విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి


Arvind

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ కట్టాలని లేకపోతే విద్యుత్ ఇచ్చేదీ లేదని ప్రభుత్వరంగ కంపెనీ ఎన్.టి.పి.సి ఈ మూడు డిస్కమ్ లకు నోటీసులు ఇచ్చింది. ఎన్.టి.పి.సి యు.పి.ఎ ఆధీనంలో ఉందని గమనిస్తే ఈ దాడికి మూలం ఎక్కడ ఉందో ఇట్టే పసిగట్టవచ్చు. కాగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్ధ 8 శాతం విద్యుత్ సర్ చార్జి ప్రకటించి ఎఎపి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని పూరా జీరో (nullify) చేయడానికి నడుం బిగించింది.

అనగా ఢిల్లీ ప్రభుత్వం పైన ఇప్పుడు మూడు వైపుల నుండి దాడి మొదలయింది.

ఒకటి: ప్రైవేటు డిస్కమ్ ల నుండి. ఢిల్లీకి విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు కంపెనీలు టాటా, అంబానీలకు చెందినవే. ఈ మూడు కంపెనీలపైనా కాగ్ ఆడిట్ నిర్వహించాలని ఎఎపి ఇచ్చిన ఆదేశాలపై సదరు కంపెనీలు కోర్టుకు వెళ్ళాయి. అదృష్టవశాత్తూ వారి పిటిషన్ స్వీకరించడానికి ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. కోర్టు ప్రయత్నం విఫలం అయ్యాక పంపిణీకి తమ వద్ద డబ్బు లేదని చేతులెత్తేశాయి. తమ ఆర్ధిక పరిస్ధితి కనాకష్టంగా ఉందంటూ బేల ముఖం పెట్టాయి. బ్యాంకులూ అప్పులు ఇవ్వడం లేదని చెబుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో రోజుకు కనీసం 10 గంటల కోత తప్పదని ప్రకటించాయి.

రెండు: డిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్ధ నుండి. అనగా భారత సామాజికార్ధిక వ్యవస్ధలో పాతుకుపోయిన నిరంకుశ బ్యూరోక్రసీ నుండి అన్నట్లు. వీళ్ళకి అధికారం వచ్చేదే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నుండి. కానీ ప్రభుత్వాల పైన పెత్తనం చెలాయిస్తున్నట్లు ప్రభుత్వాలే చెబుతాయి. ప్రతి యేటా విద్యుత్ ఛార్జీలు పెంచే బాధ్యత ఈ సంస్ధలకు అప్పజెప్పారు. ఇది ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఐడియా. విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడల్లా జనం రోడ్ల మీదికి వచ్చి పెద్ద బెడదగా మారారు. (చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది విద్యుత్ ఉద్యమం పుణ్యం వల్లనే అన్నది గుర్తు చేసుకుందాం) ఈ పరిస్ధితి నుండి బైటపడడానికి రెగ్యులేటరీ సంస్ధల్ని ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకు సలహా పడేసింది.

అప్పటి నుండి విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా మాదేం లేదు, ఇ.పి.ఆర్.సి (ఎలక్ట్రిసిటీ పవర్ రెగ్యులేటరీ కమిషన్) ని అడగండి అని చెప్పడం మొదలు పెట్టాయి ప్రభుత్వాలు. ఇప్పుడు డి.ఇ.పి.ఆర్.సి విద్యుత్ పైన 8 శాతం ఇంధన సర్ చార్జి ప్రకటించింది. దీనితో ఎఎపి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కాస్తా సున్న అయిపోతుంది. ఈ రోజుల్లో విద్యుత్ సర్ ఛార్జీలు పెరుగుతున్నది ఇంధన సర్ చార్జీల పేరుతోనే. గత యేడు అధిక వాడకం జరిగిందని చెప్పి బాకీ కింద దీన్ని వడ్డిస్తారు.  వసూలు చేస్తారు. కానీ విచిత్రంగా ఆ పెంపుదల భవిష్యత్తంతా కొనసాగుతుంది. ఉపసంహరణ అనేదే ఉండదు.

