పార్లమెంటు గొంగట్లో అప్రజాస్వామిక వెంట్రుకలు ఏరగలమా?


(పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! ఆర్టికల్ కింద మిత్రుల వ్యాఖ్యలకు రాసిన సమాధానంలో కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్)

*********

పార్లమెంటులో సభ్యులు ప్రజాస్వామికంగా వ్యవహరించడం అంటే ఏమిటి? ఎవరి సీట్లలో వారు కూర్చొని ఆయా బిల్లులపై తమ పార్టీల వైఖరికి కట్టుబడి అభిప్రాయాలు చెప్పడం. ఓటింగ్ జరిగినప్పుడు ఓటు వేయడం. సభాపతి అవకాశం ఇచ్చినపుడు మాట్లాడడం. సభా కార్యకలాపాలు దాదాపు అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఎవరు ఎప్పుడు మాట్లాడాలీ, ఏ అంశం ఎత్తాలి… మొ.న విషయాలు ముందే నిర్ణయం అవుతాయి. అప్పటికప్పుడు లేవనెత్తే సమస్యల కోసం జీరో అవర్ అనీ, వాయిదా తీర్మానాలనీ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ పద్ధతులకి భిన్నంగా ఏది జరిగినా దౌర్జన్యమో, అప్రజాస్వామికమో, లేక ఇంకొకటో అవుతుంది గానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాత్రం కాదు.

కానీ సభలు ఇలా పద్ధతిగా జరుగుతున్నాయా? నాకు ఊహ తెలిసినప్పటి నుండి పాలక, ప్రతిపక్షాలు ఇరువురూ సభల్లో గొడవ చేయడమే చూశాను. ఇరువురికి అవసరం అయిన జీతాల పెంపుదల లాంటి అంశాలు, విదేశీ మాస్టర్లు రుద్దే అణు ఒప్పందం లాంటి బిల్లులు తప్ప ఏ ఒక్క అంశం పైనైనా గొడవ లేకుండా, సజావుగా ప్రజాస్వామికంగా చర్చలు జరిగాయా? ఈ సభల లక్షణమే అంత. అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారే గానీ అది పేరుకు మాత్రమే. సభ్యుల్లో దాదాపు అందరూ లేదా మెజారిటీ దోపిడీవర్గాల ప్రతినిధులే. అయినప్పటికీ, కనీసం తమలో తాము పంపకాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేసుకోలేని సంస్కృతి పాలకవర్గాలది. అలాంటి గొంగట్లో అప్రజాస్వామిక వెంట్రుకలు ఏరాలని పూనుకుంటే సాధ్యపడేదేనా?

మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్ పాల్ బిల్లు లాంటి ప్రజోపయోగ బిల్లులను ప్రవేశపెడుతున్నపుడు తీవ్రంగా గొడవలు జరిగాయి. అణు ఒప్పందం, రిటైల్ ఎఫ్.డి.ఐ లాంటి అనేక ప్రజావ్యతిరేక బిల్లులేమో ఈ సభల్లో అప్రజాస్వామికంగా ఆమోదం పొందాయి. అప్పుడెవరూ ప్రజాస్వామ్యం గురించి బాధపడిన దాఖలాలు లేవు. ఒక్క తెలంగాణ బిల్లు విషయంలోనే సభల్లో ప్రజాస్వామిక వాతావరణం గురించి, ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం గురించి వగచడం, బాధపడడం, వీలయితె ప్రతివాదకులపైన నాలుగు రాళ్ళు వేయడం, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తరహాలో వ్యాఖ్యానం చెయ్యడం సరైనవి కాజాలవు. 

ఎ.పి అసెంబ్లీలో జరిగిందేమిటి? స్పీకర్ పోడియం చుట్టూ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు వెల్ లోకి వచ్చి నిలబడి కాపలా కాయలేదా? తెలంగాణ ఎమ్మెల్యేలు వస్తుంటే వారు రాకుండా అడ్డం పడలేదా? తిరస్కరణ తీర్మానాన్ని స్పీకర్ రెండు నిమిషాల్లో చదివేసి మూజువాణి ఓటుతో ఆమోదించేసామని ఏకపక్షంగా ప్రకటించలేదా? ఇవన్నీ ప్రజాస్వామికమే అయినప్పుడు తెలంగాణ బిల్లు ప్రతులు లాక్కోవడానికీ, చించడానికి, ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడానికీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అప్రజాస్వామికం ఎలా అవుతాయి?

