సెల్ ఫోన్ లో ఫేస్ బుక్ తో జర జాగ్రత్త!


kaspersky-facebook

ఫేస్ బుక్ కూడా గూగుల్ కంపెనీ ఎత్తుగడలను అనుసరిస్తోంది. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారుల ఎస్.ఎం.ఎస్ లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని రికార్డు చేసి భద్రపరచుకోడానికి తమ వినియోగదారులకు ఫేస్ బుక్ వల వేస్తోందని ప్రముఖ కంప్యూటర్ భద్రతా కంపెనీ ‘కాస్పరస్కీ’ అధినేత కాస్పరస్కీ హెచ్చరించారు. యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని తన అప్లికేషన్ (యాప్) ను ఫేస్ బుక్ తాజాకరించి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు వీలయిన అంశాలను చొప్పించిందని ఆయన వివరించారు. 

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ కు తమ వినియోగదారుల సమస్త సమాచారాన్ని అందజేస్తూ సహకరించిన అమెరికా ఐ.టి కంపెనీల్లో ఫేస్ బుక్ కూడా ఒకటి. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, పే పాల్, స్కైప్ తదితర ఇంటర్నెట్ కంపెనీల సర్వర్లలోనికి ఎన్.ఎస్.ఏ గూఢచారులకు నేరుగా ప్రవేశం ఉందని, ఈ ప్రవేశం ద్వారా ప్రపంచంలోని సకల దేశాల ఇంటర్నెట్ వినియోగదారులు, మొబైల్ ఫోన్ వినియోగదారులు, చివరికి అమెరికాలోని ల్యాండ్ లైన్ వినియోగదారుల వివరాలను, సంబాషణలను, మెయిళ్లను రికార్డు చేసి వినియోగించడానికి ఎన్.ఎస్.ఏ ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ (ప్రిజం) ను అభివృద్ధి చేసిన సంగతి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ తర్వాత కూడా ఈ కంపెనీలు వెనక్కి తగ్గలేదు. గూగుల్ మరింత ధైర్యంగా తన పని తాను చేసుకుపోతోంది. ఫేస్ బుక్ కూడా గూగుల్ అడుగుజాడల్లో నడుస్తోందని కాస్పరస్కీ వెల్లడించిన అంశాల ద్వారా తెలుస్తోంది. “గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ అదే పనిగా మీ ఎస్.ఎం.ఎస్ లకు ప్రవేశం దొరకబుచ్చుకోడానికి స్ధిరంగా ప్రయత్నిస్తోంది. యాండ్రాయిడ్ సిస్టమ్ లోని ఫేస్ బుక్ యాప్ లో ఇటీవల ప్రవేశపెట్టిన ఒక ఫీచర్ వినియోగదారులకు ఆందోళన కలిగించేదే” అని కాస్పరస్కీ తెలిపారు.

యాండ్రాయిడ్ సిస్టం లోని ఫేస్ బుక్ అప్లికేషన్ ను స్ధాపించే (install) సమయంలో అది కొన్ని అనుమతులు అడుగుతుంది. తాజాగా ప్రవేశపెట్టిన ఫేస్ బుక్ యాప్ వర్షన్ లో ఎస్.ఎం.ఎస్, ఎం.ఎం.ఎస్ సందేశాలను చదవడానికి కూడా అనుమతి కోరుతోందని కాస్పరస్కీ తెలిపారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ వినిపిస్తున్న వాదన కాకమ్మ కధకు ఏ మాత్రం తక్కువ కాదు.

“మీరు మీ ఖాతాకు ఫోన్ నెంబర్ జత చేసినట్లయితే మేము పాఠ్య సందేశం (text message) ద్వారా పంపే నిర్ధారణ కోడ్ ద్వారా మీ ఫోన్ నెంబర్ ను ఆటోమేటిక్ గా నిర్ధారించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది” అని ఫేస్ బుక్ వివరిస్తోంది. ఈ ‘ఆటోమేటిక్ గా’ అన్నది మోసపూరితం అని కాస్పరస్కీ తెలిపారు.

ఫేస్ బుక్ ఒక కోడ్ ను ఎస్.ఎం.ఎస్ ద్వారా ఫోన్ కు పంపుతుంది. ఫేస్ బుక్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యేందుకు ఈ కోడ్ ను యూజర్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇలా యూజర్ ఉపయోగించే అవకాశం లేకుండా ‘ఆటోమేటిక్ గా’ నిర్ధారించుకుంటామని ఫేస్ బుక్ చెబుతోందని తద్వారా చాటుగా ఇతర వ్యక్తిగత వివరాలు చూడడానికి కూడా అది అనుమతి సంపాదిస్తోందని కాస్పరస్కీ టెలీ8పారు.

