కాలిఫోర్నియా: పోలియో తరహా వ్యాధితో 25 మంది పిల్లలు


Sofia Jarvis 02

Sofia Jarvis

పోలియో రహిత ప్రపంచాన్ని స్ధాపిద్దాం అంటూ న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తుండగా ఐరాస కార్యకలాపాలకు కేంద్ర అయిన అమెరికాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కాలిఫోర్నియా రాష్ట్రంలోని పిల్లలను ఇప్పుడో వింత వ్యాధి భయపెడుతోంది. సరిగ్గా పోలియో తరహాలోనే పిల్లల కాళ్ళు, చేతులు ఒక్కసారిగా చచ్చుబడిపోతున్నాయి. పోలియో తరహా వ్యాధి అని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పోలియో మాత్రం కాదని కూడా వారు చెబుతున్నారు. ఫుకుషిమా రేడియేషన్ కాలిఫోర్నియా తీరం వరకు వ్యాపించినందున ఈ వ్యాధికి రేడియేషన్ కారణం అయి ఉండవచ్చని కొద్ది మంది సూచిస్తున్నారు.

దాదాపు రెండేళ్ల క్రితం తాజా వ్యాధి కాలిఫోర్నియాలో ప్రారంభం అయింది. ఇప్పటికీ 25 మంది పిల్లలు దీనిబారిన పడ్డారు. వ్యాధికి గురయిన వారిలో 2 సం.ల నుండి 16 సం.ల వయసుగల బాల బాలికల వరకు ఉన్నారు. ఇప్పటిదాకా డజను మంది వరకు పోలియా తరహా వ్యాధికి గురయ్యారని ది హిందు తెలియజేసింది. అయితే ది డెయిలీ మెయిల్ లాంటి పశ్చిమ పత్రికలు 25 మంది వరకు వ్యాధికి గురయ్యారని నివేదించాయి.

ఒకటి గానీ అంతకంటే ఎక్కువ గానీ చేయి లేదా కాలు లేదా అన్నీ ఒక్కసారిగా పెరాలసిస్ వచ్చినట్లుగా సత్తువ కోల్పోవడం ఈ వ్యాధి లక్షణంగా కనిపిస్తోందని కాలిఫోర్నియా డాక్టర్లు చెబుతున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాధి పీడితులపై పరిశోధనలు సాగిస్తున్నారు. రెండేళ్ల నుండి ఈ వ్యాధి కనిపిస్తున్నప్పటికీ వారు ఇంతవరకు అదేమిటో కనుక్కోలేకపోయారు. నిజంగానే కనుక్కోలేకపోయారా లేక కనుక్కొన్న కారణాలను వెల్లడించలేకపోతున్నారా అన్నది అనుమానంగా మారింది.

వ్యాధి చాలా అసాధారణంగా ఉందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. పిల్లల్లో ఎవరైనా తమ శరీర భాగాలు, ముఖ్యంగా కాళ్ళు, చేతుల్లో అకస్మాత్తుగా బలహీనంగా ఉన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిధిలోని పిల్లల ఆసుపత్రి Lucile Packard Children’s Hospital లోని పీడియాట్రిక్ న్యూరాలజిస్టు కీత్ వేన్ హరేన్ కోరారు. “ఈ వ్యాధి లక్షణాలు పోలియోతో పోలి ఉన్నాయి. కానీ పోలియో కాదు” అని ఆయన చెప్పారు. “పరిస్ధితి సీరియస్ గా ఉంది. మేము ఇంతవరకు చూసిన కేసుల్లో ఎవరూ తమ చేతిని లేదా కాలిని తిరిగి యధాపూర్వ స్ధితిలో ఉపయోగించలేకపోతున్నారు” అని కీత్ చెప్పారు.

మాంటెరి నుండి శాన్ ఫ్రాన్ సిస్కో బే ఏరియా వరకూ 5 కేసులను తాను పరిశోధించానని అందులో రెండు కేసులు ఎంటరోవైరస్-68 సోకిన కేసులని కీత్ తెలిపారు. ఈ వైరస్ పోలియో వైరస్ కుటుంబానికి చెందినదేనని ఆయన తెలిపారు. కానీ మిగిలిన ముగ్గురిలో ఈ వైరస్ జాడ కనిపించలేదని కీత్ తెలిపారు. రాష్ట్ర వ్యాపితంగా 20 కేసులు కనుగొన్నామని ఆయన చెప్పినట్లు ది హిందు తెలిపింది. మెయిల్ పత్రిక ఈ సంఖ్య 25 వద్ద ఉంచింది. ఇవి తమ దృష్టికి వచ్చినవి మాత్రమేనని ఇంకా మరిన్ని కేసులు ఉండొచ్చని ఆయన తెలిపారు.

