ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది.
వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్ ప్రైస్ తగ్గించడం వలన అనుకున్నదాని కంటే ఎక్కువ పలికిందని చెప్పిన ఐ.టి మంత్రి సిబాల్ తన ‘జీరో నష్టం’ వాదన గంగలో కలిసిన సంగతి చెప్పడం మర్చిపోయారు.
2జి మూడో విడత వేలం 10 రోజుల పాటు కొనసాగడం విశేషం. నవంబర్ 2012లో జరిగిన మొదటి విడత వేలం రెండు రోజుల్లో ముగియగా రెండో విడత వేలం (మార్చి 2013) కేవలం ఒక్క రోజే జరిగింది. ఈ రెండు వేలాల్లో ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పటి వేలంలోని ఆదాయం కలుపుకుంటే రద్దు చేసిన 2జి లైసెన్స్ ల వేలం ద్వారా ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రు. 72,000 కోట్ల చిల్లర. వేలం వేయాల్సిన లైసెన్స్ లు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నదీ తెలియలేదు.
గతంలో 800 MHz బ్యాండ్ ను వేలం వేసిన ప్రభుత్వం ఇప్పుడు 900 MHz మరియు 1800 MHz బ్యాండ్ లను వేలానికి పెట్టింది. ఈ రెండు బ్యాండ్ ల వేలం ద్వారా వచ్చిన ఆదాయం, 3జి వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో (67,718 కోట్లు) 90 శాతానికి చేరుకుందని ది హిందు తెలిపింది. 3జి వేలం ద్వారా వచ్చిన ఆదాయం ప్రాతిపతికనే కాగ్ సంస్ధ 2జి లైసెన్స్ ల పంపకం వల్ల వచ్చిన నష్టాన్ని 1,70,000 కోట్లుగా లెక్క కట్టింది. మిగిలిన 2జి లైసెన్స్ లను కూడా వేలం వేస్తే గానీ పూర్తి ఆదాయం ఎంతో తెలియదు.
ఐనప్పటికీ నామమాత్రపు ధరలకు 2జి స్పెక్ట్రమ్ ను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం వలన కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం వచ్చిందన్న కాగ్ వాదన రుజువైపోయింది. ఏ.రాజా-ప్రధాని మన్మోహన్ ల పంపకం వలన సున్న నష్టం వచ్చిందన్న కపిల్ సిబాల్ వాదన పచ్చి మోసంగానూ, కంపెనీల మేలు కోరి చేసిన వాదన గానూ రుజువైపోయింది. కపిల్ సిబాల్ తల ఎక్కడ పెట్టుకుంటారన్నదే ఇంకా తేలలేదు.
1800 MHz బ్లాకుల్లో 78 శాతం బ్లాక్ లకు బిడ్ లు రాగా 900 MHz బ్యాండ్ బ్లాక్ లకు 100 శాతం బిడ్ లు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ధరల ప్రకారం చూస్తే 1800 MHz ధరను బిడ్ ధర దాటిపోగా 900 MHz ధర కంటే బిడ్ ధర 85 శాతం ఎక్కువగా నమోదయిందని తెలిపింది. 1800 MHz బ్యాండ్ లో 385 Mhz ల స్పెక్ట్రమ్ మొత్తాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టిందనీ, 900 MHz బ్యాండ్ స్పెక్ట్రమ్ లో 46 Mhz ల మొత్తాన్ని వేలానికి పెట్టిందనీ ది హిందు తెలిపింది.
8 ప్రైవేటు కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. అవి: భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ముఖేష్ అంబానీ), ఎయిర్ సెల్, టాటా టెలీ సర్వీసెస్, టెలివింగ్స్ (యూనినార్), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (అనిల్ అంబానీ).