ఫేస్ బుక్ యాప్ ఇప్పుడు క్యాలండర్ ఈవెంట్స్ ను, మరియు ఇతర వ్యక్తిగత రహస్య సమాచారం చూడాలని కూడా భావిస్తోందని దానికి అది చెబుతున్నా కారణం నమ్మశక్యంగా లేదని ఆయన తెలిపారు. క్యాలండర్ అందుబాటులో ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి తాను క్యాలండర్ ఈవెంట్స్ మొత్తం చూడాలని ఫేస్ బుక్ అడుగుతోందని తద్వారా వ్యక్తిగత సమాచారం మొత్తం రికార్డు చేస్తోందని తెలిపారు. ఫేస్ బుక్ లో యూజర్ ఒక ఈవెంట్ ను చూసేటప్పుడు అదే సమయంలో యూజర్ ఫోన్ క్యాలండర్ అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఏర్పాటు అని ఫేస్ బుక్ చెబుతోంది. అయితే ఇది వాస్తవం కాదని, యూజర్ల వ్యక్తిగత అలవాట్లు, ఫోన్ సంబంధాలు, కార్యకలాపాలు రికార్డు చేయడమే దాని లక్ష్యం అనీ తెలుస్తోంది.

“రెండు మార్గాల నిర్ధారణకు అవకాశం ఇవ్వడం ద్వారా యూజర్లకు మరింత భద్రత కల్పించే అవకాశం ఉండొచ్చు… కానీ అంతిమంగా మేము చెప్పేదేమంటే ఒక యాప్ ను ఇన్ స్టాల్ చేసుకునేప్పుడు వివిధ అనుమతులను అవి కోరుతాయి. ఈ అనుమతులు ఇచ్చే దగ్గరే యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి” అని కాస్పరస్కీ ల్యాబ్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ రీసర్చర్ డేవిడ్ ఎం తెలిపారు.

ఫేస్ బుక్ అడిగే అనుమతి ఎం.ఎం.ఎస్ సందేశాలు చూడడానికి కూడా అవకాశం ఇస్తుందని ఏ కారణం వల్ల ఈ అనుమతి అడుగుతున్నదో ఫేస్ బుక్ వివరణ ఇవ్వలేదని డేవిడ్ ఎత్తి చూపారు. “‘ఆటోమేటిగ్గా’ అన్నదే పదమే కీలకం. నిర్ధారించుకునే పనిని యాప్ ఆటోమేటిక్ గా చేయాల్సిన అవసరం లేదన్నది స్పష్టమే. తాను పంపిన కోడ్ ని టైప్ చేయాలని యాప్ నన్నే అడగొచ్చు గదా. లేదా కనీసం ఆ అవకాశం (ఆటోమేటిక్ గా నిర్ధారించుకోవాలా లేక టైప్ చేస్తారా అన్న అవకాశం) అయినా ఇవ్వాలి కదా!” అని కాస్పరస్కీ ప్రశ్నించారని ది హిందు తెలిపింది.

ఇండియాలో ఫేస్ బుక్ కి 9.3 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో 7.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ ద్వారానే ఫేస్ బుక్ వినియోగిస్తున్నారు. కాబట్టి వీళ్ళ వ్యక్తిగత సమాచారం అంతా ఫేస్ బుక్ చేతుల్లో ఉన్నట్లే.

ఫేస్ బుక్ మాత్రమే కాదు. ఇలా ఈ మెయిళ్లకు కూడా సెల్ ఫోన్ నెంబర్ అడగడం గూగుల్ చాలా కాలం క్రితమే ప్రారంభించింది. సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ముందుకు వెళ్లలేని పరిస్ధితిని గూగుల్ కల్పిస్తుంది. ఒకవేళ ‘స్కిప్’ చేసే అవకాశం ఇస్తే skip అనే అక్షరాలు చాలా చాలా చిన్నవిగా ఇస్తుంది. జాగ్రత్తగా కళ్ళు చికిలించి చూస్తే తప్ప అవి కనిపించవు. మొత్తం మీద ఆ ప్రశ్నా, ఈ ప్రశ్నా వేస్తూ కొన్ని ప్రశ్నలను విడివిడిగా, కొన్నింటిని కలిపి వేస్తూ మొత్తం మీద తాను కోరుకున్న సమాచారాన్ని రాబట్టడంలో గూగుల్ ఆరి తేరింది.

గతంలో “Knowledge is power” అనేవాళ్లు, ఇప్పుడు “Information is power” అంటున్నారు. దాన్నిబట్టే వ్యక్తిగత సమాచారం పెట్టుబడిగా కంపెనీలు ఎంత భారీగా లబ్ది పొందుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ సమాచారం ద్వారా యూజర్ తన అవసరానికి అనుగుణంగా ఒక సేవను ఎంచుకునే బదులు తన ముందు ఉన్న సేవనే అవసరంగా మార్చుకునే పరిస్ధితి కల్పించబడుతోంది. అయితే ఇక్కడ సేవ కంపెనీది అయితే అవసరం మనది. అనగా డబ్బు వదిలించుకునేది మనం అయితే లబ్ది పొందేదీ కంపెనీ. యూజర్లకు జరిగే నష్టాల్లో ఇది ఒకటి మాత్రమే ఈ సమాచారం అమెరికా, ఐరోపా దేశాల మిలట్రీ గూఢచార సంస్ధలకు చేరుతోందని గ్రహిస్తే ఇంకా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని గ్రహించవచ్చు. మన అలవాట్లు, ఇంటర్నెట్ లో మన కార్యకలాపాలు మనకు సంబంధం లేకుండానే ప్రత్యర్ధి రాజకీయాలుగా, టెర్రరిస్టు కార్యకలాపంగా తేలవచ్చు. అసలు సమస్య కూడా అదే.

One thought on “సెల్ ఫోన్ లో ఫేస్ బుక్ తో జర జాగ్రత్త!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s