ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్


Kejriwal“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?

ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి. సవాళ్ళు ఎదుర్కొంటున్నది ఎఎపి ప్రభుత్వమే అయినా ఆ సవాళ్ళకు వణుకుతున్నది మాత్రం బైటినుండి మద్దతిస్తున్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో కూర్చున్న బి.జె.పి లే. బహుశా ఇంత రంజయిన రాజకీయ క్రీడ భవిష్యత్తులో చూడగలమో లేదో గానీ దేశ ప్రజలంతా కనిపెట్టుకుని చూడాల్సిన గొప్ప క్రీడ ఇది.

భారత దేశంలోని పాలనా వ్యవస్ధను ప్రజాస్వామ్య వ్యవస్ధగా కాంగ్రెస్, బి.జె.పి తదితర అనేక పార్టీలు చెప్పే మాట! ఈ వ్యవస్ధకు 1947 నుండి కాపలా కాస్తున్నది ఈ పార్టీలే. మధ్యలో అనేక పార్టీలు పుట్టి గతించినా వ్యక్తులు, వంశాలు, వర్గాలు మాత్రం ఎటొచ్చీ ఇపుడున్న పార్టీల వాళ్ళే. ఈ పార్టీలకు ఇప్పుడు మా చెడ్డ చిక్కొచ్చి పడింది. ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అహో’ అంటూ చాటుతూ వచ్చిన వ్యవస్ధ నిజానికి మేడిపండు ప్రజాస్వామ్యం మాత్రమే అని ఎఎపి చేష్టలు రుజువు చేస్తున్నాయి. ఈ వ్యవస్ధ అసలు లబ్దిదారులు కలిగిన వర్గాలే అని ఎఎపి తీసుకుంటున్న చీమ తలకాయంత చర్యలు రుజువు చేస్తున్నాయి.

మూడు సవాళ్ళు అనుకున్నాం గదా! అవి: ఒకటి; జన లోక్ పాల్ బిల్లు, రెండు; 1984 సిక్కు అల్లర్లపై సిట్ విచారణ, మూడు; ఫిబ్రవరి 16 తేదీన స్టేడియంలో నిర్వహించాలని తలపెట్టిన ఢిల్లీ అసెంబ్లీ సెషన్. తెలంగాణ బిల్లే లేకపోతే దేశం అంతా ఈ పాటికి ఢిల్లీ ప్రభుత్వ కార్యాలే మారుమోగుతూ ఉండేవి. తెలంగాణ బిల్లు అటు కాంగ్రెస్ నూ, ఇటు బి.జె.పి నీ కాపాడుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. సి.ఏం కిరణ్ కుమార్ అవినీతి విధానాలను కూడా ఆ బిల్లు కప్పి పెట్టడం మరో విషాధం.

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ ఆయన ప్రతిపాదించిన జన లోక్ పాల్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బి.జె.పి లు అసలు చట్టం వచ్చేసరికి కోరలన్నీ పీకి పారేసిన బలహీన బిల్లునే ఆమోదించాయి. ఆ మాత్రం బిల్లును కూడా హజారే ‘ఆహా, ఓహో’ అని పొగిడి నిజ స్వరూపం చాటుకున్నారు.

వీళ్ళ బండారం ఏమిటో ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జన్ లోక్ పాల్ బిల్లు చాటి చెబుతోంది. ఈ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ ఆమోదానికి వెళ్ళే ముందు రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాలని కాంగ్రెస్, బి.జె.పి లు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దానికి కేజ్రీవాల్ ససేమిరా అంటున్నారు. రాజ్యాంగంలో అలాంటి నియమం ఏదీ లేదని ఆయన చెబుతున్నారు. అవసరం అయితే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వాలకు పంపుతామ్ అని చెబుతున్నారు.

