యూరప్ ముంగిట ఎమర్జింగ్ మార్కెట్ సంక్షోభం


A BBC show

A BBC show

ఋణ సంక్షోభంతో తీసుకుంటున్న ఐరోపా ప్రస్తుతం మరో సంక్షోభం ముంగిట నిలబడినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఋణ సంక్షోభంలో కూరుకుపోయిన యూరో జోన్ దేశాలు ఐ.ఎం.ఎఫ్ సహాయంతో బైటపడడానికి పాట్లు పడుతున్నాయి. కంపెనీల సంక్షోభాన్ని ప్రజల పైకి మరల్చడం ద్వారా సో-కాల్డ్ అభివృద్ధి చెందిన ఐరోపా ఆర్ధిక వ్యవస్ధలు ఋణ సంక్షోభం ద్వారా ఎదుర్కోవలసిన ఆర్ధిక మాంద్యాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగాయి. అయితే బ్రిక్స్, మింట్, ఫ్రగైల్ ఫైవ్ గా పిలవబడుతున్న వివిధ ఎమర్జింగ్ దేశాల ఆర్ధిక స్ధితిగతులు నానాటికీ తీసికట్టుగా మారడంతో సదరు దేశాల ఋణ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన ఐరోపా మరో సంక్షోభం వాకిట వణుకుతూ నిలబడి ఉంది.

చైనా, రష్యాలను మినహాయిస్తే ఎమర్జింగ్ మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలలో అనేకం నిజానికి స్వతంత్రంగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాలు కావు. ఇవి స్ధూలంగా పశ్చిమ దేశాలయిన అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధల అవసరాలను తీర్చేవి మాత్రమే. గత రెండున్నర దశాబ్దాలుగా ఎమర్జింగ్ దేశాలు అమలు చేస్తున్న ఎల్.పి.జి (లిబరలైజేషన్ – సరళీకరణ, ప్రైవేటైజేషన్ – ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ – ప్రపంచీకరణ) విధానాల వలన అవి మరింతగా సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలతో పెనవేసుకుపోయాయి. దానితో ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం వల్ల మూల పడిన సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలు అనివార్యంగా ఎమర్జింగ్ ఎకానమీలను కూడా బలహీనపరిచాయి.

అయితే, ఏ ఎల్.పి.జి విధానాలనైతే అవకాశంగా తీసుకుని ఎమర్జింగ్ దేశాలలోకి విస్తృతంగా పశ్చిమ సామ్రాజ్యవాదులు ప్రవేశించారో సరిగ్గా అవే విధానాలు ఈ రోజు ఐరోపాను మరో సంక్షోభం వాకిట నిలిపాయి. ఎమర్జింగ్ ఆర్ధిక వ్యవస్ధల ఋణ మార్కెట్ లో భారీ పెట్టుబడులు పెట్టింది ప్రధానంగా ఐరోపా దేశాలే. అందువలన ఎమర్జింగ్ ఆర్ధిక వ్యవస్ధల బలహీనతల భారం తిరిగి ఐరోపా పైనే పడుతోంది.

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) మరియు మింట్ (మెక్సికో, ఇండోనేషియా, నైజీరియా, టర్కీ) దేశాలలో ప్రస్తుతం కరెన్సీ విలువలు బాగా పడిపోతున్నాయి. ఆ కారణంగా ఆ దేశాలు చెల్లించవలసిన రుణాల విలువ కూడా పెరిగిపోతున్నది. అనగా కరెన్సీ విలువ పడిపోయినందున అసలు చేసిన రుణం కంటే ఎక్కువ రుణం చెల్లించాల్సిన పరిస్ధితిలో ఉన్నాయి. దీనినే మరో కోణంలో ఎమర్జింగ్ ఎకానమీలు కూడా యూరో జోన్ దేశాల వలే ఋణ సంక్షోభంలోకి జారుతున్నాయి. ఋణ సంక్షోభం పరిమాణం పెరిగే కొద్దీ కొత్త రుణాలు పుట్టడం గగనం అవుతుంది. కొత్త అప్పులు తెచ్చి పాత అప్పులు తీర్చడం మార్కెట్ ఎకానమీలలో మామూలుగా జరిగే ప్రక్రియ. కాబట్టి ఐరోపా దేశాల నుండి తెచ్చిన పాత రుణాలు చెల్లించాలంటే ఎమర్జింగ్ దేశాలు కొత్త రుణాలు తేవాలి. కానీ అవి ఋణ సంక్షోభంలోకి జారే కొద్దీ కొత్తగా అప్పులు పుట్టవు. కనుక ఐరోపా దేశాలకు వెళ్లవలసిన ఋణ చెల్లింపులు (Debt servicing) ఆగిపోయే ప్రమాదం వస్తుంది. ఈ ప్రమాదం ముంగిటే ఐరోపా నిలబడి ఉంది.

