ఎఎపి చేతిలో అవినీతి నాయకుల చిట్టా


kejriwal 2

అవినీతిపరులయిన రాజకీయ నాయకుల జాబితాను తయారు చేశామని ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహా నాయకులని భావిస్తున్నవారి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకుల పేర్లతో కూడిన ఈ చిట్టాలో స్ధానం సంపాదించినవారికి వ్యతిరేకంగా ఎఎపి తన అభ్యర్ధులను నిలుపుతుందని కేజ్రీవాల్ తెలిపారు.

తమ జాబితాలో రాహుల్ గాంధీ ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడని ఆయనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వంలోని వివిధ మంత్రులు సైతం ఎఎపి జాబితాలో చోటు సంపాదించినట్లు తెలుస్తోంది.

నరేంద్ర మోడి కూడా అవినీతిపరుడే అని అరవింద్ స్పష్టం చేశారు. బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన మోడి అత్యంత నీతిమంతమైన నాయకుడని బి.జె.పి చెప్పుకుంటోంది. అయితే రాజీవ్, నరేంద్ర మోడిలు తమ బ్రాండ్ ఇమేజి పెంచుకోవడం కోసం 500 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని కేజ్రీవాల్ వెల్లడించారు.

కాంట్రాక్టర్ల దగ్గర, కంపెనీల దగ్గర లంచం పుచ్చుకుంటేనే అవినీతి కాదని ప్రజా ధనాన్ని స్వప్రయోజనాల కోసం దుబారా చేయడం కూడా అవినీతే అని దీని ద్వారా ఎఎపి స్పష్టం చేసినట్లయింది. ఇందులో సందేహం ఎవరికీ ఉండాల్సిన పని లేదు. ప్రజా ధనాన్ని ప్రజల కోసం ఖర్చు చేయాలని ప్రజలు అధికారం కట్టబెట్టారు తప్ప సొంత ఇమేజి నిర్మించుకోడానికి, అభివృద్ధి పేరుతో వనరులను స్వదేశీ, విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి కాదన్నది స్పష్టమే.

రాజీవ్ గాంధీతో పాటు ఇతర కేంద్ర మంత్రులైన పి.చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, బి.ఎస్.పి అధినేత్రి మాయావతి, బి.జె.పి మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ లాంటి పలువురి పేర్లు ఎఎపి జాబితాలో ఉన్నాయి.

ఎఎపి జాతీయ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్ జాబితా విషయం వెల్లడించారు. “అవినీతిపరులైన, నిజాయితీ లేని రాజకీయ నాయకుల జాబితాను నేను తయారు చేశాను. ఈ జాబితాలో నిజాయితీ ఉన్నవారి పేర్లు ఉన్నాయని భావిస్తే వాళ్లెవరో చెప్పాలని కోరుతున్నాను. ఈ నాయకులను ఓడించాలా లేక పార్లమెంటుకు పంపించాలా అని నేను దేశాన్ని ఈ సందర్భంగా అడుగుతున్నాను” అని కేజ్రీవాల్ సభలో మాట్లాడుతూ అన్నారని ది హిందు తెలిపింది.

ది హిందూ సమాచారం ప్రకారం రాజీవ్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, పి.చిదంబరం, కపిల్ సిబాల్, జి.కె.వాసన్, సల్మాన్ ఖుర్షీద్, వీరప్ప మొయిలీ, ప్రకాష్ జైస్వాల్, కమల్ నాధ్, పవన్ బన్సాల్… వీరందరికి వ్యతిరేకంగా ఎఎపి అబ్యర్ధులను పోటీ నిలపబోతున్నట్లు అరవింద్ ప్రకటించారు. ఎం.పిలు నవీన్ జిందాల్, అవతార్ సింగ్ భాదన, అను టాండన్, సురేష్ కల్మాడీ, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ లపైన కూడా ఎఎపి పోటీ చేస్తుందని ప్రకటించారు.

