అవును! నిజంగా ఈ కార్టూన్ చాలా అద్భుతమైంది.
దీన్ని అర్ధం చేసుకోవాలంటే మొదట ఒక చిన్న స్వీడిష్ కధ తెలుసుకోవాలి.
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక యువరాజు. ఆయనకి పెళ్లి వయసు వచ్చేసింది. కానీ ఆయనకి ఎంతకీ వధువు నచ్చడం లేదు. కారణం ఆయనకి ఉన్న షరతులు. పెళ్లంటూ చేసుకుంటే మరో యువరాణినే చేసుకోవాలని ఆయనగారి ఖచ్చితమైన కోరిక. ఆ యువరాణి కూడా అత్యంత సున్నితంగా ఉండాలి. కాలనేది కింద పెట్టకుండా పట్టుపరుపుల మీద పెరిగిన యువరాణి అయి ఉండాలి. నిజమైన యువరాణి అత్యంత సున్నితంగా ఉంటుందని ఆయన గాఠ్ఠి నమ్మకం మరి!
దానితో ఎంతమంది యువరాణిల సంబంధం వచ్చినా ఆయనకి నచ్చడం లేదు. అసలు వాళ్ళు యువరాణులేనా అని ఆయనకు అనుమానం. ఎవర్ని చూసినా ఏదో ఒక కోణంలో మొరటుగా కనిపిస్తున్నారాయనకి. సవాలక్షా పరీక్షలు పెట్టి దొంగ యువరాణి అని వంక పెట్టి తిప్పి పంపేస్తున్నాడు. ఆయన తల్లి గారిదీ అదే వరస!
అలా ఉండగా ఒక రోజు ఒక యువతి వర్షంలో తడిస్తూ యువరాజు కోట తలుపు తడుతుంది. తనకు వర్షం తగ్గేవరకూ ఆశ్రయం ఇవ్వాలని కోరుతుంది. తాను ఒక యువరాణిని అని కూడా చెబుతుంది. దానితో అనుకోకుండా ఇంటికి వచ్చిన యువరాణి నిజంగానే యువరాణి అవునో, కాదో పరీక్షించాలని తల్లీ, కొడుకు భావిస్తారు. లోపలికి పిలిచి మర్యాదలు చేస్తారు.
భోజన మర్యాదలు అన్నీ అయ్యాక పడుకోవడానికి పరుపులు పేర్చిన మంచం చూపిస్తారు. 20 దూది పరుపులు మరో 20 మెత్తటి ఈక పరుపులు పరుస్తారు. వాటన్నింటి కింద ఒక బఠాణీ గింజని ఉంచుతారు.
తెల్లవారుతుంది. యువరాణి పొద్దున్నే లేచాక చూస్తే కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉంటాయి. నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లినట్లు పక్కంతా చెదిరిపోయి ఉంటుంది. ఏమిటి విషయం అని తల్లీ, కొడుకులు ఆమెను అడుగుతారు. ఇక ఆమె తన గోడు చెప్పుకుంటుంది. ఆమెకు అసలు రాత్రంతా నిద్ర లేదట. అటూ ఇటూ ఎన్నిసార్లు పొర్లినా నిద్రే రాలేదట. అన్ని పరుపులు పేర్చినా తన వీపుకి ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించిందిట. పోనీ ఆ పక్కో, ఈ పక్కో సర్దుకుందాం అనుకుంటే మధ్యలో ఏదో ఎత్తైన వస్తువు ఉన్నట్లుగా బ్యాలన్స్ కుదరక మంచం మీది నుంచి దొర్లి పడిపోతానేమో అని భయం కలిగిందిట. పరుపు మీద ఏదో ఉన్నట్లు వీపంతా నొప్పి అని ఫిర్యాదు చేసింది ఆ యువతి.
ఇక మన యువరాజు గారి సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఆయన ఎంతగానో ఎదురు చూసిన నిజమైన యువరాణి ఆయనకు తారసపడినట్లే మరి. ఆమె ఎంత సున్నితమైన యువరాణి అయితే 20 దూది పరుపులు మరో 20 ఈకల పరుపుల కింద నున్న బఠాణీ గింజను ఆమె శరీరం కనిపెడుతుంది! అదీ ఆయన సంతోషం. ఇంకేం. యువరాజుగారి పెళ్లి అయిపోతుంది. ఆ బఠాణీ గింజను తీసుకెళ్లి రాజుగారి మ్యూజియంలో ప్రదర్శనకు పెడతారు. నిజమైన యువరాణిని పట్టిచ్చిందిగా మరి!
ఇదీ కధ. మన వ్యవస్ధను సున్నితమైన యువరాణితోనూ, బఠాణీ గింజను ఎఎపి పార్టీతోనూ కార్టూనిస్టు పోల్చారు. మన వ్యవస్ధ అవినీతితోనూ, ప్రజా వ్యతిరేక సెంటిమెంట్లతోనూ ఎంతగా గబ్బుపట్టిపోయిందంటే బఠాణీ గింజంత ఎఎపిని కూడా అది తట్టుకోలేక నొప్పితో అల్లాడుతోంది.