అనగా సంక్షోభం ఎక్కడ మొదలయిందో మళ్ళీ అక్కడికే చేరుతోంది. ఇది ఇంకా అమెరికాను చేరుతున్న దాఖలా ప్రస్తుతానికి లేదని పశ్చిమ పత్రికలు తమకు తామే ధైర్యం చెప్పుకుంటున్నాయి. కానీ అది జరిగే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ లోపే అమెరికా, ఐరోపాలు కేపిటల్ రియలైజేషన్ సంక్షోభం నుండి, అధిక ఉత్పత్తి సంక్షోభం నుండి, ఋణ సంక్షోభం నుండి బైటపడాలి. లేకపోతే ఈ సంక్షోభం మరో రౌండ్ మొదలు పెడుతుంది. అనగా అమెరికాకు, అక్కడి నుండి ఐరోపాకు, అనంతరం ఎమర్జింగ్ దేశాలకు మళ్ళీ అక్కడి నుండి ఐరోపాకు అనంతరం అమెరికాకు ప్రయాణం చేస్తుంది. ఇదొక విష వలయం. ఈ విష వలయం నుండి బైటికి రావడానికి సామ్రాజ్యవాదులు యుద్ధాలు ప్రారంభిస్తాయి. అప్పుడిక మహా మానవ వినాశనమే మిగులుతుంది. ఏ ఒక్క దేశం అయినా అదుపు తప్పి అణు బాంబు జోలికి వెళ్ళిందో ఇక అంతే సంగతులు!

ఆర్.టి (రష్యా టుడే) ప్రకారం అమెరికా, జపాన్ ల కంటే యూరోపియన్ దేశాలే అధికంగా ఎమర్జింగ్ దేశాల రుణాలను మోస్తున్నాయి. ‘మోర్గాన్ స్టాన్లీ కేపిటల్ ఇంటర్నేషనల్’ అనే సంస్ధ పరిశోధనలో ఈ సంగతి వెల్లడి అయింది. ఐరోపా దేశాల్లో బ్యాంకుల విషయానికి వస్తే బి.బి.వి.ఏ, ఎస్టే (Erste) బ్యాంక్, సాంటాండర్, స్టాండర్డ్ చార్టర్డ్, యూని క్రెడిట్ బ్యాంకులు అధిక మొత్తంలో ఎమర్జింగ్ దేశాలకు రుణాలిచ్చాయని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. రాయిటర్స్ ప్రకారం ఈ 6 బ్యాంకులు ఇచ్చిన రుణాలే 1.7 ట్రిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి.

స్పెయిన్ కి చెందిన సాంటాండర్ (స్పెయిన్ లో అతి పెద్ద బ్యాంకు) ప్రధానంగా లాటిన్ అమెరికాలకు రుణాలు ఇచ్చింది. (అనగా లాటిన్ అమెరికా దేశాల ట్రెజరీ బిల్స్ లేదా సార్వభౌమ ఋణ పత్రాలలో పెట్టుబడులు పెట్టింది.) ఈ బ్యాంకు ఋణ ఆదాయంలో 23 శాతం ఒక్క బ్రెజిల్ నుండే వస్తుంది. లాటిన్ అమెరికా మొత్తం మీద చూస్తే స్పెయిన్ బ్యాంకు ఇచ్చిన రుణం 2013 చివరి నాటికి 132 బిలియన్ యూరోలు (దాదాపు 178 బిలియన్ డాలర్లు) అని రాయిటర్స్ సమాచారం.

మరో పెద్ద స్పానిష్ బ్యాంకు బి.బి.వి.ఏ (బ్యాంకో బిల్బావో విజ్కాయ అర్జంటారియా) ప్రధానంగా మెక్సికో రుణాల్లో ఇరుక్కుని ఉంది. 2013లో ఈ బ్యాంకు లాభాల్లో 80 శాతం ఒక్క మెక్సికో నుండి వచ్చినవే. 55 బిలియన్ డాలర్ల మేర రుణాలను బి.బి.వి.ఏ మెక్సికోకు ఇచ్చింది. మెక్సికో కరెన్సీ, పెసో. ఇది ఒక్క జనవరి లోనే 3 శాతం పడిపోయింది. ఆ మేర మెక్సికో రుణం కూడా పెరుగుతుంది. బి.బి.వి.ఏ బ్యాంకు ఇంకా టర్కీకి కూడా భారీగా రుణాలు ఇచ్చింది లేదా టర్కీ సార్వభౌమ ఋణ పత్రాలు కొనుగోలు చేసింది లేదా టర్కీ రుణాల్లో పెట్టుబడులు పెట్టింది. టర్కీకి రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో ఇటలీకి చెందిన బహుళజాతి బ్యాంకు యూని క్రెడిట్ కూడా ఉంది. స్టాండర్డ్ చార్డర్డ్ (బ్రిటిష్ బహుళజాతి బ్యాంకు), హెచ్.ఎస్.బి.సి (హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ – ఇదీ బ్రిటన్ కు చెందిన బహుళజాతి బ్యాంకే) బ్యాంకులు ఇండియా, ఇండోనేషియా లకు అధికంగా రుణాలు ఇచ్చాయని రాయిటర్స్ తెలిపింది.

