వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం


whatsapp

‘WhatsApp’ అప్లికేషన్ కొనుగోలు మరియు స్వాధీనం (acquisition) కోసం జరిగిన పోటీలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ విజయం సాధించాడు. దానితో త్వరలో జరగబోయే ప్రపంచ స్ధాయి ఐ.టి (మొబైల్) కాన్ఫరెన్స్ లో జుకర్ బర్గ్ విజయగర్వంతో పాల్గొననున్నాడని వ్యాపార వార్తా సంస్ధలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దాదాపు ప్రతి రంగంలోనూ పాతుకుపోయిన గూగుల్ ని త్రోసిరాజనడం అంటే మాటలు కాదు మరి!

స్మార్ట్ ఫోన్ ల దగ్గర నుండి మధ్య స్ధాయి మొబైల్ ఫోన్ ల వరకు వాట్సప్ అప్లికేషన్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. టాబ్లెట్ రంగంలో కూడా విస్తృత వినియోగదారులను కలిగి ఉన్న ఈ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాపితంగా కోట్లాది వినియోగదారులు ఛాటింగ్ చేస్తూ మెసేజ్ లు పంపుకుంటూ ఉంటారు. ఈ అప్లికేషన్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం ఐ.టి కంపెనీలకు ప్రధాన ఆకర్షణ. అందుకే 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించడానికి సైతం ఫేస్ బుక్ కంపెనీ వెనుదీయలేదు. దీనికోసం తీవ్రంగా పోటీ పడిన గూగుల్ ను ఓడించడం ద్వారా ఫేస్ బుక్ భారీ మొబైల్ మార్కెట్ ను సొంతం చేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ రోజు (ఫిబ్రవరి 24) స్పెయిన్ నగరం బార్సీలోనాలో ప్రపంచ స్ధాయి మొబైల్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ జరగనుంది. వాట్సప్ కొనుగోలు ద్వారా సాధించిన విజయంతో మేఘాలలో తేలిపోతున్న జుకర్ బర్గ్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. మొబైల్ మార్కెట్ తరంగం ఫేస్ బుక్ ను నల్లిలా నలిపేస్తుందన్న విశ్లేషణలు వెలువడిన ఒకటిన్నర యేళ్లలోనే ఫేస్ బుక్ మళ్ళీ మార్కెట్ల విశ్వాసాన్ని సొంతం చేసుకుందంటే కారణం వాట్సప్ అక్విజషన్! స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు వినియోగదారులు ప్రపంచ వ్యాపితంగా కోట్లాది మంది ఉన్నారు. వీరి సంఖ్య ఇంకా పెరుగుతోంది కూడా. వీరి వలన వచ్చే వాట్సప్ ప్రకటనల ఆదాయం ఇప్పుడు ఫేస్ బుక్ సొంతం అవుతోంది.

నిజానికి వాట్సప్ కొనుగోలు కోసం జుకర్ బర్గ్ వెచ్చించిన మొత్తం చూసి మార్కెట్ విశ్లేషకులు భృకుటి ముడివేశారు. ఇంత భారీ మొత్తం చెల్లించాల్సిన ఆదాయం వాట్సప్ కు లేదని వారి అంచనా. వాట్సప్, తనకు ప్రపంచవ్యాపితంగా 450 మిలియన్ల (45 కోట్లు) వినియోగదారులు ఉన్నారని గతంలో చెప్పుకుంది. ఇంతమందికి తగిన ఆదాయం ప్రస్తుతానికి లేకున్నప్పటికీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వ్యాపారంలో ఫేస్ బుక్ ఆదాయాన్ని పెంచగల స్ధానం వాట్సప్ కి ఉన్నదని సమర్ధకులు వాదిస్తున్నారు.

వాట్సప్ తో పాటు చైనాకు చెందిన WeChat, ఇజ్రాయెల్ కు చెందిన Viber లు ఉచితంగా పాఠ్య సందేశాలు (Text Messages – SMS) పంపుకునే సౌకర్యాన్ని వినియోగదారులకు కల్పించడం ద్వారా టెలికాం ఆపరేటర్లకు భారీ ఆదాయాన్ని నష్టపరిచాయి. ఎస్.ఎం.ఎస్ సేవల ద్వారా మొబైల్ ఆపరేటర్ కంపెనీలు ఆదాయం పొందే సంగతి తెలిసిందే. ఇదే సౌకర్యాన్ని అంతర్గతంగా ఉచితంగా కల్పించడం ద్వారా వాట్సప్, తదితర అప్లికేషన్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. ఎంతగానంటే గత సంవత్సరం వీటివలన మొబైల్ ఆపరేటర్లు 32 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయారని ఒవుమ్ అనే మార్కెట్ పరిశోధనా సంస్ధ తెలిపింది. 2016 నాటికి ఇలా కోల్పోయే ఆదాయం 54 బిలియన్ డాలర్లు ఉంటుందని ఒవుమ్ అంచనా.

బహుశా వాట్సప్ ఉచిత సేవలు త్వరలోనే కనీస ధరల్ని వసూలు చేసే రోజులు త్వరలోనే ఉన్నాయని భావించవచ్చు. లేనట్లయితే 19 బిలియన్ డాలర్లు పెట్టి దాన్ని సొంతం చేసుకోవడం వల్ల జుకర్ బర్గ్ సాధించేది ఏమిటి? ఈ ఆదాయం వ్యవహారం ఎలా ఉన్నా, ఈ రోజు జరిగే మొబైల్ ఐ.టి కాన్ఫరెన్స్ లో ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్, వాట్సప్ అధినేత జాన్ కౌమ్ లు ప్రత్యర్ధులుగా బదులు భాగస్వాములుగా హాజరు కానున్నారని రాయిటర్స్ వార్తా సంస్ధ వ్యాఖ్యానించింది. అనగా వీరు ఇరువురు గూగుల్ కంపెనీకి ఉమ్మడి ప్రత్యర్ధులుగా హాజరు కానున్నారని భావించవచ్చు.

