‘మోడి బహిష్కరణ’కు అమెరికా చెల్లు చీటి


nancy-powell

‘మోడి బహిష్కరణ’ విధానానికి ఇక ముంగింపు పలకాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీకి వీసా నిరాకరించే విధానాన్ని విడనాడాలని ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ప్రత్యేకంగా అమెరికా వెళ్ళి మరీ చేసుకున్న విన్నపం ఫలితం ఇచ్చిందనేందుకు సూచనగా అమెరికా రాయబారి నాన్సీ పావెల్ మరో రెండు రోజుల్లో మోడిని కలవనున్నారు. నాన్సీ పావెల్ కోరిక మేరకు గాంధీ నగర్ లో ఆమెను కలవడానికి మోడి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోడి అపాయింట్ మెంట్ కోరడం ద్వారా 12 యేళ్ళ బహిష్కరణ నుండి అమెరికా వెనక్కి తగ్గినట్లయింది.

వచ్చే గురువారం నాన్సీ పావెల్ గాంధీ నగర్ వెళ్ళి మోడిని కలుస్తారు. గత నవంబర్ నెల నుండి భారతీయ రాజకీయ, వ్యాపార ప్రముఖులను కలుసుకుని సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి అమెరికా కృషి చేస్తూ వచ్చిందని, అందులో భాగంగానే తమ రాయబారి నరేంద్ర మోడిని కాలుస్తున్నారు తప్పితే ఈ సమావేశానికి అదనపు ప్రాముఖ్యత ఏమీ లేదని అమెరికా చెపుతోంది. “మోడి అపాయింట్ మెంట్ ను కోరిన సంగతిని ధృవీకరిస్తున్నాము” అని అమెరికా ఎంబసీ వర్గాలు చెప్పాయని ది హిందు తెలిపింది.

బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించిన దగ్గర్నుండి పశ్చిమ దేశాలు మెల్ల మెల్లగా ఆయన్ను దగ్గర తీస్తున్నాయి. ఈ వరుసలో మొదటి అడుగు వేసింది బ్రిటన్. నాన్సీ లాగే మోడి ఇంటర్వ్యూను కోరిన బ్రిటన్ రాయబారి ఆయనతో ఒక సిటింగ్ వేశారు. తమ సంభాషణ ఆద్యంతం అద్భుతంగా జరిగిందని ఆనక ఇరు పక్షాలు చెప్పుకున్నారు. అక్టోబర్ 2012 లో మోడిని కలిసిన బ్రిటన్ రాయబారి తద్వారా పశ్చిమ దేశాలు భవిష్యత్ లో మోడితో వ్యవహరించనున్న తీరును చాటాడు.

బ్రిటన్ రాయబారి మోడిని కలిసిన తర్వాత కాలంలో యూరోపియన్ యూనియన్ కూడా బ్రిటన్ ను అనుసరించింది. బ్రిటన్ కూడా ఇ.యు సభ్య దేశమే. కానీ యూరో జోన్ సభ్య దేశం కాదు. అనగా ఇ.యు సభ్య దేశమే అయినా యూరోను ఉమ్మడి కరెన్సీగా బ్రిటన్ స్వీకరించలేదు. అలా చేస్తే బృహత్తరమైన తమ చరిత్ర మంటగలిసిపోతుందని, ‘గుంపులో గోవింద’ అవుతామని వాదించిన సెక్షన్ అక్కడ బలంగా ఉంది. వారిని ఐరోపాలో ‘యూరో స్పెక్టిక్స్’ అని పిలుస్తారు. Euro Sceptisism కు బ్రిటన్ కేంద్రం అంటే తప్పు కాదు. ఈ కారణాల రీత్యా ఇ.యు, బ్రిటన్ లు దాదాపు వేరుగా కనిపిస్తాయి.

