పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! -వీడియో


‘ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే చల్లాను’ అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్యానికి తీరని కళంకం అనీ, దుర్దినం అనీ, మాయని మచ్చ అనీ, సభ్యుడిని ఎన్నికల నుండి డీబార్ చేయాలని, దేశానికి చెడ్డపేరు తెచ్చారని దాదాపు అందరూ విమర్శిస్తున్నప్పటికీ లగడపాటి పాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నారు. టి.డి.పి ఎం.పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాపాడడానికి పరుగెత్తానని, తమపై గూండాల్లాంటి ఎం.పిలు దాడికి వచ్చారనీ, అందుకే ఆత్మ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే చల్లానని లగడపాటి చెప్పుకుంటున్నారు.

కానీ ఈ కింది వీడియో అందుకు విరుద్ధంగా ఉంది.

ఆత్మ రక్షణ అనే అవసరం ఎప్పుడు ఉదయిస్తుంది? ఎవరైనా దాడి చేసినపుడు, ఆ దాడి చేసేవారిని అడ్డుకోవడానికి ఆత్మరక్షణ అవసరం వస్తుంది. పెప్పర్ స్ప్రే అన్నది దాడి చేసేవారిని నిరుత్తరులను చేయడానికీ, వారిలో కొద్దిసేపయినా కొద్ది సేపు ఇబ్బందిలో పెట్టడానికీ, వారా ఇబ్బంది నుండి బైటపడేలోపు తాను తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది.

కానీ వీడియో చూస్తే ఏం తెలుస్తోంది? పెప్పర్ స్ప్రే ను తనపై దాడి చేస్తున్నవారిపై లగడపాటి ప్రయోగిస్తున్నట్లుగా లేదు. దానికి బదులుగా సభను, ముఖ్యంగా స్పీకర్ పోడియంను ఇబ్బందిలో ఉంచడానికి, తద్వారా బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడానికి మాత్రమే పెప్పర్ స్ప్రే చల్లారని స్పష్టం అవుతోంది. తమపై దాడి చేశామని చెప్పినవారిపై కాకుండా స్పీకర్ పోడియం వద్ద ఉన్న సభ్యులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే స్ప్రే చల్లినట్లు వీడియో ద్వారా అర్ధం అవుతోంది.

నిజానికి లగడపాటి ‘పెప్పర్ స్ప్రే’ అంకానికి చాలా ముందుగానే సిద్ధపడి ఉన్నారని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ ఛానెల్/ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఈ సంఘటనకు రెండు రోజుల ముందు ఆయనతో తమ విలేఖరి మాట్లాడారని ఎట్టి పరిస్ధితుల్లోనూ బిల్లు పెట్టనిచ్చేది లేదని చెప్పారని ఛానెల్ తెలిపింది. ఎలా అడ్డుకోబోతున్నారు? అని విలేఖరి ప్రశ్నించినప్పుడు “మీరే చూస్తారుగా” అని ఆయన సమాధానం ఇచ్చారని తెలిపింది. అనగా పెప్పర్ స్ప్రే జల్లే ఉద్దేశ్యం ఆయనకు ముందుగానే ఉన్నట్లు స్పష్టం అవుతోందని ఛానెల్ తేల్చింది.

ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం గం. 12 – గం. 1 ప్రాంతం మధ్యలో అమలాపురం ఎమ్మెల్యే హర్షకుమార్ టి.వి9 తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన “మాకు ఇక ఏ ప్రత్యామ్నాయమూ మిగల్లేదు. ఏం చేయమంటారు” అని చెప్పారు. కాబట్టి బిల్లు ప్రవేశాన్ని అడ్డుకోడానికి మరో ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లోనే లగడపాటి పెప్పర్ స్ప్రే జల్లారని అర్ధం అవుతోంది.

[మళయాళం ఛానెల్ కైరాలి అందించిన వీడియో]

 

‘దాడి చేశారు. గూండాల్లా వ్యవహరించారు’ అని సీమాంధ్ర ఎం.పి లు చేస్తున్న ఆరోపణలు ఏకపక్షం. బిల్లును కాపాడుకోవడం, ఆమోదం పొందేలా చూసుకోవడం తెలంగాణ బిల్లు ప్రతిపాదకులు, మద్దతుదారుల అవసరం. సదరు బిల్లు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు దర్పణం. ఆరు దశాబ్దాల వారి పోరాటానికి ప్రతిఫలం. అలాంటి బిల్లును వ్యతిరేకించడం, అడ్డుకోవాలని చూడడం, ఆ క్రమంలో అద్దాలు పగల గొట్టడం, మైకులు విరిచేయడం, అరుపులతో పెడబొబ్బలు పెట్టడం… ఇవే నిజంగా అప్రజాస్వామిక చర్యలు.

