజు (ఫిబ్రవరి 26) కూడా సుబ్రతో రాయ్ రాకపోవడంతో ఆగ్రహించిన ధర్మాసనం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. “వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలన్న రాయ్ విన్నపాన్ని మేము మంగళవారమే తిరస్కరించాము. ఈ రోజు కూడా ఆయన రాలేదు. కాబట్టి నాన్ బెయిలబుల్ వారంట్ ఇస్తున్నాము. మార్చి 4 లోపు దీన్ని పాటించాలి” అని జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ జె.ఎస్ఖేహార్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
సుబ్రతో రాయ్ తల్లి ఆరోగ్యం విషమించిందని, ఆయన తన తల్లి పక్కన మంచంపై కూర్చొని తల్లి చేయిన తన చేతుల్లోకి తీసుకుని ఉన్నారని అందుకే రాలేకపోయారని రాం జెఠ్మలానీ కోర్టుకు వినిపించారు. దీనిని ధర్మాసనం పట్టించుకోలేదు. ఇప్పటికే ఎక్కువ అవాకాశాలు ఇచ్చామని తెలిపింది. ఫిబ్రవరి 20 నాటి తమ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని ఇతర డైరెక్టర్లు రాగా లేనిది సుబ్రతో రాయ్ ఎందుకు రాలేరని ప్రశ్నించింది.
కాగా సహారా నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసి డబ్బుగా మార్చాలని సెబి ని కోర్టు ఆదేశించింది. “ఆ ఆస్తులను మీరు అమ్మేయవచ్చు. వాటిని అమ్మేసి డబ్బును స్వాధీనం చేసుకోవడానికి మీకు అనుమతి ఇస్తున్నాం. అవి ఇతరత్రా చిక్కుకుని ఉన్న ఆస్తులయితే వెంటనే కంపెనీపై క్రిమినల్ కేసు పెట్టండి. ఈ కేసు తగిన విధంగా తార్కిక ముగింపుకు రావలసి ఉంది” అని ధర్మాసనం సెబిని కోరింది. వేలం వేసే భారాన్ని కంపెనీ పైనే పెట్టాలన్న సెబి కోరికను బెంచి తిరస్కరించింది.
17,400 కోట్ల రూపాయలను దేశవ్యాపితంగా ఉన్న చిన్న చిన్న మదుపుదారుల నుండి వసూలు చేశామని సుబ్రతో రాయ్ వినిపించిన వాదన. ఆ డబ్బు సేకరించిన విధానం చట్టవిరుద్ధం కనుక వెనక్కి ఇచ్చేయాలని సెబి కోరింది. సుప్రీం కోర్టులో వాదప్రతివాదాలు, మొట్టికాయలు అన్నీ అయ్యాక అకస్మాత్తుగా ‘చెల్లించేశాం’ అని సుబ్రతో చెప్పడమే ఈ కేసులో ఇంకా మిగిలి ఉన్న మిస్టరీ. చడీ చప్పుడు లేకుండా అంత మొత్తాన్ని మదుపుదారులకు, అది కూడా ఎలాంటి పరపతి లేని చిన్న చిన్న కూలీలయిన మదుపుదారులకు ఎలా చెల్లించారాన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న అడిగినందుకు ‘నీకు అనవసరం’ అని సుబ్రతో రాయ్ చెప్పారని సెబి ఫిర్యాదు.
ఇంతకీ సహారా చెప్పినట్లు నిజంగానే చెల్లించి ఉంటే ఎలా చెల్లించారు? చెల్లించకపోతే సుప్రీం కోర్టును కూడా ధిక్కరించే ధైర్యం సహారా, జెఠ్మలానీలకు ఎక్కడిది?
విషయం ఏమిటంటే, బహుశా, సహారా కంపెనీ నిజానికి సదరు డబ్బు సేకరించలేదు. అది అక్రమ సొమ్ము. లేదా నల్ల డబ్బు. నల్ల డబ్బును తెలుపు చేసుకోవడానికి సహారా కంపెనీ కొన్ని పేపర్ కంపెనీలను స్ధాపించింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్ప్ లిమిటేట్ అని ఒకటి, సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్ప్ అని మరొకటి. మదుపుదారుల నుండి సేకరించామని చెబితే ఆ నల్లడబ్బు కాస్తా తెల్ల డబ్బు అవుతుంది. కానీ సెబి ఏ మూడ్ లో ఉందో గానీ సహారా సేకరించానని చెప్పిన పద్ధతి చట్ట విరుద్ధం అని గ్రహించింది. నోటీసులు జారీ చేసింది. ఇక అప్పటి నుండి జాతరే జాతర.