టోల్ గేట్ అంటేనే బాదుడుకి ప్రతిరూపం. ప్రజల కోసం అని చెప్పి రోడ్లు వేసి, ఆ రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి జనాన్ని బాదే అధికారాన్ని సైతం వారికి ఇవ్వడం పచ్చి ప్రజా వ్యతిరేక చర్య. వాహనాలు కొన్నపుడు రోడ్ టాక్స్ వేస్తారు. బస్సుల్లో తిరిగితే టిక్కెట్ డబ్బులు వసూలు చేస్తారు. పెట్రోల్ కొన్నప్పుడు కూడా దానిపైన సవాలక్షా పన్నులు వేసి సామాన్యులకు అందకుండా చేస్తారు. ఇవన్నీ పోను మళ్ళీ టోల్ గేట్ రుసుము వసూలు చేయడం, అది కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం… ఇంతకంటే మించిన ప్రభుత్వ గూండాయిజం మరొకటి ఉండబోదు.
ఈ గూండాయిజాన్ని ఎదిరించే పేరుతో మహారాష్ట్రలో రాజ్ ధాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మరో గూండాయిజానికి తెర తీసింది. వారం రోజుల క్రితం వన్ ఫైన్ మోర్నింగ్ నిద్ర లేచిన రాజ్ ధాకరే తన పార్టీ కార్యకర్తలను సమావేశపరిచి టోల్ గేట్ రుసుము ఎంత అన్యాయమో లెక్చర్ దంచిందే తడువుగా ఎం.ఎన్.ఎస్ సైనికులు చెలరేగిపోయారు. టోల్ గేట్ రుసుము చెల్లించొద్దని, టోల్ గెట్ లను నలిపేయాలని రాజ్ ధాకరే ఇచ్చిన పిలుపును కార్యకర్తలు మహోత్సాహంతో అమలు చేశారు. శివసేన నుండి చీలి వచ్చినోళ్లే కాబట్టి ఆ లక్షణాలనే పుణికి పుచ్చుకున్న ఎం.ఎన్ సేన టోల్ గేట్ల పైన విధ్వంసకర దాడులు మొదలు పెట్టారు. ధానెతో మొదలు కొని డజన్ల కొద్దీ టోల్ గేట్ లను ధ్వంసం చేశారు. వీళ్ళకి ఎం.ఎన్.ఎస్ ఎమ్మెల్యేలే నాయకత్వం వహించారని పత్రికల సమాచారం.
ఇదే పని మావోయిస్టులు చేస్తే ‘ప్రజాస్వామ్యంలో విధ్వంసకర కార్యకలాపాలకు తావు లేదు’ టైపు ఉపన్యాసాలు, నీతి బోధలు పత్రికలు, ఛానెళ్లను నింపేసేవి. కానీ ఆ చేసింది తమలో ఒక వర్గమే కాబట్టి పాలకులు సుతీమెత్తగా ప్రకటనలు జారీ చేశారు. కొంతమంది ఎం.ఎన్.ఎస్ కార్యకర్తలను అరెస్టు కూడా చేశామని మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. రాజ్ ధాకరే పైన కేసులు పెట్టామని సెక్షన్ 153, 109 తదితర సెక్షన్లు పెట్టామని వాళ్ళు తెలిపారు. కానీ విచిత్రంగా ధాకరేని అరెస్టు చేసే ఉద్దేశ్యం మాత్రం తమకు లేదని చెప్పారు. సెక్షన్ 109 నిజానికి నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇలాంటి సీరియస్ కేసు పెట్టి కూడా అరెస్టు చేసే ఉద్దేశ్యం లేదనడం ద్వారా పోలీసులు ఏం చెప్పదలిచారు?
మరో విశేషం ఏమిటంటే జనవరి 31 తేదీన రాజ్ ధాకరే ముంబై నుండి పూణేకు ప్రయాణం చేశారు. ఆయన వెళ్ళిన దారిలో 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయన వెళ్ళినపుడు కౌంటర్లు మూసేసి వెళ్ళాక తెరిచారని టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. (ఏం.ఎల్.ఏ లు టోల్ ఫీజు చెల్లించాల్సిన పని లేదట.) ఐనా ఆయన వాహన కాన్వాయ్ నుండి టోల్ ఫీజు వసూలు చేయలేదు. పైగా కౌంటర్లు మూసేశారు. ప్రభుత్వాలు, వ్యవస్ధలు ఎవరికోసం పని చేస్తాయో తెలియడానికి ఇదొక చిన్న తార్కాణం.
టోల్ ఫీజుల గురించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కూడా రాజ్ చెప్పారు. ఫిబ్రవరి 9 తేదీన పూణేలో ప్రకటిస్తారట. ఆయన కార్యాచరణ సంగతి అటుంచితే, దానివల్ల లబ్ది పొందింది ఆయన వాహనాలే తప్ప జనం కాదు. జనం ఎప్పటిలాగే టోల్ ఫీజులు చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం అంతా జనం దృష్టిని ఆకర్షించి ఏమిటో చేయబోతున్నామని చెప్పడానికి తప్ప మరోకందుకు కాదని అర్ధం చేసుకోవచ్చు. టోల్ ఫీజులు ఈనాటివి కావు. గతంలోనూ శివ సేన ఇలాంటి దాడులు చేసి తమ అవసరం ముగిశాక కిమ్మనలేదు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రత్యర్ధుల కంటే పై చేయి సాధించడానికి ఎం.ఎన్.ఎస్ సంస్ధ టోల్ గేట్లను ఒక సాధనంగా ఎంచుకుంది. అనగా ఎం.ఎన్.ఎస్ సంస్ధ స్వయంగా రాజకీయ టోల్ గేట్ దుకాణం తెరిచిందని కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికలు ముగిశాక ఎం.ఎన్.ఎస్ కార్యాచరణ ఏట్లోకి వెళ్తే జనం ఎప్పటిలాగే టోల్ గేట్ల గుండా వెళ్తూ ఇంకా ఇంకా పెరిగిన ఫీజులు చెల్లించుకుంటారు.