భారత ఔషధ కంపెనీలపై అమెరికా అలవిమాలిన ఆంక్షలు విధిస్తోంది. తనను తాను స్వేచ్ఛా వాణిజ్యానికి ఛాంపియన్ గా చెప్పుకుంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రపంచానికి స్వేచ్ఛా వాణిజ్య సూత్రాల గొప్పతనం గురించి లెక్చర్లు దంచే అమెరికా ఆచరణలో అవలంబించేది మాత్రం అందుకు విరుద్ధమైన సూత్రాలు. భారత ఔషధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ, భారతీయ కంపెనీలకు ఇటీవల కాలంలో వరుసగా భారీ జరిమానాలు విధించడం పట్ల ప్రభుత్వం ఆందోళన ప్రకటించింది.
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కమిషనర్ మార్గరెట్ ఎ. హ్యాంబర్గ్ ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నారు. భారత ఔషధ కంపెనీల పట్ల అమెరికా అనుసరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తి తెలియజేయడానికి భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. ఆడిట్ పరీక్షల పేరుతో USFDA ఇటీవల పెద్ద మొత్తంలో భారత ఫార్మా కంపెనీలపై జరిమానాలు వసూలు చేసింది. జరిమానాలు విధించే ముందు కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వడం లేదని భారత ఫార్మా కంపెనీలు ఆరోపిస్తున్నాయి.
విదేశాల దిగుమతులు తమ కంపెనీల ఉత్పత్తులకు ప్రమాదం అనుకున్నప్పుడల్లా వివిధ సాకులు చూపి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం అమెరికాకు ఉన్న అలవాటు. నిజానికి టారిఫేతర అడ్డంకులను తొలగించాలని అమెరికా అనాదిగా భారత దేశం లాంటి మూడో ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేసి సఫలం అయింది. కానీ అదే తరహా టారిఫేతర అడ్డంకులు విధించడంలో అమెరికాది ఎన్నదగిన చెయ్యి. ఉదాహరణకు భారత టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయేలా చేయడానికి ఒకానొక శుభముహూర్తంలో భారతీయ దుస్తులకు నిప్పు అంటించి “ఇవి వేగంగా తగలబడుతున్నాయి” అని ప్రచారానికి దిగుతారు. దానితో భారతీయ దుస్తుల అమ్మకాలు అమెరికాలో హఠాత్తుగా పడిపోతాయి. అనగా భారత టెక్స్ టైల్స్ ఎగుమతులు పడిపోతాయి. నిజానికి నిప్పు పెడితే తగలబడని దుస్తులంటూ ఉంటాయా? జనానికి ఈ విచక్షణ అబ్బేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
సరిగ్గా ఇదే తరహా ఎత్తుగడలను భారత ఫార్మా కంపెనీలపై ఇటీవల కాలంలో ముమ్మరంగా అమలు చేస్తున్నారు. నాట్కో కంపెనీకి భారత ప్రభుత్వం ‘కంపల్సరీ లైసెన్స్’ ఇవ్వడం ద్వారా జర్మనీ ఔషధ కంపెనీ కేన్సర్ డ్రగ్ ను అత్యంత తక్కువ ధరకు తయారు చేయించిన దగ్గర్నుండి అమెరికా ఈ దాడి మొదలు పెట్టింది. నెల డోసును లక్షల రూపాయలకు అమెరికా కంపెనీ అమ్ముకునే ఔషధాన్ని భారత కంపెనీ కేవలం తొమ్మిది వేలకు ఉత్పత్తి చేయడానికి సిద్ధపడింది.
డబ్ల్యూ.టి.ఓ ట్రిప్స్ చట్టం ప్రకారం పేటెంట్ ఉన్న ఔషధాలను ఇతర కంపెనీలు ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. అయితే ఔషధం అవసరాన్ని బట్టి దాని సమాన ఔషధం (జెనెరిక్ ఈక్వెలెంట్) తయారు చేయడానికి ఇతర దేశాలు ‘కంపల్సరీ లైసెన్స్’ ఇచ్చే సదుపాయం WTO వాణిజ్య చట్టంలో ఉంది. మూడో ప్రపంచ దేశాల పేటెంట్ లను ఉల్లంఘించడానికి పేద దేశాల పేరుతోనే ఈ సౌకర్యాన్ని పశ్చిమ దేశాలు పెట్టుకున్నాయి. పేద దేశాలకు సానుకూలత ఇచ్చే పేరుతో చేర్చిన ఈ సదుపాయం ఇప్పటిదాకా ధనిక దేశాలకే ఎక్కువగా ఉపయోగపడింది. ఇదే సౌకర్యాన్ని వినియోగిస్తూ భారతీయ కంపెనీకి భారత ప్రభుత్వం కంపల్సరీ లైసెన్స్ ఇవ్వడంతో పశ్చిమ దేశాలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. అప్పటి నుండి జర్మనీ తరపున అమెరికాయే ఔషధ వాణిజ్య రౌడీయిజం ప్రారంభించింది.
