జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్


దేశ రాజకీయ చిత్రపటంపై తమను తాము ఉప్పు-నిప్పుగా చెప్పుకునే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తాటి మీదికి రావడంతో ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ దశలోనే ఓటమిని ఎదుర్కొంది. దానితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసే దిశలో ప్రయాణిస్తోంది. ముఖేష్ అంబానీపై రాష్ట్ర ఎ.సి.బి చేత అవినీతి కేసు నమోదు చేయించినందుకే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటయ్యాయని అరవింద్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన ఎ.కె చివరికి ఆ కారణంతోనే మొట్టమొదటి అవినీతి వ్యతిరేక ప్రభుత్వాన్ని వధ్యశిలపై నిలబెట్టారు.

జన్ లోక్ పాల్ బిల్లు కేంద్రంగా ఢిల్లీ అసెంబ్లీలో గత కొద్ది రోజులుగా అల్లకల్లోల పరిస్ధితులు నెలకొన్నాయి. తెలంగాణ బిల్లు పుణ్యమాని ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్, బి.జె.పి ల కుమ్మక్కు దేశ ప్రజల దృష్టికి రాకుండా పోయింది. అసలు ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా చర్యలకు దిగిన ఢిల్లీ ప్రభుత్వం నుండి, ఢిల్లీ అసెంబ్లీలో తమ కుమ్మక్కు నుండి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికే ‘పెప్పర్ స్ప్రే’ అంకానికి తెర తీసారా అన్న అనుమానాలు లేకపోలేదు. జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడానికి న్యాయమంత్రి సోమ్ నాధ్ భారతి చుట్టూ తమ అల్లర్లను కేంద్రీకరించిన బి.జె.పి, కాంగ్రెస్ లు బిల్లును పెట్టకుండా మాత్రం అడ్డుకోలేకపోయాయి.

లోక్ పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి విరుద్ధంగా లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్.జి) నజీబ్ జంగ్ ఇచ్చిన సలహాను పాటించాలంటూ కాంగ్రెస్, బి.జె.పిలో ఢిల్లీ అసెంబ్లీలో గొడవ ప్రారంభించాయి. ఎల్.జి ఇచ్చిన సలహాను సభలో చదివి వినిపించాలని కాంగ్రెస్, బి.జె.పిలు ఒత్తిడి చేయడంతో స్పీకర్ సదరు సలహాను చదివి వినిపించినట్లు తెలుస్తోంది. చట్టం ప్రకారం నిర్ణయించబడిన పద్ధతికి విరుద్ధంగా లోక్ పాల్ బిల్లు ప్రవేశపెడుతున్నందున దానిని విరమించుకోవాలని నజీబ్ జంగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని తన సలహాలో కోరారు. ఈ సలహాను పాటించకుండా ఉండడానికే ఎ.కె ప్రభుత్వం నిర్ణయించుకుని బిల్లు ప్రవేశానికి చర్యలు ప్రారంభించింది.

గవర్నర్ సలహాపై ఓటింగు నిర్వహించాలని కాంగ్రెస్ నేత అరవింద్ సింగ్ లవ్లీ, బి.జె.పి నేత హర్షవర్ధన్ పెద్ద పెట్టున డిమాండ్ చేయడంతో సభ వాయిదా పడింది. ఈ డిమాండ్ ను వ్యతిరేకించిన ప్రభుత్వం వాయిదా అనంతరం గలాభా మధ్యలోనే లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి ఎ.కె లేచి నిలబడ్డారు. దీనితో రెచ్చిపోయిన కాంగ్రెస్, బి.జె.పి సభ్యులు గొడవకు దిగారు. గవర్నర్ సలహాకూ విరుద్ధంగా బిల్లు ప్రవేశ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని వారు వాదించారు.

సభలో మళ్ళీ గలాటా జరగడంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు. సభ మళ్ళీ సమావేశం అయిన తర్వాత బిల్లుపై చర్చ జరపాలని ప్రభుత్వం కోరింది. దీనిని నిరాకరించిన కాంగ్రెస్, బి.జె.పి సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ ను డిమాండ్ చేశాయి. అరుపులు, కేకల అనంతరం ఓటింగ్ కు స్పీకర్ సిద్ధపడ్డారు. లోక్ పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టాలా వద్దా అన్న అంశంపై సభ్యులు ఓటు చేయాలని కోరారు. ఈ ఓటింగులో ఢిల్లీ ప్రభుత్వం ఓటమిని ఎదుర్కొంది.

లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 27 ఓట్లు రాగా వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. అనగా కాంగ్రెస్, బి.జె.పి సభ్యులు లోక్ పాల్ ప్రవేశపెట్టడానికే (ఆమోదానికి కాదు) అంగీకరించలేదు. బిల్లును సభలో పెట్టాక అందులో లోటుపాట్లను చర్చించిన అనంతరం తిరస్కరిస్తే అదొక సంగతి. కానీ బిల్లు ప్రవేశపెట్టడాన్నే ప్రధాన పార్టీలు రెండూ వ్యతిరేకించడాన్ని బట్టి అవినీతికి వ్యతిరేకంగా ఆ పార్టీలు చెప్పే కబుర్లన్నీ ఓటి మోతలేనని స్పష్టం అయిపోయింది.