మూడు: ప్రభుత్వరంగం (పబ్లిక్ సెక్టార్) నుండి. పేరుకు ప్రభుత్వ రంగమే గానీ ఇవి పోషించింది ప్రధానంగా దేశీయ పెట్టుబడిదారులనే. ప్రభుత్వ రంగాన్ని అడ్డం పెట్టుకునే టాటా, బిర్లా, సింఘానియా, కిర్లోస్కర్ తదితర ప్రైవేటు దళారీ పెట్టుబడిదారీ కుటుంబాలు 10 కోట్ల (1947) రూపాయల సంపదలను ఈ నాడు లక్షల కోట్ల సంపదగా మార్చుకున్నారు. భారతీయ నిరంకుశ బ్యూరోక్రాట్లను, దళారీ రాజకీయ నాయకులను, దళారీ పెట్టుబడుదారులను అరవైయేళ్లుగా మేపి అభివృద్ధి చేసిన ఘనత మన ప్రభుత్వరంగానిది. ప్రభుత్వరంగ కంపెనీలను నడిపేది కూడా బ్యూరోక్రసీ మరియు రాజకీయ వర్గాలలోని ఒక భాగమే. కనుక ఇప్పుడు ఎన్.టి.పి.సి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎన్.టి.పి.సి చేస్తున్న దాడి ప్రత్యక్షంగా కాదు. అది పరోక్షంగా చేస్తోంది. పాత బాకీలు అర్జెంటుగా చెల్లించాలని లేకపోతే విద్యుత్ ఇచ్చేదీ లేదనీ ఇది ఢిల్లీ డిస్కమ్ లకు నోటీసులు ఇచ్చింది. (ఎన్.టి.పి.సి విద్యుత్ ఉత్పత్తి చేసి ఇస్తే దాన్ని డిస్కంలు పంపిణీ చేస్తాయి.) ఇన్నాళ్లూ ఊరుకొన్న ఎన్.టి.పి.సికి ఇప్పుడే అర్జెంటుగా పాత బాకీలు గుర్తుకు వచ్చాయి? సమాధానం స్పష్టమే. ఎన్.టి.పి.సి ఒత్తిడి చేస్తే ఆ వంక పెట్టి డిస్కంలు సహాయ నిరాకరణ చేస్తాయి. ఇందులో భాగంగానే డిస్కంలు 10 గంటల కోత ప్రకటించాయి.

మనకు కనపడని, మన దేశంలో లేని నాలుగో పక్షం కూడా ఒకటి ఉంది. అది విదేశీ సామ్రాజ్యవాద వర్గం. మన పాలకులంతా వీరికి సేవకులు. మరి ఎఎపి పైన వీరి దాడి లేదా అంటే ఉంది. ఇది కూడా పరోక్షంగా ఉంది. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ప్రస్తుతం ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ అనే విదేశీ క్రెడిట్ రేటింగ్ కంపెనీ విదేశీ సామ్రాజ్యవాద పాత్ర పోషిస్తోంది. ఢిల్లీకి విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు డిస్కమ్ లు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయని చెబుతూ ఈ కంపెనీ ఇటీవలే ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ పౌరులు చెల్లించాల్సిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం తగ్గించడం పైన కూడా ఈ కంపెనీ హెచ్చరిక జారీ చేసింది. ఇలాగయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కష్టం అవుతుందని వాపోయింది. నిజం ఏమిటంటే ఈ క్రెడిట్ రేటింగ్ కంపెనీలన్నీ ఏదో ఒక బహుళజాతి కంపెనీయో, వాల్ స్ట్రీట్ కంపెనీయో నడిపేవే. కాబట్టి కంపెనీల ప్రయోజనాల కోసమే అవి పని చేస్తాయి. ప్రభుత్వాల విధానాలు కంపెనీలకు అనుకూలంగా లేకపోతే ఘోరం జరిగిపోతోందని గగ్గోలు ప్రారంభిస్తాయి. తమ వాదనకు మద్దతుగా మనకు అర్ధం కానీ పదజాలం గుప్పించి సవా లక్షా లెక్కలు ప్రదర్శిస్తాయి.

త్రిమూర్తులు

త్రిమూర్తులు కలిసి లోకం నడకని శాసిస్తున్నారని కదా మన పురాణాలు చెప్పేది! ఢిల్లీ విద్యుత్ పంపిణీని కూడా త్రిమూర్తులే శాసిస్తున్నారు.

అవి: బి.ఆర్.పి.ఎల్ (బి.ఎస్.ఇ.ఎస్ రాజధాని పవర్ లిమిటెడ్), బి.వై.పి.ఎల్ (బి.ఎస్.ఇ.ఎస్ యమునా పవర్ లిమిటెడ్), టి.పి.డి.డి.ఎల్ (టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్).

వీటిలో మొదటి రెండు అనీల్ అంబానీకి కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రా కు చెందినవి. ఈ పేర్లలో బి.ఎస్.ఇ.ఎస్ అంటే బోంబే సబర్బన్ ఎలక్ట్రిక్ సప్లై అని అర్ధం. దీన్ని అనీల్ అంబానీ మహారాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్నాడు. అనంతరం తన విద్యుత్ పంపిణీ కంపెనీల ముందు దాన్ని తగిలిస్తున్నాడు.