గత జనవరి 23 తేదీన అమెరికా ఔషధ నియంత్రణ సంస్ధ, భారత ఔషధ కంపెనీ రాన్ బేక్సీ ఔషధాల దిగుమతులపై పాక్షిక నిషేధం విధించింది. ఈ కంపెనీకి తోన్సా లో ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఔషధాలను అమెరికా దిగుమతి చేసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు విధించింది. గత కొన్ని నెలలుగా అమెరికా నిషేధం ఎదుర్కొన్న రాన్ బేక్సీ ఫ్యాక్టరీలలో ఇది నాలుగవది. అంటకుండు మొహాలీ, పోంటా సాహిబ్, దేవాస్ ఫ్యాక్టరీలపై ఈ నిషేధాన్ని వర్తింపజేసింది.
అలాగే మరో భారత ఔషద కంపెనీ వొక్ హార్డ్ కి చెందిన కర్మాగారాలను కూడా నిషేధిత జాబితాలో USFDA చేర్చింది. రెండు కంపెనీలను దిగుమతి అలర్ట్ జాబితాలో ఉంచుతున్నట్లు తెలిపింది. తద్వారా ఈ కంపెనీల దిగుమతులన్నింటినీ అనుమానిత జాబితాలోకి నెట్టేసినట్లయింది.
ప్రపంచంలో జెనెరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాలలో ఇండియా ముఖ్యమైనది. భారత కంపెనీల జెనెరిక్ ఔషధాల వలన అమెరికా ప్రజలు సైతం లబ్ది పొందుతున్నారు. అమెరికా ఔషధ కంపెనీలు భారీ ధరలకు తమ ఔషధాలను అమ్ముకుంటాయి. ఎగువ మధ్యతరగతి ప్రజలకు సైతం అవి అందుబాటులో ఉండవు. దానితో ఇండియా లాంటి దేశాలు తయారు చేసే తత్సమాన జెనెరిక్ ఔషధాల పైనే అనేకమంది ఆధారపడి ఉన్నారు. ఫలితంగా పడిపోయిన మార్కెట్ ను పెంచుకోవడం కోసం అమెరికా ఔషధ కంపెనీలు తమ ప్రభుత్వాన్ని లాబీయింగులతో ముమ్ధెత్తుతున్నాయి. ఈ లాబీయింగులకు తలొగ్గి USFDA వివిధ సాకులు చూపుతూ నిషేధం విధించడం, అలర్ట్ లు జారీ చేయడం చేస్తున్నది.
USFDA అనుసరిస్తున్న పద్ధతులపై తాము నాన్-పేపర్ తయారు చేసి అమెరికాకు సమర్పిస్తామని USFDA కమిషనర్ మార్గరెట్ ను కలిసిన అనంతరం వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ విలేఖరులకు తెలిపారు. “మన కంపెనీలకు సంబంధించి కొన్ని ఆందోళనలు మనకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇచ్చే సమయం పైనా, ఫైలింగ్ ప్రక్రియ పైనా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ అంశాలపై మేము త్వరలో నాన్-పేపర్ ఇస్తాము” అని శర్మ తెలిపారు.
అనేక సందర్భాల్లో ఆడిట్ పరీక్షల నిర్ధారణలకు స్పందించే అవకాశం భారత కంపెనీలకు ఇవ్వడం లేదని ఒక భారత అధికారి చెప్పారని ది హిందు తెలిపింది. సాధారణంగా ఆడిట్ పూర్తయ్యాక కంపెనీలతో చర్చలు జరపాలని కానీ అవి జరగడం లేదని ఆయన తెలిపారు. దానితో కంపెనీలు ఏక పక్షంగా చర్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని కేసుల్లో వివరణలు ఇవ్వాలని కోరినప్పటికీ అవి ఇచ్చే లోపే కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. USFDA విధిస్తున్న భారీ జరిమానాల విషయం కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెప్పారు.
2012-13 లో ఇండియా చేసిన మొత్తం ఫార్మా ఎగుమతుల విలువ 14.6 బిలియన్ డాలర్లు. ఇందులో 26 శాతం ఒక్క అమెరికాకే వెళ్ళాయి. పరిమాణం లెక్కలో తీసుకుంటే అమెరికాకు జెనెరిక్ మందులు ఎగుమతి దేశాలలో ఇండియాయే అతి పెద్దది. భారత దేశంలో USFDA ఆమోదం పొందిన ఔషధ కంపెనీలు 320 వరకూ ఉన్నాయి. అమెరికా ప్రజలు వినియోగించే ఔషధాలు అమెరికా బైట తయారు చేసే దేశాల్లో ఇండియాయే అతి పెద్దది. కనుక భారత ఔషధ ఎగుమతులపై అమెరికా కన్ను వేయడం ఆశ్చర్యకరం ఏమీ కాదు.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: ఔషధాలపై అమెరికా ఆంక్షలు, భారత్ ఆందోళన | ugiridharaprasad