తెలంగాణ బిల్లు ఆమోదించారు


Loksabha

ఒక ముఖ్యమైన అంకం పూర్తయింది. ఎంత ముఖ్యం అనుకున్నారో అంత వివాదాస్పదంగా ముగిసిపోయింది. ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక కోర్కెను మన్నించడానికి మరో ప్రాంత ధనిక వర్గాలు ససేమిరా అంగీకరించకపోవడంతో చివరికి మూజువాణి ఓటే తెలంగాణకు శరణం అయింది. ‘సీమాంధ్రకు కూడా న్యాయం’ నినాదం మాటున తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తినే మూల్యంగా చెల్లించుకోవాల్సిన డిమాండ్లు సీమాంధ్ర నాయకులు ముందుకు తేవడంతో సామరస్య వాతావరణానికి చోటు లేకుండా పోయింది. వెరసి గందరగోళం మధ్యనే లోక్ సభ ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ ను ఆమోదించింది.

బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించినప్పటికీ బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను మాత్రం తలలు లెక్కించి ఆమోదం పొందారని తెలుస్తోంది. క్లాజుల వారీగా మొత్తం 60కి పైగా సవరణలు ఆమోదం పొందాయని పత్రికల సమాచారం. సీమాంధ్రకు కూడా న్యాయం అంటూ బి.జె.పి నిన్న, ఈరోజు ప్రతిపాదించిన సవరణలు వాస్తవంగా ఆ పార్టీ సభలో పెట్టలేదని ఎం.ఐ.ఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందని తెలియడంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. సీమాంధ్ర నేతలు మాత్రం ఈ రోజు ప్రజాస్వామ్యానికి దుర్దినం అని ప్రకటిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు పరస్పరం భిన్నమైన అవగాహనలు ప్రకటించడం లోక్ సభలో బిల్లు ఆమోదం తర్వాత కూడా కొనసాగింది. తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూనే టి.డి.పి నేత మోదుగుల బిల్లును ఆమోదించిన తీరు అప్రజాస్వామికం అని తిట్టిపోశారు. తెలంగాణ వ్యతిరేక నాయకులు సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే, కమల్ నాధ్, స్పీకర్ మీరా కుమార్ తదితరులను నియంత అనీ, అప్రస్వామికులని, పక్షపాతి అనీ, కుట్రదారులని తిట్టిపోస్తున్నారు.

గందర గోళం మధ్య తెలంగాణ బిల్లుపై చర్చను హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రారంభించారు. అనంతరం లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ చర్చలో పాల్గొన్నారు. ఆమె ప్రసంగం పూర్తయ్యాక కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బిల్లుపై ముగింపు ప్రసంగం చేయడం, బిల్లును మూజువాణి ఓటుకు స్పీకర్ పెట్టడం, ఆయ్, నో లతో ఆమోదం పొందడం జరిగిపోయాయని వివిధ ఛానెళ్ల వార్తలను బట్టి తెలుస్తోంది.

చర్చ ప్రత్యక్ష ప్రసారం కాకుండా స్పీకర్ నిలువరించడం పట్ల పలువురు విమర్శలు సంధిస్తున్నారు. దాదాపు 40 మంది వరకూ వివిధ రాష్ట్రాల సభ్యులు తమ తమ డిమాండ్ లతో వెల్ లోకి రావడంతో తీవ్ర గందరగోళ పరిస్ధితుల మధ్యనే చర్చ కొనసాగింది. దానితో ప్రత్యక్ష ప్రసారం నిలిపేయాలని స్పీకర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా లోక్ సభ టి.వి లో ప్రత్యక్ష ప్రసారం ఆగిపోవడంతో సభ 3 గం.లకు వాయిదా పడిందని ఛానెళ్లు వార్త ప్రసారం చేశాయి. అయితే వాస్తవానికి సభ వాయిదా పడలేదని ప్రత్యక్ష ప్రసారం మాత్రమే నిలిపేశారని మొదట ఏ.బి.ఎన్, అనంతరం టి.వి9, ఈ టి.వి2 లు తెలిపాయి. అదే సమయంలో బిల్లు అప్పటికే ఆమోదించారని చెప్పాయి.

దాదాపు గం. 3. 15 ని.ల కల్లా లోక్ సభ మూజువాణి ఓటు ద్వారా తెలంగాణ బిల్లును ఆమోదించిందన్న వార్త వెలువడింది. అనంతరం లోక్ సభ వాయిదా పడిందని వార్త వెలువడింది. కానీ మరు నిమిషం లోనే వాయిదా కాదు చర్చ ఇంకా కొనసాగుతోందన్న వార్త వెలువడింది. వరుసగా సవరణలను ఆమోదిస్తున్నారని, సవరణలకు ఓటింగు తీసుకుంటున్నారని ఛానెళ్లు తెలిపాయి. ఈ వార్త వస్తుండగానే పార్లమెంటు బయట విమర్శల జాతర మొదలయింది.