ఫిబ్రవరి 12 తేదీన నేను 11 గంటల నుంచి 4 గంటల వరకూ టి.వి ముందు కూర్చుని తెలుగు, ఆంగ్ల ఛానెళ్లు మార్చి మార్చి చూస్తూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అనంతరం వివిధ పత్రికల వెబ్ సైట్లను చూసాను. వీటన్నింటి ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే సభలో ఇరు ప్రాంతాల సభ్యులు ఒకరికొకరు కలబడ్డారు. అది సభా సమయంలో జరగ్గా తాను చూడలేదని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ విలేఖరి స్వయంగా వీడియోలో చెప్పారు. ఒకరు దాడి చేస్తే మరొకరు భరించారని కాకుండా ఎవరి ప్రయత్నాలు వారు చేసారు.

ఈ క్రమంలో ఇరు పక్షాలూ సభా మర్యాదలను అతిక్రమించారు. ఇందులో ఒకర్ని మెచ్చుకుని మరొకర్ని తూలనాడాల్సిన అవసరం లేదు. తూలనాడాల్సిన అవసరమే ఉందనుకుంటే మొత్తం పార్లమెంటరీ వ్యవస్ధను ఈ స్ధితికి దిగజార్చిన అన్ని పార్టీలను అనాల్సిందే. ఇది కేవలం ఫిబ్రవరి 12, 2014 తో మొదలయింది కాదు. పైన చెప్పినట్లు నాకు ఊహ తెలిసినప్పటి నుండీ ఇలాంటి వార్తలు చదివాను. ఇప్పుడే కొత్తగా దేశానికి ఏదో ముందుకొచ్చిందని చెప్పడం సబబు కాదు.

సభల్లో ఆయా సభ్యుల ప్రవర్తనల విషయంలో ప్రజాస్వామికం-అప్రజాస్వామికం అనే చర్చజోలికి పోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే అవి వారి లక్షణాలు. పార్లమెంటు, అసెంబ్లీలు దోపిడీ వర్గాల ప్రయోజనాలు నెరవేర్చే ఆలయాలు. అప్పుడప్పుడూ ఇలా తెలంగాణ లాంటి ప్రజాస్వామిక బిల్లులు అందులోకి వస్తాయి. వాటిని ఆమోదం లభించేలా చూడడం ప్రతిపాదకులు, సమర్ధకుల కర్తవ్యం. ఇందులో మరో మాటకు తావు లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఇచ్చే మద్దతును సభల్లో సభ్యుల అపసవ్య వర్తనకు మద్దతుగా మార్చి చెబుతూ నిందలకు పూనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. 

తెలంగాణ రాష్ట్రం అనేది అక్కడి ప్రజల అకాంక్ష. వారి జీవిత అవసరం నీళ్లు, ఉద్యోగాలు, బడ్జెట్ లాంటి అంశాలలో ఆరు దశాబ్దాల పాటు వారు ఎదుర్కొన్న అప్రజాస్వామిక వివక్ష, నిర్లక్ష్యాలను అది తొలగిస్తుంది. అలాంటి బిల్లును వ్యతిరేకించడమే అప్రజాస్వామికం కాగా సమర్ధించడం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండడం. అప్రజాస్వామికమైన తెలంగాణ వ్యతిరేకతను పక్కనపెట్టి తెలంగాణ అనుకూలతను ‘ఎప్పటినుండో పార్లమెంటు కార్యకలాపాల్లో భాగంగా ఉన్న దౌర్జన్యాలకు దాడులకు మద్దతుగా’ మార్చి భాష్యం చెప్పడం అంటే అసలు సమస్యను వదిలి ఏదో ఒక సాకుతో నిందలకు దిగే ప్రయత్నం చెయ్యడం.

ఈ సందర్భంగా కొన్ని అంతర్జాతీయ ఉదాహరణలు చెప్పుకోవడం ఉపయుక్తం కాగలదు.