బిల్లు ప్రతులను చించడం, సభలో ప్రవేశపెట్టకుండా చూడడం ప్రజాస్వామ్య హక్కుగా, సభా హక్కుగా సీమాంధ్ర నేతలు చెప్పడం అంటే ప్రజాస్వామ్య హక్కుల్లో ‘దౌర్జన్యం చేయడం’ కూడా ఒక భాగంగా చెప్పడమే. సభా కార్యకలాపాలను భంగం కలిగించడం కూడా సభా హక్కుగా చెప్పుకోవడం ఒక విపరీత పరిస్ధితి. మేడిపండు ప్రజాస్వామ్యంలోనే ఇలాంటి విపరీత హక్కులకు డిమాండ్ ఉంటుంది.

6 thoughts on “పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! -వీడియో

 1. నిజంగా ఈ టపాతో మీమిద వున్న నాకు అభిప్రాయం తప్పని నాకు అనిపిస్తుంది. మీకు తెలంగాణ ఎంత అవసరమైనా యింత నీచంగా సమర్థించిటం చూస్తుంటే చాలా బాధగా వుంది…

  1. కమలనాథ్ ఆధ్వర్యంలో కాంగ్రేస్ ఎంపీలను “మార్షల్స్” లాగా వాడుకున్నారని, పిడిగుద్దులతో సీమాంధ్ర ప్రాంత ఎంపీలను వివిధ “ఐవిట్నస్” వాళ్ళు చెప్పినదాని బట్టి అర్థం అవుతుంది.

  2. కాంగ్రేస్ ఎంపీలందరూ (సీమాంధ్ర ఎంపీలు తప్ప) ప్రజాస్వ్యామ్యంగానే వ్యవహరించారనే ఉధేశం మీలో బాగా కనబడుతుంది. వారీ అరాచకాలను మీరు ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం అవ్వడం లేదు..

  3. అదిగో తోక అంటే యిదిగో పులి అన్నట్లు.. ‘కత్తి’ అని విషప్రచారంలో మీలాంటి వారు కూడ మంచిగా పోషించారు.. అంటే ఒక ప్రాంత వారి ని ఎలాగైనా ధుర్మార్గులుగా చిత్రిస్తానికి పయత్నించడం చూస్తుంటే.. మీ ఆలోచన విధానంలో లోపం కనబడుతుంది. మైక్ లు చట్ట సభలలో యిరగకొట్టడం నేను పుట్టక మునుపునుండి.. భారత చట్టసభలలో జరుగుతూనేవున్నయి.. మోదుగులను కాంగ్రేస్/తెలంగాణా వారు చితక బాదారని తెలిసిన తరువాత మీలాంటి వారు ఆ ‘కత్తి’ ప్రచారంలో ఉధేశపూర్వక మినహాయింపే కదా?.

  4. తెలంగాణ ప్రాంత పెట్టుబడీదారుల మీడియాను భుజాన ఎత్తుకొని.. వాటినే ప్రామాణికంగా మీరు తీసుకొని విషప్రాచారంలో మీరు భాగస్వామ్యం అవుతున్నారు. యిప్పటికి కొంత మీడియా.. కత్తులు కటారులతో పార్లమెంటుకు అని నిసిగ్గుగా ప్రాచారం చేస్తుంది..

  5. మరీ దారుణ విషయం ఏమిటంటే.. “బిల్లును కాపాడుకోవడం, ఆమోదం పొందేలా చూసుకోవడం తెలంగాణ బిల్లు ప్రతిపాదకులు, మద్దతుదారుల అవసరం” మీరు తెలంగాణ ఎంపీలు సీమాంధ్ర ఎంపీలపి భౌతిక దాడులను పరోక్షంగా సమర్థంచడం చూస్తుంటే.. మీ టపాలను నాలాంటి వారు చదవడం టైమ్ వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే… సభలో భిల్లు జిరాక్స్ కాపీలు చింపడం, సభలో ప్రవేశపెట్టకుండా చూడడం అంటే.. ప్రజాస్వామ్య హక్కుల్లో ‘దౌర్జన్యం చేయడం’ గా చూడటం…మీ వాదనలో పోంతన వుందా? ఒక దేశ సైనికుడని ఆ దేశ భక్తుడిగా చూడాలా? లేక వేరే దేశానికి ఉగ్రవాదిగా చూడాలా? వారి వారి ప్రాంతాల బట్టి రెండూ నిజమే!