లోక్ సభ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కాకుండా నిలిపేసినందుకు ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు చీకటి రోజు’ అని బి.జె.పి నేత వెంకయ్య నాయుడు వాపోయారు. టి.డి.పి నేతలు మోదుగుల, శివ ప్రసాద్, సుజన చౌదరి తదితర నేతలు కెమెరాలు ముందు గుండెలు బాదుకున్నారు. లోక్ సభలో సీమాంధ్ర ప్రజల గొంతు కోస్తున్నారని, కనీసం గొంతు కోయడం చూసే భాగ్యం కూడా ఇవ్వలేదని వాపోయారు. పట్టపగలే లోక్ సభలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన సుజన చౌదరి విమర్శించారు. సీమాంధ్ర బాధలు ఇక ఎవరికి చెప్పుకోవాలని మోదుగుల, శివ ప్రసాద్ ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యానికి ఈ రోజు చీకటి దినంగా ప్రకటించిన జగన్ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చారు.

లోక్ సభలో చర్చ ప్రత్యక్ష ప్రసారం కాని సంగతి తమకు తెలియదని సుష్మా స్వరాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. బిల్లుపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆమె సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా తాము చూస్తామని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ పని చేస్తామని ఆమె వాగ్దానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో బి.జె.పి అగ్రనేత ఎల్.కె.అద్వానీ సభలో లేరని ఛానెళ్లు తెలిపాయి. గందరగోళం మధ్య తెలంగాణ బిల్లును ఆమోదించవద్దని ఆయన నిన్నటి నుండి గట్టిగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో బి.జె.పిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా కొందరు అనుమానాలు వెలిబుచ్చారు.

బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్, జె.డి(యు) లు వాకౌట్ చేశాయి. సి.పి.ఎం సభ్యులు మొదటిసారిగా తెలంగాణకు వ్యతిరేకంగా లోక్ సభ వెల్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. టి.ఎం.సి సబ్యులు వెల్ లోకి రావడంతో వారు కూడా రావలసి వచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్లమెంటు తాజా విడత సమావేశాలు మొదలయినప్పటి నుండి వివిధ పార్టీల నేతలు చేస్తూ వచ్చిన పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఆడిన దాగుడు మూతల ఆటలు, వలపోతలు, తిట్టుపోతలు, తూరుపోతలు అన్నీ ఓట్ల కోసం పడ్డ పోటీలే అని జనం గ్రహించాల్సిన విషయం. ఎవరు ఎంత ఎక్కువగా భావోద్వేగాలు వ్యక్తం చేస్తే వారు అంత ఎక్కువగా తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రజలు భావిస్తారని వారు భావించిన ఫలితంగా ఆవిష్కృతం అయిన దృశ్యాలే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నవి.

పెప్పర్ స్ప్రే వీరుడు, ఆంధ్ర భగత్ సింగ్ అని అభిమానులతో (టి.వి ప్రకటనల్లో) పిలిపించుకున్న లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు చేసిన ప్రకటన ఆకర్షణీయంగా కనిపిస్తున్న వార్త. తెలంగాణ రాష్ట్రం వస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆయన చెబుతూ వచ్చారు. మాటకు కట్టుబడి నిజంగానే తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారని కొన్ని ఛానెళ్లు తెలిపాయి. ఆయన రాజకీయ సన్యాసానికి అసలు కారణం తెలంగాణలో ఆయనకి ఉన్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ఆస్తులేనని విమర్శకుల అభిప్రాయం. ఆయన మాత్రం “నాలాంటివారు ఇలాంటి రాజకీయాల్లో ఇమడడం కష్టం అని తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా అర్ధం అయింది. అందుకే తప్పుకుంటున్నా” అని చెప్పారు. సహ సభ్యులపై పెప్పర్ స్ప్రే జల్లినందుకు ఆయనపై విచారణ జరగవచ్చని, అవసరం అయితే శిక్షకు కూడా స్పీకర్ ప్రతిపాదించవచ్చని పత్రికలు రాశాయి. రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నందున పోటీ చేయకుండా నిరోధించే అవకాశం ఇప్పుడిక లేదు. కానీ పెప్పర్ స్ప్రే ఘటన జరిగింది కనుక ఆయన సన్యాసంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

5 thoughts on “తెలంగాణ బిల్లు ఆమోదించారు

 1. స్వాగతం! సుస్వాగతం!! తెలంగాణా! కానీ, ఈ విదంగా ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణా అభిమానిగా సిగ్గుపడుతున్నాను!రేపు తెలంగాణా ఈ విదంగా ఏర్పడిందని భవిష్యత్తు తరాలకు చెప్పేటుప్పుడు సిగ్గురాకమానదు!? దీనంతటికి ప్రధానకారణం కాంగ్రేస్! ఇంకే రాష్త్రము ఇలా ఏర్పడుకూడదని భావిస్తున్నాను!

