జనవరి చివరిలో అమెరికాను మరోసారి మంచు తుఫాను వణికించింది. పోలార్ వొర్టెక్స్ ఫలితంగా జనవరి మొదటివారంలో మధ్య పశ్చిమ, ఈశాన్య అమెరికాలు గజగజ వణికిపోగా ఈసారి చలికాలంలో సంభవించే మంచు తుఫాను అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా అలబామా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాలను చలి పులి చుట్టుముట్టింది. ఈశాన్య అమెరికా నుండి కరోలినా, జార్జియాల మీదుగా టెక్సాస్ వరకూ విస్తరించి ఉన్న మంచు దుప్పటిని కింది ఫొటోల్లోని శాటిలైట్ చిత్రంలో చూడవచ్చు.
మంచు తుఫాను దాటికి అట్లాంటా (జార్జియా రాజధాని) నగరంలో రెండు రోజుల పాటు ప్రజా జీవనం స్తంభించిపోయింది. జనం అనేక చోట్ల ఇరుక్కొనిపోయారు. వివిధ షాపింగ్ మాల్ లలో ఇరుకున్నది కొందరైతే, రోడ్డు పైన కార్లలో ఇరుక్కున్నది అనేకమంది. చివరికి పాఠశాలల విద్యార్ధులు సైతం ఇంటికి వెళ్ళే మార్గం లేక తరగతి గదుల్లోనే గడపాల్సి వచ్చింది.
అనేక జాతీయ రహదారులు మంచుతో కప్పబడిపోయి ప్రమాదాలు జరగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి పదుల కి.మీ మేర వాహనాలు నిలబడిపోయిన ఘటనలు అనేకం సంభవించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ఇరుక్కున్న వాహనాలను తప్పించడానికి అనేక చోట్ల సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రహదారులపై నిలబడిన వాహనదారులు, ప్రయాణీకులకు, పాఠశాలల్లో ఇరుక్కుపోయిన టీచర్లు, విద్యార్ధులకు ఆహార పదార్ధాలు సరఫరా చేయాల్సిన పరిస్ధితి. అలబామా లాంటి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా రోడ్లు మూసివేశారు.
ట్రాఫిక్ ప్రమాదాలతో రోడ్లపై నిలబడి పోవడం ఒక ఇబ్బంది కాగా ఉషోగ్రతలు బాగా పడిపోయిన పరిస్ధితుల్లో రోడ్లపైనా, షాపుల్లోనూ గడపాల్సి రావడం మరో ఇబ్బంది. జనవరి 28తో మొదలయిన మంచు తుఫాను వల్ల జనవరి 29, 30 తేదీల వరకూ ప్రమాదకర పరిస్ధితులను కల్పించింది. ప్రకృతిని తనమానాన తనను ఉండనివ్వని దేశాల్లో అమెరికాది మొదటి స్ధానం. అందుకే గ్లోబల్ వార్మింగ్ దుష్ఫలితాలను కూడా ఆ దేశమే ఎక్కువగా భరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి వరకూ గాలికూడా చొరబడని వేడి పరిస్ధితుల్లో పశ్చిమ, మధ్య అమెరికా రాష్ట్రాలు కొట్టుమిట్టాడాయి. అనంతరం పోలార్ వొర్టెక్స్. ఇప్పుడు చలి తుఫాను!
Photos: Boston Globe