శ్రీవిద్య:
మీ సైట్ పాఠకుల్లో నేనొకరిని. సైట్ నాకు ఉపయోగంగా ఉంది. నా మొదటి ప్రశ్న- ఇటీవల వార్తల్లో “మూజువాణి ఓటు” అని తరచుగా కనిపిస్తోంది… అంటే ఏమిటి? ఇటువంటి ఓటుతో ఇంతకుముందు ఏమన్నా ఇటువంటి తీర్పులు జరిగాయా?
సమాధానం:
మూజువాణి ఓటు అని పత్రికల్లో చదవడమే గానీ అదేమిటో చాలా మందికి తెలియదు. అడిగినా చెప్పేవారు తక్కువే ఉంటారు. వాణి అంటే గొంతు, పలుకు అని అర్ధం అని తెలుసు గనక అదేదో అరిచి చెప్పే ఓటు అని కొందరు చూచాయగా ఊహించి చెబుతారు. కానీ పూర్తి వివరాలు మాత్రం ఒక పట్టాన అందుబాటులో ఉండవు.
పేరే చెబుతున్నట్లుగా ఒక బిల్లు లేదా తీర్మానం పైన తమ అభిప్రాయాన్ని ‘అవును’ లేదా ‘కాదు’ అని మూకుమ్మడిగా అరిచి చెప్పేదే మూజువాణి ఓటు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా, అప్రజాస్వామికంగా కనిపించినా ప్రజాస్వామ్యం పేరుతో చెలామణిలో ఉన్న అన్ని దేశాల్లోనూ అమలులో ఉంది.
ఒక బిల్లు పైన గానీ తీర్మానం పైన గానీ చట్ట సభల్లో ఓటింగు కోరే పద్ధతులు ప్రధానంగా మూడు రకాలు. మూడింటిలో అత్యంత తేలికయినది మూజువాణి ఓటు.
ఒక బిల్లు లేదా తీర్మానం విషయంలో సభలో సాధారణంగా ఏకాభిప్రాయం ఉన్నపుడు స్పీకర్ మూజువాణి ఓటు నిర్వహిస్తారు. ఓటింగుకు పెడుతున్న బిల్లు లేదా తీర్మానంలో కొద్ది భాగం గానీ లేదా మొత్తంగా గానీ (పాఠం చదవగలిగినంత తక్కువగా ఉంటే) చదివి దానికి ఆమోదించేవారు Aye (Yes) అనాలని స్పీకర్ కోరుతారు. ఆమోదించే సభ్యులంతా మూకుమ్మడిగా ‘Aye’ అని అరుస్తారు. అనంతరం వ్యతిరేకించేవారు Nay (No) అనాలని స్పీకర్ మరోసారి కోరుతారు. ఈసారి వ్యతిరేకించేవారంతా ‘No’ అని మూకుమ్మడిగా అరుస్తారు. ఈ రెండు శబ్దాల్లో ఏది ఎక్కువ శబ్దంతో వినిపిస్తే ఆ వైపుగా బిల్లు లేదా తీర్మానం మొగ్గిందని స్పీకర్ భావించి ఆ మేరకు ప్రకటిస్తారు.
అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో శబ్దం తీవ్రతను బట్టి అవునా కాదా అని స్పీకర్ నిర్ణయించుకుంటారని చెబుతారు. కానీ ఇండియాలో ఇది స్పష్టంగా నిర్వచించినట్లు లేదు. పెద్దగా వివాదాస్పదం కానీ బిల్లులు లేదా తీర్మానాలు, సాధారణంగా ఎక్కువమంది అనుకూలంగా ఉన్నారని భావించే బిల్లులు లేదా తీర్మానాలు మూజువాణి ఓటుకు పెడతారు. ఓటు ఎటువైపు మొగ్గిందీ నిర్ణయించుకునే విచక్షణాధికారం స్పీకర్ దే.
