ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.
ప్రసార నష్టాలు అన్నది సాంకేతిక సమస్య. కాస్త నిర్వహణ సమస్య కూడా. ఈ రెండు అంశాలూ ప్రైవేటు కంపెనీల హయాంలో ఏ మాత్రం మెరుగుపడిందీ రికార్డుల్లేవు. భలే మెరుగుపడ్డాయి అని కొన్ని పత్రికలు చెప్పినా ఆ వివరాల్లేవు. పైగా నష్టాల్లో ఉన్నామని అవే చెప్పుకుంటున్నాయి. ఇక ఏం గొప్పగా అవి నిర్వహించినట్లు? దొంగతనాలు అరికట్టడం పూర్తిగా కంపెనీలు చేసే పని కాదు. పోలీసుల సాయం అవసరం. వారు ఉండేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో. కంపెనీల ఆధీనంలో కాదు. మరి ప్రైవేటు కంపెనీలు విద్యుత్ చౌర్యాన్ని ఎలా అరికడతాయి? పోనీ, ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన 2003 నుండి అవి ఎంతవరకు విద్యుత్ చౌర్యం అరికట్టాయి?
గత సంవత్సరం ఏప్రిల్ లో కేంద్ర విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ చౌర్యం అరికట్టడంలో ఢిల్లీ డిస్కంలు విఫలం అయ్యాయి. ఏప్రిల్ 2013 ముందరి నాలుగు సంవత్సరాల్లో 99,473 విద్యుత్ చౌర్యం కేసులు నమోదయ్యాయి. విద్యుత్ చౌర్యంలో దేశంలోనే నాలుగో స్ధానంలో ఢిల్లీ ఉందని సదరు నివేదిక పేర్కొంది. మధ్య ప్రదేశ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ల తర్వాత స్ధానం ఢిల్లీదే. విచిత్రం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేటు డిస్కంలు లేవు. కానీ అతి తక్కువ విద్యుత్ చౌర్యం కేసులు (22,000) నమోదయింది ఆంధ్ర ప్రదేశ్ లోనే.
ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి విద్యుత్ పంపిణీ వెళ్ళాక ప్రసార నష్టాలు అరికట్టారో లేదో తెలియదు గానీ జనానికి మాత్రం చార్జీల మోత మోగిపోయింది. ఎన్నిసార్లు ఛార్జీలు బాదినా నష్టాలంటూ బీద అరుపులు అరవడం డిస్కం కంపెనీలు మానలేదు. దీనితో అసలు డిస్కం కంపెనీలను సి.ఎ.జి ఆడిట్ జరిపించాలని ఒక పౌర సంస్ధ కోర్టులో వ్యాజ్యం వేసింది. ఇది జరిగింది 2011 ఫిబ్రవరిలో. అనగా సరిగ్గా మూడేళ్ళ క్రితం. అప్పటి నుండి కోర్టుల సాక్షిగా ప్రైవేటు కంపెనీలు, ఢిల్లీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుకున్నాయి. జనం మాత్రం భారం భరిస్తూనే ఉన్నారు.
ఎఎపి అధికారంలోకి వచ్చీరాగానే డిస్కం కంపెనీల పైన సి.ఎ.జి ఆడిట్ జరిపిస్తామని ఒక్క రోజులోనే తేల్చిపారేసింది. ఈ విషయంలో షీలా ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వ్యవహరించిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. చీదర పుడుతుంది కూడా.
RWA అంటే Residents Welfare Association అని అర్ధం. ఢిల్లీలో వివిధ కాలనీల్లోనూ, అపార్ట్ మెంట్ల లోనూ ఉన్న RWA లన్నింటి తరపున URJA అనే సంస్ధ ఏర్పడింది. దీని పూర్తి రూపం United RWAs Joint Action. దీన్ని సులువు కోసం ఉర్జా అందాం.
ఈ ఉర్జా 2011 ఫిబ్రవరిలో కోర్టుకు వెళ్లింది. ప్రైవేటు డిస్కం లను కాగ్ ఖచ్చితంగా ఆడిట్ చేసేలా చూడాలని, దానితో పాటు సదరు కంపెనీల వ్యవహారాలపైన సి.బి.ఐ తో గానీ తత్సమాన సంస్ధతో గానీ విచారణ జరిపి నిగ్గు దేల్చాలని తన పిటిషన్ లో కోరింది. ప్రైవేటు డిస్కంలు తప్పుడు పద్ధతులు అవలంబిస్తూ, రికార్డులను తారుమారు చేస్తున్నాయని ఆరోపించింది. న్యూ ఢిల్లీ పవర్ లిమిటెడ్ (టాటా పవర్, నేషనల్ కేపిటల్ టెరిటరీ ప్రభుత్వాల జాయింట్ వెంచర్), BSES యమునా పవర్ లిమిటెడ్ (BYPL), BSES రాజధాని పవర్ లిమిటెడ్ (BRPL)… ఈ మూడు కంపెనీల పైనా విచారణ జరిపించాలని పిటిషన్ లో కోరింది.
