ఎ.పి అసెంబ్లీ ఆటంకం దాటిన టి.బిల్లు -కార్టూన్


T Bill

ఎన్.డి.ఎ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఉత్తర ఖండ్. ఈ రాష్ట్రాల ఏర్పాటు నల్లేరుపై నడకలాగే సాగింది. ఆ ప్రాంతాల మూల రాష్ట్రాల అసెంబ్లీలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం దానికొక కారణం. అక్కడ అభ్యంతరం చెప్పకపోవడానికీ, ఇక్కడ తీవ్ర అభ్యంతరం చెప్పడమే కాకుండా ఆందోళనలు కూడా జరగడానికి కారణం ఏమిటి?

బి.జె.పి పార్టీ దానికి కారణం కాంగ్రెస్ వ్యవహరించిన పద్ధతి అని ఆరోపిస్తోంది. ‘మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది’ అని వెక్కిరిస్తోంది. ‘ప్రశాంతంగా పాత రాష్ట్రాలను విడదీసి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాదే’ అని కూడా చాటుతోంది. వారప్పుడు కేంద్రంలో ఉన్నారు గనక, రాష్ట్రాల ఏర్పాటు కూడా ప్రశాంతంగా సాగింది గనుక కాస్త క్రెడిట్ వారికి ఇవ్వొచ్చేమో గానీ ఎ.పిలో ఎదురయిన ఆటంకాలకు మాత్రం కేంద్రం పనితనంతో సంబంధం లేదని భావించాలి.

కాంగ్రెస్ వ్యవహరించిన తీరు కొన్ని అదనపు సమస్యలను సృష్టించిన మాట వాస్తవమే గానీ అదే ప్రధాన కారణం అని మాత్రం చెప్పలేము. ఇందుకు కొన్ని అంశాలను చూడవచ్చు.

సి.ఎం కిరణ్ తో సహా దాదాపు ఎం.పిలు, ఎమ్మేల్యేలు ఏకగ్రీవంగా చెబుతున్న అభిప్రాయం తమ అభ్యంతరాలకు ప్రధాన కారణం హైద్రాబాద్ అని. ఇలాంటి కారణం/సమస్య ఎన్.డి.ఎ హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలకు లేదు. గత మూడు కొత్త రాష్ట్రాలు కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకున్నాయి. పాత రాజధానిని అడగాల్సిన పరిస్ధితి వారికి ఏర్పడలేదు.

కానీ హైద్రాబాద్ పరిస్ధితి అందుకు భిన్నం. ఏ ప్రాంతం అయితే విడిపోవాలని కోరుకుందో ఆ ప్రాంతంలోనే పాత రాజధాని ఉంది. పైగా అది దేశంలో అభివృద్ధి చెందిన పెద్ద నగరాల్లో ఒకటి అయింది. హైద్రాబాద్ చారిత్రక నగరం కూడా.

విడిపోవాలని కోరుకున్న ప్రాంతంలోనే పాత రాజధాని ఉన్నంత మాత్రాన అది సమస్యగా మారాల్సిన అవసరం ఉన్నదా? నిజానికి లేదు. అయినా ఎందుకు సమస్య అయిందంటే ఎవరి ఆధిపత్యం వల్లనైతే తమ వనరులు తమకు దక్కలేదని విడిపోవాలన్నవారు భావిస్తున్నారో వారి ఆధిపత్యం ఆ హైద్రాబాద్ నగారంతో ముడిపడి ఉండడమే సమస్యకు ప్రధాన కారణం. సీమాంధ్ర ఆధిపత్య వర్గాల రియల్ ఎస్టేట్ ఆస్తులు, పరిశ్రమలు, ఆదాయం హైద్రాబాద్ వద్ద కేంద్రీకృతం అయ్యాయి. అలాంటి నగరం దూరం అయితే వారి ఆధిపత్యానికి చిల్లు పడినట్లే. అందుకే హైద్రాబాద్ సమస్య అయింది.

సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ బ్రిటిష్ పాలన వల్ల నీటి పారుదల వసతి అందుబాటులోకి రావడం వల్ల అయితేనేమీ, బ్రిటిష్ వారితో సాంగత్యం వల్ల అయితేనేమీ సీమాంధ్ర భూస్వాముల భూములు సిరులు కురిపించడంతో పాటు వారికి విద్యా గంధం అబ్బింది. తద్వారా వారు ప్రభావశీలురైన పెట్టుబడిదారులుగా అభివృద్ధి చెందారు. కానీ వారు తమ సంపదలను తమ ప్రాంతంలోనే పెట్టుబడిగా పెట్టడానికి బదులు తెలంగాణకు, హైద్రాబాద్ కు వరుస కట్టారు. అలా కాకుండా వారు విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖ తదితర నగరాలను అభివృద్ధి చేసి ఉంటే హైద్రాబాద్ కోసం వగచే పరిస్ధితి ఉండేది కాదు.