జర్మనీ రాయబారి నేతృత్వంలో వివిధ ఇ.యు దేశాల రాయబారులు నరేంద్ర మోడితో కలిసి గత సంవత్సరం జనవరి 7 తేదీన రాత్రి విందు ఆరగించడం ద్వారా దాదాపు 11 సం.ల బహిష్కరణకు ముగింపు పలికారు. జర్మనీ రాయబారి యొక్క న్యూ ఢిల్లీ నివాసం లోనే ఈ కలయిక జరగడం విశేషం. విచిత్రంగా ఈ విందు సంగతి మరో నెల రోజుల తర్వాత రాయిటర్స్ వార్తా సంస్ధ బైటపెట్టేవరకూ ఎవరికీ తెలియకపోవడం. భారత పత్రిక ద్వారానే తనకూ తెలిసిందని రాయిటర్స్ ఆనాడు చెప్పింది.

బ్రిటన్ కంటే ముందు స్వీడన్, డెన్మార్క్ రాయబారులు మోడిని కలిశారు. కానీ ఆ రెండు చిన్న దేశాలు. జనాభా పరంగా చూసినా చిన్నవే. దానితో వారు మోడితో సంబంధాలు పెట్టుకున్న సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఈ దేశాలన్నీ గుజరాత్ మారణకాండలో మోడి పాత్రను అనుమానించినవే. కొన్ని దేశాలు ఆయన పాత్ర ఉందని పరోక్షంగా చెప్పగా మరి కొన్ని దేశాలు మారణకాండ అనంతరం దోషులను శిక్షించడానికి ప్రభుత్వాధినేతగా మోడి ఏమీ చేయలేదని నమ్మాయి. అలాంటి ప్రయత్నాలను నిరోధించాడని కూడా ఆరోపించాయి.

అలాంటి వారు మోడి నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే పొగడ్తలు కురిపించాయి. భారత దేశంలో మోడి ఒక ప్రముఖ వ్యక్తి అని యూరోపియన్ యూనియన్ రాయబారి జోవో క్రవిన్హో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. 2002 లో జరిగిన హత్యాకాండ లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన జాగ్రత్త తీసుకున్నామని మోడి చెప్పారని సంతృప్తి ప్రకటించాడు. “ఎక్కడ తప్పు జరిగిందో, ఏమి జరిగి ఉండవలసిందో కనిపెట్టాలని మేము మోడిని కోరాం. ప్రస్తుతం పరిస్ధితి ఏమిటని కూడా అడిగామ్” అని జోవో చెప్పినట్లు పత్రికలు చెప్పాయి. కానీ దానికి మోడి సమాధానం ఏమిటో వాళ్ళు చెప్పలేదు.

“గుజరాత్ మారణకాండకు బాధ్యులెవరో నిర్ణయించాలని ఇ.యు చెబుతోంది. కానీ ఆ బాధ్యత తమ విందు అతిధితో ఆగిపోతుందని వారికి తెలియదా?” అని విందు సంగతి బైటపడిన తర్వాత కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని అమెరికా, బ్రిటన్, ఇ.యు లు గతంలో ఏదో ఒక సందర్భంలో చెప్పాయి. జనవరి 2013 నాటికి ఆ అభిప్రాయం తారుమారైపోయింది. పోనీ ఈ బహిష్కరణ సాగినన్నాళ్లూ గుజరాత్ లో పెట్టుబడులు పెట్టకుండా ఈ దేశాలు ఆగిపోయాయా అంటే, అదీ లేదు. అమెరికా నుండి నార్వే వరకూ ప్రతి దేశానికి చెందిన కంపెనీ గుజరాత్ లోని పారిశ్రామిక-స్నేహపూర్వక (Indistry-friendly) వాతావరణం నుండి లబ్ది పొందినవే.

సైనికులు, సైన్యాధిపతులు, సర్వ సైన్యాధ్యక్షుడు, మంత్రులు అంతా అయ్యాక ఇప్పుడిక వాళ్ళ నాయకుడి వంతు వచ్చింది. (పశ్చిమ దేశాల నాయకుడు అమెరికా.) అయితే అమెరికా మోడి నుండి పూర్తిగా దూరంగా లేదు. అమెరికా నుండి వచ్చే ప్రముఖులలో మోడిని కలవకుండా వెళ్ళినవారు తక్కువే. వీరిలో కొందరికి మోడియే డబ్బు చెల్లించి పిలిపించుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వాటి సంగతి ఎలా ఉన్నా అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అధికారి, మాజీ రాజకీయ కౌన్సిలర్ అయిన ఉజ్ర జేయ వీలు దొరికినప్పుడల్లా గుజరాత్ వచ్చి మోడిని కలుస్తూనే ఉన్నారు.