యు.కె జనాభా 6.3 కోట్లు. అందులో స్కాట్లాండ్ జనాభా 53 లక్షలు. అనగా యు.కె జనాభాలో స్కాట్లాండ్ జనాభా కేవలం 8 శాతం. కానీ యు.కె ప్రధాన ద్వీపంలో స్కాట్లాండ్ భూభాగం 30 శాతం పైనే ఉంటుంది. ఇప్పుడు స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవాలని కోరుకుంటోంది. ఈ మేరకు వచ్చే సెప్టెంబర్ 18 తేదీన ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరగబోతోంది. ఆ అభిప్రాయం మొత్తం యు.కె ప్రజల్ని అడగడం లేదు. కేవలం స్కాట్ ప్రజల్ని మాత్రమే అడుగుతున్నారు.

స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బరో ప్రపంచ ద్రవ్య సంస్ధలకు పెద్ద కేంద్రం. స్కాట్లాండ్ విడిపోతే ఉత్తర సముద్రంలో చమురు, సహజవాయువు వనరులు దాని సొంతం అవుతాయి. పారిశ్రామిక విప్లవ కాలం నుండి మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు స్కాట్లాండ్ పట్టుగొమ్మ. జెట్ ఇంజన్ల నుండి సాఫ్ట్ వేర్ వరకు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్… ఇలా అనేక సంస్ధలు అక్కడ ఉన్నాయి. కాబట్టి స్కాట్లాండ్ ని కోల్పోతే యు.కె ఆర్ధిక శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.

అయినప్పటికీ స్కాట్లండ్ ప్రజల డిమాండ్ ను యు.కె ప్రజలు ఇక్కడ జరగుతున్నట్లు ఇంత నడమంత్రంగా వ్యతిరేకించడం లేదు. అది ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఇతర యు.కె ప్రజలు అనడం లేదు. యు.కె ప్రధాని కూడా విడిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడే గానీ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇతర యు.కె ప్రజల్ని ఉసిగొల్పడం లేదు. ఎందుకని? ఎందుకంటే అది అక్కడి ప్రజల సహజ హక్కు. దానికి ఒకరి అనుమతి, వ్యతిరేకతలతో పని లేదు. స్కాట్ లలో ఎక్కువమంది కలిసే ఉండాలనుకుంటే యు.కె లో ఉంటుంది. లేకపోతే విడిపోతుంది.

గత సం. సూడాన్ నుండి దక్షిణ సూడాన్ ప్రత్యేక దేశంగా విడిపోయింది. సూడాన్ దేశపు ఆయల్ వనరుల్లో ఎనభై శాతం దక్షిణ సూడాన్ లోనే ఉన్నాయి. అయినా దక్షిణ సూడాన్ విడిపోవడానికి మా అభిప్రాయం కూడా అడగాలని సూడాన్ ప్రజలు చెప్పలేదు. ‘ఉన్న ఆయిల్ అంతా మీ దగ్గరే ఉంది. కాబట్టి కలిసే ఉండాలి, మా అభిప్రాయం కూడా తీసుకోవాలి’ అని వారు డిమాండ్ చేయలేదు. ఒకరిద్దరు చేసినా అది అప్రజాస్వామికం, నియమ విరుద్ధం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. జరిగిన గొడవ అంతా దక్షిణ సూడాన్ ప్రజల సాయుధ పోరాటమే. వారికి వ్యతిరేకంగా సూడాన్ ప్రజలు భావోద్వేగాలు పెంచుకుని జాతర చేయలేదు.

సోవియట్ రష్యా ఏర్పడినప్పుడు లెనిన్ ప్రభుత్వం జాతులకు విడిపోయే హక్కును సోషలిస్టు రాజ్యంగంలో చేర్చింది. ఆ హక్కుతోనే లాత్వియా, లిధుయేనియా, ఎస్తోనియాలు విడిపోయాయి. అనంతరం అవే వచ్చి కలిసాయి. సోవియట్ పెట్టుబడిదారీ వ్యవస్ధ అణచివేతను ఎదిరిస్తూ మళ్ళీ 1990లో విడిపోయాయి. సోవియట్ విఛ్ఛిన్నాన్ని రష్యా ప్రజలు వ్యతిరేకించి దాడులు చేయలేదు. పశ్చిమ రాజ్యాలు సోవియట్ విచ్ఛిన్నాన్ని ప్రోత్సహించాయే గానీ అప్రజాస్వామ్యం అని అరవలేదు. అనేక జాతులు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోతే అది వారి హక్కుగానే ప్రపంచ దేశాలు గుర్తించాయి.