కాబట్టి హైద్రాబాద్ సమస్య కావడానికి కారణం ఎ.పి లో నెలకొన్న ఒక ప్రత్యేక రాజకీయ, సామాజికార్ధిక పరిస్ధితులే ప్రధాన కారణం. స్పష్టంగా చెప్పాలంటే, దోపిడీ వర్గాలు సీమాంధ్రంలో ప్రధానంగా కేంద్రీకృతం కాగా, వారి దోపిడీ కార్యకలాపాలు మాత్రం తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైద్రాబాద్ చుట్టూ కేంద్రీకృతం కావడం ఈ ప్రత్యేక కారణం.

నిజానికి తెలంగాణ సమస్య తలెత్తింది కూడా ఈ కారణం వల్లనే. అనగా ఏ సమస్య వల్లనైతే విడిపోతామని తెలంగాణ కోరుకుందో, సరిగ్గా అదే సమస్య విభజనను అడ్డుకోవడానికి కూడా కారణం అయింది. ఇక మిగిలిన కారణాలన్నీ దీని చుట్టూ అల్లుకున్నవే. ఉద్యోగాలు, అభివృద్ధి, నీళ్ళు… ఇవన్నీ ఈ సమస్యలో అంతర్భాగం.

అందుకే ఆంధ్ర ప్రదేశ్ విభజన/తెలంగాణ ఏర్పాటు ఇంత పెద్ద సమస్య అయింది. విడిపోవాలనుకుంటున్నవారు రాజకీయంగా, ఆర్ధికంగా బలహీనురు గాకా నిరోధిస్తున్నవారు బలవంతులు. దానితో వారు కేంద్రానికి కూడా సమస్య కాగలిగారు. రాజశేఖర రెడ్డి అండతో సీమాంధ్ర కలిగిన వర్గాలు, జాతీయ స్ధాయి కలిగిన వర్గాలతో తలపడుతూ గ్యాస్, ఖనిజ వనరుల్లో వాటా కోసం తగాదాపడకపోతే ఏమై ఉండేదో గానీ, సరిగ్గా ఈ తగాదాయే సీమాంధ్ర ధనికులను అణచివేయాల్సిన అవసరం జాతీయ స్ధాయి ధనిక వర్గాలకు వచ్చి పడింది.

దీని ఫలితంగానే తెలంగాణ డిమాండ్ కు జాతీయ స్ధాయి ధనిక వర్గాల మద్దతు లభించింది. వారి మద్దతే లేకపోతే సోనియా గాంధీ ఎంత గింజుకున్నా ఫలితం ఉండేది కాదు. అసలు ఆమె గింజుకునే అవసరమే వచ్చేది కాదు.

జాతీయ స్ధాయి గ్యాస్, ఖనిజ వనరుల కోసం పోటీ వస్తున్న సీమాంధ్ర ధనికవర్గాలను అణచివేయాల్సిన అవసరం జాతీయ స్ధాయి ధనికవర్గాలకు రావడం తెలంగాణకు అనుకూలించింది. ఇది సోనియా గాంధీ కఠిన నిర్ణయం గానూ, ‘దేవత సోనియా’గానూ మనకు కనిపిస్తోంది. తరిచి చూస్తే ఒకరు దేవతా కాదు, మరొకరు దెయ్యమూ కాదు. ఇది దోపిడీ వర్గాలు ఆధిపత్యం కోసం పడిన తగాదా.

అయితే తెలంగాణ నిర్లక్ష్యానికి, వివక్షకు గరయిన విషయం ఒక చారిత్రక వాస్తవం. చరిత్రలో జరిగిన కొన్ని పరిణామాలు (బ్రిటిష్ వలస పాలన ఒకవైపు, నిజం ఫ్యూడల్ పాలన మరొకవైపు) ఆ వాస్తవానికి బాటలు పరిచాయి. ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతాల మధ్య చారిత్రకంగా గీయబడిన ఈ రాజకీయ, సామాజికార్ధిక విభజన రేఖను చూడలేకపోతే తెలంగాణ డిమాండ్ ను సానుకూలంగా అర్ధం చేసుకోవడం సాధ్యపడదు. ఈ కోణం లోంచి చూస్తేనే తెలంగాణ డిమాండ్ ప్రజాస్వామిక డిమాండ్ అయింది. ఇందుకే సమైక్యాంధ్ర డిమాండ్ అప్రజాస్వామికం అయింది.