  ఈ ఒక్క పాయింట్ చాలు.. నిజం ఏమి అయివుంటుందీ అవగాహనకు రావడానికి…
  పార్లమెంటులో 12 కెమారాలు వున్నాయి.. అవి బయట పెట్టాలని.. ఏ ఒక్క తెలంగాణ ఎంపీ కి తట్టలేదు.. కనీసం ఆ సాక్ష్యాలు కూడా వున్నయనే విషయం మీలాంటి వారికి తెలియదంటే ఎవరు నమ్మగలరు?
  కేవలం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు మాత్రమే కెమెరా ఫుటేజ్ లు బయట పెట్టాలని కోరుతుంటే.. మీలాంటి వారు, కాంగ్రేస్ అనుకూల మీడియా దాని ఊసే ఎత్తకపోవడం చూస్తుంటే.. నాకు.. సీమాంధ్ర ఎంపీలు అసాధారణంగా ప్రవర్తింవి వుండరని భావిస్తున్నా.. యిక పోతే హర్షకుమార్ ప్రత్యక్ష పరిస్థితి తెలియక.. అప్పటికే నేషనల్ మీడియాలో దానిని ఫాలో అయిన తెలుగు మీడియాకు ప్రభావంచెంది.. ఎలాగ కవర్ చేసుకొలేక తెలియక వాగిన వాగుడుగా భావించ వచ్చు…
  ఎందుకంటే.. ఉండవల్లి ఎన్ డి.టి.వి విలేకర్ తో మాట్లాడుతూ.. నేను ప్రత్యక్ష సాక్షిని.. మోదుగులను, రాజగోపాల్ ని తెలంగాణ ఎంపీలూ చితక బాధుతుంటే రక్షణార్థం స్ప్రే వాడటం జరిగింది.. నేను చెప్పినదానికి ఋజువు పార్లమెంట్ కెమెరా ఫుటేజ్ లు అన్నాడు… దీనిని బట్టి మనం ఏమని నమ్మాలి?

  యికపోతే.. షేర్ చేసిన వీడియోలో.. ఏముందో అస్సలు అర్థం అవ్వడంలేదు.. అదేదో పెద్ద సీక్రేట్ ని బయట పెట్టినట్లు చూస్తుంటే నాకు పెద్ద కామేడిగా వుంది. ఆ వీడియోలో ఏముంది? ఎవరో స్ప్రే కొడుతున్నట్లు వుంది.. ఆ ఒక్క అస్పష్ట దృశ్యానికి మషాల అంటించి కావలసిన కత్తిరింపులతో వున్న వీడియోలో మీకు ఏమి అర్థం అయిందో నాకు అర్థం అవ్వడంలేదు… ఎందుకంటే, స్ప్రే కొట్టిన వ్యక్తే పార్లమెంటు ప్రెస్ పాయింట్ సాక్షిగా దేశమొత్తానికి చెప్పాడు.. నేనే పిప్పర్ స్ప్రే కొట్టానని… కాని అతను చెప్పిన “స్ప్రే” కి దారితీసిన పర్తిస్థితిని మాత్రం మీరు షేర్ చేసిన వీడియోలో లేదు…

  నేను రాసిన “మీరు” ని మీరు వ్యక్తిగతం తీసుకోవద్దని అభ్యర్థన.. “మీరు” అంటే తలంగాణా విషయంలో మీలాంటి భావజాలం వున్నవారందరనీ అర్థంగా చోసుకోగలరు.

  పార్లమెంటులో 12 కెమెరాల ఫుటెజ్ లను బయట పెడితేగాని అస్సలు విషయం బయట పడతు.. నా ఉధేశం ప్రకారం ఆ విడియోలు ఎప్పటికీ బయటకు రావు.. అదే తెలంగాణ వాదుల ధైర్యం కావచ్చు.. ఎందుకంటే.. సీమాంధ్ర ఎంపీల పైకి తెలంగాణ, యితర రాష్ట్ర ఎంపీలను “మార్షల్స్” గా ఉపయోగించినట్లుగా బయట పడుతుండొచ్చు.