అయితే మూజువాణి ఓటు ఫలితాన్ని స్పీకర్ ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయంతో విభేదిస్తూ డివిజన్ కోరే హక్కు సభ్యులకు ఉంటుంది. ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ, సదరు బిల్లు లేదా తీర్మానం భావితవ్యంపై దేశ ప్రజలు శ్రద్ధగా పరిశీలిస్తున్నారని నేతలు భావించినపుడు సభ్యులు డివిజన్ కోరుతారు. అనగా అవును అనేవారు ఒకసారి, కాదు అనేవారు ఒకసారి లేచి నిలబడితే వారిని లెక్కిస్తారు. ఆ విధంగా ఎవరు ఎటువైపు ఓటు వేసిందీ స్పష్టంగా తెలుస్తుంది.
ఈ రెండు పద్ధతుల్లో కాకుండా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కూడా ఓటింగు నిర్వహిస్తారు. సభ్యుల సీట్ల దగ్గర వివిధ (Yes, No, Abstain) స్విచ్ లు ఉంటాయి. స్పీకర్ ఆదేశించిన సమయంలో కొద్ది సేపు తమ తమ నిర్ణయానికి అనుగుణంగా స్విచ్ లను నొక్కి పెడతారు. అవన్నీ ఒక బోర్డుపైన ప్రత్యక్షం అవుతాయి. ప్రతి సభ్యుడు ఎటువైపు ఓటు వేసింది ఆ బోర్డుపైన కనిపిస్తుంది. ఆ బోర్డును ఫోటో తీసి మూడు రకాల ఓట్లు లెక్కిస్తారు. ఆ విధంగా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇది సుదీర్ఘమైన పద్ధతి.
మూజువాణి ఓటు కంటే డివిజన్ ఓటింగ్ కాస్త కష్టం. ఈ రెండింటి కంటే ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ ఓటింగ్ మరింత కష్టం. సమయం పడుతుంది. ఈ విధంగా సమయం తీసుకోకుండా ఉండడానికీ, సాధారణంగా ఏకాభిప్రాయం లేదా ఎక్కువమంది ఏకీభవిస్తున్నారు అనుకున్న బిల్లులపై స్పీకర్ మూజువాణి ఓటు పాటిస్తారు.
సభలో గందరగోళం నెలకొన్న పరిస్ధితుల్లో కూడా స్పీకర్ మూజువాణి ఓటును ఆశ్రయించవచ్చు. ఒక బిల్లును ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాల్సిన తప్పనిసరి పరిస్ధితి ఉండవచ్చు. కానీ కొందరు సభ్యుల నుండి తగిన సహకారం ఉండకపోవచ్చు. ఈ సందర్భాల్లో కూడా స్పీకర్ మూజువాణి ఓటును ఆశ్రయించవచ్చు.
పాలకులకు మరో అవసరం కూడా వస్తుంది. అత్యంత వివాదాస్పద బిల్లుల విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులు తాము ఎటువైపు ఓటు వేసిందీ జనానికి తెలియకూడదని భావించినప్పుడు కూడా మూజువాణి ఓటుకు మొగ్గు చూపుతారు. తద్వారా ప్రజల నుండి ఛీత్కారాలు, తిరస్కారాలు ఎదురు కాకూడదని సభ్యులు కోరుకుంటారు. అంటే ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలనే మోసగించడం అన్నమాట.
ఇవేవీ కాకుండా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు కూడా మూజువాణి ఓటును ఆశ్రయిస్తారు. ఉద్దేశ్యపూర్వకంగా తమ సభ్యుల చేతనే పాలక పక్షాలు గొడవ చేయిస్తారు. లేదా ప్రతిపక్షంలోని ఒకటి రెండు పార్టీలు పాలకపక్షంతో కుమ్మక్కయ్యి గలభా సృష్టిస్తారు. ఆ గలభాను సాకుగా చూపుతూ మూజువాణి ఓటుతో బిల్లును గట్టెక్కించుకుంటారు.