ఎఎపి ప్రతిపాదించిన జన్ లోక్ పాల్ బిల్లు ముందు రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వాలకు పంపితే వారు దాన్ని సంవత్సరాల తరబడి అట్టే పెట్టుకుంటారని ఎ.కె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది అనుమానం కాదు అసలు సిసలు వాస్తవం. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందితే ఇక భవిష్యత్తులో అధికారం చేపట్టే ప్రభుత్వాలకు కూడా అది గుడిబండ అవుతుంది. అందుకే కాంగ్రెస్, బి.జె.పి లు తెగ కలవర పడుతున్నాయి. రాజ్యాంగ సూత్రాలు వల్లిస్తూ లోక్ పాల్ బిల్లు అడ్డుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్నాయి. అవినీతి పాలకుల భరతం పట్టే బిల్లు అని చెబుతున్న ఢిల్లీ జన్ లోక్ పాల్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అయితే ఇక రాజ్యాంగం అవినీతి పాలనకు అనుకూలంగా ఉన్నట్లా? తమ అవినీతిని కప్పి పెట్టడానికి రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెప్పడానికి కూడా ఈ పార్టీలు దిగజారుతాయని స్పష్టం అవుతోంది.

జన్ లోక్ పాల్ బిల్లు చర్చను జనం చూడాలన్న ఉద్దేశ్యంతోనే ప్రస్తుత అసెంబ్లీ సెషన్ చివరి రోజు చర్చను ఇందిరాగాంధి స్టేడియంలో నిర్వహించాలని ఎఎపి తలపెట్టింది. ఈ ఎత్తుగడతో కాంగ్రెస్, బి.జె.పి లు గిలగిలా తన్నుకుంటున్నాయి. జన్ లోక్ పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అది ప్రజల ముందే జరుగుతుంది. అలాగని అనుకూలంగా ఓటేస్తే అది తమ మెడకే చుట్టుకుంటుంది. దానితో ఈ పేరు గొప్ప పార్టీల పిల్లులు ఎఎపి అనే చిన్ని ఎలక ముందు నిలబడి గజగజ వణుకుతున్నాయి. సామాన్య ప్రజానీకానికి ఈ దృశ్యం ఎంతో మజా కలిగించేది.

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్.జి) చేత స్వయంగా లేఖ రాయించినా ఎఎపి నేత లొంగిరాలేదు. స్టేడియంలో జరిగే అసెంబ్లీ సెషన్ కు భద్రత ఇవ్వడం తమ వల్ల కాదని ఢిల్లీ పోలీసులు చెప్పారని కాబట్టి ఆ ఆలోచన విరమించుకోవాలని ఎల్.జి కోరారు. ఆయన లేఖకు తిరుగు టపాలోనే ఎ.కె సమాధానం పంపారు. ఒక్క స్టేడియం కే పోలీసులు రక్షణ ఇవ్వలేకపోతే ఇక నగరం మొత్తానికి ఎలా రక్షణ ఇస్తారని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. ఈ లెక్కన తమ చేతగానితనాన్ని ఢిల్లీ పోలీసు అధిపతి అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. చేతగాకపోతే ఆ పదవిలో కొనసాగే అర్హత ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు.

మొత్తం మీద అసెంబ్లీని బహిరంగంగా సమావేశపరచడం ఎంత చిన్నదే అయినా, ఒక వినూత్న ప్రక్రియ. ప్రజాస్వామ్య సంస్ధల ప్రజాస్వామ్య కార్యకలాపాలు నాలుగు గోడల మధ్య మాత్రమే జరగాల్సిన అవసరం లేదని చాటి చెప్పే ప్రక్రియ. ప్రజలకు చెందిన కార్యకలాపాలు వారి ముందే వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరగాలన్న భావనను ప్రజల ముందుకు తెచ్చే ప్రక్రియ. పనికి మాలిన అంశాలను పెద్దవి చేస్తూ హడావుడి చేసే టి.వి ఛానెళ్లు, పత్రికలు ఢిల్లీ ప్రభుత్వ చర్యలను చూసీ చూడనట్లు నటిస్తూ వాటికి ప్రచారం దొరకాకుండా జాగ్రత్త పాటిస్తున్నాయి. కాబట్టి జనమే ఈ వార్తలను వెతుక్కుని ఈ వ్యవస్ధ పనితీరు పట్ల తగిన అవగాహనను పెంచుకునే మహదావకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తపడాలి.

One thought on “ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s