వీసా ఇస్తామని అనుకోవద్దు, అమెరికా వివరణ


modi-US-visa

అమెరికా రాయబారి నరేంద్ర మోడిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరినంత మాత్రాన తమ వీసా విధానంలో మార్పు ఉంటుందని భావించనవసరం లేదని అమెరికా విదేశాంగ శాఖ వివరణలాంటి సవరణ ప్రకటించింది. అమెరికా వీసా విధానంలో గానీ, ప్రపంచవ్యాపితంగా మానవహక్కులకు మద్దతుగా నిలవడంలో గానీ అమెరికా ఎలాంటి మార్పు చేసుకోలేదని గొప్పలు పోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి విలేఖరులకు వివరణ ఇచ్చారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలుసుకోవడానికి అమెరికా రాయబారి నాన్సీ పావెల్ అనుమతి కోరిన సంగతి విదితమే. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 13) ఇరువురు గాంధీ నగర్ లో కలుసుకోనున్నారు. 2002 నాటి గుజరాత్ మారణకాండ నేపధ్యంలో నరేంద్ర మోడి అమెరికా సందర్శించకుండా ఆ దేశం మోడీకి ఇచ్చిన వీసాను రద్దు చేసింది. 2005లో రద్దు చేసిన వీసా ఇంతవరకు పునరుద్ధరించబడలేదు. మధ్యలో ఒకటి రెండుసార్లు అమెరికా వెళ్లడానికి మోడి ప్రయత్నించినప్పటికీ అమెరికా వీసా నిరాకరించింది.

మానవ హక్కులను హరించడంలో ప్రతికూల రికార్డు ఉన్నవారికి వీసా నిరాకరించడం అమెరికా విధానానికి విరుద్ధం అని కారణం చెప్పింది. ఈ నిబంధనను అమెరికా చాలా తక్కువమంది విషయంలో మాత్రమే అమలు చేసింది. సెర్బియా నాయకుడు స్లోబోడన్ మైలోసెవిక్ బోస్నియా ముస్లింలపై మారణకాండ జరిపించాడని ఆరోపించిన అమెరికా ఆయన వీసాను రద్దు చేసింది.

నిజానికి సెర్బియాలో గానీ, బోస్నియా-హెర్జిగోవినాలో గానీ జరిగిన దారుణ మారణకాండలకు అసలు కారకులు అమెరికా, ఇ.యులే తప్ప మైలోసెవిక్ కాదు. సెర్బియాలో అమెరికా, ఇ.యుల జోక్యాన్ని ఎదిరించి నిలబడినందుకు ఆయనపై ఈ విధమైన అక్రమ ఆరోపణలు మోపి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐ.సి.సి) లో విచారిస్తున్నారు. ఇంతకీ ఐ.సి.సి లో అమెరికా సంతకందారు కాదు. మైలోసెవిక్ ఎన్నడూ అమెరికా రావాలని పాకులాడలేదు. తతమ దేశ ప్రయోజనాల కోసం ఆంబోతు లాంటి అమెరికా సామ్రాజ్యవాదులను ధిక్కరించిన గొప్ప దేశభక్తుడు మైలోసెవిక్. ఆయన తర్వాత ఈ నిబంధన కింద వీసా నిరాకారించింది మోడి విషయంలోనే.

ఇంత ఆర్భాటంగా మోడి వీసా రద్దు చేసిన అమెరికా ‘ఆయన వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామ్’ అని కొద్ది నెలల క్రితం ప్రకటించి పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అమెరికా రాయబారి స్వయంగా నరేంద్ర మోడి అపాయింట్ మెంట్ కోరడంతో అమెరికా తన పంతం సడలించుకుందని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు ఖండనలు జారీ చేయగా మరికొందరు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది.

తమ అంబాసిడర్ పావెల్ గుజరాత్ ముఖ్యమంత్రిని కాలుస్తున్నప్పటికీ అమెరికా మాత్రం 2005 నాటి నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉండని జెన్ సాకి చెప్పడం విశేషం. అమెరికా వలస మరియు జాతీయత చట్టం లోని 214(b) నిబంధన క్రింద మోడీకి ఎంట్రీ వీసా రద్దు చేస్తున్నట్లు అమెరికా అప్పట్లో ప్రకటించింది. అలాగే సెక్షన్ 212(a)(2)(g) ప్రకారం మోడికి జారీ చేసిన టూరిస్టు/బిజినెస్ వీసా కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అనేకమంది ముస్లింలు హత్యాకాండకు గురయిన 2002 నాటి అల్లర్లతో మోడీకి సంబంధం ఉందని భావిస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు తాము జరిపిన పరిశీలనలో మోడి హస్తం ఉందని వెల్లడి అయిందని కూడా అమెరికా తెలిపింది.

సాధారణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ తరుణంలో అమెరికాకు చెందిన అత్యంత సీనియర్ రాయబారి హడావుడిగా నరేంద్ర మోడిని కలవడం అంటే, అది ఆయన పట్ల అమెరికా వైఖరి మారుతోందనడానికి సూచన అని వస్తున్న విశ్లేషణలు సరికాదని జెన్ సాకి వివరించారు. అయితే 9 యేళ్ళు ఆగి ఇప్పుడు సంబంధాలు పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆమె “మేము తరచుగా సీనియర్ రాజకీయ, వ్యాపార నాయకులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి నిర్దిష్ట ప్రయత్నాలు చేస్తాము. నెలల క్రితం నుండే మేము ఈ పని ప్రారంభించాము… అమెరికా-ఇండియాల సంబంధాలు కొనసాగేలా చూడడం దీని లక్ష్యం. అందులో భాగంగానే తాజా ప్రయత్నాన్ని పరిగణించాలి” అని సమాధానం ఇచ్చారు.

“ఎన్నికల సందర్భంగా మేము ఎలాంటి పొజిషన్ తీసుకోము. ఈ ఉదాహరణ అయితే ఖచ్చితంగా అలాంటి పొజిషన్ కాదు. ఇది కేవలం వివిధ రాజకీయ అనుబంధాలు, నేపధ్యాలు కలిగి ఉన్న వివిధ వ్యక్తులతో సంబంధాలు పెంపొందించుకునే క్రమంలోని ఒక ఆలోచన మాత్రమే. మేము దీనిని ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో చేస్తాము” అని జెన్ సాకి తెలిపారు. మోడితో సమావేశానికి సంబంధించి వివిధ అంశాలను తమ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారనీ, అనంతరమే అందరి ఆమోదంతోనే ఈ సమావేశం జరుగుతోందని జెన్ సాకి తెలిపారు.

మోడితో సమావేశం తమ వీసా విధానంలో మార్పు కాదని ఆమె స్పష్టం చేశారు. “ఎవరైనా ఒక వ్యక్తి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అమెరికా చట్టాలు, విధానం ప్రకారం దాన్ని సమీక్షిస్తాము. ఇది మార్పును సూచించేదేమీ కాదు” అని తెలిపారు. మోడికి వీసా ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోందనీ దాని ఫలితమే ఈ సమావేశామా అన్న ప్రశ్నకు ఆమె “కానే కాదు” అని చెప్పారు.

వీసా ఇచ్చేదీ లేనిదీ అమెరికా సొంత వ్యవహారం. కానీ అమెరికా వీసా చుట్టూ ఇంత విలువను చేర్చడమే మన దౌర్భాగ్యం.

 

5 thoughts on “వీసా ఇస్తామని అనుకోవద్దు, అమెరికా వివరణ

  1. మంచివాడా, దుర్మార్గుడా అన్నవిషయం పక్కంపెడితే మోడీ స్థాయికి అమెరికా వీసాకోసం ఇంతగా వెంపర్లాడడం తగదు.

  2. నిజంగా అమెరికా తమ చట్టాలని తాము గౌరవించుకునేట్లు ఉంటే, బయట దేశాలకి వెళ్లి తిరిగి అమెరికా వెళ్ళే అమెరికన్లు మరియు వారి ప్రసిడేంట్లు చాలా కష్టపడవలసిందే.

  3. వీసా ఇచ్చేదీ లేనిదీ అమెరికా సొంత వ్యవహారం. కానీ అమెరికా వీసా చుట్టూ ఇంత విలువను చేర్చడమే మన దౌర్భాగ్యం.

    అమెరికా వీసా ఇవ్వకపోయినంత మాత్రాన కొంపేమీ మునిగిపోదు. ఒకవేళ అమెరికా వీసా ఇస్తామని అహ్వానించినా మోడీ దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s