ఇది చాలా విధాలుగా ఎస్.సి వర్గీకరణ సమస్యతో పోలి ఉండడం యాదృచ్ఛికం. అప్పటికే కాస్త అభివృద్ధి సాధించినవారు మెజారిటీ అవకాశాలు తన్నుకుపోతుండడంతో, అభివృద్ధి చెందనివారు తమ అవకాశాలు తమకే పరిమితం చేయాలని డిమాండ్ పెట్టారు. ఇది ప్రజాస్వామిక డిమాండ్. కానీ అవతలివారు ఒక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే (పురుషోత్తమ్ అనుకుంటా) అన్నట్లు ‘మాది మాకు కావాలి. దానితో పాటు మీది కూడా కావాలి’ అనడం మొదలు పెట్టారు. పైకి దానిని ‘అణగారిన వర్గాల ఐక్యత’ అని అందంగా పిలుస్తున్నారు.

తెలంగాణ కూడా అంతే. 66 యేళ్ళు తమ అవకాశాలు తమకు అందక నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డ జనం, ఇతర వర్గాలు ఇప్పుడు ‘మాది మాకు ఇవ్వండి’ అన్నారు. అది ప్రజాస్వామిక డిమాండ్. కానీ సీమాంధ్ర దోపిడి వర్గాలు ‘మాది ఎలాగూ మాదే. మీది కూడా మాదే. ఎందుకంటే మీకు అన్నీ నేర్పింది మేమే’ అంటున్నారు. ఇది అప్రజాస్వామికం. సమర్ధించడానికి వీలు లేనిది. కానీ వారు బలవంతులు. దానితో సమస్య ఎంత ముదరాలో అంతా ముదిరింది.

తెలంగాణను కాంగ్రెస్ తమ రాజకీయ స్వప్రయోజనానికి వాడుకోవడానికి చూడడంతో మరింత కంగాళీ అయింది.

ఇప్పటికన్నా ఎ.పి అసెంబ్లీ లోని సవాలక్షా చిక్కులను దాటి తెలంగాణ బంతి రాష్ట్ర పతి బల్ల మీద ‘OUT’ విభాగానికి చేరింది.

6 thoughts on “ఎ.పి అసెంబ్లీ ఆటంకం దాటిన టి.బిల్లు -కార్టూన్

  1. దోపిదీ అనడం సమంజసమా? రాజధాని కనుక వెళ్ళారు.తెలంగాణావారిలో దోపిడీదారులు లేరా? దోపిడీదారులమీదఎక్కుపెట్తాల్సిన పోరాటం గురించి ఏమిటి?

  2. రవిబాబు గారూ

    “స్పష్టంగా చెప్పాలంటే, దోపిడీ వర్గాలు సీమాంధ్రంలో ప్రధానంగా కేంద్రీకృతం కాగా, వారి దోపిడీ కార్యకలాపాలు మాత్రం తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైద్రాబాద్ చుట్టూ కేంద్రీకృతం కావడం ఈ ప్రత్యేక కారణం.”

    మీరు ప్రస్తావించింది పై మాటల్లోని దోపిడీయేనా? అదే అయితే దోపిడీవర్గాల దోపిడీ అనే అన్నాను గానీ ప్రజల దోపిడీ అన్లేదని గమనించగలరు. ఉద్యోగాలు, అవకాశాల కోసం వలస వెళ్లిన సామాన్య సీమాంధ్రులది దోపిడీ కాదని నా అభిప్రాయం. ఇలాంటి వలస ఒక్క తెలంగాణకే జరగలేదు. ప్రపంచంలోని అనేక చోట్లకి జరిగింది.

    తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అచ్చమైన వర్గ పోరాటం కాదు. అది జనరల్ ప్రజాస్వామిక ఉద్యమం. విశాల వర్గ పోరాటంలో శక్తులు సమకూర్చుకోవడానికి ప్రజా సంఘాల ద్వారా చేసే ఉద్యమాల్లాంటిదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం.

  3. ఈ పోరాటాన్ని దోపిడి దారుల వాటాల కోసం కొట్లాట గా చూడాలా? లేక ప్రజాస్వామ్య ఉద్యమం గా చూడాలా? ప్రజల్ని రెచ గొట్టడం లో ఈ దోపిడి దారులు సఫలం అయ్యారా? జోనల్ సిస్టం వచ్చాకా కూడా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందా? ఇప్పుడు లక్ష ఉద్యోగాలు వస్తాయా?