పోలియో వాక్సిన్ వల్ల తాజాగా తలెత్తిన వ్యాధిని నివారించలేవని కీత్ తేల్చేశారు. అయినప్పటికీ పోలియో వాక్సిన్ తప్పనిసరిగా వినియోగించాల్సిందేనని తెలిపారు. వ్యాధి పీడితులందరిలోనూ ఉమ్మడి లక్షణాలు ఉన్నట్లుగా తమ దృష్టికి రాలేదని కాలిఫోర్నియా ఆరోగ్య శాఖవారు చెప్పడం విశేషం.

డెయిలీ మెయిల్ పత్రిక ప్రకారం మొట్టమొదటి గుర్తించిన కేసు 2012 నాటిది. సోఫియా జార్విస్ అనే 2 యేళ్ళ పాప మొదటిసారి ఊపిరి సమస్యలతో, వాంతులతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆస్తమా మందులతో వ్యాధిని తగ్గించి 4 రోజుల తర్వాత ఇంటికి పంపేశారు. వ్యాధి తగ్గిందని వారు భావించినప్పటికీ ఇంటికి వెళ్ళిన మరుసటి రోజే సోఫియా ఎడమ చేయి బలహీనంగా మారి పూర్తిగా చచ్చుబడిపోయింది. MRI స్కానింగ్ తీసినప్పటికీ డాక్టర్లకు తమకు తెలిసింది అందులో ఏమీ కనిపించలేదు.

సోఫియాకు అనంతరం శారీరక శిక్షణ ఇచ్చి ఎడమ చేయిలో కదలిక తేవడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. క్రమంగా ఎడమ కాలు కూడా బలహీనం అవుతోందని డాక్టర్లు గమనించారు. ఈ కేసు లక్షణాలతో పోలిన కేసుల కోసం వెతకగా కాలిఫోర్నియా రాష్ట్రం లోనే 25 కేసులను వారు కనుగొన్నారు. అందరికీ దాదాపు ఇదే సమస్య. “వ్యాధి నయం అయింది అనుకుంటే ఒక కాలు గానీ చెయ్యి గానీ పని చేయడం లేదని అర్ధం. మరీ ఘోరం అనుకున్న కేసులో రెండు కాళ్ళు, రెండు చేతులు చచ్చుబడిపోయినట్లే” అని కీత్ చెప్పడాన్ని బట్టి పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

ఎవ్రీజో వెబ్ సైట్ ప్రకారం వైరస్ లు మ్యూటేషన్ చెంది సరికొత్త రూపాలు ధరిస్తాయి. పోలియో వైరస్ కూడా అదే తరహాలో మ్యూటేషన్ చెంది కొత్త తరహా పోలియో వైరస్ ఉద్భవించి ఉండవచ్చని సదరు వెబ్ సైట్ తెలిపింది. దీనితో పాటు అణు ధార్మికత (అటామిక్ రేడియేషన్) వల్ల కూడా వ్యాధి పుట్టి ఉండవచ్చని తెలియజేసింది. ఫుకుషిమా రేడియేషన్ కాలిఫోర్నియా తీరం వరకు విస్తరించినట్లు కనుగొన్న నేపధ్యంలో తాజా వ్యాధికి రేడియేషన్ కారణం కావచ్చని కొందరు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి అభిప్రాయాలకు ప్రధాన స్రవంతి పత్రికలలో స్ధానం దక్కే అవకాశం లేదు. అణు పరిశ్రమ లాబీ అందుకు అంగీకరించవు. ఒకవేళ రేడియేషనే వ్యాధికి కారణం అయితే అది ఎప్పటికీ బైటికి రాదు. ముఖ్యంగా అమెరికాలో! ఒకవేళ బైటికి వచ్చినా ఆ వార్త ఎక్కడో మారుమూలల్లో సంచరిస్తుంది తప్ప ప్రభుత్వ పరిశీలన వరకూ వెళ్లదు.

1 thoughts on “కాలిఫోర్నియా: పోలియో తరహా వ్యాధితో 25 మంది పిల్లలు

  1. ఇదేదో ఆసక్తికర పరిణామంలా ఉంది. పోలియో వైరస్ మ్యూటేషన్ సాధించినా…., లేదా రేడియేషన్ కారణమైనా.., మరోటైనా ప్రపంచానికి అవసరమైందే కదా. ఇలాంటి వార్తలు మీడియా కవర్ చేయకపోవడం దురదృష్టకరం.

వ్యాఖ్యానించండి