 2. MOOLAగారూ, మా తెలంగాణను స్వాగతించినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు తెలంగాణ ఏర్పడిన విధానానికి సిగ్గుపడుతున్నానన్నారు. ఈ విషయంలో సీమాంధ్రులు సిగ్గుపడాలి. ఇకపోతే ఇంతకుమునుపు ఏర్పడిన రాష్ట్రాలు ముఁహ్ ౙబానీ వోటింగ్ ద్వారానే ఏర్పడ్డాయనే విషయం తెలుసుకోండి. అయితే, నేడు తెలంగాణ బిల్లు ఆమోదానికి సంపూర్ణ మెజారిటీని చూసుకొన్నాకనే వోటింగ్‍లో నెగ్గినట్టుగ ప్రకటించారు. అంటే, ముఁహ్ ౙబానీ వోటింగ్ ద్వారా కాక ప్రత్యక్షంగానే వోటింగ్ ద్వారానే నెగ్గినట్టుగా ప్రకటించారన్నది వాస్తవం. ఐతే మీ ఉద్దేశం బిల్లుకు మెజారిటీ లేదనా? వేరొకటా? కాంగ్రెస్ బీజేపీ కలిస్తే మెజారిటీ ఉన్నట్టా, లేనట్టా? ఈ విషయం మీరు అర్థంచేసుకోవాలి. ఇది ఖచ్చితంగా సక్రమమే. భవిష్యత్తరాలకు ఒక విజయగాథలా చెప్పాల్సిందే! ఇందుకు సిగ్గుపడాల్సిందేం లేదు.

 3. ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక కోర్కెను మన్నించడానికి మరో ప్రాంత ధనిక వర్గాలు ససేమిరా అంగీకరించకపోవడంతో చివరికి మూజువాణి ఓటే తెలంగాణకు శరణం అయింది.

  సీమాంధ్రులంతా దనికవర్గప్రజలే, అంతా కోటీశ్వరులే అని నాకు తెలీదు. రోజూ రోడ్డెక్కి అందోళనా అవేదన వెలిబుచ్చుతున్నవారు మీ దృష్టిలో శ్రమదోపిడీధనికస్వాములూనూ, సీమాంధ్రులను నిత్యం దాదాపుగా బూతులు తిట్టటమే ఉద్యమ విధానంగా చెలరేగిపోయేవారు ప్రజాస్వామ్యవీరవరేణ్యులూ అని మీకు అర్థం కావటం వలన మీరు తప్పక మేథావులే అని రూఢి అయింది. కేవలం మనదేశవాళీ మేథావులకు మాత్రమే అన్నీతలక్రిందులుగా అర్థం అవుతాయన్నది మరొకసారి చాటారు. శభాష్.

 4. శ్యామలరావు గారూ

  మీరు మేధావులంటూ ఎగతాళి చేయడం మానుకోవాలని కోరుతున్నాను. దయచేసి మరోసారి చెప్పించుకోవద్దు.

  తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక కోర్కెను సీమాంధ్ర ధనిక వర్గాలు మన్నించలేదని అన్నాను. దీనర్ధం మన్నించని వారంతా ధనిక వర్గాలే అని అర్ధం కాదు. మీకు కావలసిన అర్ధాన్ని నా రాతలకు ఆపాదిస్తే అందుకు నేను బాధ్యుడ్ని కాను.

  తెలంగాణ డిమాండ్ పైన నేను విభిన్న కోణాల నుండి అనేక ఆర్టికల్స్ బ్లాగ్ లో రాశాను. సందర్భం వచ్చినప్పుడల్లా నా అభిప్రాయం వివరించాను. మళ్ళీ పాడిందే… అన్నట్లు వాదిస్తే చెప్పేదేమీ లేదు.

  మన దేశంలో చాలా పట్టణాల్లో ట్రాఫిక్ రూల్స్ పెద్దగా పాటించరు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళగల పట్నాలు చాలా ఉన్నాయి. అదే తరహాలో ఏమీ అనుకోకుండా మీరోసారి మీ దృష్టిని ఒకసారి తలకిందులు చేసి చూడండి. విషయం సవ్యంగా అర్ధం అయ్యే అవకాశం లేకపోలేదు.

