జనాన్ని విభజన రందిలో ముంచేసిన రాష్ట్ర పాలకులు తమ కార్యాల్ని నిర్విఘ్నంగా చక్కబెట్టుకుంటున్నారు. ఇ.పి.సి ఒప్పందాలకు విరుద్ధంగా జలయజ్ఞం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని పెరిగిన ధరల పేరుతో అదనంగా చెల్లించడానికి సి.ఎం, ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసేశారు. కనీసం 20,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గుత్తేదారుల పరం చేసే ఈ బృహత్కార్యాన్ని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ప్రచురించింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జనవరి 27 తేదీన సమావేశం జరగనుందని పత్రిక చెప్పింది.
సదరు సమావేశం జరిగిపోవడం, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుస్తూ నిర్ణయం తీసేసుకోవడం కూడా జరిగిపోయిందని ఈనాడు పత్రిక నిన్న (ఫిబ్రవరి 9) తేదీన మరో వార్త ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్ర సి.ఎం ఆమోదించిన తాజా నిబంధనలు గత సంవత్సరం నుండి వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భవిష్యత్తులోనూ అదనపు చెల్లింపులు జరిగేలా అధికారిక ఉత్తర్వులు జారీ చేసేశారు. ఈ నిర్ణయం వలన ప్రభుత్వంపై అదనంగా 20,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సాధారణ ప్రజలకు సబ్సిడీ ఇవ్వాలంటే బడ్జెట్ లోటు గురించి తెగ గొంతు చించుకునే కేంద్ర ఆర్ధిక శాఖ, ప్రధాని, ప్రణాళికా శాఖలు రాష్ట్రంలో జరుగుతున్న అప్పగింతల సంగతి గ్రహిస్తున్నారో లేదో మరి!
కేంద్రం వరకూ ఎందుకు? మన రాష్ట్ర బడ్జెట్ ని చూసినా లోటుతో సతమతం అవుతోంది. లక్ష నుండి లక్షన్నర కోట్ల వరకూ అట్టహాసంగా బడ్జెట్ రూపొందించడం, ఆనక నిధులు లేవంటూ ఎస్.సి, ఎస్.టి, బి.సి ల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కాంట్రాక్టర్ల దోపిడీకి, సొంత పర్సెంటీజలకూ తరలించుకోవడం ప్రతి సంవత్సరం జరిగే తంతు. ఈ విధంగా భారీ బడ్జెట్ కేటాయింపుల ద్వారా జలయజ్ఞం పేరుతో సాగిస్తున్న దోపిడీకి అవకాశం లేకుండా పోతుందన్నదే తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర నేతల దుగ్ధ అని జనానికి ఎప్పటికీ తెలిసేను. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు అందరూ విభజన కాకతో రగిలిపోతూ తెలుగు జాతిని చీల్చుతున్నారంటూ ఆపసోపాలు పడుతుంటే మంత్రులు, కాంట్రాక్టర్లు మాత్రం తమ పని తాము చల్లగా కానిచ్చేస్తున్నారు.
కింది బొమ్మలను క్లిక్ చేస్తే పెద్ద సైజులో బొమ్మలు చూడవచ్చు. ఒకవేళ పెద్ద సైజు కాకుండా తదుపరి బొమ్మ కనిపిస్తే బొమ్మ పైన బొమ్మ కొలతలను పిక్సెల్స్ సైజులో చూపే అంకెలు ఉంటాయి. ఆ అంకెలపై క్లిక్ చేస్తే అసలు సైజులో చూడవచ్చు. లేదా పి.డి.ఎఫ్ కాపీ కోసం మరో లింక్ ఇస్తున్నాను. అక్కడ క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో చూడవచ్చు.
దీనికి పి.డి.ఎఫ్ కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
–