తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగానే లగడపాటి బరితెగించి పాల్పడిన చర్య తీవ్ర అల్లకల్లోలానికి దారి తీసింది. లోక్ సభ వెల్ లోకి ప్రవేశించిన రాజగోపాల్ జేబులో నుంచి పెప్పర్ స్ప్రే (మిరియాల పొడి కలిపిన ద్రావకం) బైటికి తీసి సభ నలువైపులా జల్లడంతో స్పీకర్ తో సహా పలువురు సభ్యులు అశ్వస్ధతకు గురయ్యారు. రాజగోపాల్ సృష్టించిన గందరగోళం పలువురి ఖండన మండనలతో పాటు 17 మంది సీమాంధ్ర ఎం.పిల సస్పెన్షన్ కు దారి తీసింది. సభ మరోసారి సమావేశం అయినప్పుడు టి.డి.పి ఎం.పి కె.నారాయణ రావు ఏదో మింగి కుప్పకూలారని, ఆయన్ను ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.
తమ ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో 6గురు ఎం.పిలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నాటకాలు ఆడొద్దు. ముందు మీ సభ్యులను కంట్రోల్ చేయండి’ అని బి.జె.పి నాయకులు తీవ్రంగా హెచ్చరించడంతో కాంగ్రెస్ ఈ సస్పెన్షన్ అంకానికి తెర తీసింది. అనంతరం కాంగ్రెస్ మంత్రులు కూడా వెల్ లోకి వచ్చి నినాదాలు చేయడంతో ఈ రోజు సభలో బిల్లు ప్రవేశపెడతారా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి.
బుధవారం విందు రాజకీయం చేయడం ద్వారా ప్రధాని మన్మోహన్ సింగ్ బి.జె.పిని దారిలోకి తెచ్చుకున్నారు. అయితే సభ్యులను సస్పెండ్ చేయడానికి వీలు లేదని వారు షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బిల్లు ఎలా ప్రవేశపెట్టేదీ ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాలేదు. బిల్లు ప్రవేశపెడుతున్నపుడు బిల్లు ప్రతులను ప్రతిపాదకుల చేతుల్లో నుండి లాక్కోవడం అనే ప్రక్రియను ఎస్.పి నేతలు గతంలోనే సభకు పరిచయం చేశారు. కాబట్టి హోమ్ మంత్రి బిల్లును ప్రవేశపెడుతున్నపుడు ఆ ప్రక్రియను కాపాడుకోవడం ఎలా అని తెలంగాణ ఎం.పి లు వ్యూహాలు రచించుకోగా, బిల్లు కాగితాలను ఎలా లాక్కోవాలా అని సీమాంధ్ర ఎం.పిలు వ్యూహాలు రచించుకున్నారు.
రానున్న ఉత్కంఠ భరిత సన్నివేశాన్ని జనానికి ఎప్పటికప్పుడు అందజేయడానికి ఛానెళ్లు తమ తమ ఏర్పాట్లు చేసుకున్నాయి. లోక్ సభ వ్యవహారాల జాబితాలో తెలంగాణ అంశం లేదని ఉదయం ఛానెళ్లు రిపోర్టు చేశాయి. ప్రవేశపెట్టేది లేనిది ఇంకా నిర్ణయించలేదని, ఇంకా మాట్లాడుతున్నామనీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాధ్ చెప్పినట్లుగా తెలిపాయి. అయితే 11 గంటలకల్లా లోక్ సభ జాబితాలో తెలంగాణ బిల్లు చేర్చారు. అప్పటి నుండి వివిధ ఛానెళ్లు ఢిల్లీ నుండి లైవ్ కార్యక్రమాన్ని, స్టూడియోల నుండి చర్చా కార్యక్రమాన్ని నడిపాయి.
12 గంటలకు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు అజెండాలో ఉన్నట్లుగా తెలిసింది. అయితే 12 గంటల నుండి లోక్ సభలో ఏం జరుగుతోందీ తెలియకుండా పోయింది. ప్రత్యక్ష ప్రసారం కోసం లోక్ సభలో ఏర్పాటు చేసిన కెమెరాలు కేవలం ఒక యువ ఎం.పిని మాత్రమే చూపాయి. సభలో వెనుక వరుసలో ఉన్న ఆయన మొఖంలో నమ్మలేని కార్యకలాపాలు తన ముందు జరుగుతున్నట్లుగా హావభావాలు కనపడ్డాయి. ఈ దృశ్యాన్ని ఆంగ్ల ఛానెళ్లు, అనంతరం టి.వి9, ఆ తర్వాత ఇతర ఛానెళ్లు చూపడం ప్రారంభించాయి. ఇంతలో లోక్ సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినట్లుగా ఎ.బి.ఎన్ చానెల్ టైటిల్స్ విజువల్స్ ను ప్రసారం చేసింది. కానీ లోక్ సభ దృశ్యాలను మాత్రం, ఆ ఒక్క యువ ఎం.పి ఫేసు తప్ప, ఛానెళ్లు చూపలేకపోయాయి.
