అమెరికా ద్వంద్వ విధానాల గురించి అనేకానేక పుస్తకాలు, విమర్శలు, కధలు, వార్తా కధనాలు వచ్చాయ్, వస్తున్నాయ్, వస్తూనే ఉంటాయ్. మూడో ప్రపంచ దేశాలతో అమెరికాది ఎలాగూ పెత్తందారీ వైఖరే. పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రం అయ్యేకొద్దీ అమెరికా తన అనుంగు మిత్రులతో కూడా ఇదే తీరులో వ్యవహరిస్తోంది. ఇండియా లాంటి దేశాలపై వినాశకర అణు ఒప్పందాన్ని రుద్దిన అమెరికా కెనడాకు చమురు సరఫరా చేసే పైప్ లైన్ నిర్మాణానికి మాత్రం గ్లోబల్ వార్మింగ్ కారణంగా చూపుతోంది. ఉత్తర అమెరికా దేశాల (కెనడా, అమెరికా మెక్సికో) సమావేశం సందర్భంగా కెనడా, అమెరికాల మధ్య లుకలుకలు తాజాగా బైటికి వచ్చాయి.
అణు విద్యుత్ నాణ్యమైనదని, అత్యంత శుభ్రమైనదనీ, కాలుష్యం సృష్టించదని అణు విద్యుత్ కంపెనీలు ప్రభోదిస్తాయి. తమ లాభాల పలుకుల్నే పశ్చిమ దేశాల నేతలతో పలికిస్తాయి. వాస్తవంలో అణు విద్యుత్ ఎంత పరిశుభ్రమైందో ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా ఇప్పటికీ వాయు, జల, భూ కాలుష్యాలను నిలువరించలేక, లీకేజీలను అరికట్టలేక సతమతం అవుతున్న టెప్కో కంపెనీ, జపాన్ ప్రభుత్వాలను చూస్తే అర్ధం అవుతుంది. అలాంటి అణు విద్యుత్ రియాక్టర్లను ఇండియాకు అంటగట్టడానికి అమెరికా 2008లో పౌర అణు ఒప్పందాన్ని బలవంతంగా మనపై రుద్దింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, రష్యా లు అణు కాలుష్య కుంపటిని మన గుండెలపై మోపి లాభాలు పిండుకోజూస్తున్నారు.
కానీ అదే కాలుష్యం సాకుగా చూపుతూ పదేళ్ళ నాటి చమురు పైప్ లైన్ నాలుగో దశ నిర్మాణ ఒప్పందాన్ని అమెరికా నిరాకరిస్తోంది. కీ స్టోన్ XL పైప్ లైన్ గా పిలిచే పైప్ లైన్ ను పశ్చిమ కెనడాలోని తారు ఇసుక నేలల (Tar sands or Bituminous sands) ప్రాంతం అయిన హార్దిస్టీ నుండి మధ్య అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, స్టీలే నగరం వరకు నిర్మించాలని తలపెట్టారు. హార్డిస్టీ నుండి సింధటిక్ క్రూడ్ ఆయిల్ ను స్టీలే నగరానికి సరఫరా చేయడానికి ఈ పైప్ లైన్ ను ఉద్దేశించారు. ఈ పైప్ లైన్ ప్రాజెక్టును నాలుగు దశలుగా విభజించగా మొదటి మూడు దశల నిర్మాణం పూర్తయింది. నాలుగో దశను ‘కీ స్టోన్ XL పైప్ లైన్ ప్రాజెక్ట్’ గా పిలుస్తున్నారు.
కీ స్టోన్ XL పైప్ లైన్ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అమెరికా కాంగ్రెస్ లోని కొందరు సభ్యులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల నెబ్రాస్కా రాష్ట్రంలో పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి అభ్యంతరం. ముఖ్యంగా నెబ్రాస్కా లోని సాండ్ హిల్స్ ప్రాంతం పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. (కేరళ, కర్ణాటకల లోని పశ్చిమ కనుమలు తరహాలో.) భూములు, నీటి వనరులు, ఇంకా ఇతరత్రా ప్రత్యేకత కలిగిన ప్రాంతాలు ఈ పైప్ లైన్ వలన తీవ్రంగా కలుషితం అవుతాయని సహజసిద్ధత దెబ్బ తింటుందని వివిధ సంస్ధలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఆందోళన పర్యవసానంగా ప్రతిపాదిత పైప్ లైన్ రూట్ కు అనుమతి ఇవ్వడానికి అధ్యక్షుడు ఒబామా జనవరి 2012లో అనుమతి నిరాకరించాడు. దానితో పైప్ లైన్ నిర్మాణం తలపెట్టిన ట్రాన్స్ కెనడా కార్పొరేషన్ పైప్ లైన్ రూట్ ను సవరించుకుంది. సవరించిన రూట్ ద్వారా పర్యావరణ నష్టాన్ని పరిమితం చేయొచ్చని తెలిపిందేగాని అసలు నష్టం ఉండదు అని మాత్రం చెప్పలేకపోయింది. కొత్త రూట్ ను నెబ్రాస్కా గవర్నర్ జనవరి 2013 లో ఆమోదించాడు. కానీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంతవరకు ఆమోదించలేదు. 1179 మైళ్ళ పొడవునా నిర్మితమయ్యే పైప్ లైన్ కు అనుమతి ఇవ్వాలని కెనడా కంపెనీ పదే పదే కోరుతున్నప్పటికీ సంతకం చేయడానికి ఒబామా నుండి చొరవ లేదని కెనడా ఆరోపిస్తోంది. మెక్సికో నగరం తొలుకా లో జరిగిన మూడు దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో కూడా కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఈ ఆరోపణను పునరుద్ఘాటించినా ఒబామా నుండి నిర్దిష్టమైన హామీ లభించలేదు.
