దలైలామా, ఒబామాల సమావేశం దరిమిలా చైనా ప్రభుత్వం అమెరికా రాయబారికి ఓవైపు సమన్లు జారీ చేస్తుండగానే చైనాతో తమకు సమస్యలేమీ లేవని అమెరికా మిలట్రీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా అత్యున్నత మిలట్రీ అధికారి బీజింగ్ పర్యటిస్తూ చైనాతో సంబంధ బాంధవ్యాలు తమకు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా టిబెటన్ భౌద్ధ గురువు దలైలామాను అమెరికా అధ్యక్షుడు ఒబామా కలుసుకున్నందుకు చైనా తీవ్ర నిరసన తెలిపిన మరుసటి రోజే మిలట్రీ అధికారి శాంతి సందేశం వెలువడడం అమెరికా-చైనాల సంబంధాల సంక్లిష్టతను చాటుతోంది.
ఆర్ధికంగా పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడుతూనే అదే ఆర్ధిక రంగంలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి రాజకీయ, మిలట్రీ రంగాలలో అమెరికా, చైనాలు పరస్పరం తలపడుతుంటాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పరస్పర విరుద్ధ పరిణామాలు ఈ సంగతిని మరింత విస్పష్టం కావిస్తున్నాయి.
అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రే ఒడీర్నో ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. చైనా మిలట్రీ అధికారులతో తన చర్చలు ‘నిజాయితీతో, నిష్కపటంతో’ జరిగాయని ఆయన ఈ సందర్భంగా విలేఖరులకు తెలిపారు. ఇరు దేశాల సైన్యాల మధ్య మరింత లోతైన సంబంధాలు నెలకొనడానికి తాము చర్చలు జరుపుతున్నామని తెలిపారు. “ఇది నిజంగా సహకారం విస్తృతం చేసుకోవడానికి ఉద్దేశించినది. కపటం లేకుండా చెప్పాలంటే మా మధ్య పోటీని నియంత్రించడానికి (manage) సంబంధించినది. అత్యున్నత స్ధాయిలో సహకారం విస్తృతం చేసుకోవాలని మేము భావిస్తున్నాము. పరస్పర ప్రయోజనాల ఉన్న చోట సహకారం తీవ్రం చేస్తాం. విభేదాలను నిర్మాణాత్మకంగా నడిపిస్తాం” అని ఒడిర్నో తెలిపాడు.
చైనా ప్రభుత్వంతోనే కాక చైనా మిలట్రీతో కూడా తమకు ఉమ్మడి అంశాలు ఉన్నాయని అందువలన పరస్పరం సంబంధాలు నెరపడం, చర్చలు జరపడం, అవగాహన పెంచుకోవడం ద్వారా ఇరు దేశాల మిలట్రీల మధ్య నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రధమ, ద్వితీయ ఆర్ధిక వ్యవస్ధలుగా ఉన్న అమెరికా, చైనాల మధ్య ఉన్న ఆర్ధిక పోటీ అనివార్యం. ఈ ఆర్ధిక పోటీ వలన ఇతర రంగాలలోనూ తగాదాలు, వైరుధ్యాలు విస్తరించడం కూడా అనివార్యం. ఈ కారణంతోనే అనేక రాయబార ఘర్షణలకు ఇరు దేశాలు వేదికలుగా నిలిచాయి. ముఖ్యంగా చైనాను అమెరికా సైనికంగా చుట్టుముట్టడంతోనూ, పెరుగుతున్న ఆర్ధిక ప్రయోజనాలను రక్షించుకోవడం కోసం తనను తాను అంతకంతకూ ఎక్కువగా చైనా వివిధ రీతుల్లో చాటుకోవడంతోనూ ఈ ఘర్షణలు పెరుగుతూ పోతున్నాయి. చైనా ఎదుగుదలను, మిలట్రీ విస్తరణను ఎలాగైనా అడ్డుకొని ఆర్ధిక బలిమిని నిలువరించడం అమెరికా ప్రయోజనం కాగా పెరుగుతున్న ఆర్ధిక బలిమికి అనుగుణంగా రాజకీయ, సైనిక, భౌగోళిక ప్రభావాన్ని విస్తరించుకోవడం చైనా అవసరం.