  ఎవరు పరిధి దాటి ప్రవర్తించినా అది ఖండనార్హమే కాకుండా శిక్షించ బడాలికూడా అది సీమాంధ్ర ఎంపిలైనా లేక తెలంగాణ ఎంపీలైనా… దారుణం చేసింది కాంగ్రేస్ ఎంపీలు.. దోషులుగా మాత్రం సీమాంధ్ర ప్రాంత ఎంపీలందరినీ చూపడానికి కాంగ్రేస్ అధిష్టానం తో పాటు తెలంగాణా వాద లీడర్లు ప్రయత్నిస్తున్నట్లు వుంది.

  నాకో విషయం అర్థం అవ్వడంలేదు.. తెలుగు ఎంపీలు పార్లమెంటులో కొట్టుకున్నంత మాత్రాన దేశ పార్లమేంటు ప్రతిష్ఠ దెబ్బతింటుందా? నాకు నిజంనవ్వొచ్చింది.. నీనియర్ పార్లమెంటేరియన్స్.. తెగ బాధ పడిపోయారు.. యింత దారుణమా అని…మన ఆర్థిక మంత్రి గా ఎవరుండాలో “వైట్ హౌస్” నిర్ణయించడం కన్నా నీచమా?

  ప్రాంతీయ వాదాలు, కులాలు , మతాలను సమర్థించి రాసేటప్పుడు కొంత సంయవనం అవసరం కనీసం మీలాంటి వారికి. ఎందుకంటే.. పెట్టుబడీ దారీ వ్యవస్థ.. ప్రాంతానికి, కులానికి, మతానికి అతీతం.. అందులేదు.. యిందులేదు.. ఎందెదువెతికినా వుంటుంది… అంతెందుకు.. తెలంగాణా వాదు ఉధ్యమనాయకులలో పెట్టుబడీదారులు లేరా?

 2. వివిధ అంశాలపై నిష్పక్షపాతంగా వ్యాఖ్యారిస్తారని మీ మీద పాఠకులు ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని ఈ పోస్టుతో మీరే తొలగించుకున్నట్లయింది.

  బిల్లును ఆమెదింపజేసుకోవటం, బిల్లును కాపాడుకోవటం కోసం తెలంగాణ ఎంపీలు వెల్ లోకి వెళ్ళటం, అప్రజాస్వామికంగా వ్యవహరించటాన్ని మీరు సమర్థించటం పూర్తిగా ఏకపక్షం.

  మీ బ్లాగుకు ‘జాతీయ, అంతర్జాతీయ వార్తలు, తెలంగాణ దృక్కోణం’ అని పేరు పెట్టుకుంటే సబబుగా ఉంటుంది.

 3. విషయాన్ని చర్చించడం మానేసి ఈ వ్యక్తిగత నిందలు ఏమిటండీ? ఒకరేమో నీచం అంటారు, ఇంకొకరేమో అభిప్రాయం తొలగించుకున్నానంటారు. ఈ ధోరణి దేనికీ ఉపయోగపడదు. కనీసం చర్చకు కూడా.

  పార్లమెంటులో సభ్యులు ప్రజాస్వామికంగా వ్యవహరించడం అంటే ఏమిటి? ఎవరి సీట్లలో వారు కూర్చొని తమ అభిప్రాయాలు చెప్పడం. ఓటింగ్ అవసరం అయితే ఓటు వేయడం. సభా కార్యకలాపాలు దాదాపు అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఎవరు ఎప్పుడు మాట్లాడాలీ, ఏ అంశం ఎత్తాలి… మొ.న విషయాలు ముందే నిర్ణయం అవుతాయి. అప్పటికప్పుడు లేవనెత్తే సమస్యల కోసం జీరో అవర్ అనీ, వాయిదా తీర్మానాలనీ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ పద్ధతులకి భిన్నంగా ఏది జరిగినా దౌర్జన్యమో, అప్రజాస్వామికమో, లేక ఇంకొకటో అవుతుంది.

