“ఈసారి నుండి సారూ, అవినీతికి పాల్పడని నాయకుల జాబితా తయారు చేయమని అడగండి. అలాగైతేనే సమయం వృధా కాదు…”
–
అవినీతి నేతల చిట్టా తయారు చేయడం ఎంత కష్టమో ఈ కార్టూన్ చెబుతోంది. అనేకమంది నేతల్లో అవినీతి నేతలను వెతుక్కోవలసి రావడం కాదు ఆ కష్టం. అవినీతి నేతలను కనిపెట్టడం తేలికే గానీ వారి పేర్లను రాస్తూ పోవడమే అసలు కష్టం.
కనపడ్డా ప్రతి రాజకీయ నాయకుడూ ఏదో ఒక సందర్భంలో అవినీతి సంపాదన ఆరోపణ, అక్రమ ఆస్తుల ఆరోపణ, లెక్క చెప్పలేని ఆస్తుల ఆరోపణ… ఇత్యాది ఆరోపణలను ఎదుర్కొన్నవారే. చట్టం దృష్టిలో కాకుండా ప్రజల దృష్టిలోనుంచి వారికి తెలిసిన నిజాల ప్రాతిపదికన లెక్క వేస్తే ఈ అవినీతి నేతల జాబితా ముందు కొండవీటి చాంతాడు లెక్కే ఉండదు.
మొన్నీ మధ్య జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ఎఎపి పార్టీ అవినీతి నాయకుల జాబితా తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. సమావేశంలోనే పలువురి పేర్లు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు సాయంత్రం లోపు తమ దృష్టికి వచ్చిన అవినీతిపరుల పేర్లను చెప్పాలని కోరారు. అరవింద్ విజ్ఞప్తికి స్పందించిన కార్యకర్తలు జాబితా తయారు చేయడం ప్రారంభిస్తే పరిస్ధితి ఏమిటో ఈ కార్టూన్ సూచిస్తోంది.
విచిత్రం ఏమిటంటే రాజకీయ నాయకులు అందరూ అవినీతి ఆరోపణల నుండి తమను తాము మినహాయించుకోవడం. బోఫోర్స్ కుంభకోణం, 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఇరిగేషన్ కుంభకోణం, ఐ.పి.ఎల్ కుంభకోణం, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, జల యజ్ఞం కుంభకోణం, ఇనుప ఖనిజం తవ్వకాల కుంభకోణం, గడ్డి కుంభకోణం… ఇలా అనేకానేక కుంభకోణాల్లో ఆరోపణలు వచ్చిన నేతలు కూడా రాజకీయాల నుండి అవినీతిపరులను ఏరిపారేస్తామని బయలుదేరుతున్నారు. వీరంతా అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చినవారే.
అంతెందుకు? అన్నా హజారేయే స్వయంగా నరేంద్ర మోడి ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చిన చరిత్ర నిన్నటిదే. రాష్ట్ర వనరులను రాష్ట్ర ప్రజలకు కాకుండా విదేశీ ప్రైవేటు కంపెనీలకు దోచి పెట్టడం అవినీతి కాదని, అభివృద్ధి అని మోడి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు గాక! జన లోక్ పాల్ బిల్లు డిమాండ్ చేసిన హజారేకయినా తెలియొద్దా? భారత దేశంలో అవినీతి నిర్మూలన అంటే ఇంత గొప్పగా ఏడ్చింది మరి!
వ్యవస్ధలో ప్రజలందరికీ సమాన అవకాశాలు లేకపోవడం, అటువంటి అసమాన పరిస్ధితులను 66 యేళ్లుగా కొనసాగిస్తుండడమే అతి పెద్ద అవినీతి. ఈ అవినీతిలో తాము భాగస్వాములం కాదని ఏ నాయకుడూ చెప్పలేనరన్నది నిష్టుర సత్యం.