బి.ఐ.ఎస్ (బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్) అందజేసిన గణాంకాల ప్రకారం గత సం (2013) సెప్టెంబర్ నాటికి ఐరోపా దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన రుణాల మొత్తం 3.4 ట్రిలియన్ డాలర్లు (రు. 210 లక్షల కోట్లకు సమానం). ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు బ్రిటిష్ బ్యాంకులు పెట్టిన రుణ పెట్టుబడి మొత్తం 518 బిలియన్ డాలర్లు కాగా లాటిన్ అమెరికా దేశాల్లో స్పానిష్ బహుళజాతి బ్యాంకులు పెట్టిన ఋణ పెట్టుబడి 475 బిలియన్ డాలర్లని బి.ఐ.ఎస్ తెలిపింది. అలాగే దక్షిణ ఐరోపా దేశాలలో ఫ్రెంచి, ఇటలీ బ్యాంకులు పెట్టిన ఋణ పెట్టుబడి 200 బిలియన్ డాలర్లని బి.ఐ.ఎస్ ద్వారా తెలుస్తోంది.

పశ్చిమ దేశాల బహుళజాతి బ్యాంకులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్యగల ఈ రుణానుబంధం పైకి పశ్చిమ దేశాలు అప్పులిచ్చి బాధపడుతున్నట్లుగా భ్రమింపజేస్తుంది. పశ్చిమ పత్రికలు రాయడం కూడా అలానే రాస్తాయి. వాస్తవం ఏమిటంటే ఈ రుణాల ద్వారా పశ్చిమ దేశాలు ఆర్ధికంగా అనేక రెట్లు లాభపడడమే కాకుండా రాజకీయ పెత్తనం కూడా చెలాయిస్తాయి. తాము రుణాలు ఇచ్చే దేశాల్లో ప్రభుత్వాల ఆర్ధిక విధానాలను శాసిస్తాయి. రాజకీయ నియామకాలను కూడా శాసిస్తాయి. దీర్ఘకాలికంగా చూసినపుడు అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల నుండి మూడో ప్రపంచ దేశాలకు వచ్చే రుణాల కంటే మూడో ప్రపంచ దేశాల నుండి పశ్చిమ దేశాలకు వెళ్ళే సంపదలే అధిక మొత్తంలో ఉంటాయి. అనగా అసలు కంటే వడ్డీయే అనేక రెట్లు ప్రవహిస్తూ ఉంటుంది.

ఎమర్జింగ్ దేశాల్లో (అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పై భాగాన ఉండే దేశాలు – క్రీమీ లేయర్ అనొచ్చు) ప్రస్తుతం ఆర్ధిక వృద్ధి బలహీనంగా కొనసాగుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు (ఫెడరల్ రిజర్వ్) నెల నెలా ఇస్తున్న 80 బిలియన్ డాలర్ల ఆర్ధిక ఉద్దీపనలో కొంత భాగాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్ధితి ఇంకా దిగజారుతోంది. సౌత్ ఆఫ్రికా, టర్కీ, మెక్సికో దేశాల్లో కరెన్సీ విలువల 2008 నాటి సంక్షోభం స్ధాయికి పడిపోయాయి. ఇండియాలో కూడా రూపాయి విలువ 2013లో 12 శాతం వరకు పడిపోయింది. రష్యా కరెన్సీ రూబుల్ కూడా 5 సం.ల కనిష్ట స్ధాయికి పడిపోయింది. దానితో మదుపుదారులు తమ ఎమర్జింగ్ మార్కెట్ ఆస్తులను ఐరోపా, అమెరికాలకు అమ్ముకుంటున్నారు.

