జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries – పి.ఎఫ్.సి) జాబితాలో ఇండియాను చేర్చేందుకు అమెరికాలో కసరత్తు మొదలయిందన్న సూచనలు రావడంతో ఇండియా కూడా డబ్ల్యూ.టి.ఓ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది.
తమ బహుళజాతి కంపెనీల వాణిజ్యానికి తగిన సానుకూల వాతావరణం కల్పించకపోతే వివిధ పేర్లతో వేధింపులకు దిగడం అమెరికా తదితర పశ్చిమ దేశాలకు అనాదిగా ఉన్న దురలవాటు. ఈ దురలవాటునే అమెరికా ఇప్పుడు ఇండియాపై ప్రయోగిస్తోంది. అమెరికా కంపెనీల వాణిజ్య ప్రయోజనాల కోసం తయారు చేసుకున్న పి.ఎఫ్.సి నిబంధనలను ఇండియాపై అమలు చేయడం ద్వారా వాణిజ్య ఆంక్షలు విధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు 50 కంపెనీలతో కూడిన ఒక కన్సార్టియమ్ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ (United States International Trade Commission) కు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదును పురస్కరించుకుని ఇండియాను పి.ఎఫ్.సి జాబితాలో చేర్చే అవకాశాలను కమిషన్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పి.ఎఫ్.సి జాబితాతో పాటు అమెరికా వద్ద మరో ఆయుధం కూడా ఉంది. ‘ఫారిన్ కంట్రీ వాచ్ లిస్ట్’ అనే జాబితాలో ఒక దేశాన్ని చేర్చినట్లయితే అలాంటి దేశాలపై ఏకపక్షంగా ఆంక్షలు విధించే వెసులుబాటును అమెరికా తనకు తానుగా కల్పించుకుంది. ప్రపంచ వాణిజ్య వ్యవహారాల పైన, ఆయా దేశాల మార్కెట్లలోకి స్వేచ్ఛా ప్రవేశాన్ని కల్పించాల్సిన అవసరం పైనా అన్ని దేశాలకు లెక్చర్లు దంచే అమెరికా తన దేశంలో మాత్రం విదేశీ కంపెనీలపై సవాలక్షా ఆంక్షలు విధిస్తుందన్నమాట!
ఇండియాకు సంబంధించి అమెరికా టార్గెట్ చేసుకున్న రంగాల్లో ఫార్మా రంగం ఒకటి. పశ్చిమ బహుళజాతి కంపెనీ నోవార్టిస్ కు చెందిన కాన్సర్ ఔషధాన్ని జెనెరిక్ గా తయారు చేయడానికి హైద్రాబాద్ కి చెందిన నాట్కో ఫార్మా కంపెనీకి భారత ప్రభుత్వం ‘కంపల్సరీ లైసెన్స్’ మంజూరు చేసింది. 2012 మార్చి నెలలో ఈ కంపల్సరీ లైసెన్స్ మంజూరు చేసినప్పటి నుండి భారత ఫార్మా రంగంపై పశ్చిమ బహుళజాతి కంపెనీలు ముఖ్యంగా అమెరికా బహుళజాతి ఔషధ కంపెనీలు కత్తిగట్టాయి.
‘కంపల్సరీ లైసెన్స్’ అనేది డబ్ల్యూ.టి.ఓ లోనే కల్పించిన ఒక వెసులుబాటు. ప్రజలకు అత్యవసరమైన ఔషధాలపై ఒక కంపెనీకి పేటెంట్ ఉన్నప్పటికీ ప్రజల అవసరాల రీత్యా పేటెంట్ హక్కులకు అతీతంగా సదరు ఔషధాల తయారీకి వేరే కంపెనీలకు ఇచ్చే లైసెన్స్ ను కంపల్సరీ లైసెన్స్ అంటారు. ఈ లైసెన్స్ విధానాన్ని అమెరికా విస్తృతంగా వినియోగిస్తుంది. ఇండియాకు వచ్చేసరికి, డబ్ల్యూ.టి.ఓ నిబంధనలకు లోబడిందే అయినా కంపల్సరీ లైసెన్స్ ఇవ్వరాదని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేసి విఫలం అయింది. దాని పర్యవసానంగానే భారత ఫార్మా కంపెనీల వాణిజ్య ప్రయోజనాలను దెబ్బ తీసే కార్యక్రమాన్ని అమెరికా ఎఫ్.డి.ఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) చేపట్టిందని భారత కంపెనీలు భావిస్తున్నాయి.
జెనెరిక్ ఔషధం అంటే పేటెంట్ హక్కుదారులు తయారు చేసే ఔషధాలను అవే పదార్ధాలు వినియోగిస్తూ తక్కువ ధరలకు తయారు చేయబడేవి. పేటెంట్ హక్కుదారులు సదరు ఔషధం తయారు చేయడానికి తాము అనేక సంవత్సరాల పాటు పరిశోధన చేశామని, అందుకు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించామని చెబుతూ భారీ ధరలు వసూలు చేస్తాయి. అలాంటి మందుల ఫార్మూలను కాపీ చేసి తయారు చేసే కంపెనీలు అత్యంత తక్కువ ధరలకు సదరు ఔషధాలను తయారు చేస్తాయి. అయితే పేటెంట్ హక్కుదారులకు తగిన మొత్తంలో రాయల్టీలు చెల్లిస్తాయి. రాయల్టీలు చెల్లించినప్పటికీ ఆ మేరకు భారీ లాభాలను పేటెంట్ హక్కుదారులు కోల్పోతారు. అంత భారీ ధరలను నిజంగా పరిశోధన కోసమే వెచ్చించారా అన్నది ఎప్పటికీ రహస్యంగా మిగిలిపోయే సమాచారం.