జాబితా తయారు చేయడం తాను ప్రారంభించానని అదింకా పూర్తికాలేదనీ అరవింద్ చెప్పారు. సభ్యులు కూడా తమకు తెలిసిన అవినీతి నాయకుల పేర్లతో జాబితా తయారు చేసి తనకివ్వాలని, వారి విషయం పార్టీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్, బి.జె.పి పార్టీల ప్రధాన మంత్రి అభ్యర్ధులను అరవింద్ ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. “వాళ్ళు తమ ఇమేజి నిర్మించుకోవడానికి 500 కోట్లు ఖర్చు చేశారు… బ్రాండ్ మోడి, బ్రాండ్ రాహుల్ లాంటి బ్రాండ్ లు నిర్మించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. బ్రాండు తయారు చేసుకోవడానికి 500 కోట్లు ఖర్చు చేసే నాయకులు నిజాయితీ ప్రభుత్వాన్ని అందివ్వగలరా? అధికారంలోకి వచ్చాక వారు ఆ మొత్తాన్ని మన దగ్గర్నుండి పిండుకుంటారు” అని అరవింద్ సభికులకు చెప్పారని ఔట్ లుక్ పత్రిక తెలిపింది.

ఎఎపి పార్టీ లక్ష్యం అధికారం సంపాదించడం కాదని, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యమని కార్యకర్తలు గుర్తెరగాలని ఢిల్లీ సి.ఏం కోరారు. “మన మోటో అధికారం సంపాదించడం కాదు. అధికారం కోసం రాజకీయాలు చేయడం కాదు. అవినీతి నాయకులు గానీ, వంశపారంపర్య నాయకులు గానీ పార్లమెంటులో అడుగు పెట్టకుండా చూడడమే మన లక్ష్యం కావాలి” అని అరవింద్ అన్నారు.

ఔట్ లుక్ ప్రకారం ఎఎపి జాబితాలో కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా, డి.ఎం.కె ఎం.పిలు అళగిరి, మాజీ మంత్రి ఎ.రాజా, కనిమొళి, ఎన్.సి.పి మంత్రులు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ తదితర నాయకులు ఉన్నారు.

జాబితాలో ఉన్న ఇతర బి.జె.పి నేతలు: బి.జె.పి యువజన సంఘం నేత అనురాగ్ ఠాకూర్, బి.జె.పి జాతీయ కార్యదర్శి అనంత కుమార్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తదితరులు.

“ఈ పార్టీలను మనం 65 యేళ్ళ పాటు నమ్మాము. వాళ్ళు దేశానికి మంచి చేస్తారని నమ్మాము. కానీ వాళ్ళు మనల్ని మోసం చేశారు. 65 యేళ్ళ తర్వాత సామాన్యులు పార్లమెంటులో ప్రవేశించే అవకాశం, తన హక్కుల గురించి మాట్లాడే అవకాశం లభించింది” అని అరవింద్ ఊరించారు.

కాంగ్రెస్ లాంటి పార్టీలు 65 యేళ్లలో చేయలేని పనులు ఎఎపి నెల రోజుల్లో చేసి చూపిందని అరవింద్ గుర్తు చేశాడు. “గత ప్రభుత్వాలు 65 యేళ్లలో చేయలేనివి మనం నెల రోజుల్లో చేసి చూపాం. హై కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున విద్యుత్ పంపిణీ సంస్ధలను ఆడిట్ చేయలేమని బి.జె.పి, కాంగ్రెస్ లు చెప్పాయి. మనం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలపై ఆడిటింగ్ చేయాలని 5 రోజుల్లో ఆదేశాలిచ్చాము. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 28 సం.లు గడిచాయి. సిక్కు సోదరులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బి.జె.పి లు కూడా అదే డిమాండ్ చేశాయి. కానీ మనం మాత్రమే విచారణ కమిటీ వేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరాం. ఈ విషయంలో మనం సోమవారం నిర్ణయం తీసుకోబోతున్నాం” అని అరవింద్ చెప్పారు.

జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం తనకు లేదని అరవింద్ చెప్పడం విశేషం. ఢిల్లీ శాసన సభలో ఎఎపికి మెజారిటీ లేదని అందువల్ల జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందడం అనుమానమే అని చెప్పారు. ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీలో బిల్లు ఎలాగో గట్టెక్కినా దాన్ని కేంద్రం ఆమోదించాలని అది జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారాయన.