ఉర్జా తరపున ఎఎపి నేత, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఎఎపి ప్రభుత్వం కాగ్ విచారణకు ఆదేశించినపుడు ఈ కేసునే డిస్కంలు చూపిస్తూ కోర్టు పరిధిలో ఉండగా కాగ్ ఆడిట్ కి ఆదేశించడం అన్యాయం అన్నాయి. దానికి ఎ.కె (అరవింద్ కేజ్రీవాల్) అలా చేయ కూడదని కోర్టు ఆదేశాలు లేవు పొమ్మన్నాడు. దాంతో హై కోర్టుకి వెళ్ళి స్టే ఇవ్వాలని అవి కోరాయి. అందుకు కోర్టు నిరాకరించింది.
ఉర్జా కేసు విషయానికి వస్తే, ఈ మూడేళ్లూ ఇరు పక్షాలు అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేస్తూ వచ్చాయి. ఇక లిఖిత వాదనలన్నీ పూర్తయ్యాయని నవంబర్ 2013 లో చెప్పేసింది.
ఇవన్నీ జరుగుతున్న క్రమంలో హై కోర్టు నవంబర్ 2011లో ఢిల్లీ ప్రభుత్వం అభిప్రాయం అడిగింది. అప్పుడు షీలా ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా? డిస్కం కంపెనీల పైన కాగ్ ఆడిట్ కోరే అధికారం తమకు లేదని చెప్పింది. అంటే ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కంపెనీలతో కుమ్మక్కయిందన్నమాట! ‘ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003’ చట్టం ప్రకారం చూసినా లేదా ‘టారిఫ్ పాలసీ 2000’ విధానం ప్రకారం చూసినా ప్రైవేటు కంపెనీలపై కాగ్ ఆడిట్ చేయించే తనకు లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయితే అవసరం అనుకుంటే అప్పుడప్పుడూ కాగ్ ఆడిట్ జరిపించవచ్చని అభిప్రాయం చెప్పింది. సాధారణ ప్రజానీకం మరియు వినియోగదారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత (conviction) రీత్యా ఇలా ‘అప్పుడపుడూ’ కాగ్ చేత ఆడిట్ చేయించొచ్చని చెప్పింది. అప్పుడప్పుడూ సాధ్యం అయ్యేపనైతే పూర్తిగా ఆడిట్ చేయించడం ఎందుకు సాధ్యం కాదు? అసలు సంగతి ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంటే ఎలాంటి కన్విక్షన్ లేదు. తమకు ‘అవసరం’ అనుకుంటే మాత్రం ఈ కన్విక్షన్ పని చేస్తుంది.
తనకు అధికారం లేదని చెప్పిన షీలా ప్రభుత్వం మార్చి 2012లో కాగ్ ఆడిట్ కి పురమాయించింది. అంబానీ కంపెనీ తన 49 శాతం వాటా స్ధిరంగా ఉంచుకోవడానికి వీలుగా మరింత ఈక్విటీ ధనం కంపెనీలో పెట్టింది. ఆ సమయంలో కాగ్ ఆడిట్ కి ఆదేశించారు. ఈ సంగతి మార్చి 22, 2012 న కోర్టుకు తెలిపారు.
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా’ (సి.ఎఫ్.ఐ) నుండి మూడు డిస్కంలు పెద్ద మొత్తంలో గ్రాంట్ లు, రుణాలు పొందుతున్నాయని అందువల్ల కాగ్ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ప్రైవేటు డిస్కంలు కూడా కాగ్ ఆడిట్ పరిధిలోకి వస్తాయని ఉర్జా తన పిటిషన్ లో పేర్కొంది. అయితే రాజ్యాంగం లోని ఆర్టికల్ 149 ప్రకారం ప్రైవేటు కంపెనీల పైన ఆడిట్ నిర్వహించే అధికారం కాగ్ కి లేదని డిస్కంలు వాదించాయి.