కారణం: గుజరాత్ లో అనేక అమెరికా కంపెనీలు ఉన్నాయి. బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. కాకులను కొట్టి గద్దలకు వేసే నయా ఉదారవాద విధానాలకు గుజరాత్ కాణాచి మరి! అలాంటి పెట్టుబడిదారుల స్వర్గధామాన్ని అమెరికా ఎలా వదులుకుంటుంది? అనేక అమెరికా స్టార్ట్-అప్ వ్యాపారాలతో పాటు అమెరికా అందజేసిన అణు విద్యుత్ రియాక్టర్లు కూడా గుజరాత్ లో పని చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అమెరికాకి ఇండియాలో ఉన్న అత్యంత పెద్ద పెట్టుబడి అణు రియాక్టర్లే.

బి.జె.పి అభిమానులు, హిందూ సంస్ధల కార్యకర్తలు తెలిసీ తెలియ కుండా చైనా పైన గుడ్డి ద్వేషం వెళ్లగక్కుతారు గానీ బి.జె.పి పార్టీ చైనాకు దూరంగా ఏమీ లేదు. ముఖ్యంగా నరేంద్ర మోడి అసలే లేరు. 2011 చివర్లో 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనా వెళ్ళిన మోడికి చైనా వ్యాపార వర్గాలు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఉన్నత నాయకత్వం ఆయనను కలిసి గుజరాత్ లో పెట్టుబడులు పెట్టడంపై మంతనాలు జరిపారు. మోడిని భారత దేశపు భావి ప్రధానిగా 2011 లోనే చైనా పరిగణించిందని తెలిస్తే నోటమాటరాక మ్రాన్పడిపోవలసిందే.

మోడి సందర్శన అనంతరం చైనా జైళ్ళలో మగ్గుతున్న గుజరాతీ వజ్రాల వ్యాపారుల్లో 13 మందిని నెల లోపే విడుదల చేశారు. మరో 9 మందికి కొన్నేళ్లు జైలు శిక్ష వేశారు. మామూలుగా అయితే జీవితాంతం చైనాలోనే మగ్గాల్సి ఉండగా మోడి దౌత్యం వల్ల విచారణ వేగంగా జరపడమే కాకుండా, పరిమిత జైలు శిక్షలతో చైనా సరిపెట్టిందని అప్పట్లో నరేంద్ర మోడి వెబ్ సైట్ రాసింది. చైనాలో న్యాయ వ్యవస్ధ అక్కడి పార్టీ చెప్పు చేతల్లో ఉండడం వలన కలిగే లాభం ఏమిటో అప్పుడు గుజరాతీలకు అనుభవంలోకి వచ్చి ఉండాలి. అదే న్యాయ వ్యవస్ధ కోట్లాది చైనీయ శ్రామికుల పాలిట సాతానుగా వ్యవహరిస్తుందన్నది వేరే సంగతి.

మోడితో అమెరికా సంభాషణ బి.జె.పి కీ, నరేంద్ర మోడీకి గొప్ప కావచ్చు. కానీ భారత ప్రజలకు మాత్రం కాబోదు. తాను విదేశీ పెట్టుబడులకు స్నేహితుడినని మోడి చెప్పుకుంటారు. ఆ విదేశీ పెట్టుబడులనే మన జాతీయ నేతలు 150 యేళ్ళు పోరాడి గెంటేశామని చెప్పారు. అలాంటి విదేశీ పెట్టుబడుల స్నేహం భారత ప్రజలకు మేలు చేయజాలదు. విదేశీ పెట్టుబడులు భారత దేశంలో మరో విశ్వాసిని మన నేతగా తయారు చేసుకుంటున్న ఫలితమే నేడు మోడీ బెల్లం చుట్టూ మూగుతున్న విదేశీ ఈగల మోత! ఆ ఈగలకు ఇక్కడి సంపదలను తమకు దోచిపెట్టే నేత కావాలి. ఇన్నాళ్లూ మన్మోహన్ ఆ పని చేసిపెట్టారు. ఇప్పుడిక….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s