అమెరికా ఋణ పరిమితి: సమీపిస్తున్న మరో గడువు


Debt_Ceiling

అమెరికా ఋణ పరిమితి పెంపుకు గడువు మరోసారి సమీపిస్తోంది. అమెరికా చెల్లింపులు చేయలేని పరిస్ధితికి త్వరలోనే వస్తుందని ఆ దేశ కోశాగార అధిపతి (ట్రెజరీ సెక్రటరీ) జాక్ ల్యూ హెచ్చరించాడు. ఫిబ్రవరి ఆఖరు వరకు ఖర్చులు గడుస్తాయని కానీ ఆ తర్వాత రోజులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

గత సంవత్సరం తాత్కాలికంగా ఋణ పరిమితిని పెంచడం ద్వారా ఇరు పార్టీలు సంక్షోభం నుండి తృటిలో బైటపడినట్లు చెప్పాయి. ఒబామా కేర్ చట్టం సాకు చూపి కొత్త బడ్జెట్ ఆమోదానికి ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నిరాకరించడంతో అక్టోబర్ 1 నుండి రెండు వారాలు అమెరికా ప్రభుత్వం మూసివేతకు కూడా గరయిన సంగతి విదితమే. అక్టోబర్ 17, 2013 తేదీన కుదిరిన తాత్కాలిక ఒప్పందం కుదరడంతో సంక్షోభం వాయిదా పడింది. జనవరి 15 వరకు ప్రభుత్వ ఖర్చులు నడవడానికి, ఫిబ్రవరి 7 వరకూ ఋణ పరిమితి (17 ట్రిలియన్లు) అందుబాటులో ఉండే విధంగానూ తాత్కాలిక ఒప్పందంలో ఏర్పాట్లు జరిగాయి. ఫలితంగా అమెరికా ప్రభుత్వం తిరిగి పని చేయడం ప్రారంభించింది.

ఈ లోపు చర్చలు జరిపి దీర్ఘకాలిక పరిష్కారం వెతుక్కోవాలని ఇరు పార్టీలు పిలుపు ఇచ్చినప్పటికి ఆ సంగతి ఎంతవరకు వచ్చిందో తెలియలేదు. అమెరికా ప్రభుత్వ మూసివేత వలన అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం సంభవించిందని, ఒప్పందం కూడా తాత్కాలికం అయినందున అదే సంక్షోభం తిరిగి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ కంపెనీ ఎస్ & పి అప్పుడే హెచ్చరించింది.

ఋణ పరిమితి తాత్కాలిక పెంపుదల ద్వారా సమకూరిన నిధులు ఫిబ్రవరి 7 వరకే అందుబాటులో ఉంటాయని అనంతరం మళ్ళీ ఋణ పరిమితి పెంచాల్సి ఉంటుందని ప్రభుత్వము, పత్రికలు తెలిపాయి. అయితే ఈ గడువు ఫిబ్రవరి చివరి వరకు ఉంటుందని పత్రికలు ప్రస్తుతం చెబుతున్నాయి. ట్రెజరీ కార్యదర్శి హెచ్చరిక కూడా ఈ అవగాహనను ధ్రువపరుస్తోంది. అధికారిక ఋణ పరిమితికి అదనంగా ప్రభుత్వానికి కొన్ని ఫైనాన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఫిబ్రవరి ఆఖరు వరకు ఖర్చులు గడుస్తాయని తెలుస్తోంది.

అయితే గత అక్టోబర్ లో వ్యక్తం అయిన తీవ్ర స్ధాయిలో ఈసారి ఆందోళన వ్యక్తం కావడం లేదు. దానికి కారణం ప్రతిపక్ష రిపబ్లికన్లు గతంలో మాదిరిగా తీవ్ర స్ధాయి షరతులు విధించడానికి సిద్ధంగా లేకపోవడమే. వచ్చే నవంబర్ లో కాంగ్రెస్ ఎన్నికలు ఉండడమే దీనికి కారణమని రాయిటర్స్ తెలిపింది.

‘ఒబామా కేర్’ గా పత్రికలు చెప్పే ఆరోగ్య భీమా చట్టం ‘ఎఫర్డబుల్ కేర్ యాక్ట్’ వల్ల ప్రభుత్వం పై పడే ఖర్చుల్లో భారీగా కోత పెట్టాలని రిపబ్లికన్ పార్టీ గతంలో గట్టిగా డిమాండ్ చేసింది. కంపెనీలకు ఇస్తున్న పన్ను రాయితీలను తగ్గించాలన్న ఒబామా ఆలోచనను కూడా రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో కార్మికులకు, ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు లాంటి వారికి ఇస్తున్న సౌకర్యాలలో కోత పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల వలన 2011లోనే ఋణ పరిమితి సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వం తన విచక్షణాధికారంతో పెట్టే ఖర్చులను 10 యేళ్ళ కాలంలో 2.1 ట్రిలియన్ డాలర్లకు తగ్గించే ‘బడ్జెట్ కంట్రోల్ చట్టం’ చేయడానికి అంగీకరించడం ద్వారా ఒబామా ప్రభుత్వం ఈ సంక్షోభం నుండి గట్టెక్కింది. గత సం. సెప్టెంబర్ 30 నాటికి కొత్త బడ్జెట్ ఆమోదించాల్సి ఉన్నప్పటికీ ‘ఒబామా కేర్’ కేటాయింపుల్లో కోత పెట్టాలని రిపబ్లికన్లు పట్టు పట్టడంతో అది జరగలేదు. ఫలితంగా అక్టోబర్ 1 నుండి ప్రారంభం అయిన కొత్త ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ లేక ప్రభుత్వం మూతపడింది. 17 రోజుల పాటు చర్చలు సాగదీశాక తాత్కాలిక ఒప్పందం ద్వారా బైటపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్ధితికి అమెరికా చేరుకుంది.

కానీ ప్రతినిధుల సభలో (కాంగ్రెస్) రిపబ్లికన్ పార్టీ నేత జాన్ బోయేనర్ “అమెరికా తన అప్పులను చెల్లించలేని పరిస్ధితికి రావడానికి వీలు లేదు. ఆ పరిస్ధితిని రానివ్వం” అని ఇటీవల ప్రకటించడంతో ఈసారి పరిస్ధితి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే క్రెడిట్ రేటింగ్ సంస్ధలు మాత్రం పరిస్ధితిని తేలికగా తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఋణ పరిమితి పెంచే ఒప్పందాన్ని ఫిబ్రవరి నెలలోనే ఆమోదించాలని, గడువు దాటినా ఫర్వాలేదన్న ఆశావాహ పరిస్ధితి లేదని అవి హెచ్చరిస్తున్నాయి. ట్రెజరీ సెక్రటరీ జాక్ ల్యూ కూడా దాదాపు ఇదే హెచ్చరిక జారీ చేశారు. “అనవసరమైన ఆలస్యం లేదా రాజకీయ ఫోజులు… ఇవన్నీ ఎదురు తిరిగి మనమే తయారు చేసుకున్న సంక్షోభంలోకి వెళ్లిపోగలం” అని ఆయన హెచ్చరించారు. అమెరికా చెల్లింపులు చేయలేక డీఫాల్ట్ అయితే ప్రపంచవ్యాపితంగా ఆర్ధిక తొక్కిసలాట జరగడమే కాకుండా తీవ్ర స్ధాయి ఆర్ధిక మాంద్యం తప్పదని ఇప్పటికే అనేకసార్లు రుజువయింది కూడా.

DebtCeiling-Mailbox

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s