గత కొద్ది నెలలుగా (సంవత్సరాలుగా కాకుంటే) ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతున్నదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఎడ్వర్డ్ స్నోడెన్. అమెరికా గూఢచార సంస్ధలకు తమ వినియోగదారుల వివరాలను నేరుగా అందజేస్తున్న కంపెనీలలో ఒకటిగా ఫేస్ బుక్ ను స్నోడెన్ లోకానికి పరిచయం చేయడంతో తమ సమాచార భద్రతపై అనేకమంది వినియోగదారులు ఆందోళన చెందడం ప్రారంభించారు. డైలాగ్ బాక్స్ లో జరిగే సంభాషణల దగ్గర్నుండి వివిధ గ్రూపుల్లో జరిగే సంభాషణలను కూడా ఫేస్ బుక్ టార్గెట్ చేసుకుందని, ఆ మేరకు ప్రైవసీ పాలసీలో కూడా తగిన మార్పులు చేసుకుందని ఇటీవల వెల్లడయిన వివరాలు తెలియజేశాయి.

ఫేస్ బుక్ పైన మొహం మొత్తి దూరం అవుతున్న వినియోగదారుల సంఖ్య కూడా తక్కువ కాదని పరిశీలకులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో కంపెనీ భవిష్యత్తు పట్ల భయాందోళనలు ప్రారంభం అయ్యాయి. ఫేస్ బుక్ కు ఉన్నారని చెప్పుకునే వినియోగదారుల్లో అనేకమంది బూటకపు వినియోగదారులన్న వాస్తవం కూడా అంతకంతకూ రుజువవుతోంది. దానితో ఫేస్ బుక్ స్టాక్ విలువ ఎల్లకాలం నిలుస్తుందా అన్న అనుమానాలు బయలుదేరాయి. ఈ పరిస్ధితిలో వాట్సప్ కొనుగోలు ఫేస్ బుక్ మార్కెట్ ఆధారతను పెంచుతుందని ఆశిస్తున్నారు.

ఆసియా, ఆఫ్రికాలలో ఇంటర్నెట్ మొఖం ఎరుగని వినియోగదారులు ఇంకా వందల కోట్లలోనే ఉన్నారు. వీరికి భవిష్యత్ లో ఇంటర్నెట్ తో మొదటి పరిచయం పి.సిలకు బదులుగా మొబైల్ ఫోన్ల ద్వారానే కలిగే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల కూడా వాట్సప్ కొనుగోలు ఫేస్ బుక్ కు లాభించనుంది. ఇలాంటి ఇంటర్నెట్ మొదటి వినియోగదారులను తన ఉనికి ద్వారా ఫేస్ బుక్ ఆకర్షించలేని పక్షంలో వారికి శాశ్వతంగా ఫేస్ బుక్ మొఖం చూడని పరిస్ధితి వస్తుందనీ, అనేక ప్రత్యామ్నాయ అప్లికేషన్లు వారికి అందుబాటులో ఉండడమే దానికి కారణం అని పరిశీలకుల అంచనా.

అయితే గూగుల్ కంపెనీకి ఉన్న అతిపెద్ద సానుకూలత యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం. నేడు వెలువడుతున్న మొబైల్ ఫోన్/స్మార్ట్ ఫోన్లలో 80 శాతం యాండ్రాయిడ్ ఓ.ఎస్ తో వెలువుడుతున్నాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో 80 శాతం మంది తాము వద్దనుకున్నా గూగుల్ అందజేసే విస్తృత సేవలను వినియోగించుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. సెర్చ్ వ్యాపార నుండి మేప్ లు, గూగుల్ ప్లస్ సోషల్ నెట్ వర్క్ వరకూ విస్తారమైన సేవలను గూగుల్ అందజేస్తున్న సంగతి తెలిసిందే.

వాట్సప్ అప్లికేషన్ ఫేస్ బుక్ చేతుల్లోకి వెళ్లినందున అది స్వతంత్రంగా ఉండగలదా అన్న అనుమానాలు లేకపోలేదు. స్వతంత్రంగానే ఉంటుందని జుకర్ బర్గ్ హామీ ఇస్తున్నాడు. ఫేస్ బుక్ తన ఉపరితల ఏరియాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందనీ, వివిధ అవసరాలకు వివిధ ఆప్ లను అందుబాటులోకి తేవడం ద్వారా విస్తృతిని పెంచుకుంటోందని కాబట్టి ఆయా ఆప్ లను స్వతంత్రంగా ఉంచక తప్పదని ఫేస్ బుక్ సమర్ధకులు హామీ ఇస్తున్నారు.

టెలికాం ఆపరేటర్లతో దగ్గరి సంబంధాలు నెరపడం ద్వారా వినియోగదారులకు మరింత చౌకగా ఇంటర్నెట్ అందుబాటులో ఉంచడానికి జుకర్ బర్గ్ పధకాలు రచిస్తున్నాడని, బార్సీలోనా కాన్ఫరెన్స్ లో కూడా ఇతర మొబైల్ ఆపరేటర్ కంపెనీలతో ఈ మేరకు ఒప్పందాలకు లేదా చర్చలకు ఆయన పూనుకోవచ్చని మార్కెట్ పరిశీలకులు ఊహిస్తున్నారు. లేనట్లయితే గూగుల్ తో పోటీ పడడం అంత తేలిక కాబోదు.

5 thoughts on “వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం

  1. పింగ్‌బ్యాక్: వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s