తెలంగాణ: లైన్ క్లియర్, రాజీనామా యోచనలో కిరణ్


telangana 2

రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా పార్లమెంటులో ప్రవేశించనున్న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎమ్మేల్యేలు తదితరులు ప్రతిపాదించిన సవరణలలో కొన్నింటిని బిల్లులో చేర్చడానికి కేబినెట్ ఆమోదించింది. అయితే సీమాంధ్ర నాయకుల డిమాండ్లను ఏ మేరకు అంగీకరించారు అన్న అంశంలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు వివరాలను ముందే పత్రికలకు చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కావడంతో హోమ్ మంత్రి బిల్లు, సవరణల వివరాలను పత్రికలకు చెప్పలేదు.

శుక్రవారం సమావేశమైన కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘దమ్ముంటే రాష్ట్రానికి పంపిన బిల్లునే పార్లమెంటులో పెట్టండి చూద్దాం’ అని సవాలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి సమాధానంగానా అన్నట్లుగా సరిగ్గా అదే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేబినెట్ నిర్ణయించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టాక సీమాంధ్ర నాయకుల సలహాలు, సూచనలను 32 సవరణలుగా ప్రభుత్వం ప్రతిపాదించనుంది. బి.జె.పి చేసిన డిమాండ్లు, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల డిమాండ్లు దాదాపు ఒకటే కావడంతో కేబినెట్ కు కాస్త్ర శ్రమ తప్పిందని పత్రికలు చెప్పాయి. బి.జె.పి మాత్రం తమ డిమాండ్లనే తమ మంత్రులు నాయకుల చేత కాంగ్రెస్ చెప్పించిందని ఆరోపించింది.

సీమాంధ్ర నాయకులు పెట్టిన ప్రధాన డిమాండ్లు 10 కాగా అందులో ఒక్కదానినే కేబినెట్ పరిగణించిందని ఈనాడు పత్రిక తెలిపింది. ఆంధ్ర జ్యోతి పత్రిక మాత్రం దీనికి విరుద్ధంగా 10 డిమాండ్లలో 8 డిమాండ్లను కేబినెట్ పరిగణించిందని తెలిపింది. ఈ సంగతి ప్రభుత్వ వర్గాలే తెలిపాయని జ్యోతి పత్రిక తెలిపింది. ది హిందు నివేదన కూడా దాదాపు ఈనాడు నివేదనతో పోలి ఉంది. అయితే ది హిందు పత్రిక సీమాంధ్ర నాయకుల అభిప్రాయాన్ని క్రోడీకరిస్తూ “మొత్తం మీద చూస్తే అసలు బిల్లులో పెద్ద మార్పులేమీ లేవు. పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణ జిల్లా నుండి విడదీసి సీమాంధ్రలో కలపడానికి నిర్ణయించడం ఒక్కటే సానుకూలంగా తీసుకున్న నిర్ణయం” అని ఒక సీనియర్ మంత్రి చెప్పినట్లు తెలిపింది.

వివిధ పత్రికల సమాచారాన్ని బట్టి కేబినెట్ ఆమోదించిన బిల్లులోని వివిధ అంశాలు ఇలా ఉన్నాయి:

అసెంబ్లీకి పంపిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెడతారు. దానికి అధికారికంగా 32 సవరణలు ప్రతిపాదిస్తారు.

పోలవరానికి తెలంగాణ నాయకులు ఒప్పుకున్నట్లే. ముంపు ప్రాంతాలను భద్రాచలం డివిజన్ నుంచి విడదీసి సీమాంధ్రలో కలుపుతారు. భద్రాచలం తెలంగాణకే.

ఇరు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. నూతన ఆంధ్ర ప్రదేశ్ లో 175 నుండి 225కు తెలంగాణలో 119 నుండి 150కు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని ప్రతిపాదించబడింది.

హైద్రాబాద్ ను కొన్నేళ్లయినా కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ ని నిరాకరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు.

నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్ను రాయితీలు లాంటి ప్యాకీజీలు ఉంటాయి. రాయల సీమ రెవిన్యూలోటు సమస్యను ఇది పరిష్కరిస్తుంది. లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ చేసిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయంలో కేంద్రం వాటాగా వచ్చే సొమ్ములో కొంత భాగాన్ని సీమాంధ్రకు కేటాయిస్తారని కొన్ని పత్రికలు చెప్పగా, హైద్రాబాద్ ఆదాయంలో కొంత భాగం సీమాంధ్రకు ఇచ్చేందుకు చట్టపరమైన అవకాశం లేనందున ఈ ప్రతిపాదనను కేబినెట్ తోసిపుచ్చిందని కొన్ని పత్రికలు తెలిపాయి.

సీమాంధ్ర విద్యార్ధులకు హైద్రాబాద్ విద్యా సంస్ధలలో పదేళ్లపాటు అవకాశాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించాలని తెలంగాణ నేతలు కోరారు. దీనిని కేబినెట్ తిరస్కరించింది.

విజయవాడ-గుంటూరు-తెనాలి పట్టణాలను ఉమ్మడిగా మెట్రో నగరంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. సంవత్సరం లోపల దీనిపై నివేదిక తయారు చేస్తారు. దీన్ని బట్టి కొత్త రాజధాని ఈ మూడు పట్టణాలు కలిసిన మెట్రో నగరంలో ఏర్పాటు చేస్తారని భావించవచ్చు.

ఒక్కొక్కటి చొప్పున ఐ.ఐ.టి, ఎన్.ఐ.టి, ఐ.ఐ.ఎం, ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఐ.టి జాతీయ విద్యా సంస్ధలను సీమాంధ్రలో ఏర్పాటు చేస్తారు. కేంద్రీయ, పెట్రోలియం, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటును పరిశీలిస్తారు. ఢిల్లీలోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ తరహాలో సూపర్ స్పెషాలిటీ బోధన ఆసుపత్రి నెలకొల్పుతారు. జాతీయ విపత్తు నివారణ కేంద్రం నెలకొల్పుతారు.

కిరణ్ పై కొరడా

కేబినెట్ సమావేశం అనంతరం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఇందులో కిరణ్ వ్యవహారంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ వచ్చి మరీ జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టడాన్ని అధిష్టానం సీరియస్ గా పరిగణించిందని పత్రికలు చెబుతున్నాయి. రాష్ట్రపతి నుండి బిల్లు వచ్చాక గానీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గానీ కిరణ్ ను సి.ఎం పదవి నుండి తప్పించే ఆలోచన చేసినట్లు సమాచారం.

అయితే తనను పదవి నుండి తప్పించక మునుపే రాజీనామా చేసే యోచన లో కిరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఓ.కె చేసిన వెంటనే రాజీనామా చేయడానికి ఆయన ఉద్యుక్తులు అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దిగ్విజయ్ సింగ్ మాత్రం సి.ఎంపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఆలోచన ఏదీ లేదని చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ ఒక విషయంలో అవును అంటే దాని అసలు అర్ధం ‘కాదు’ అనే అంటూ గతంలో జె.సి.దివాకర్ రెడ్డి లాంటివారు వ్యాఖ్యానించారు. కాబట్టి ఎం జరుగుతుందో, అది జరిగేవరకూ నిర్ధారించకపోవడమే ఉత్తమం కావచ్చు.

కాంగ్రెస్ తప్పించకుండా కిరణ్ కుమార్ తానే రాజీనామా చేసినట్లయితే పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. కేంద్రమే పదవి నుండి తప్పించినట్లయితే ఆయన అమర వీరుడుగా, పోరాడి ఓడినవాడిగా సీమాంధ్ర ప్రజల్లో కాస్త పేరన్నా దక్కుతుంది. కానీ ఆ పేరు ఓట్లుగా మార్చుకుని కొత్త పార్టీగా మలుచుకోగల శక్తి లభించడం అనుమానమే. కొత్త పార్టీ పెట్టేది నిజమే అయితే అది ఈ పాటికి జరిగిపోయి ఉండాలి. ఇంకా జరగకపోవడం వల్ల కాంగ్రెస్ అధిష్టానం స్క్రిప్టునే ఆయన పాటిస్తున్నారన్న చంద్రబాబు నాయుడు ఆరోపణే నిజం అని జనం భావించక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s