  4. That’s a good question.

    ఈ ఉద్యమానికి రెండు లక్షణాలూ ఉన్నాయి. తెలంగాణ వనరులు కాస్తయినా అక్కడి ప్రజలకు దక్కుతాయి కాబట్టి, తెలంగాణ బడ్జెట్ అక్కడి అన్నివర్గాలకు సొంతం అవుతుంది కాబట్టి ఇది ప్రజాస్వామిక ఉద్యమం. దోపిడీ వర్గాలు నాయకత్వం వహించారు కాబట్టి ఉద్యమ లక్ష్యాన్ని తప్పు పట్టలేము.

    అదే సమయంలో తెలంగాణ దళారీ పెట్టుబడిదారులు, భూస్వాములు కూడా ఇన్నాళ్ళూ తగిన వాటా పొందలేదు. వారికి అప్పటికే అభివృద్ధి చెందిన సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు ఆటంకంగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్రం ద్వారా ఈ ఆటంకం వారు తొలగించుకుంటారు. అందుకే ఉద్యమానికి చురుకైన మద్దతు ఇవ్వడమే కాక నాయకత్వం కూడా వహించారు.

    సాధారణంగా ఇలాంటి ఉద్యమాల్లో ప్రగతిశీల శక్తులు బలంగా ఉండి నాయకత్వం వహించగలిగితే ఉద్యమం రాష్ట్ర సాధనతోనే ఆగకుండా ఇతర సాధారణ ప్రజల సమస్యల (నిరుద్యోగం, ప్రైవేటీకరణ, నీటివనరుల సక్రమ వినియోగం, అధిక ధరలు, కనీస వేతనాలు మొ.వి) పరిష్కారం కోసం కూడా ఉద్యమాన్ని పొడిగిస్తారు. దురదృష్టం ఏమిటంటే అలాంటి శక్తులు బలంగా లేవు. తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ దోపిడీ శక్తులే నాయకత్వం వహించాయి. అందువలన ఇది రాష్ట్ర సాధనతో ముగిసిపోతుంది.

    జోనల్ పద్ధతి వచ్చాక కూడా అన్యాయం జరుగుతోందా అన్న ప్రశ్న ఇప్పుడున్న పరిస్ధితుల్లో అసందర్భం అయింది. ఎందుకంటే ఉద్యోగాల రిక్రూట్ మెంటునే పాలకులు రద్దు చేశారు. పై స్ధాయి వరకు తీసుకుని మిగిలినవి కాంట్రాక్టీకరణ చేసేశారు. ఇది పైన చెప్పిన ప్రైవేటీకరణ సమస్యలో భాగం. ఆ కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా తమకు పూర్తిగా దక్కడం లేదని తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు కాబట్టి అంతవరకైనా అది సమస్యే. సీమాంధ్ర నుండి వలస వెళ్లినవారి విషయంలో తీసుకునే నిర్ణయం పైన కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది.

    తెలంగాణ ఉద్యమం స్ధూలంగా దోపిడీ శక్తులు ప్రధానంగా నాయకత్వం వహించిన ప్రజాస్వామిక ఉద్యమం. విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ఇందులో ప్రగతిశీల శక్తులు. (వారిలోనూ అనేక బలహీనతలు.) ఒక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది ఆ ఉద్యమ విస్తృతి, ప్రగతిశీల శక్తుల పాత్ర, ప్రజల పాత్ర, ఉద్యమ లక్ష్యం… ఇలాంటి అంశాలను బట్టి నిర్ణయించుకోవాలి. మద్దతు ఇవ్వాలనుకుంటున్నవారి స్వభావం కూడా ఇందులో తగిన పాత్ర పోషిస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!

    ప్రజల్ని రెచ్చగొట్టడంలో సఫలం అయ్యారన్న భావన సమంజసం కాదు. ప్రజల అసంతృప్తి నిజం. వారి సమస్యలు నిజం. వివక్ష, నిర్లక్ష్యాలు నిజం. కాబట్టి వారు అనివార్యంగా స్పందిస్తారు. ఈ అంశాన్ని అలాగే చూడాలి. వారి ప్రయోజనాలు లేకుండా స్పందిస్తే అది రెచ్చగొట్టడం అవుతుంది. అలాంటి స్పందన ఎక్కువ కాలం నిలవదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s