ఎఎపి ఇంతదాకా మహా చేసిందేముంది? మూడు ప్రైవేటు కంపెనీలను కాగ్ చేత ఆడిట్ చేయిస్తోంది. కేవలం 400 యూనిట్లు విద్యుత్ వాడుకునేవారికి ఛార్జీలు సగం తగ్గించింది. రోజుకి 667 లీటర్లు వాడుకునే వారికి మాత్రమే వాటర్ ఛార్జీలు లేకుండా ఉచితంగా నీరిస్తోంది. విదేశీయులు (స్వదేశీయులు కూడా కాదు) కొద్ది మంది డ్రగ్స్ అమ్మకం, వ్యభిచారం చేస్తున్న అనుమానంతో తనిఖీ చేయమంటే పోలీసులు నిరాకరించినందుకు ఒక రోజు ధర్నా చేశారు. అంతే.
ఈ మాత్రానికే కాంగ్రెస్, బి.జె.పి పార్టీలు మొదలుకొని దేశంలోని మారుమూల ఉన్న పార్టీలు కూడా ఎఎపి పట్ల చిటపటలు ప్రదర్శిస్తున్నాయి. ఎఎపి ఉనికిని అయిష్టంగానే అంగీకరిస్తూ ఆ పార్టీని అనుకరించేది కొన్ని పార్టీలయితే, ‘అనుకరిస్తాం, ఆదర్శంగా స్వీకరిస్తాం, నేర్చుకుంటాం’ అంటూనే ఎఎపి ని ప్రజల్లో ఎలా పలుచన చేయాలా అని ఎదురు చూస్తున్నది అనేకులు.
‘పాపులిస్టు అనార్కి పాలనకు ప్రత్యామ్నాయం కాదు’ అంటే? అన్న ఆర్టికల్ లో నేను చివరి పేరాలో ఇలా రాశాను.
అందుకే ప్రజల క్రియాశీలతకు వ్యతిరేకంగా ఈ వ్యవస్ధలో అనేక పేర్లు తగిలించబడతాయి. వాటిలో కొన్ని చాలా అందంగా ఉంటాయి. వినసొంపుగా ఉంటాయి. విజ్ఞానదాయకంగా ఉన్నట్లు కనిపిస్తాయి. మొత్తం వ్యవస్ధ నడకను, నడవడికను మంచి వైపు తీసుకెళ్తున్నట్లు ముసుగు వేసుకుంటాయి. ఆ ముసుగులు తొలగించి చూస్తేగాని తెలియదు, లోపల ఎంత గబ్బు దాగి ఉందో. ఆధిపత్య వర్గాల ఆధిపత్యం చిరకాలం కొనసాగాలంటే ఆ గబ్బుని వారు కాపాడుకోవలసిందే. రకరకాల పదబంధాల మాటున ప్రజల చైతన్యాన్ని అణచివేయాల్సిందే. చివరికి ఎఎపి లాంటి నామమాత్ర ప్రజానుకూల చర్యలను కూడా వారు సహించనిది అందుకే మరి!
బఠాణీ గింజ 40 పరుపుల కింద ఉంటే మన నిద్రపై ఎంత నామమాత్ర ప్రభావం కలిగిస్తుందో, ఎఎపి ఇప్పటిదాకా తీసుకున్న చర్యల వల్ల కూడా వ్యవస్ధలో సౌకర్యవంతంగా ఉన్నవారిపై అంత నామమాత్ర ప్రభావం పడుతుంది. కాగ్ ఆడిట్ వల్ల టాటా, అంబానీలకు నష్టాలేవీ రావు. కేవలం అక్రమ అదనపు లాభాలు మాత్రమే ఆగిపోతాయి. ఎఎపి పోటీవల్ల ఈ మూడ్నాలుగు నెలల్లో కాంగ్రెస్, బి.జె.పిలకు పోయే సీట్లు ఎన్ని ఉంటాయి? మహా అయితే ఒక 10 లేదా 20. ఇంతమాత్రానికే కాంగ్రెస్, బి.జె.పి… ఇంకా అలాంటి అనేక పార్టీలు కాపాడుతున్న వ్యవస్ధ వణికి చస్తోంది. ప్రజల కార్యశూన్యత దోపిడీ శక్తులకు ఎంత పెద్ద భారీ పెట్టుబడో ఈ అంశం నిస్సందేహంగా రుజువు చేస్తోంది.
అవును నిజం! చేదు నిజం! మంచి కార్టూన్!
ప్రజల కార్యశూన్యత దోపిడీ శక్తులకు ఎంత పెద్ద భారీ పెట్టుబడో ఈ అంశం నిస్సందేహంగా రుజువు చేస్తోంది.
అవును. అందుకే….దోపిడి శక్తులు, వ్యాపార వర్గాలు ప్రజల్ని నిద్రపుచ్చేందుకు ప్రయత్నిస్తాయి.