తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది?
సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు నచ్చజెపుతున్నారు.
వారి లాజిక్ ఏమిటంటే: టి.ఆర్.ఎస్ ని అప్పుడే కాంగ్రెస్ లో కలిపేస్తే తెలంగాణలో రాజకీయంగా ఒక ఖాళీతనం ఏర్పడుతుంది. కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ అనే రెండు పార్టీల స్ధానంలో కాంగ్రెస్ అన్న ఒక్క పార్టీయే మిగలడం వల్ల ఏర్పడే ఖాళీ అది. ఈ ఖాళీలోకి తెలుగు దేశం వచ్చేసే ప్రమాదం మెండుగా ఉంది. అనగా తెలుగు దేశం ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. అది కాస్తా బలమైన ప్రతిపక్షం అవతరించడానికో లేదా అలాంటిదే మరొక అనుకోని ఉపద్రవమో జరిగే అవకాశం ఉందని టి.ఆర్.ఎస్ నేతల వాదన.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నపుడు కూడా, జులై చివర్లో తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయించిన తర్వాత కూడా టి.డి.పి కి గణనీయ మొత్తంలో పంచాయితీలు దక్కాయి. ఈ నేపధ్యంలో టి.ఆర్.ఎస్ వాదనలో (వారు నిజంగా ఆ వాదన చేస్తే) కాస్తో కూస్తో నిజం లేకపోలేదు.
‘అదేం కాదు. టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపిస్తే ఇక ఆ సముద్రంలో ఒకానొక నీటిబొట్టుగా మాత్రమే కె.సి.ఆర్ మారిపోతారు. దానికి భయపడే స్వతంత్ర ఉనికి కోసం రకరకాల సాకులు చూపుస్తున్నారు’ అని కొందరు అంటున్నారు. ఫ్యామిలీతో వెళ్ళి సోనియాను కలిసిన కె.సి.ఆర్ 500 కోట్లు అడిగారని టి.డి.పి నేతలు ఆరోపించడం మరో విశేషం. ఆ సమయంలో వాళ్ళు అక్కడే ఉన్నంత ఖచ్చితంగా లెక్క చెప్పడం ఏమిటో పరిశీలకులకు ఒక పట్టాన కొరుకుడు పడలేదనుకోండి!
మొత్తం మీద వాగ్దానం ఇచ్చినంత తేలికగా కె.సి.ఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేట్లు లేరు. అందుకే కాంగ్రెస్ చేయి పుచ్చుకుంటారని భావించిన కె.సి.ఆర్ కాంగ్రెస్ దక్కాల్సిన క్రెడిట్ ని తన విజయంగా చూపిస్తూ ముందుకు చాచాల్సిన చేతిన వెనక్కి తీసుకున్నట్లు కార్టూన్ సూచిస్తోంది.
చూద్దాం. కొద్ది రోజుల్లో తేలే విషయమేగా!
విభజన జరిగిన తరువాత విలీనం లేదనడానికి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రాజకీయాలు ఏనాడో అంతరించాయి. గతంలో ప్రజారాజ్యం చిరుగాలి కూడా అటువైపు మొగ్గి ఇప్పుడు తోకాడిస్తూ ముఖ్య పదవికోసం పాకులాడుతున్నాడు. టి.ఆర్.ఎస్. ఎంత బింకాలుపోయినా దుకాణం బందుచేసే కార్యక్రమం అంతర్గత ఒప్పందం. ప్రజలను మభ్యపెట్టే ప్రణాళిక అంశం ఈ బుకాయింపులు. జరగనినాడు కె.సి.ఆర్. బతికి బట్టకడతాడా? సోనియా లాబీనుంచి గులాబి వెలిసిపోక తప్పదు. రేవు దాటగానే తెప్ప తగలేస్తే ఆవలి ఒడ్డున మరో చాకిరేవు కాంగ్రెస్స్ పెడుతుంది. అప్పుడు విభజన భజన, ఇప్పుడు విలీన విభజన. జనాలు మౌనన్ని అమాయకతగా ఊహించుకుంటే అది వారి మూర్ఖత్వం.