నాలుగో దశ నిర్మాణం కీ స్టోన్ XL పైప్ లైన్ పూర్తయితే అక్కడి నుండి ఇప్పటికే నిర్మించిన కీ స్టోన్ పైప్ లైన్ ద్వారా క్రూడాయిల్ టెక్సాస్ రాష్ట్రంలోని రిఫైనరీలకు చేర్చాల్సి ఉంటుంది. పైప్ లైన్ నిర్మాణాన్ని నెబ్రాస్కా గవర్నర్ ఆమోదించినప్పటికీ ఆ నిర్ణయాన్ని నెబ్రాస్కా రాష్ట్రం లోని ఒక జిల్లా కోర్టు నిన్ననే (ఫిబ్రవరి 19) కొట్టేసింది. దానితో పర్యావరణ వేత్తలకు, ఆందోళనకారులకు విజయం లభించినట్లయింది. ఈ నేపధ్యంలో కీ స్టోన్ పైప్ లైన్ వల్ల గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పెరిగేపనైతే తాను దానిని అనుమతించేది లేదని ఒబామా కూడా ప్రకటించాల్సి వచ్చింది.
ఈ విధంగా అమెరికాలోని వివిధ వ్యవస్ధలు తమ కంపెనీ తలపెట్టిన పైప్ లైన్ నిర్మాణాన్ని ఏళ్ల తరబడి సమీక్షించడాన్ని కెనడా తప్పు పడుతోంది. జిల్లా కోర్టు తన నిర్ణయాన్ని కొట్టివేయడంతో గవర్నర్ వెంటనే రాష్ట్ర కోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్లు చెప్పాడు. అక్కడ జరిగే నిర్ణయంపై కూడా ఓడిన వాళ్ళు సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్ళేది ఖాయం. తమ సమీక్ష ప్రక్రియ విస్తృతంగా ఉన్నప్పటికీ అది న్యాయబద్ధమైందే అని ఒబామా సమర్ధించుకున్నాడు. అమెరికా జాతీయ ఆర్ధిక వ్యవస్ధ, దాని ప్రయోజనాలే తమకు అత్యున్నతం అని ఒబామా గొప్పగా చాటుకున్నాడు.
అయితే భారత పాలకులకు తమ జాతీయ ఆర్ధిక వ్యవస్ధ, దాని ప్రయోజనాలు పట్టవని అనుకోవచ్చా? తమిళనాడులో కూడంకుళం సముద్ర తీరంలో రష్యా నిర్మించిన అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా మూడు తీర జిల్లాల ప్రజలు ఆందోళనలు చేశారు. సంవత్సరాల తరబడి పనులు వదులుకుని తమ భవిష్యత్ జీవనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న వేలాది గ్రామ ప్రజలపైన దేశద్రోహం కేసులు మోపడానికే కేంద్రం ఇష్టపడింది తప్ప వారి భయాందోళనలు తొలగించడానికి కనీసం ప్రయత్నించలేదు. పైగా ఆందోళనలకు అమెరికా మద్దతు ఉందని, స్కాండినేవియా దేశాల మద్దతు ఉందని ప్రధాని స్వయంగా అభాండాలు మోపారు. ఆరోపణలు రుజువు చేయాలని ఆందోళన నేతలు సవాలు చేసినప్పటికీ ప్రధాని నుండి సమాధానం రాలేదు.
రిటైల్ ఎఫ్.డి.ఐ విషయంలో దాదాపు నాలుగున్నర కోట్ల భారతీయ కుటుంబాల పొట్ట గొడుతూ అనుమతి ఇవ్వాలని బారక్ ఒబామా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేగా దానికి మన పాలకులు లొంగిపోయారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల సంస్కరణల కోసం ఒత్తిడి తెస్తే లొంగిపోయారు. పంచదార, పెట్రోల్ తదితర నిత్యావసర సరుకుల ధరలను డీ కంట్రోల్ చేశామని మొన్నటి బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి సగర్వంగా చాటుకున్నారు. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణల పేరుతో పశ్చిమ బహుళజాతి కంపెనీలు డిమాండ్ చేసినవే. అమెరికా జాతీయ ఆర్ధిక వ్యవస్ధ ప్రయోజనాలు ఒబామా కాంక్షించడంలో తప్పు లేదు. కానీ ఇతర దేశాల జాతీయ ఆర్ధిక వ్యవస్ధలను కుంగదీసి, కూలదోసి అమెరికాకు దోచి పెట్టాలని కోరడం ఎంతవరకు సమంజసం?
కెనడా పైప్ లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వమంటేనేమో ‘మా జాతీయ ఆర్ధిక వ్యవస్ధకు ప్రయోజనకరమయితేనే ఇస్తాం’ అంటారు. ఇండియాలో అణు రియాక్టర్లు అమ్ముకోవడం కోసం, వాల్ మార్ట్ రిటైల్ కంపెనీ నిలువు దోపిడీ కోసమేమో ఇండియా జాతీయ ఆర్ధిక ప్రయోజనాలను కూలదోసయినా సంస్కరణలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తారు. ఇది “మా ఇంటికొస్తే ఏం తెస్తావ్? మీ ఇంటికొస్తే ఏమిస్తావ్?” అని డిమాండ్ చెయ్యడమే కాదా?