కానీ జెనెరిక్ ఔషధాల తయారీదారుల వలన అనేక మూడో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కూడా లబ్ది పొందుతున్నారు. భారత జెనెరిక్ ఔషధాలకు అతి పెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికాయే. జెనెరిక్ ఔషధాలే లేనట్లయితే మరిన్ని లాభాలు తమకు దక్కుతాయన్నది పేటెంట్ హక్కుదారు కంపెనీల దుగ్ధ. ఈ దుగ్ధ తోనే జెనెరిక్ ఔషధ తయారీదారులను నియంత్రించడానికి పశ్చిమ బహుళజాతి ఔషధ కంపెనీలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. అలాంటి ప్రయత్నాలలో అమెరికా చట్టాలను ప్రయోగించి ఆంక్షలు అమలు చేయడం ఒకటి.
బహుళజాతి కంపెనీలు అనుసరించే దోపిడీ ఎత్తుగడ ‘పేటెంట్ ఎవర్ గ్రీనింగ్’ కు విరుగుడుగా పుట్టిందే కంపల్సరీ లైసెన్స్ విధానం. తాము పేటెంట్ పొందిన ఒక ఔషధంలో స్వల్ప మార్పులు చేసి తిరిగి కొత్తగా పేటెంట్ హక్కులు పొందడం ద్వారా లాభాలను నిరంతరాయంగా పొడిగించుకోవడానికి బహుళజాతి కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఉదాహరణకి ఒక కొత్త ఔషధాన్ని ఒక కంపెనీ కనిపెట్టిందని అనుకుందాం. అనేక ఏళ్ళు కష్టపడి పరిశోధన చేసి సదరు ఔషధం కనిపిట్టినందుకు ఆ కంపెనీకి సదరు ఔషధంపై పేటెంట్ హక్కు ఇస్తారు. అలా ఇచ్చే పేటెంట్ హక్కులు గరిష్టంగా 20 యేళ్లకే ఇస్తారు. కానీ 20 యేళ్ళు గడిచిన తర్వాత కూడా సదరు లాభాలను వదులుకోవడానికి కంపెనీ ఇష్టపడదు. ఇంకా ఇంకా లాభాలు కావాలని ఆశిస్తుంది. అందుకోసం అదేం చేస్తుందంటే ఆ పాత ఔషధం ఫార్ములాలోనే స్వల్పంగా మార్పులు చేస్తుంది. తద్వారా కొత్త ఫార్ములా కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తుంది. కొత్త ఫార్ములా కాబట్టి కొత్తగా పేటెంట్ హక్కు సంపాదిస్తుంది. కానీ వాస్తవంలో అది పాత ఔషధమే. 20 యేళ్లలో ముగిసిపోవలసిన పేటెంట్ హక్కును స్వల్ప ఫార్ములా మార్పు ద్వారా కొత్త పేటెంట్ సంపాదించడాన్ని ‘ఎవర్ గ్రీనింగ్’ అంటారు.
ఈ ‘ఎవర్ గ్రీనింగ్’ కు విరుగుడుగా ‘కంపల్సరీ లైసెన్సింగ్’ విధానాన్ని అనేక చర్చోపచర్చల అనంతరం డబ్ల్యూ.టి.ఓ వాణిజ్య నిబంధనల్లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా అమెరికా కంపెనీలు లబ్ది పొందాయి కూడా. కానీ అదే లబ్దిని ఇండియా లాంటి దేశాల కంపెనీలకు అమెరికా నిరాకరిస్తోంది. అందులో భాగంగా ఇండియాను పి.ఎఫ్.సి జాబితాలో చేర్చడానికి ఏర్పాట్లు చేస్తోంది. వాషింగ్టన్ డి.సి లో ఈ మేరకు USITC పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. ఈ హియరింగ్ కు భారత ఫార్మా కంపెనీలు కూడా హాజరై తమ వాదనలు వినిపించాయి. వాదనలు వినిపించిన వారిలో భారత సాఫ్ట్ వేర్ కంపెనీల సంస్ధ నాస్కామ్, ఫార్మా కంపెనీల సంఘం ఐ.పి.ఏ (ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్) లు ఉన్నాయి.
USITC ప్రారంభించిన విచారణకు “భారత దేశంలో వాణిజ్యం, పెట్టుబడులు మరియు పారిశ్రామిక విధానాలు: అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై వాటి ప్రభావం” అని శీర్షిక పెట్టారు. అనగా కేవలం ఇండియా వాణిజ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అమెరికా ఈ విచారణ ప్రారంభించింది. USITC ప్రతినిధులు త్వరలో ఇండియా కూడా పర్యటించనున్నారు. వారికి ఇండియా వీసా నిరాకరించినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అదేమీ లేదని USITC ప్రతినిధులు నిరాటంకంగా భారత్ రావచ్చని, కలవదలుచుకున్నవారిని కలిసి విచారణ చేసుకోవచ్చని నిన్న కేంద్ర వాణిజ్య మంత్రి ప్రకటించారు.
USITC విచారణ ముగియడానికి మరో 2 నెలలు పడుతుందని తెలుస్తోంది. అనగా మరో రెండు నెలల్లో అమెరికా, ఇండియాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు రేగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా యు.పి.ఏ ప్రభుత్వం అమెరికాను సవాలు చేసే ఫోజులో కనిపిస్తుంది. ఆ ఫోజు చూసి మోసపోవలసిన అవసరం లేదు. ఆ తర్వాత వాస్తవంగా అమెరికా తీసుకునే చర్యలే భారత ప్రభుత్వ సత్తాను తెలియజేస్తాయి.