“ఇదే మా చివరి సెషన్ గా కనిపిస్తోంది. అవినీతిని రూపుమాపడానికి ముఖ్యమంత్రి పదవికి 1000 సార్లు రాజీనామా చేసే అవకాశం వచ్చినా, నా జీవితాన్ని అర్పించే అవకాశం వచ్చినా అదృష్టవంతుడిగా నన్ను నేను భావిస్తాను” అని బిల్లు ప్రవేశం ఓటమి అనంతరం అరవింద్ సభలో పేర్కొన్నారు. కానీ అవినీతి నిర్మూలనకు కావలసింది రాజీనామాలు, త్యాగాలు కాదు. ఆచరణాత్మక చర్యలు మాత్రమే కావాలి. ఆ చర్యలను పురిటిలోనే సో కాల్డ్ ‘పెద్ద’ జాతీయ పార్టీలు సంధికొట్టడంతో ఎ.కెకు మిగిలింది ఇక ప్రజల వద్దకు వెళ్ళడమే.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేసే యోచనలోనే ఉన్నారని ఎఎపి పార్టీ వర్గాలు చెప్పాయని ది హిందు తెలిపింది. ముఖ్యమంత్రి త్వరలోనే రాజీనామా చేయడం లాంటి తీవ్ర చర్యకు దిగవచ్చని వారు చెప్పినట్లు తెలుస్తోంది. “ప్రభుత్వంలో ఉండడం ఇక ఎంత మాత్రం సముచితం కాదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు” అని ఎఎపి నాయకుడొకరు చెప్పారని పి.టి.ఐ తెలిపింది. ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకోవడానికి పార్టీ కార్యకర్తలను కార్యాలయం చేరుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇక త్వరలోనే బంతి ఢిల్లీ ప్రజల కోర్టుకు రానుంది. ఈసారి ఎఎపికి పూర్తి మెజారిటీని ప్రజలు ఇవ్వగలిగితే బహుశా మరింత రంజైన రాజకీయం, అసలు సిసలు రాజకీయం ఢిల్లీ రాజకీయ యవనికపై కనిపిస్తుంది. కానీ ఈసారి ఎన్నికలు స్వేచ్ఛగా జరగనిస్తారా?

Photos: India Today

అప్ డేట్

ఈ ఆర్టికల్ ను పోస్ట్ చేస్తుండగానే ఢిల్లీ ముఖ్యమంత్రి రాజీనామా చేసిన వార్త వెలువడింది. కేబినెట్ సమావేశం జరిపిన అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని పత్రికలు తెలిపాయి. ఈ మేరకు తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు పంపారని తెలుస్తోంది. దీనితో అవినీతికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం ద్వారా ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం 49 రోజుల పసి దశలోనే ఊపిరి కోల్పోయినట్లయింది. అవినీతిని నిర్మూలించడానికి నడుం బిగిస్తే ఈ వ్యవస్ధలో ప్రధాన స్ధానాల్లో ఉన్న వర్గాలు చూస్తూ ఊరుకోబోవని అరవింద్ రాజీనామా స్పష్టం చేస్తోంది.

భారత దేశంలోని అర్ధ వలస-అర్ధ భూస్వామ్య వ్యవస్ధకు ప్రాణవాయువు అవినీతే. బల్లకింద చేయి చాస్తేనే అవినీతి అనుకుంటే అమాయకత్వం. ప్రజలకు చెందాల్సిన దేశ వనరులను అనేకానేక ఆర్ధిక విధానాల మాటున స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడమే ఒక పెద్ద అవినీతి కుంభకోణం. ఈ కుంభకోణానికి సారధులు జనం సంపదలను భోంచేసి బలిసిన పెట్టుబడుదారులు, భూస్వాములు, సామ్రాజ్యవాద వర్గాలే. వారిని అధికారం నుండి తప్పించకుండా అవినీతిని నిర్మూలించడం అసాధ్యం. అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే నిజాయితీపరుడై ఈ వర్గాల ఆధిపత్యాన్ని ఎదిరించాలని పూనుకుంటే, ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినా, ఈసారి మెజారిటీ ప్రభుత్వాన్నే ఏర్పరిచినా, దానిని ఆటంకపరచడానికి తగిన సాధనాలు, వ్యవస్ధాగత నిర్మాణాలు ఈ వ్యవస్ధలో ఉన్నాయి.

One thought on “జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్

  1. బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, దాని పరిణామాల ద్వారా….ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల మీద దేశంలో చాలా మందికి భ్రమలు తొలిగే అవకాశం ఉంది. ప్రత్యామ్యాయ మార్గాల వైపు చూసే అవకాశం….కనీసం ఆ దిశగా చర్చనైనా ఈ పరిణామాలు దారి తీస్తాయి. ఏ రకంగానైనా మార్పు అభిలషణీయమే కదా.

    ఇక ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి…..కేజ్రీవాల్ కు ఉన్న నక్కకు-నాకలోకానికి మధ్య ఉన్న తేడాని ఓ సారి చెప్పి తీరాలి. హై కమాండ్ ను వ్యతిరేకిస్తాను కానీ రాజీనామా చేయననే కిరణ్…..తాను నమ్మిన విలువల కోసం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ను చూసి చాలా నేర్చుకోవాలి.

    ఇక ఆమ్ ఆద్మీ విషయానికొస్తే…..దేశంలోని అన్ని రకాల దోపిడీ వర్గాలు ఈ సారి ఏకమైతాయి. ఆమ్ ఆద్మీని అధికారంలోకి రాకుండా సర్వ శక్తులూ ఒడ్డుతాయి. వారి అనుకూల మీడియా ప్రజల ఆలోచనలు మార్చేందుకు భారీ ఎత్తున ప్రచారం చేయవచ్చు. వీటికి ఢిల్లీ ఓటరు లొంగుతాడా….లేక ఆమ్ ఆద్మీకి పూర్తి మద్దతు ఇస్తాడా చూడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s