బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ను హైద్రాబాద్, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ.. అన్న నాలుగు యూనిట్ లుగా విడదీస్తే అందులో హైద్రాబాద్, కోస్తాంధ్రలు మిగులు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు మాత్రం లోటు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు.
కోస్తాంధ్ర (7 జిల్లాలు) ప్రాంతం 684 కోట్ల మిగులు బడ్జెట్ కలిగి ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. హైద్రాబాద్ ఏకంగా 12,854 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కలిగి ఉంది. అయితే తెలంగాణ (10 జిల్లాలు – హైద్రాబాద్ లేకుండా) 8,400 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కలిగి ఉండగా రాయలసీమ (4 జిల్లాలు) ప్రాంతం 7,600 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఉంది.
వెరసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 2,462 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ను కలిగి ఉంది. విభజన అనంతర పరిస్ధితిని చూస్తే తెలంగాణ రాష్ట్రం 4,454 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోనూ, నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 6,916 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోనూ ఉంటాయి.
చూసి చెబుతాం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చేదీ లేనిదీ బిల్లును చూసి చెబుతాం అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అయితే బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బిల్లుకు మద్దతు ఇచ్చి తీరతామని నిన్న చెప్పడం విశేషం. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు, బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడిని కలిసిన సందర్భంలో కిషన్ రెడ్డి ఈ సంగతి చెప్పారు. “చంద్రబాబు నాయుడు చెప్పులరిగేలా ఎన్నిసార్లు మోడి చుట్టూ తిరిగినా బి.జె.పి బిల్లుకు మద్దతు ఇచ్చేది ఖాయం” అని ఆయన చెప్పారని ఛానెళ్లు తెలిపాయి.
జాతీయ నేత వెంకయ్య నాయుడు మాత్రం తెలంగాణ బిల్లును తాము పూర్తిగా అధ్యయనం చేశాక తమ మద్దతు సంగతి చెబుతామని తెలిపారు. జి.ఓ.ఎం సభ్యుడు జైరాం రమేష్ తనతో చర్చించిన సందర్భంగా తాను పలు సూచనలు చేశానని కానీ వాటిని కేబినెట్ పట్టించుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ లు కలిసినప్పుడు కూడా తాను పలు సూచనలు చేశానని వారు కూడా పట్టించుకోలేదని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బడ్జెట్ ల మధ్య ఉన్న తేడాను పూడ్చడానికి బిల్లులో తగిన ఏర్పాట్లు చేయాలని తాను డిమాండ్ చేశానని ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంగతే పట్టించుకోలేదని ఆరోపించారు.
బిల్లు ఆపుతాం
విజవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ ఇంకా ఆశాభావంతో ఉన్నారు. బిల్లును ఎలాగైనా అడ్డుకుంటామని పునరుద్ఘాటిస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల సహకారం ఉంటే బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పుకొచ్చారు. ఏ.పి అసెంబ్లీలో వ్యవహరించినట్లుగా పార్లమెంటులో కూడా సీమాంధ్ర ఎం.పి లు కలిసి కట్టుగా ఉమ్మడి వ్యూహంతో వ్యవహరించాలని ఆయన కోరారు.
సి.ఎం కిరణ్ కుమార్ రాజీనామా చేయొచ్చన్న ఊహాగానాల నేపధ్యంలో ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని లగడపాటి కోరారు. రాజీనామా చేయవలసిన అవసరం ఉందని సి.ఎం భావిస్తున్నారని చెబుతూ ఆయన బిల్లును ఆపేందుకు ఇంకా అవకాశం ఉన్నందున పదవిని అంటిపెట్టుకుని ఉండాలని కోరారు.
సి.ఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టొచ్చన్న ఊహాగానాలు నిజమేనన్న సూచన లగడపాటి మాటల్లో ధ్వనించింది. విలేఖరుల ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా “కిరణ్ కుమార్ రెడ్డి తన బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆయన తన మద్దతుదారుల గురించి తప్పకుండా ఆలోచిస్తారు. సమైక్య రాష్ట్ర లక్ష్యం కోసం ఆయన మద్దతుదారులు ఆయనను కళ్ళు మూసుకుని అనుసరిస్తారు” అని లగడపాటి చెప్పారు.
ఒక వేళ కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అది తెలుగు దేశం పార్టీకి లాభం కలిగించే అవకాశం ఎక్కువ. అసలే మైనస్ లో ఉన్న కాంగ్రెస్ ఓట్లను కిరణ్ పార్టీ చీల్చితే అది వైకాపాకు గానీ టి.డి.పి కి గానీ లాభిస్తుంది. వైకాపా ఎటూ కాంగ్రెస్ లో కలిసిపోతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్నందున టి.డి.పికే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంటుంది.
పోనీ కొత్త పార్టీ పెట్టినా దాని వల్ల ఏమిటి ఉపయోగం? రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు అయ్యాక సమైక్యాంధ్ర బ్యానర్ తో సీమాంధ్ర లో ఎన్నికలకు ఎలా వెళ్తారు? కొత్త పార్టీ అంటూ పెడితే, అది సమైక్య రాష్ట్రంలో మాత్రమే ఆకర్షణీయం అవుతుంది. అది కూడా సీమాంధ్ర జిల్లాల్లో మాత్రమే. కానీ ఇంతవరకూ వచ్చాక విభజన ఆగుతుందా? విభజనను ఆపి కాంగ్రెస్ రెంటికీ చెడ్డ రేవడి అవుతుందా?