ప్రజలకు అనుకూలమైన బిల్లులను చర్చించకుండా ఆమోదం పొందకుండా చేయడానికి కూడా గలభా సృష్టిస్తారు. ఈ గలాభా సాకు చూపి వివిధ బిల్లులను ప్రవేశపెట్టకుండా వాయిదా వేస్తూ గడుపుతారు. ఈ వాయిదాలను, గలాభాలను ఆయా ప్రచారాల్లో అస్త్రాలుగా వాడుకోవడం మనకు తెలిసిన విషయమే. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు. గందరగోళం మధ్యనే అనేక ప్రజా వ్యతిరేక బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకునే పాలకులు మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం ఇప్పటికీ ఆమోదించలేదు.
కాబట్టి మూజువాణి ఓటు అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి. దాదాపు ఏకాభిప్రాయం ఉన్న బిల్లుల ఆమోదానికి అది ఉపయోగపడుతుంది. అత్యంత వివాదాస్పదం అయిన బిల్లులకూ ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలకు రిఫరెన్స్ ప్రజలే. బిల్లు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం. కానీ ఆమోదించాలి. అప్పుడు మూజువాణి ఓటు ఉపయోగపడుతుంది. బిల్లు ప్రజలకు అత్యంత అవసరం; కానీ పాలకులకి అది ఇష్టం లేదు. అప్పుడూ మూజువాణి ఓటు ఉపయోగపడుతుంది.
భారత పార్లమెంటు, అసెంబ్లీలు అనేకసార్లు అనేక బిల్లులను మూజువాణి ఓటు పద్ధతిలో ఆమోదించి చట్టాలు చేశారు. తెలంగాణ కంటే ముఖ్యమైన అనేక బిల్లులను, లక్షల కోట్ల రూపాయల ఖర్చులు పెట్టే బిల్లులను ఈ పద్ధతిలో ఆమోదించారు. పాలకవర్గాలకు ప్రజలను మోసం చేయడానికి తయారు చేసుకున్న తేలికపాటి ఓటింగ్ పద్ధతి మూజువాణి ఓటింగు.
(మీ రెండో ప్రశ్నకు సమాధానం మరో ఆర్టికల్ లో)
పూర్వం పెళ్ళిళ్ళలో మేజువాణి కార్యక్రమం బయట గదిలో వధూవరుల శోభనానికి దీటుగా ఏర్పాటుచేసేవారు. జమిందారితనంలో ఇదొక దిగజారుడు తంతు. రాజకీయంలోని మూజువాణి కూడా ఇటువంటి కోవకు చెందినదే. దిగజారుడు రాజకీయాలకు పెడదారి మార్గం. సభ్యులు మేకలమందలోని అరుపులతో కదిలే పీకలను లెక్కకట్టి ఫలితాన్ని అనుకూలంగా మలచుకోవడానికి అధికార పక్షం పక్షపాత నిర్ణయానికి నిర్దేశకత.
‘ Parliament transacted normal business for only 24 per cent of its total time in the extended winter session that started on February 5. A report of the PRS Legislative Research said that in the 12 sittings in this period, while Lok Sabha lost 79 per cent of scheduled time to disruptions, the Rajya Sabha lost 73 per cent time to disruptions’ .
And the cost of each minute of the session is two and a half lakh rupees !
మూజు వాణి ఓటు !
పాలకులకు గ్రేటు !
పాలితులకు చేటు !
ప్రజాస్వామ్యానికి తూటు !
Dear Editor
Thanks for the information
Dear sir,
Thank you for your valuable information………
Hi Yenduko?! YemO & VIJAY,
Your are welcome.
చట్ట సభలకు అయ్యే ఖర్చు ఎలా లెక్కకడతారో చెప్పగలరు ? అంత అంత ఖర్చు ఎందుకు అవుతుంది ?
మూజువాణి అనేది ఉర్దూ పదమైన -మూ జుబానీ- (నోటి మాటగా) అనే దానికి భ్రష్టరూపం. అంటే ఔననో, కాదనో నోటితిో చెప్పడం అన్నమాట. ఓటింగ్ లేకుండా మౌఖికంగా అన్న అర్థంలో వాడుతారు. మూజువాణి అనే పదం తెలుగులో లేదు.
ఇంగ్లీషులో దీనికి వాయిస్ ఓట్ అని పేరు