ఒక్కోసారి అమెరికా వాసులంత అదృష్టవంతులు ఉండరేమో అనిపిస్తుంది. అందుకు వారిపైన ఈర్ష్య కలుగుతుంది. దానికి కారణం అమెరికా సాధించిందంటున్న అభివృద్ధి కాదు. అమెరికా భూభాగంపైన అక్కడి ప్రజానీకానికి అందుబాటులో ఉన్న విస్తారమైన, వైవిధ్య భరితమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు. ఫొటోల్లో సైతం గుండెలు ఆవిసిపోయేలా చేసే నయాగరా జలపాతం వారి సొంతమే కదా. కాసిని శతాబ్దాల్లోనే సీజన్ల వారీ సంస్కృతీ సంరంభాలకు అమెరికా ఆలవాలం అయిందంటే కారణం అక్కడి ప్రకృతి నిర్మాణాలే.
అమెరికాకు ప్రకృతి ప్రసాదించిన అటువంటి నిర్మాణాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన ‘లేక్ సుపీరియర్’ ఒకటి. చలికాలంలో లేక్ సుపీరియర్ ప్రయాణం అమెరికన్లకు ఇష్టమైన ఆటవిడుపు. అరుదుగా సంభవించే చిక్కని చలి వల్ల ఐసు గుహలు ఏర్పడితే ఇక ఆ గుహల్ని సందర్శించడానికి జనం బారులు తీరుతారు. ఐసు గుహల్ని చేరే నీరు కూడా గడ్డకట్టడం ఇంకా అరుదైన దృశ్యం. లేక్ సుపీరియర్ లో ఇప్పుడా అరుదైన వాతావరణం నెలకొనడంతో జీవిత కాలపు అనుభవాలను సొంతం చేసుకోవడానికి జనం వరుస కట్టారు. ఆ దృశ్యాలే ఇవి.
పోలార్ వొర్టెక్స్ అమెరికాపై విసిరిన చలి పంజా వల్ల అయితేనేమీ, వరుసగా సంభావిస్తున్న మంచు తుఫాన్ల వల్ల అయితేనేమీ లేక్ సుపీరియర్ జనం నడవడానికి తగినంతగా గడ్డకట్టింది. పూర్తిగా గడ్డకట్టకపోయినా ఐసు గుహల్ని చేరుకోవాల్సిన మార్గం వరకు ఐసు మైదానంగా మారిపోయింది. ఆ మైదానంపై గుంపులుగా ప్రయాణం చేస్తూ అమెరికన్లు ఐస్ గుహల్ని సందర్శిస్తున్నారు. ఐసు గడ్డల గుహలకు ట్రెక్కింగ్ చేయడానికి వీలుగా మంచి నీటి సరస్సే గడ్డకట్టడం ఈ సంవత్సరం సమకూరిన అదనపు ఆకర్షణ.
లేక్ సుపీరియర్ అమెరికా, కెనడాల మధ్య విస్తరించి ఉంటుంది. అమెరికా భాగంలోని మంచినీటి సరస్సులో ‘అపోసిల్ ఐలాండ్స్’ (Apostle Islands National Lakeshore) పేరుతో ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఉండే అరుదైన గుహలు శీతల వాతావరణంలో ఐస్ గుహలుగా అవతరిస్తాయి. ఇవి టూరిస్టులకు ప్రధాన ఆకర్షణ. కానీ ఐసు గుహలు ఎప్పుడూ ఏర్పడవు. వెళ్లడానికి నీటి మార్గం ఉన్నా, సదరు గడ్డ కట్టిన ఐసు గుహల దృశ్యాలు మాత్రం అత్యంత శీతల పరిస్ధితుల్లోనే ఏర్పడతాయి.
ప్రస్తుతం అమెరికాను శీతల వాతావరణం చుట్టేసిన సంగతి తెలిసిందే. పోలార్ వొర్టెక్స్, మంచు తుఫాన్లు ఈ వాతావరణానికి కారణం. లేక్ సుపీరియర్ ట్రెక్కింగ్ కి సరిపోయినంతగా గడ్డకట్టిందని ప్రభుత్వం నెల క్రితం ప్రకటించింది. అప్పటి నుండి దాదాపు 35,000 మందికి పైగా యాత్రీకులు ట్రెక్కింగ్ కి వెళ్ళి అరుదైన అనుభవాల్ని సొంతం చేసుకున్నారని రాయిటర్స్ వార్తా సంస్ధ సమాచారం. గత 20 యేళ్ళలో ఎన్నడూ లేనంత విశాల ప్రాంతం మేర లేక్ సుపీరియర్ గడ్డ కట్టిందని సదరు వార్తా సంస్ధ తెలిపింది. ఇక్కడి నీటి ఘనీభవనం ఎంత తీవ్రంగా ఉందంటే భారీ ఓడలు కూడా ఇందులో చిక్కుకునిపోయాయి.
లేక్ సుపీరియర్ లోని అపోసిల్ ఐలాండ్స్ లో ట్రెక్కింగ్ కి వెళ్ళిన రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ అందించిన ఫొటోలివి. వీటిని ది అట్లాంటిక్ ప్రచురించింది.
- Lake Superior – Google
- Apostle Island National Lakeshore