బి.వై.పి.ఎల్ కంపెనీ తూర్పు, మధ్య ఢిల్లీ ప్రాంతానికి విద్యుత్ పంపిణీ చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి (జెన్ కో), ప్రసారం (ట్రాన్స్ కో) చేసే కంపెనీలకు తాను చెల్లింపులు చేయలేకపోతున్నాననీ, తన ఆర్ధిక పరిస్ధితి చాలా కష్టంగా ఉందని కాబట్టి ఫిబ్రవరి 1 నుండి కోతలు తప్పవని ఈ కంపెనీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి లేఖ రాసింది.

ఇతర కంపెనీలు కూడా దాన్ని అనుసరించాయి. టాటా పవర్ డి.డి.ఎల్, జాతీయ రాజధాని ప్రభుత్వం సంయుక్తంగా ఎన్.డి.పి.ఎల్ (నార్త్ ఢిల్లీ పవర్ లిమిటెడ్) ద్వారా ఉత్తర ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీ రాష్ట్ర విద్యుత్ పంపిణీ 70 శాతం అంబానీ చేతుల్లోనూ, 30 శాతం టాటా చేతుల్లోనూ ఉంది.

ఈ కంపెనీలు తమ వాదనలకు మద్దతుగా పి.డబ్ల్యూ.సి ఇచ్చిన నివేదికను చూపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం అనేక నివేదికల్లో అదొకటని, అందులో ఉపయోగపడే అంశాలు ఉంటే స్వీకరిస్తాం అనీ చెప్పి ఊరుకుంది.

బ్లాక్ మెయిలింగ్

త్రిమూర్తుల విద్యుత్ కోతల బెదిరింపుల్ని ఢిల్లీ ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి డిస్కంలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించాడు. విద్యుత్ నియంత్రణ సంస్ధ విద్యుత్ సర్ చార్జీలను పెంచడాన్ని కూడా ఆయన ఖండించాడు. తాము సి.ఏ.జి ఆడిట్ కు ఆదేశించామనీ ఆడిట్ పూర్తి కాకుండా హడావుడిగా సర్ ఛార్జీ బాదాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఆడిట్ పూర్తయితే తమ అడ్డగోలు వాదనలన్నీ రద్దైపోయి అక్రమ ఆదాయం ఆగిపోతుందని డిస్కంలు భయపడినట్లు కనిపిస్తోంది. దానితో హడావుడిగా కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించి రెగ్యులేటరీ కమిషన్ ను రంగంలోకి దించి ఛార్జీలు పెంచేలా చూసుకున్నాయి.

డిస్కంలు చేస్తున్న ఆర్ధిక నష్టాల వాదనలోని పస ఏమిటో ఆడిట్ పూర్తయితే తెలిసిపోతుందని, అప్పటివరకూ ఛార్జీలు పెంచేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశాడు. “తమ వద్ద డబ్బు లేదని వాళ్ళు చెబుతున్నారు. అయితే డబ్బంతా హఠాత్తుగా ఎక్కడికి పోయినట్లు? వారి డబ్బు ఎక్కడికి వెళ్లిందో కనిపెట్టడానికి సి.ఏ.జి ప్రయత్నిస్తోంది. సి.ఏ.జి నివేదిక వచ్చాక నిజం ఏమిటో బైటికి వస్తుంది. ఆ నివేదిక వస్తే డిస్కంలు నిజంగా ఆర్ధిక సంక్షోభంలో ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది” అని ఏ.కె (అరవింద్ కేజ్రీవాల్) స్పష్టం చేశాడు.

విద్యుత్ కోతలు విధిస్తామని చెప్పడం అంటే బ్లాక్ మెయిల్ చేయడమే అని ఏ.కె హెచ్చరించాడు. అదే జరిగితే వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని హెచ్చరించాడు. “కోతలు విధించడానికి కారణాలు ఏమీ లేవు. ఈ విధంగా భయోత్పాతం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాము” అని ఏ.కె అన్నారు. దేశంలో విద్యుత్ పంపిణీ కంపెనీలు టాటా, అంబానీలవి మాత్రమే కాదనీ, ఇంకా అనేక కంపెనీలు ఆ రంగంలో ఉన్నాయని కాబట్టి ఇతర కంపెనీలకు అవకాశం ఇస్తామని కూడా ఏ.కె హెచ్చరించాడు.

“సి.ఏ.జి ఆడిట్ కి వాళ్ళు సహకరించడం లేదు. అక్కడే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వారి లైసెన్స్ లు రద్దు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదు” అని ఏ.కె హెచ్చరిక జారీ చేశాడు. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s