అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్


AK

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు!

సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా?

అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్ మార్క్. పుస్తకాలు చెప్పే ఆదర్శం. డబ్బు పిచ్చి పట్టిన ప్రతి వ్యక్తీ కనే ఒక అందమైన కల. దర్శన భాగ్యం కోసం రాజకీయ నాయకులంతా క్యూ కట్టే ఒక స్వామీజీ. ఆజ్ఞాపిస్తే మంత్రులు సైతం పొర్లు దండాలు పెట్టుకోవడానికి సిద్ధపడే ఒక దేవతా ఠీవి. వంద కోట్ల ఇంటిని అవలీలగా కట్టేయగల దర్జా. నిమిషాల్లో ప్రభుత్వాల్ని కూల్చిపారేసి, అవసరం అనుకుంటే మళ్ళీ నిలబెట్టగల ఆజ్ఞ. ఆత్మకధ పేరుతో, విజయ గాధ పేరుతో నాలుగు అక్షరాలు గెలికి పదారు పేజీలు నింపిన గీత!

ఆ బ్రాండ్ వెనుక వేలాది శ్రమ జీవులు కార్చిన చెమట ఇంకి ఉంటుంది. ఆ ట్రేడ్ మార్క్ ముద్ర కింద లక్షలాది జీవితాలు నలిగి నీరసించి ఉంటాయి. కోట్ల బతుకులను నల్లిలా నలిపేయగలిగితేనే  ఆ ఆదర్శాన్ని చేరుకోగలం. సామాన్యుల రక్తతర్పణం జరిగితే తప్ప ఆ కల సాకారం కాదు. ట్రిలియన్ల కొద్దీ స్వేద గ్రంధులు ఆవిరయితేనే ఆ డబ్బు దేవత ప్రత్యక్షం అవుతుంది. ఆ ఠీవి నిండా పెళపెళలాడే నోట్ల కట్టలు దట్టించబడి ఉంటాయి. ఆ దర్జా పొరల కింద శ్రామిక సోదరుల నెత్తురు వేడిగా ఉడుకుతూ ఉంటుంది. ఆ ఆజ్ఞల చెలాయింపు వెనుక అమాయక హృదయాల నమ్మకం మోసపోయి ఉంటుంది. ఆ వీరగాధల్లోని ప్రతి అక్షరం ఆట్టడుగున పడి కాన్పించని కధల్ని వేలాదిగా వినిపిస్తాయి.

ఇప్పుడు అదంతా సామాన్యుల కనీస తెగింపు కూడా దిగదుడుపే అని సంకేతాత్మకంగా రుజువు చేయగల రోజు వచ్చిందా? సహజవాయువు ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించి రేటు పెంచితే తప్ప ఉత్పత్తి పెంచనని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి సాధించుకున్న ముఖేష్ అంబానీ, అంబానీ ఆదేశించిందే తడవుగా పక్కకు తప్పుకున్న జైపాల్ రెడ్డి స్ధానంలో చమురు సచివులైపోయి తన యజమాని ఆజ్ఞను అక్షరాలా అమలు చేసిన వీరప్ప మొయిలీ, రిలయన్స్ బూర ఊదితే తన్మయంగా ఊగిపోయే బూరోక్రాట్లు… వీరందరిపైనా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసిన పుణ్యం కట్టుకుంది ఢిల్లీ ఎ.సి.బి. అనంతర కాలంలో ఈ కేసు గంగలో కలిస్తే కలవొచ్చు గాక!

మాజీ చమురు మంత్రి మురళి దియోరా (ఇప్పుడు ఈయన కొడుకు కేంద్ర మంత్రి), మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డి.జి.హెచ్) వి.కె.సిబాల్ లు కూడా ఢిల్లీ ఎ.సి.బి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో స్ధానం పొందారు.

మాజీ కేబినెట్ కార్యదర్శి టి.ఎస్.ఆర్.సుబ్రమణీయన్, నావికాదళ మాజీ అధిపతి అడ్మిరల్ ఆర్.హెచ్.తహిల్యాని, సుప్రీం కోర్టు లాయర్ కామిని జైస్వాల్, కేంద్ర మాజీ వ్యయ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ లాంటి ప్రముఖులు దాఖలు చేసిన 100 పేజీల ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అనూహ్య చర్యకు ఉపక్రమించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఎ.సి.బిని నిన్న (ఫిబ్రవరి 11) ఆదేశించగా ఈ రోజే ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయబడింది.