ఈ ఉదహారణాలన్నీ ప్రత్యేక దేశంగా ఏర్పడాలని జరిగిన, జరుగుతున్న పోరాటాలు, ఘర్షణలు. కానీ తెలంగాణ ప్రజలు దేశం కావాలనలేదు. అరవైయేళ్ల క్రితం ఉన్న రాష్ట్రాన్ని తిరిగి ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారు అంతే. అది ప్రజాస్వామిక డిమాండ్. వారి సహజ హక్కు.

జాతులను బలవంతపు బందిఖానాలుగా పెట్టుకుని దోపిడీ చేయ్యడం పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద రాజ్యాల దోపిడీ లక్షణం. అది దోపిడీ అవసరం. అలాంటి దోపిడీ నుండి విముక్తి కావాలని జాతులు కోరుకోవడం ప్రజాస్వామిక లక్షణం. అందుకే జాతుల పోరాటాలకు మద్దతు ఇవ్వడం సోషలిస్టులు/కమ్యూనిస్టులు ఒక నియమంగా అమలు చేస్తారు. అలాంటిది కేవలం ఒక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం, అది కూడా అక్కడి ప్రజలు గట్టిగా కోరుతున్నా వ్యతిరేకించడం ప్రజాస్వామ్యం కానేకాదు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే ఒక అప్రజాస్వామిక భావన. ఇక అందులో మళ్ళీ ప్రజాస్వామ్య వర్తన-అప్రజాస్వామ్య వర్తన అంటూ తేడాలు ఉండవు. జాతుల విముక్తి కోసం సాయుధ పోరాటం చేసినా కరెక్టే అని కమ్యూనిస్టు సిద్ధాంతం గుర్తిస్తుంది. కానీ కమ్యూనిస్టులే పార్లమెంటరీ బురదలో కూరుకుపోయి సభల్లో ప్రజాస్వామిక ప్రవర్తన-అప్రజాస్వామిక ప్రవర్తన అంటూ చర్చ చేయడం వృధా ప్రయాస. అది అసలు సమస్యను పక్కదారి పట్టించడం లేదా అసలు పట్టించుకోకపోవడం.

8 thoughts on “పార్లమెంటు గొంగట్లో అప్రజాస్వామిక వెంట్రుకలు ఏరగలమా?

 1. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే ఒక అప్రజాస్వామిక భావన….. Chaalu ee okka vakyam….. 1000 salutes for this post….. thank you……

 2. రాజకీయ నాయకులకి, మీడియాకి స్వార్ధప్రయోజనాలు ఉంటాయి. కావున వారి భాషని, ప్రవర్తనని నేను అర్ధం చేసుకోగలను. కానీ, ఒక ప్రాంత ప్రజలు (సీమాంధ్రులు) మరొక ప్రాంత (తెలంగాణా) ప్రజల పట్ల తీవ్రమైన దురహంకార ధోరణి కలిగి ఉండటం.. దురదృష్టకరం. నన్ను సీమాంధ్ర ప్రజల మనస్తత్వం నిరాశకి గురి చేసింది.

 3. who started this mudslinging? Who started accused an entire region of looting and calling them settlers in thier own country? who threatened them not to come back after holidays? who threatened them with “cutting tongues”? then what were all these so called democratists doing? In scotland no one has been doing all these things and there are no threats to the mainland UK people, otherwise they could not have the courage. Dont forget what happened in the case of Ireland separatists! Anything can be settled through negotiations only, not through spread of hatred and lies. Then it will be like India and Pakistan.

