కార్టూనిస్టుల ఊహలు ఒక్కోసారి ఎంత అందంగా ఉంటాయో వివరించే కార్టూన్ ఇది!
15వ లోక్ సభ, 16వ లోక్ సభల మధ్య సంధి కాలాన్ని ఈ కార్టూన్ లో దర్శించవచ్చు. లేదా 16వ లోక్ సభలోకి జారుతున్న 15వ లోక్ సభ స్వరూపాన్ని కూడా ఇందులో చూడవచ్చు. కాలాన్నీ, రాజకీయాలను, కాలంతో పాటు మారుతున్న రాజకీయాల స్వరూపాన్నీ కూడా ఇందులో చిత్రించే ప్రయత్నాన్ని కార్టూనిస్టు చేశారు.
15వ లోక్ సభ చివరి సెషన్ కు అనేక బిల్లుల్ని కేంద్రం సిద్ధం చేసింది. అందులో తెలంగాణ బిల్లు ముఖ్యమైనది అని చెప్పనవసరం లేదు. దానితో పాటు మతహింస బిల్లును కూడా కాంగ్రెస్ సిద్ధం చేసింది. దీనిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి తీవ్ర ప్రతిఘటన రావడంతో విరమించుకుంది.
మతహింస నిరోధక బిల్లును వ్యతిరేకిస్తూ బి.జె.పి, టి.ఎం.సి లాంటి పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ బిల్లు రాష్ట్రాల అధికారాలను కట్టడి చేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆ పార్టీలు వర్ణించాయి. కానీ మతహింస నిరోధానికి ఏమి చేయొచ్చో చెప్పడంలో మాత్రం అవి ఆసక్తి చూపలేదు.
మతహింస రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం అట! శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది కాబట్టి మతహింస కూడా రాష్ట్రాల పరిధిలోనిదే అని ఈ పార్టీలు వాదించాయి. ఒక రాష్ట్రంలో ఒక మతానికి చెందిన ప్రజలపైకి మరో మతం వాళ్ళు కత్తులు, కర్రలు పట్టుకుని వెళ్ళి చంపడం మొదలు పెడితే దానికి కేంద్రం స్పందించడానికి వీలు లేదని ఈ పార్టీలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వమే హింసాకాండకు తెగబడితే? రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతో మత విద్వేషాన్ని నిండా నింపుకున్న మూకలు విచ్చలవిడిగా నరుకుతున్నా పోలీసు యంత్రాంగం రక్షించడం మాని చేష్టలుడిగి నిలబడితే?
గుజరాత్ హింసాకాండ నిరోధించడంలో విఫలం అయినందుకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తొలగించడానికి అప్పటి ప్రధాని వాజ్ పేయి సిద్ధపడితే హోమ్ మంత్రి అద్వానీ చక్రం అడ్డు వేశారని పత్రికలు చెప్పే మాట! రాజధర్మం నిర్వహించడంలో మోడి విఫలం అయ్యారని వాజ్ పేయి విమర్శించి ఊరుకున్నారు గానీ హింసాకాండకు బలైన జనానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయమూ దక్కపోగా బెదిరింపులే ఎదురయ్యాయి.
చివరికి సుప్రీం కోర్టు స్వయంగా పూనుకుని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తే తప్ప కొన్ని కేసుల్లోనైనా న్యాయం దక్కలేదు. అన్నీ అయ్యాక, ప్రధాని పదవిపై కన్ను పడ్డాక మాత్రమే ‘సద్భావన’ గుర్తుకు వచ్చే నేతల దౌర్జన్యాలను అరికట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం ఈ దేశంలోని బలహీనుల దౌర్భాగ్యమా?
అవినీతి నిరోధానికి ఉద్దేశించిన బిల్లులను లోక్ సభ ఆమోదించాలని ప్రభుత్వం కోరుతున్నప్పటికీ వినే నాధులు లేరు. 15వ లోక్ సభ ఇప్పటివరకు 165 బిల్లులను ఆమోదించి చట్టాలుగా మార్చగా ఇంకా 126 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పత్రికల సమాచారం. ఇందులో 72 బిల్లులు లోక్ సభ లో పెండింగ్ లో ఉంటే 54 బిల్లులు రాజ్యసభలో పెండింగ్ లో ఉన్నాయి.
అంటే 74 బిల్లులకు ఇక కాలం తీరినట్లే. వీటిపై 16వ లోక్ సభలో మెజారిటీ పక్షం ఆసక్తి కనబరిస్తేనే ముందుకు వెళ్తాయి. లేకపోతే మురిగిపోతాయి. రాజ్య సభలో బిల్లులు ఆమోదం పొందితే ప్రభుత్వం మారినా వాటిని మళ్ళీ ఆమోదించాల్సిన పని లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ కోవలోనిదే.
15వ లోక్ సభకు కాలం తీరిపోతున్న సంధి దశలో ఆమోదానికి నోచుకోని బిల్లులు 16వ లోక్ సభకు బదిలీ అవుతున్నాయని కార్టూనిస్టు సూచిస్తున్నారు. అదే సమయంలో 15వ లోక్ సభ కాలంతో పాటు కరిగిపోతున్న అంశాన్ని కూడా సూచిస్తున్నారు. కాలంతో కరిగిపోతున్న 15వ లోక్ సభలోని పెండింగ్ బిల్లులు 16వ లోక్ సభ చేపట్టాలన్న ఆశాభావం ఇందులో చూడవచ్చు.
ఈ అంశాలతో పాటు కాలం గడిచే కొద్దీ పార్లమెంటు స్వరూప స్వభావాలు మారిపోతున్న దృశ్యం కూడా ఇందులో చూడవచ్చు. తమ పార్టీ నాయకులు గానీ ప్రధాన మంత్రి గానీ ఒక ఆదేశం ఇస్తే దాన్ని పాలక పార్టీ ఎం.పిలు తు.చ తప్పకుండా పాటించే రోజులు గతించి తమ తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. బహుశా ఈ అంశాన్ని కూడా కార్టూనిస్టు ఉద్దేశించి ఉండవచ్చు.
పార్లమెంటులో జరిగే కార్యకలాపాలు నిజంగా ప్రజల ప్రయోజనం కోసమే ఉద్దేశించబడితే కార్టూనిస్టు ఊహ చాలా అందమైనదనడంలో సందేహం లేదు.