గ్యాస్ ఉత్పత్తి ధరలను అసలు అయిన ఖర్చు కంటే చాలా ఎక్కువగా చూపి నిర్ణయించారని, ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగా కంపెనీ సామర్ధ్యం కంటే చాలా తక్కువగా చేస్తున్నారని, తద్వారా పెరిగిన ధరల ప్రకారం గ్యాస్ ఉత్పత్తికి భారీ లాభాలు పొందడానికి కుట్ర పన్నారనీ, దీనికి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ, బ్యూరోక్రాట్ నియంత్రణ సంస్ధ డి.జి.హెచ్ సహకరించారని పైన పేర్కొన్న ప్రముఖులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఢిల్లీ సి.ఎం ఆదేశాల మేరకు నమోదయిన ఎ.సి.బి కేసుకు మొయిలీ వెంటనే స్పందించారు. పరమ అసహ్యంగా. ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం ఎలా నడుస్తుందో తెలియదట! పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నిపుణుల చేత నిర్ణయిస్తారట. ఆ నిపుణుడు ఎవరో కాదు. మన ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రంగరాజన్ గారే. మన దేశానికి ఏ విధంగానూ సంబంధం లేని సింగపూర్, అమెరికా, ఐరోపాల క్రూడ్ మార్కెట్ లలో ధరల్ని లెక్కగట్టి వాటితో పోటీగా ఉండాలని చెప్పి గ్యాస్ ధరల్ని పెంచిన పెద్ద మనిషి ఈయన. చమురు ఉత్పత్తి చేసే చోటుకు ఒక్కసారైనా వెళ్ళి ఎరగని ఈ పెద్ద మనిషి పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే నిపుణుడు? నవ్విపోదురుగాక!

ప్రభుత్వాలు ఎలా నడుస్తాయో తెలియదని ఢిల్లీ సి.ఎం ని ఎద్దేవా చేస్తున్నారు వీరప్ప మొయిలీ గారు. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిందే సం. క్రితం. ముఖ్యమంత్రి అయింది నెల క్రితమే. కాబట్టి తెలియకపోవచ్చు. కానీ దశాబ్దాల అనుభవం వెనకేసుకున్న మొయిలీ గారు చేసిందేమిటి? జనానికి చెందిన సహజ వనరులని ఒక కంపెనీ అధినేతకు అప్పజెప్పి, ఆయనతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం అయినా ఉత్పత్తి చేయకుండా అమాంతం తగ్గించేసినా నోరుమూసుకుని కూర్చొని, అంతా అయ్యాక తగుదునమ్మా అంటూ నిపుణుల వంక పెట్టి గ్యాస్ ధరల్ని రెట్టింపు చేశారు మొయిలీ గారు. అంతోసి అనుభవం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మొయిలీ గారు!

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ గారికయితే షాక్ తగిలిందట. మరి తగలదా? ఆజ్ఞ ఇవ్వడమే తప్ప తీసుకొనుటయే ఎరుంగని ఈ చమురాత్ములజాతశత్రువులు గారికే ఎ.సి.బి ఎఫ్.ఐ.ఆర్ లో చోటు దక్కినననాడు ఆ మాత్రం షాక్ తప్పదు. KG-D6 చమురు భావిలో ఉత్పత్తి చేసే సహజవాయువు మొత్తం భారత దేశంలోనే విక్రయిస్తుండగా దాని ధరల్ని డాలర్లలో నిర్ణయించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఫిర్యాదుదారులు అడిగారు, దానికి సమాధానం చెప్పరా షాకింగ్ అంబానీ గారూ? బ్రెంట్ క్రూడ్ అనీ, TOCOM క్రూడ్ అనీ, నిమెక్స్ క్రూడ్ అనీ, గాడిద గుడ్డు క్రూడ్ అనీ నోరు తిరగని మార్కెట్ల పేర్లు చెప్పి వాటికి పోటీగా మనమూ ఉండాలంటూ ధరల్ని రెట్టింపు చేస్తే అది నైపుణ్యం ఎలా అవుతుందో మొయిలీ గారు చెప్పగలరా?

అవినీతి కుట్రలతో పెంచిన ధరల్ని ఏప్రిల్ 1 నుండి అమలు కావాలని నిర్దేశించారని, ఈ నిర్ణయం విచారణ ముగిసేవరకూ అమలు కాకుండా పక్కన పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. దీనికి కూడా అనుభవం కావాలా?

గ్యాస్ ధరల్ని రెట్టింపు చేసి వసూలు చేయడం వలన దేశ ప్రజలు కనీసం 54,500 కోట్ల రూపాయాలు ఎక్కువ చెల్లించుకోవాలనీ, రిలయన్స్ కంపెనీకి వచ్చే గాలివాటు లాభమే 1.2 లక్షల కోట్లకు పైమాటే అనీ ఫిర్యాదుదారులు వెల్లడించారు. ఈ నిలువు దోపిడీ వల్ల దేశ జనం ఎంత షాక్ తినాలి అంబానీ గారూ?

2 thoughts on “అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

  1. నిజమా! ఉండండి గిల్లుకొని చూస్తాను. అబ్బా! నిజం లాగే ఉన్నట్లు ఉంది. దేశ వనరులు ప్రజా వనరులుగా గుర్తింపు వస్తే అంతే చాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s