ఇక అప్పటినుండి మొదలైంది జాతర. సభలో ఏదో భరించలేని వాసన ఘాటుగా వస్తోందని దానితో సభ్యులు పరుగులు పెడుతున్నారని టి.వి.9 ప్రసారం చేసింది. మరికొద్ది నిమిషాలకు విజయవాడ ఎం.పి లగడపాటి సభలో పెప్పర్ స్ప్రే జల్లారన్న వార్తను దాదాపు అన్నీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. లగడపాటి అన్నివైపులా పెప్పర్ స్ప్రే జల్లి ఆ తర్వాత కొంత మింగారని దానితో ఆయన స్పృహ తప్పారని ఒక ఛానెల్ చెబితే, ఎం.పి మందా జగన్నాధం ఆయన్ను కిందకి తోసేసి తొక్కారని మరో ఛానెల్ చెప్పడం ప్రారంభించింది. టి.డి.పి ఎం.పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సెక్రటేరియట్ బల్ల మీద ఉన్న మైకు విరగ్గొట్టారని, అలా చేతికి వచ్చిన మైకు భాగంతోనే తనను తాను పొడుచుకోబోగా సహచర ఎం.పిలు అడ్డుకున్నారని చెప్పాయి. ఇక ఆంగ్ల ఛానెళ్లయితే వేణుగోపాల్ సభకు కత్తి తెచ్చారని దానితో ఆయన పొడుచుకోబోయారని ఒక భారీ సంచలన వార్తగా ప్రసారం చేశాయి.
పెప్పర్ స్ప్రే వల్ల లగడపాటి, మరో ముగ్గురు ఎం.పిలు తీవ్ర అవస్ధతకు గురయ్యారని, వారిని అప్పటికే సిద్ధం చేసిన అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలించారని ఛానెళ్లు తెలిపాయి. ఇలా ఆసుపత్రిపాలయిన వారిలో తెలంగాణ కాంగ్రెస్ ఎం.పి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయన్ను పార్లమెంటు గేటు నుండి అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తున్న దృశ్యాలను ఆంగ్ల, తెలుగు ఛానెళ్లు ప్రసారం చేశాయి. పది లంఖణాలు తిన్నవారిలా తీవ్రంగా నలిగిపోయి, నలుగురైదుగురు దాదాపు మోసుకొస్తున్నట్లు కనిపించిన పొన్నం ప్రభాకర్ ని చూస్తే లగడపాటి ‘పెప్పర్ స్ప్రే’ ప్రభావం భారీగా ఉందని వీక్షకులకు అర్ధం అయింది.
ఇంకా ఇతర ఎం.పిలు కూడా ఒక్కొక్కరూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ బైటికి రావడం కనిపించింది. దాదాపు ప్రతి లోక్ సభ సభ్యుడు ఆశ్చర్యంతో, నమ్మలేని దృశ్యాలను చూసిన హావభావాలతో భవనం నుండి బైటికి వస్తూ కనిపించారు. కొందరు సభ్యులు నోటికి, ముక్కుకు రుమాలు అడ్డు పెట్టుకుని దగ్గుతూ, తుమ్ముతూ బైటికి వచ్చారు. టి.వి9తో టెలిఫోన్ లో మాట్లాడుతూ లగడపాటి చర్యను అమలాపురం ఎం.పి హర్షకుమార్ సమర్ధించుకున్నారు. తమకు ఇక ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో ఆ పని చేశామని, ఆయన స్వార్ధం కోసం ఆ పని చేయలేదని అందరూ గుర్తించాలని హర్షకుమార్ తమ చర్యల్లో న్యాయబద్ధతను, ప్రజలపై ప్రేమను కనపరిచేందుకు విఫలయత్నం చేశారు.
సీమాంధ్ర సభ్యుల ప్రవర్తనను, ముఖ్యంగా లగడపాటి చర్యను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. బి.జె.పి ఇదే అవకాశంగా కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసింది. బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భాల్లో అన్నీ సాంప్రదాయాలను కాంగ్రెస్ కాలరాసిందని సుష్మా స్వరాజ్ విమర్శించగా, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వైరుధ్యాలే ఈ పరిస్ధితికి కారణం అని వెంకయ్య నాయుడు విమర్శించారు. భారత ప్రజాస్వామ్యం ఆదర్శ ప్రాయంగా ప్రపంచం చూస్తుందని కానీ ఆ ప్రజాస్వామ్యం పైనే ఈ రోజు వ్యవహారం మచ్చ వేసిందని స్పీకర్ మీరా కుమార్ విమర్శించారు.
హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడలేని పరిస్ధితిలో ఆయన ఉన్నట్లు కనిపించింది. తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టామని ఒక ముక్క చెప్పి పోబోయారు. సభలో జరిగిన సంఘటన గురించి విలేఖరులు గొల్లుమంటూ అడగడంతో “మేము తగిన చర్య తీసుకుంటాము” అని చెప్పి వెళ్ళిపోయారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్ నాధ్ తాము చర్యలను ప్రతిపాదిస్తామని ఆ తర్వాత స్పీకర్ ఇష్టం అని చెప్పారు.