రాష్ట్రపతి గారిని భారత దేశ ప్రజలు ఇప్పుడొక ప్రశ్న వేయాలి? నెరవేర్చలేని వాగ్దానాలు ఇవ్వకూడదని బోధించిన రాష్ట్రపతి గారు ఆ వాగ్దానాలేమిటో చెప్పలేదు. హై కోర్టు లో కేసంటూ అబద్ధాలు చెప్పి ప్రైవేటు డిస్కమ్ కంపెనీలపై ఆడిట్ జరపకుండా మోసం చేసిన పార్టీలది అరాచకమా లేక అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే ఆడిట్ కి ఆదేశాలివ్వడం అరాచకమా అని రాష్ట్రపతిని జనం ప్రశ్నించాలి. ఒక పక్క సిక్కు అల్లర్లపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ వైపుగా ఒక్క అడుగూ వేయని పార్టీలది అరాచకమా లేక అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చర్యలు తీసుకోవడం అరాచకమా ఆయన చెప్పాలి.

పాపులిస్టు అనార్కి పేరుతో ప్రజోపయోగ చర్యలు తీసుకొనేవారిని ఆటంకపరచడం, పాలనలో ప్రజల పాత్రను నిరోధించేందుకు చూడడమే నిజమైన అరాచకం కాదా అన్నది ప్రజలు ఆలోచించాలి. ఒక పక్క ‘పార్టీసిపేటరీ డెమోక్రసీ’ అంటూ ఉదాత్తమైన పదబంధాలు తయారు చేసి వల్లిస్తూ మరోవైపు సదరు ఉదాత్తతను నామమాత్రంగానైనా ఆచరణలోకి తెస్తున్న వారిపై నిందలు వేయడం ఏ వర్గాల ప్రయోజనం కోసమో కూడా ప్రజలు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా గుడ్డి అభిమానంతో లేదా గుడ్డి ద్వేషంతో నాయకులను ఆకాశానికెత్తడం లేదా ద్వేషించడం అరాచక గుంపులు చేసే పనే తప్ప సామాన్యులు, దేశహితం కోరేవారూ చేసేది కాదని గ్రహించాలి.

One thought on “ఎఎపి చేతిలో అవినీతి నాయకుల చిట్టా

 1. కాంగ్రెస్ లాంటి పార్టీలు 65 యేళ్లలో చేయలేని పనులు ఎఎపి నెల రోజుల్లో చేసి చూపిందని ,
  ఇది సోత్కర్ష. మొదటిసారిగా ఉద్యోగం చేరినపుడు, కొత్తలలో తెగపని చేస్తారు, ఆ తరువాత అసలు స్వరుపం (పని ఎగవేయటం రాజకీయాలు చేయటం)చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీ 65సం|| ఎమీ చేయకపోతే ప్రజలు గెలిపిస్తారా?
  ఈ మధ్య విపరీతంగా స్కాంలు ఆపార్టి పాలనలో జరిగాయి గనుక ప్రజలు విసుగ్గెత్తిపోయారు.

  *మరోవైపు సదరు ఉదాత్తతను నామమాత్రంగానైనా ఆచరణలోకి …*
  రోజుకొక ఉద్యమం చేపడితే ప్రజలకు లాభం లేదు. ఆయనది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ప్రభుత్వం కనుక,ఎంత కాలం ఉంటామో తెలియదు కనుక ప్రజలను ఆకట్టుకొనే వేషాలు వేయవచ్చు. ఆయన పాలన ఎవరైనా గుర్తుంచుకోవాలనుకొంటే, చట్టాల సరిగ్గా అమలుజరగే విధంగా చర్యలు చేపట్టాలి. వాటి అమలుకు ఎక్కువ సంఖ్యలో కోర్టులను ఏర్పాటు చేయటమే గాక, నిర్ణిత కాలవ్యవధిలో తీర్పు వచ్చేటట్లు, అది అమలు జరిగేటట్లు అరవింద్ గారు చేయాలి. అప్పుడు ఆయన నిజాయితిని అందరు గుర్తిస్తారు. ఆ దిశలో చర్యలు చేపట్టినట్లు ఎక్కడా కనపడటంలేదు. అది కూడా ప్రశాంత్ భూషణ్ లాంటి పెద్ద లాయర్ ప్రముఖ పాత్ర వహించే పార్టి ప్రభుత్వంలో.
  (ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో చట్టాలు అమలు కాకుండా ఆలస్యం అయ్యేటట్లు కార్పోరేట్ కంపేనీలు కనపడని విధంగా పనిచేస్తూంటాయని, చాలారోజుల క్రితం మాజి ఐ.ఏ.యస్. ఆఫిసర్ రాస్తే చదివాను.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s