  కానీ సభలు ఇలా జరుగుతున్నాయా? నాకు ఊహ తెలిసినప్పటి నుండి పాలక, ప్రతిపక్షాలు ఇరువురూ సభల్లో గొడవ చేయడమే చూశాను. ఇరువురికి అవసరం అయిన జీతాల పెంపుదల లాంటి అంశాలు, విదేశీ మాస్టర్లు రుద్దే అణు ఒప్పందం లాంటి బిల్లులు తప్ప ఏ ఒక్క అంశం ఐనా గొడవ లేకుండా, సజావుగా ప్రజాస్వామికంగా చర్చలు జరిగాయా? ఈ సభల లక్షణమే అంత. అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారే గానీ, అందరూ దోపిడీవర్గాల ప్రతినిధులే అయినా కనీసం తమలో తాము ప్రజాస్వామికంగా పంపకాలు చేసుకోలేని సంస్కృతి పాలకవర్గాలది. అలాంటి గొంగట్లో అప్రజాస్వామిక వెంట్రుకలు ఏరాలని పూనుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

  మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్ పాల్ బిల్లులాంటి ప్రజోపయోగ బిల్లుల సమయంలో తీవ్ర గందరగోళం జరిగింది. అణు ఒప్పందం, రిటైల్ ఎఫ్.డి.ఐ లాంటి అనేక ప్రజావ్యతిరేక బిల్లులేమో అప్రజాస్వామికంగా ఆమోదం పొందాయి. అప్పుడెవరూ ప్రజాస్వామ్యం గురించి బాధపడిన దాఖలాలు లేవు. ఒక్క తెలంగాణ బిల్లు విషయంలోనే సభల్లో ప్రజాస్వామిక వాతావరణం గురించి, ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం గురించి వగచడం, బాధపడడం, వీలయితె ప్రతివాదకులపైన నాలుగు రాళ్ళు వేయడం, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తరహాలో వ్యాఖ్యానం చెయ్యడం… ఇవి బొత్తిగా నాకు అర్ధం కాని విషయాలు.

  నా అభిప్రాయం నేను చెబుతున్నాను. మీ అభిప్రాయాలు కూడా మీరు చెప్పండి. వ్యక్తిగతంగా ఎందుకు నిందించడం?

  ఎ.పి అసెంబ్లీలో జరిగిందేమిటి? స్పీకర్ పోడియం చుట్టూ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు వెల్ లోకి వచ్చి నిలబడి కాపలా కాయలేదా? తెలంగాణ ఎమ్మెల్యేలు వస్తుంటే వారు రాకుండా అడ్డం పడలేదా? తిరస్కరణ తీర్మానాన్ని స్పీకర్ రెండు నిమిషాల్లో చదివేసి మూజువాణి ఓటుతో ఆమోదించేసామని ఏకపక్షంగా ప్రకటించలేదా? ఇవన్నీ ప్రజాస్వామికమే అయినప్పుడు తెలంగాణ బిల్లు ప్రతులు లాక్కోవడానికీ, చించడానికి, ప్రవేసపెట్టకుండా అడ్డుకోవడానికీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అప్రజాస్వామికం ఎలా అవుతాయి?

  ఫిబ్రవరి 12 తేదీన నేను 11 గంటల నుంచి 4 గంటల వరకూ టి.వి ముందు కూర్చుని తెలుగు, ఆంగ్ల ఛానెళ్లు మార్చి మార్చి చూస్తూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అనంతరం వివిధ పత్రికల వెబ్ సైట్లను చూసాను. వీటన్నింటి ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే లోక్ సభలో ఇరు ప్రాంతాల సభ్యులు ఒకరికొకరు కలబడ్డారు. ఒకరు దాడి చేస్తే మరొకరు భరించారని కాకుండా ఎవరి ప్రయత్నాలు వారు చేసారు. ఈ క్రమంలో ఇరు పక్షాలూ సభా మర్యాదలను అతిక్రమించారు. ఇందులో ఒకర్ని మెచ్చుకుని మరొకర్ని తూలనాడాల్సిన అవసరం లేదు. తూలనాడాల్సిన అవసరమే ఉందనుకుంటే మొత్తం పార్లమెంటరీ వ్యవస్ధను ఈ స్ధితికి దిగజార్చిన అన్ని పార్టీలను అనాల్సిందే. ఇది కేవలం ఫిబ్రవరి 12, 2014 తో మొదలయింది కాదు. పైన చెప్పినట్లు నాకు ఊహ తెలిసినప్పటి నుండీ ఇలాంటి వార్తలు చదివాను. ఇప్పుడే కొత్తగా దేశానికి ఏదో ముందుకొచ్చిందని చెప్పడం సబబు కాదు.