2 గంటలకు లోక్ సభ మళ్ళీ సమావేశమయింది. లగడపాటి రాజగోపాల్ తో సహా ఇతర సీమాంధ్ర ఎం.పి లు 18 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుత సెషన్ ముగిసేవరకూ ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలుస్తోంది. అనగా ఇక మళ్ళీ ఎన్నికల్లో నెగ్గితేనే వారికి పార్లమెంటులో ప్రవేశం. సెక్షన్ 374 A కింద సస్పెండ్ ఐనా సభ్యులు పేర్లు ఇవి: రాజగోపాల్, వేణుగోపాల్ రెడ్డి, సబ్బం హరి, అనంత వెంకట్రామి రెడ్డి, రాయపాటి, ఎస్.పి.వై రెడ్డి, ఎం.శ్రీనివాసుల రెడ్డి, వుండవల్లి, సాయి ప్రతాప్, సురేష్ షెట్కార్, కె.ఆర్.జి రెడ్డి, కనుమూరి, గుత్తా సుఖేందర్ రెడ్డి (తెలంగాణ), శివ ప్రసాద్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ళ నారాయణ రావు.
సీమాంధ్ర ఎం.పి లు అత్యధికులు ఓట్ల కోసం పోటీ పడుతూ మాత్రమే ఆయా వేశాలకు, నాటకాలకు, ఆందోళనలకు తెరతీశారు తప్ప జనం కోసం కాదు. నిజంగా సీమాంధ్ర జనం కోసం తపించేవారే అయితే ఆ నడక, నడత వేరేగా ఉంటుంది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అనేక అరాచకాలకు వంతపాడుతూ కేవలం ఒక్క రాష్ట్ర విభజన వల్లే కొంపలన్నీ కూలుతున్నట్లు గగ్గోలు పెట్టడం నయ వంచన, ప్రజా వంచన. వివిధ పార్టీల తెలంగాణ నాయకుల ప్రజానుకూలత ఏపాటిదో కూడా త్వరలోనే ప్రజలు కళ్ల జూస్తారు.
ఈ రోజు భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఇరు పక్షాలూ వాదిస్తున్నాయి. కాకపోతే కారణాలు వేరు. సభ్యుల అభిప్రాయాలను అణచివేస్తూ లోక్ సభలో బిల్లు పెట్టినందుకు ప్రజాస్వామ్యానికి మచ్చ అని సీమాంధ్ర నాయకులు చెబుతుంటే, పెప్పర్ స్ప్రే తో పాటు వివిధ రకాల ముష్టి యుద్ధాలకు దిగినందుకు మాయని మచ్చ అని తెలంగాణ నేతలు చెబుతున్నారు. కానీ ఈ నాయకులంతా ఒక తానులోని ముక్కలే అని జనం గ్రహించాల్సిన విషయం.
andhra mp lu intha baynkaranga bali thegisthe … telangana vallanu andhra mp lanu oke ghati katti bale manage chesaru …..
” సభ్యుల అభిప్రాయాలను అణచివేస్తూ లోక్ సభలో బిల్లు పెట్టినందుకు ప్రజాస్వామ్యానికి మచ్చ” ye billu meedha nainaa binna abipryalu vuntai …kondariki binna abipryalu vunnai ani .. billu le pettadu ante prapanchamu lo ye billu pass kadu 😦 .
మేనేజ్ చెయ్యడం ఏమిటి? ఏం చెప్పదలిచారో స్పష్టంగా చెప్పండి.
తెలుగు యం.పి ల తీరు సిగ్గుచేటు!కాంగ్రేస్ సీమాంధ్ర కాంగ్రేస్ యం.పి ల తో సర్దుబాటుకు ఎందుకు ప్రయత్నిచడం లేదు! అంత ఏక పక్షంగా ఎందుకు వెలుతోంది!తెలుగు యం.పి ల తీరు సిగ్గుచేటు!కాంగ్రేస్ సీమాంధ్ర కాంగ్రేస్ యం.పి ల తో సర్దుబాటుకు ఎందుకు ప్రయత్నిచడం లేదు! అంత ఏక పక్షంగా ఎందుకు వెలుతోంది!తెలుగు యం.పి ల తీరు సిగ్గుచేటు!కాంగ్రేస్ సీమాంధ్ర కాంగ్రేస్ యం.పి ల తో సర్దుబాటుకు ఎందుకు ప్రయత్నిచడం లేదు! అంత ఏక పక్షంగా ఎందుకు వెలుతోంది!
శేఖర్ గారు.. చివరి పేరా చివరి నుంచి మూడో లైనులో సీమాంధ్ర బదులు, తెలంగాణ నాయకులని ఉంది. సరిచేయగలరు.
అవున్నిజమే. సరి చేశాను. పైన ‘మేనేజ్ చేశారు’ అన్నది కూడా ఇందుకేనా?
manage chesaru annadhi andhuku kadu …. telangan valla nu bali theginchina andhra mp lanu oke gati naa kattinadhuku
ఒకేగాటన కట్టినట్లు ఎక్కడ కనిపించింది మీకు? సందర్భం చెప్పండి. ఊరికే ఒక రాయి వేసేస్తే?