ప్రభుత్వం నుంచి తీసుకున్నది తిరిగి చెల్లించాల్సిన అవసరం కంపెనీలకు జూన్ 2014 వరకు ఉందని, అంతే కాక ఢిల్లీ ట్రాన్స్ కో నుండి సబ్సిడీ ధరలకు విద్యుత్ ను డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయని కాబట్టి ప్రభుత్వానికి కంపెనీలు జవాబుదారీ అని పిటిషనర్ వాదించారు. దీనికి డిస్కం లు కౌంటర్ గా ప్రారంభ అప్పు మొత్తం తిరిగి చెల్లించామని ప్రభుత్వానికి తాము బాకీ లేమని చెబుతూ సబ్సిడీ విద్యుత్ వల్ల తమకు అదనంగా చేకూరే లబ్ది లేదని తెలిపాయి. వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికే తమకు సబ్సిడీకి ఇస్తున్నారు తప్ప తమకు లాభం లేదని తెలిపాయి. అంటే ట్రాన్స్ కోల ద్వారా అందుతున్న సబ్సిడీని పూర్తిగా వినియోగదారులకు బదలాయిస్తున్నామని, ఇక లాభం ఎక్కడిదని డిస్కంల వాదన. ఇది వాస్తవానికి ఆడిట్ లో తేలాలి తప్ప వాదనలు అఫిడవిట్లతో కాదు. కానీ కంపెనీలు వద్దంటున్నదే ఆడిట్ ని ఇక తేలేదేలా?
అసలు డి.ఇ.ఆర్.సి (ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) కూడా రాష్ట్ర ప్రభుత్వం కాగ్ చేత ఆడిట్ చేయించాలని సిఫారసు చేసిందని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు. కాగ్ ఆడిట్ సిఫారసు చేసే అధికారం డి.ఇ.ఆర్.సి కి లేదు పొమ్మని డిస్కంలు వాదించాయి. (డి.ఇ.ఆర్.సి పని ఛార్జీలు పెంచడం, అదనపు సర్ ఛార్జీలు బాదడం వరకే అన్నట్లు!)
పిటిషనర్ చేసిన మరో వాదన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం డిస్కంలు ఇంకా ప్రభుత్వ కంపెనీలుగా ఉన్నాయి తప్ప ప్రైవేటు కంపెనీలుగా బదలాయింపు జరగలేదు అని. కాబట్టి అవింకా ప్రభుత్వ కంపెనీలే అని ఎత్తి చూపింది ఉర్జా. విచిత్రం ఏమిటంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారమే ఈ బదలాయింపు పూర్తయిందని డిస్కంలు వాదించాయి. అనగా ఒకే సమాచారాన్ని ఇరు పక్షాలు పరస్పర విరుద్ధంగా చూస్తున్నారు. ఆ రికార్డులు అంత సొంపుగా తగలడ్డాయన్నమాట!
ప్రైవేటు టెలికాం కంపెనీలపైన కాగ్ ఆడిట్ జరిపించిన సంగతి పిటిషనర్ ప్రస్తావించారు. ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం జొరబడింది. ట్రాయ్ సేవల చట్టం ప్రకారం కాగ్ ఆడిట్ జరిపించే అవకాశం ఉంది గానీ అలాంటి అవకాశం ప్రైవేటు డిస్కంల చట్టంలో లేదని ప్రభుత్వం వాదించింది. అంటే మళ్ళీ ప్రైవేట్ డిస్కంల కోసం ఢిల్లీ ప్రభుత్వం బ్యాటింగ్ చేసింది.
జనవరి 2012లో ఉర్జా మళ్ళీ తాజాగా కోర్టు ముందుకు వస్తూ కాగ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది.
ఈ వాద ప్రతివాదాలన్నీ ప్రస్తుతం కోర్టు ముందు ఉన్నాయి. లిఖిత వాదనలన్నీ పూర్తయినట్లు నవంబర్ 2013 లో హై కోర్టు చెప్పింది. కాబట్టి ఇక అఫిడవిట్ లు ఏవీ ఉండవు. పూర్తిస్ధాయి విచారణ, తీర్పు జరగాల్సి ఉంది.
ఈ వివరాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇండియా టుడే పత్రికలు అందించాయి. సంవత్సరం క్రితం ఇండియా టుడే ఇచ్చిన కొన్ని వివరాలు కింద చూడవచ్చు.
ఈ వ్యవహారంలో అంతిమంగా తేలేది ఏమిటి? ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు ఒక పక్షం అయితే సాధారణ ప్రజానీకం ఒక పక్షం. ప్రభుత్వాలు నిజానికి ప్రజల పక్షం వహించాల్సి ఉండగా అవి కంపెనీల పక్షమే వహిస్తాయి. చివరికి కోర్టు ముందు కూడా ప్రైవేటు కంపెనీల కోసమే ప్రభుత్వాలు నిస్సిగ్గుగా వాదిస్తాయి. 2జి కుంభకోణంలో గానీ బొగ్గు కుంభకోణంలో గానీ మరే కుంభకోణంలో గానీ జరిగిందీ, జరుగుతున్నదీ ఇదే. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న తంతు ఇదే.