 4. రాజకీయనాయకులు, పెట్టుబడిదారులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం తెలంగాణ ఏర్పడవద్దంటున్నారు. స్వార్థ ప్రయోజనాలు కోరని సీమాంధ్ర ప్రజలు, తెలంగాణను అడ్డుకోవడం శోచనీయం. రెండు చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల అభివృద్ధి శీఘ్రగతిన జరుగుతుందనేది వాస్తవం. ఇది తెలిసికొని ప్రవర్తించాలి సీమాంధ్రులు!

  అందరికీ తెలిసేలా ఉదాహరణలతో తెలిపినందుకు విశేఖర్ గారికి ధన్యవాదాలు.

  జై తెలంగాణ! జై జై తెలంగాణ!
  (నా తెలంగాణ కోటి రత్నాల వీణ…ratnaalaveena.blogspot.in)

 5. నిజమే శేఖర్ గారు.
  అసలు తెలంగాణ రాష్ట్ర్రం అనే పేరు వింటేనే కొందరు నాయకులు భరించలేకపోతున్నారు. పాకిస్తాన్- భారత్ కు మధ్య కంచె వేసినట్లు ఏదో పెద్ద అడ్డుగోడ కడతారన్నట్లుగా లేని పోనివి ప్రచారం చేస్తున్నారు.

  ఉద్యోగాలు రావని, నీళ్లు ఆపేస్తారని…, కొందరైతే వీసాలు పట్టుకొని హైదరాబాద్ కు పోవాలని…నోటికి ఏది తోస్తే అది విష ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర నాయకుల అభ్యంతరాలు నిజంగా అవే ఐతే తమకు ఉద్యోగాలు కావాలనో….నీళ్ల పంపకం సక్రమంగా జరగాలనో…పోనీ మాకు నీళ్లు ఎక్కువ కావాలనో….ఇంకా మరిన్ని ప్రయోజనాలో అడగవచ్చు. కానీ ఇవేవీ కాకుండా….మొండిగా సమైక్యాంధ్ర అంటారు. అవతలి వాళ్లు ఒప్పుకోకుండా సమైక్యంగా ఎలా ఉంటారో అర్ధం కాదు.

  అన్నింటికన్నా మరో కీలక మైన సంగతి ఏమిటంటే విభజన ఇష్టం లేకుంటే ముఖ్యమంత్రి కానీ మరో నాయకుడు కానీ….తెలంగాణ ప్రజలను “మీరు విడిపోవద్దు..మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఇకనైనా న్యాయం చేస్తాం” అని మాట మాత్రమైనా అన్నారా..? ఆ దిశగా చిన్న ప్రయత్నమైనా చేశారా..? పైగా తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని శాసనసభలోనే సీఎం ప్రకటించాడు. అటు చంద్రబాబు కానీ, జగన్ కానీ, అశోక్ బాబు కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నమో…, పర్యటనో చేశారా….? చేయరు. కానీ “విభజనను అడ్డుకుంటాం”. అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారు.
  పోనీ ఇప్పుడు లగడపాటో, సబ్బం హరో, జగనో….ఇతరం సీమాంధ్ర నాయకుల పోరాటం ఫలించి తెలంగాణ రాలేదే అనుకుందాం..? మరి అప్పుడు తెలంగాణ ప్రజలు ఊరికే ఉంటారా..? తర్వాత జరిగే పరిణామాలను సీమాంధ్ర నాయకులు కనీసం ఊహిస్తున్నారా…?
  మొత్తంగా చూస్తే…భవిష్యత్ లో తెలుగు ప్రజల మధ్య శాశ్వత వైరం పెట్టడం ద్వారా….రాజకీయ పబ్బం గడుపుకోవాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు…

 6. చందు తులసి గారు,
  మీరన్నది నిజం. వీరికి సమైక్యాంధ్రే ద్యేయమైతే తెలాంగాన ఉధ్యమం జరుగుతున్న మొదటి దశలోనే ఆ వైపూగా – అంటె సామారస్య పూరితంగా అడుగులు వేసే వారు కాదా? ముదిరి పాకాన పడినప్పుడు ఇంత బరి తెగించి పోతున్నారంటే రాజకీయ అవకాశ వాధం కాక మరోటి కాదు. ఈ విషయం ఇంతకు మునుపే ఇక్కడ చెప్పుకున్నాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s