జర్మనీకి చెందిన డ్యూశ్చ్ బ్యాంక్ విశ్లేషకుడు మాట్ స్పిక్ ప్రకారం ఐరోపా బ్యాంకుల్లో అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్నది స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు. ఎందుకంటే ఈ బ్యాంకు ఆదాయంలో 90 శాతం ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం దేశాల నుండి వస్తున్నదే. ప్రపంచ జి.డి.పి లో 25 శాతం వాటా ఉన్న బ్రిక్స్ కూటమి (చైనా మినహా) 2013లో బలహీన వృద్ధిని నమోదు చేసింది. రష్యా జి.డి.పి 1.3 శాతం మాత్రమే వృద్ధి చెందగా ఇండియా జి.డి.పి వృద్ధి 5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. చైనా గతంలో 20 యేళ్ళ పాటు 10 శాతం వరకు వృద్ధి నమోదు చేస్తే 2013లో 7.5 మాత్రమే నమోదు చేసింది. కానీ ఇతర అన్నీ దేశాలతో పోలిస్తే ఇదే ఎక్కువ.

మింట్ అనే కూటమి ఉనికిలో ఏమీ లేదు. కానీ బ్రిక్స్ తర్వాత ఆ మేరకు వృద్ధి చెందుతున్న దేశాలుగా వాల్ స్ట్రీట్, ద సిటీ (ఆఫ్ లండన్) పండితులు ఈ నాలుగు దేశాలను అంచనా వేస్తున్నారు. వారి ద్వారా ఈ పదం వాడుకలోకి వచ్చింది. టర్కీ, బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా… ఈ 5 దేశాలను కలిపి వాల్ స్ట్రీట్ పండితులు ప్రస్తుతం ఫ్రగైల్ ఫైవ్ అంటున్నారు. అనగా ఈ 5 దేశాల కరెన్సీలు ఫెళుసుగా మారాయని వారి భావన. (మోర్గాన్ స్టాన్లీ బ్యాంకులో ఒక ఎనలిస్టు మొదట ఈ పదం వాడాడు.) ఐరోపా ఋణ సంక్షోభం ఆదిలో అధిక ఋణ పీడిత దేశాలుగా నిలిచిన పోర్చుగల్, ఐర్లాండ్, గ్రీస్, స్పెయిన్ లను పిగ్స్ గా పిలిచిందీ వీళ్ళే. తమ కంపెనీల అవసరాల కోసం, ప్రయోజనాల కోసం వీళ్ళు పెట్టే పేర్లను పశ్చిమ పత్రికలు విస్తృతంగా ప్రచారంలోకి తెస్తాయి.

నౌరియెల్ రౌబిని లాంటి ఆర్ధికవేత్తలు ఎమర్జింగ్ దేశాల బలహీనత కొద్ది కాలమే ఉంటుందని, అనంతరం అవి పుంజుకుంటాయని సూచిస్తున్నారు. దానితో అప్పుడే తొక్కిసలాట మొదలు కాలేదు. రౌబిని డాక్టర్ డూమ్ గా సుప్రసిద్ధుడు. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని కాస్త ముందుగా ఊహించి చెప్పడం, అనంతరం యూరప్ ఋణ సంక్షోభంతో పాటు ఇతర బలహీన పరిస్ధితులను ముందే అంచనా వేయడం వలన ఆయనకు ఆ పేరు వచ్చింది. అలాంటి ఆర్ధికవేత్త ఇది తాత్కాలికమే అని చెప్పడం మదుపుదారులకు ఊరట ఇస్తోంది.

ఫ్రగైల్ ఫైవ్ లాంటి బలహీన దేశాల్లో సానుకూలమైన మేక్రో-ఎకనామిక్, ఫైనాన్షియల్, విధాన పరమైన ఫండమెంటల్స్ ఇంకా బలంగా ఉన్నాయని రౌబిని అభిప్రాయం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, మధ్యతరగతి వృద్ధి, వినియోగదారీ సమాజం అభివృద్ధి తదితర అంశాలు ఈ దేశాలకు సానుకూల అంశాలని రౌబిని చెబుతున్నారు. కానీ ఆయన దృష్టి కోణం పశ్చిమ దేశాలకు మేలు చేసేదే తప్ప అభివృద్ధి చెందుతున్న దేశాల దృష్టి కోణం కాదు. కాబట్టి డాక్టర్ డూమ్ ఆశావాదం పశ్చిమ దేశాలకే ప్రధానంగా ఉపయోగం.

One thought on “యూరప్ ముంగిట ఎమర్జింగ్ మార్కెట్ సంక్షోభం

  1. http://www.theguardian.com/world/2014/feb/05/un-denounces-vatican-child-abuse

    U.S. says Sri Lanka refuses visa for official after war crime accusation

    http://uk.mobile.reuters.com/article/idUKBREA1413220140205?p=BREA14133&irpc=932

    వార్తలు కొంచెం ప్రత్యేకంగా అనిపించాయి. మన పేపర్ లో రావుకనుక లింక్ లి స్తున్నnu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s