  నా మాటలకు అర్ధం నా దృష్టి కోణంలోనే చూడాలి. మీ దృష్టి కోణం నుండి కాదు. నా దృష్టి కోణం అర్ధం కాకపోతే అందులో తప్పు లేదు. మళ్ళీ అడిగితే చెబుతాను. కానీ వాటికి మీ అర్ధాన్ని ఆపాదిస్తే అందుకు బాధ్యత నాది కాదని విన్నవించుకుంటున్నాను.

 5. సామాన్యుల న్యాయబద్దమైన కోరిక ముందు….ధనిక వర్గాల, దోపిడీ శక్తుల అణచివేత తలవంచక తప్పదని …అంతిమ విజయం ఎప్పటికీ జనానిదే అని తెలంగాణ ఏర్పాటు నిరూపిస్తోంది. తెలంగాణ సోదరులకు శుభాకాంక్షలు.
  ఇక సీమాంధ్ర ప్రాంత సోదరులకు కూడా నాదో విజ్ఞప్తి. తెలంగాణ విజయం సీమాంధ్ర ఓటమి కాదు.

  పేదలు, సామాన్యులకు తమపై జరుగుతున్న దోపిడీని ఎదుర్కొనేందుకు, రకరకాల సిద్ధాంతాలను, మార్గాలను, పోరాట రూపాలను అనుసరిస్తారు. నిరసన ప్రదర్శనలు, బంద్ లు, గెరిల్లా పోరాటాలు, ఆత్మబలిదానాలు, ఆత్మాహుతి దాడులు,….ఇలా రకరకాల రూపాల్లో పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలు జరుగుతాయి.

  ఇక తెలంగాణ అంశానికొస్తే….ఇక్కడి ప్రజలపై జరుగుతున్న దోపిడీ అధికంగా సీమాంధ్రకు చెందిన వారి ద్వారా జరుగుతోంది. ఇందుకు చారిత్రక కారణాలు ఏవైనా…., సీమాంధ్రకు చెందిన కొందరు దోపిడీ దారులు తెలంగాణ ప్రాంత వనరులను దోచుకున్నారు. ఇందుకోసం తెలంగాణకు చెందిన దోపిడీదారులు కూడా వారికి సహకరించారు. ఈ దోపిడీని నివారించేందుకు ఎదుర్కొనేందుకు ఇక్కడి ప్రజలకు అందివచ్చిన ఆయుధం…లేదా నినాదం స్థానికత. మా ప్రాంతాన్ని మేం పాలించుకుంటాం అని. ఆ రకంగా పాలకుల దోపిడీని ఎదుర్కోవచ్చునని. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంత ప్రజలు విజయవంతమయ్యారు కూడా. ఐతే దీన్ని లోతుగా చూస్తే….దోపిడీ దారులకు వ్యతిరేకంగా సామాన్య జనం చేసిన పోరాటమే తెలంగాణ. ఇది సీమాంధ్ర దోపిడీ దారులకు వ్యతిరేకంగా జరిగిందే తప్ప…, సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా జరిగింది మాత్రం కాదు. కాబట్టి సీమాంధ్రకు చెందిన వారైనా, ఇతర రాష్ట్రాల వారైనా దీన్ని దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా కాదు. ప్రస్తుతానికి సీమాంధ్ర పాలకుల దోపిడీ తప్పినంత మాత్రాన ( అసలు తప్పుతుందా అనేది మరో ప్రశ్న) స్థానిక దోపిడీ దారుల దోపిడీ ఉండదని కాదు.
  ఎలాగంటే స్వతంత్ర పోరాట కాలంలో….బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతే మన దేశాన్ని మనమే పాలించుకోగలం అని నాటి జనం చాలా ఆశించి ఉంటారు, కానీ ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా…? తెల్ల దొరలు పోయి, నల్లదొరలు వచ్చారు. తెలంగాణ లోనూ అదే జరగొచ్చు. మళ్లీ దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు మరో పోరాట రూపాన్ని ఎంచుకుంటారు. వెంటనే కాకపోవచ్చు. తాము మళ్లీ దోపిడీకి గురవుతున్నామని జనం గుర్తించిన తర్వాతైనా మరో పోరాటం తప్పదు. ఇలా ఎంతకాలం అంటే దోపిడీ రాజ్యం పోయేవరకూ….విరుద్ధ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోరాటమైనా…..మరో పోరాటమైనా లోతుగా చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే
  దోపిడీ చేసే వర్గాలకు….దోపిడీకి గురవుతున్న వర్గాలకు మధ్య నిత్యం సంఘర్షణ ఖాయం అని…ఈ పోరాటంలో అంతిమ విజయం సామాన్యులదేనని గతంలో అనేక పోరాటాలు నిరూపించాయి. తాజాగా తెలంగాణ పోరాటం నిరూపించింది. కనుక……….. తెలంగాణ ప్రజల విజయం సీమాంధ్ర ప్రజల ఓటమి కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s