  వీడియోలో ఏముందో ఆర్టికల్ లో రాశాను. మీకు కామెడీగా ఉంటే నవ్వుకోండి. తప్పులేదు. కానీ వీడియోలో ఏమీ లేదనడమే విచిత్రంగా ఉంది. లగడపాటి ఆత్మరక్షణ కోసం కాకుండా, తనపై దాడి జరగడం అనేది లేకుండా పెప్పర్ స్ప్రే ని గాలిలో జల్లడం వీడియోలో కనిపిస్తోంది. అంటే ఆయన చెప్పినట్లు ఆత్మరక్షణ కోసం జల్లడం అబద్ధం అని తెలుస్తోంది. ఈ అంశం కోసమే వీడియో. లగడపాటి అబద్ధాన్ని ఈ వీడియో బైటపెట్టింది. ఏమీ లేదనడం ఏమిటి? మీకు చూడడం ఇష్టం లేదంటే సరిపోతుంది.

  సభల్లో ఆయా సభ్యుల ప్రవర్తనల విషయంలో ప్రజాస్వామికం-అప్రజాస్వామికం అనే చర్చజోలికి పోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే అవి వారి లక్షణాలు. పార్లమెంటు, అసెంబ్లీలు దోపిడీ వర్గాల ప్రయోజనాలు నెరవేర్చే ఆలయాలు. అప్పుడప్పుడూ ఇలా తెలంగాణ లాంటి ప్రజాస్వామిక బిల్లులు అందులోకి వస్తాయి. వాటిని ఆమోదం లభించేలా చూడడం ప్రతిపాదకులు, సమర్ధకుల కర్తవ్యం. ఇందులో మరో మాటకు తావు లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఇచ్చే మద్దతును సభల్లో సభ్యుల అపసవ్య వర్తనకు మద్దతుగా మీరు మార్చి చెప్పుకుని దానికి నన్ను నిందిస్తే నేను చెప్పెదేం లేదు. అందుకు నా పైనా, నా బ్లాగ్ పైనా అభిప్రాయం మార్చుకుంటాం అంటే అది మీ యిష్టం.

  తెలంగాణ రాష్ట్రం అనేది అక్కడి ప్రజల అకాంక్ష. వారి జీవిత అవసరం నీళ్లు, ఉద్యోగాలు, బడ్జెట్ లాంటి అంశాలలో వారు ఆరు దశాబ్దాల పాటు వారు ఎదుర్కొన్న అప్రజాస్వామిక వివక్ష, నిర్లక్ష్యాలను అది తొలగిస్తుంది. అలాంటి బిల్లును వ్యతిరేకించడమే అప్రజాస్వామికం. మీ అప్రజాస్వామిక వ్యతిరేకతను పక్కనపెట్టి నా/మా తెలంగాణ అనుకూలతను ‘ఎప్పటినుండో పార్లమెంటు కార్యకలాపాల్లో భాగంగా ఉన్న దౌర్జన్యాలకు దాడులకు’ మద్దతుగా మార్చి భాష్యం చెప్పడం అంటే అసలు సమస్యను వదిలి ఏదో ఒక సాకుతో నిందలకు దిగే ప్రయత్నం చెయ్యడం.

  ఈ సందర్భంగా ఒక సంగతి చెప్పడం ఉపయుక్తం కాగలదు.

  యు.కె జనాభా 6.3 కోట్లు. అందులో స్కాట్లాండ్ జనాభా 53 లక్షలు. ఇప్పుడు స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవాలని కోరుకుంటోంది. ఈ మేరకు వచ్చే సెప్టెంబర్ 18 తేదీన ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరగబోతోంది. ఆ అభిప్రాయం మొత్తం యు.కె ప్రజల్ని అడగడం లేదు. కేవలం స్కాట్ ప్రజల్ని మాత్రమే అడుగుతున్నారు. స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బరో ప్రపంచ ద్రవ్య సంస్ధలకు పెద్ద కేంద్రం. దాన్ని కోల్పోతే యు.కె ఆర్ధిక శక్తి తగ్గిపోతుంది.

