మేధావి: ఫిషనా లేక ఫ్యూషనా?
సామాన్యుడు: ఏదీ కాదు పెప్పర్ స్ప్రే
***
భారత దేశానికి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. సభలో కూర్చునేవారు ఈ సంగతి చెబుతారు. సభ బయట ఉన్న మనం అది నిజమే కాబోలని నమ్ముతున్నాం. ప్రజాస్వామ్య దేవాలయం ప్రాశస్త్యం గురించి అనేక పుస్తకాలు, పాఠ్య గ్రంధాలు, పరిశోధనా పత్రాలు చెప్పే సూత్రాలకు ఇక కొదవే లేదు.
కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం ఇందుకు విరుద్ధం. పార్లమెంటులో సజావుగా చర్చలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. జరిగే గొడవలు కూడా అనేక సందర్భాల్లో సమయం గడపడానికీ, కెమెరాలను ఆకర్షించడానికీ, జరుగుతున్నవే. చేయాల్సిన గొడవలు చేసేసి, గడపాల్సిన సమయం గడిపేసి చివరలో ముఖ్యమైన ప్రజావ్యతిరేక బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించుకోవడం చట్ట సభల్లో అనాదిగా జరుగుతున్న తంతు.
ఫిషన్ అంటే ఒక పెద్ద పదార్ధం చిన్న కణాలుగా విడిపోవడం. న్యూక్లియర్ ఫిషన్ అంటే ఒక పెద్ద మూలకంలోని న్యూక్లియస్ రెండు లేక అంతకంటే ఎక్కువ చిన్న చిన్న న్యూక్లియస్ లుగా విడిపోవడం. చిన్న న్యూక్లియస్ లుగా విడిపోయే సందర్భంలో అసలు న్యూక్లియస్ లోని కొన్ని కణాలు స్వతంత్రంగా విడిపోయి స్వేచ్ఛను పొందుతాయి. అనగా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేసే కణాలుగా మారతాయి. ఇవి భౌతికంగా ఫోటాన్లు లేదా గామా కిరణాలుగా విడుదల అవుతాయి.
ఫ్యూషన్ అంటే రెండు చిన్న పదార్ధాలను అత్యంత వేగంగా ఢీకొట్టేలా చేసి ఒకే పదార్ధం పుట్టించడం. న్యూక్లియర్ ఫ్యూషన్ లో రెండు న్యూక్లియస్ లను అత్యంత వేగంతో ఒకదానికొకటి ఢీ కొట్టించి కొత్త న్యూక్లియస్ పుట్టిస్తారు. ఫ్యూషన్ ప్రక్రియలో ఐరన్ మూలకం లోని మాస్ (mass) కంటే తక్కువ మాస్ ఉండే మూలకాలను వాడితే శక్తి విడుదల అవుతుంది. ఐరన్ మాస్ కంటే ఎక్కువ మాస్ ఉండే మూలకాలను వాడితే శక్తి గ్రహణ ఉంటుంది.
ఐరన్ షరతును పక్కన పెడితే ఫిషన్, ఫ్యూషన్ లలో శక్తి విడుదల అవుతుందని గ్రహించవచ్చు. ఫిబ్రవరి 12 తేదీన పార్లమెంటు భవనం నుండి విడుదల అయిన శక్తి ఫిషన్ వల్ల వచ్చిందా లేక ఫ్యూషన్ వల్ల వచ్చిందా అని మేధావిగారు అంచనా వేయబోతే సామాన్యుడు గారేమో ‘అంతొద్దు, అది ఒట్టి పెప్పర్ స్ప్రే మాత్రమే’ అని తేల్చేశారు.
ఫిషన్, ఫ్యూషన్ లతో పోల్చాల్సిన సీన్ పార్లమెంటుకు లేదని కార్టూనిస్టు చెబుతున్నారా?