మిత్ర దేశాలు చైనా, దక్షిణ కొరియాలను అడ్డం పెట్టుకుని దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాలలో తిష్ట వేసిన అమెరికా యుద్ధ నౌకలు క్రమం తప్పకుండా మిలట్రీ విన్యాసాలు నిర్వహిస్తూ చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. తైవాన్ ను స్వతంత్ర దేశంగా అమెరికా గుర్తిస్తుండగా దానిని తమ దేశంలో భాగంగా గుర్తించాలని చైనా కోరుతుంది. దారితప్పి తిరుగుతున్న రాష్ట్రంగా తైవాన్ ను చెప్పే చైనా ఎప్పటికైనా తైవాన్ ను తాము కలుపుకోవలసిందేనని వాదిస్తుంది. “సుదీర్ఘ కాలంగా మేము ఇలాంటి సమస్యలపై చర్చిస్తున్నాము. భవిష్యత్తులో కూడా మరింత కృషి కొనసాగిస్తాము” అని ఈ వైరుధ్యాలను దృష్టిలో ఉంచుకుంటూ ఒడిర్నో విలేఖరులకు తెలిపారు. (Reuters)
ఇటీవల సంవత్సరాల్లో చైనా, అమెరికా యుద్ధ నౌకల మధ్య తృటిలో ఘర్షణలు తప్పిపోయిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి గత డిసెంబర్ లోనే అమెరికాకి చెందిన గైడెడ్ మిసైళ్లను మోసుకుపోయే క్రూయిజర్ ఒకటి దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తూ సమీపంలో మిలట్రీ డ్రిల్ లో పాల్గొంటున్న చైనా యుద్ధ నౌకను దాదాపు ఢీకొన్నంత పని చేసింది. చివరి నిమిషంలో అప్రమత్తం కావడంతో భారీ నౌకా ప్రమాదంతో పాటు ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం కూడా తృటిలో తప్పిపోయింది. ఇరు మిలట్రీ పక్షాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం లేనందున ఈ సంఘటనలు జరిగాయని, ఈ సమస్య పరిష్కారం కోసమే తాజా చర్చల్లో ప్రయత్నాలు జరిగాయని కొన్ని పత్రికలు సూచిస్తున్నాయి. అయితే ఈ విషయమై వివరాలేవీ వెల్లడి కాలేదు. వైరి పక్షంతో కనీసం ఫోన్ చేసి మాట్లాడుకునే వాతావరణం ఉండడం ఎంతో అవసరం అని అమెరికా జనరల్ ఒడిర్నో వ్యాఖ్యానించడం ఈ నేపధ్యంలోనే కావచ్చు.
జపాన్, చైనాల మధ్య తూర్పు చైనా సముద్రంలో నెలకొన్న యాజమాన్య వివాదం కూడా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. నిజం చెప్పాలంటే చైనాకు వ్యతిరేకంగా జపాన్ ను ఎగదోయడం ద్వారా ఇక్కడ తన ఉనికి ఎల్లకాలం ఉండేలా అమెరికా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. తద్వారా చైనా పక్కలో బల్లెంలా ఉండేదుకు ప్రయత్నిస్తోంది.
జపాన్ పై తీవ్రమైన, తక్కువ కాలం పాటు దాడి చేసేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుంటోందని ఇటీవల ఒక అమెరికా నావికా బలగాల అధికారి ప్రకటించడం సంచలనానికి దారి తీసింది. తూర్పు చైనా సముద్రంలోని దియోయు/సెంకాకు ద్వీపకల్పంపై యాజమాన్యం కోసం చైనా, జపాన్ ల మధ్య తగాదా ఉన్నది. ఇవి ప్రస్తుతం జపాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ కొన్ని శతాబ్దాల క్రితం చైనా నుండి స్వాధీనం చేసుకున్న ద్వీపాలివి. అందుకే తమ ద్వీపాలు తమకు ఇచ్చేయాలని, వాటిపై తమకు సార్వభౌమ హక్కులు ఉన్నాయని చైనా వాదిస్తోంది. జపాన్ అందుకు ససేమిరా అంటోంది.
ఈ నేపధ్యంలో జపాన్ పై అత్యల్ప కాలంలో వేగంగా దాడి చేయడానికి తగిన సామర్ధ్యం పొందడం కోసం చైనా తమ బలగాలకు శిక్షణ ఇస్తోందని అమెరికా నావికా గూఢచార అధికారి ఒకరు రెండు రోజుల క్రితం ఒక బహిరంగ వేదికపైనే ప్రకటించాడు. దీంతో మిలట్రీ పరిశీలకుల్లో కలకలం చాలరేగింది. ఈ వార్తను అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒడిర్నో తిరస్కరించాడు. అలాంటి సూచనలు ఉన్నట్లుగా తమ వద్ద సమాచారం లేదన్నాడు. “దియోయు/సెంకాకు ద్వీపకల్పం విషయంలో ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుకోవాలని మేము గట్టిగా చెబుతున్నాము” అని ఒడిర్నో తెలిపాడు. కానీ ఈ మాటలు కేవలు అలంకారప్రాయం మాత్రమే దియోయు/సెంకాకు ద్వీపకల్పం సమస్యను చైనా, జపాన్ లు సామరస్యంగా పరిష్కరించుకున్ననాడు అమెరికాకు ఈ ప్రాంతంలో ఇక ఉనికే ఉండదు. అది అమెరికాకు ఎంతమాత్రం అంగీకారం కాదు.
వచ్చే ఏప్రిల్ లో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ చక్ హెగెల్ కూడా చైనా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్, వెనిజులా, సిరియాలలో ఏకకాలంలో రష్యా, చైనా ప్రయోజనాలకు వ్యతిరేకంగానూ స్ధానిక జాతీయ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానూ సాయుధ ఘర్షణలను రెచ్చగొడుతున్న అమెరికా అదే సమయంలో చైనాతో మంతనాలు సాగించడం ఒక అభాస. చైనా కేంద్రంగా అమెరికా ఎదుర్కొంటున్న అభద్రతకు ఇది సూచిక.