  స్కాట్లండ్ ప్రజల డిమాండ్ ను యు.కె ప్రజలు ఇక్కడ జరగుతున్నట్లు ఇంత నడమంత్రంగా వ్యతిరేకించడం లేదు. స్కాట్లండ్ ప్రధాన ద్వీపంలో మూడో వంతు భాగం. అయినా అది ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఇతర యు.కె ప్రజలు అనడం లేదు. ఎందుకని? ఎందుకంటే అది అక్కడి ప్రజల సహజ హక్కు. దానికి ఒకరి అనుమతి, వ్యతిరేకతలతో పని లేదు. స్కాట్ లలో ఎక్కువమంది కలిసే ఉండాలనుకుంటే యు.కె లో ఉంటుంది. లేకపోతే విడిపోతుంది.

  గత సం. సూడాన్ నుండి దక్షిణ సూడాన్ ప్రత్యేక దేశంగా విడిపోయింది. సూడాన్ దేశపు ఆయల్ వనరుల్లో ఎనభై శాతం దక్షిణ సూడాన్ లోనే ఉన్నాయి. అయినా విడిపోవడానికి మా అభిప్రాయం కూడా అడగాలని సూడాన్ ప్రజలు చెప్పలేదు. ఉన్న్ ఆయిల్ అంతా మీ దగ్గరే ఉంది. కాబట్టి కలిసే ఉండాలి, మా అభిప్రాయం కూడా తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఒకరిద్దరు చేసినా అది అప్రజాస్వామికం, నియమ విరుద్ధం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు.

  సోవియట్ రష్యా ఏర్పడినప్పుడు జాతులకు విడిపోయే హక్కును సోషలిస్టు రాజ్యంగంలో లెనిన్ ప్రభుత్వం చేర్చింది. ఆ హక్కుతోనే లాత్వియా, లిధుయేనియా, ఎస్తోనియాలు విడిపోయాయి. అనంతరం అవే వచ్చి కలిసాయి. మళ్ళీ 1990లో విడిపోయాయి. సోవియట్ విఛ్ఛిన్నాన్ని రష్యా ప్రజలు వ్యతిరేకించలేదు. అనేక జాతులు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోతే అది వారి హక్కుగానే ప్రపంచ దేశాలు గుర్తించాయి.

  తెలంగాణ ప్రజలు దేశం కావాలనలేదు. అరవైయేళ్ల క్రితం ఉన్న రాష్ట్రాన్ని తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు అంతే. అది ప్రజాస్వామిక డిమాండ్. వారి సహజ హక్కు. జాతులను బలవంతపు బందిఖానాలుగా పెట్టుకుని దోపిడీ చేయ్యడం పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద రాజ్యాల దోపిడీ లక్షణం. అది దోపిడీ అవసరం. అలాంటి దోపిడీ నుండి విముక్తి కావాలని జాతులు కోరుకోవడం ప్రజాస్వామిక లక్షణం. అందుకే జాతుల పోరాటాలకు మద్దతు ఇవ్వడం సోషలిస్టులు/కమ్యూనిస్టులు ఒక నియమంగా అమలు చేస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని చెప్పినా స్వార్ధపూరితంగా చేసే వాదనే.

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే ఒక అప్రజాస్వామిక భావన. ఇక అందులో మళ్ళీ ప్రజాస్వామ్య వర్తన-అప్రజాస్వామ్య వర్తన అంటూ తేడాలు ఉండవు. జాతుల విముక్తి కోసం సాయుధ పోరాటం చేసినా కరెక్టే అని కమ్యూనిస్టు సిద్ధాంతం గుర్తిస్తుంది. కానీ కమ్యూనిస్టులే పార్లమెంటరీ బురదలో కూరుకుపోయి సభల్లో ప్రజాస్వామిక ప్రవర్తన-అప్రజాస్వామిక ప్రవర్తన అంటూ చర్చ చేయడం వృధా ప్రయాస. అసలు సమస్యను పట్టించుకోకపోవడం

  (ఈ వ్యాఖ్యలో సోషలిస్టులు/కమ్యూనిస్టులు అంటూ నేను రాసిన భాగం వాసవ్య గారిని మాత్రమే ఉద్దేసించినది. తేజస్వి గారికి ఇది వర్తించదు. మిగిలిన భాగం తేజస్విగారికి కూడా సమాధానంగా చూడగలరు.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s