తెలంగాణ బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ


APAssembly

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ను తిరస్కరించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ గత బి.ఎ.సి సమావేశంలోనే చెప్పడంతో తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయం అయింది. అయితే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు సభా కార్యక్రమాలకు అడ్డు పడడంతో తీర్మానం ఎలా ప్రవేశపెడతారన్న ప్రశ్న ఉదయించింది.

ఈ సమస్యను అధిగమించడానికి స్పీకర్, సి.ఎం లు పెద్దగా శ్రమ పడలేదు. తీర్మానాన్ని మూజువాణి ఓటింగుకు పెట్టి ఆమోదం వచ్చినట్లు ప్రకటించారు. మూజువాణి ఓటింగ్ అంటే తీర్మానంలోని ఒకటి రెండు వాక్యాలు చదివి దీన్ని ఆమోదిస్తున్నారా అని స్పీకర్ ప్రశ్నిస్తారు. సభ్యులు ‘ఆయ్’ (Aye) అని ఆమోదిస్తున్నట్లు చెబుతారు. ఆ విధంగా ఒక తీర్మానం మూజువాణి ఆమోదం పొందుతుంది. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సి.ఎం ప్రవేశపెట్టిన తీర్మానం ఇలాగే ఆమోదించామని స్పీకర్ ప్రకటించారు. ఫలితంగా సి.ఎం పంతం నెగ్గింది.

మూజువాణి ఓటింగుతో ఆమోదం పొందడం అంటే సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లే అర్ధం అనీ, కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ తెలంగాణ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించిందని ఆర్ధిక మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ప్రకటించి, మరింత కాక పుట్టించారు. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కాంగ్రెస్ తెలంగాణ ఎం.ఎల్.ఎ లు సభ ముగిశాక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సి.ఎం ను ఎండగట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా తీర్మానాన్ని మూజువాణితో ఆమోదం పొందినట్లు చెబుతున్నారని చెప్పారు. రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన వ్యక్తి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా మాత్రమే వ్యవహరించారని ఆగ్రహం ప్రకటించారు.

శాసన మండలిలో కూడా ఇదే దృశ్యం చోటు చేసుకుంది. సభా నాయకుడు రామచంద్రయ్య ప్రవేశ పెట్టిన తిరస్కరణ తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో మండలి ఆమోదించిందని మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు. అనంతరం మండలి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

శాసన సభ నిరవధికంగా వాయిదాపడిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును ఆ పదవి నుండి తప్పించడం ద్వారా సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తనకు కావలసిన ఫలితాన్ని రాబట్టుకున్నట్లు కనిపిస్తోంది. శ్రీధర్ బాబు ను శాసన సభ వ్యవహారాల మంత్రిగా కొనసాగించకపోతే బహుశా కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులకు ఆటంకాలు ఎదురై ఉండేవి.

తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టాలని మరో 10 ప్రతిపాదనలు వచ్చాయని అయితే వాటి సారాంశం సి.ఎం ప్రతిపాదన లోని అంశాలే కావడంతో వాటిని తిరస్కరిస్తున్నానని స్పీకర్ సభకు తెలిపాడు. అనంతరం మూజువాణి ఓటుకు తిరస్కరణ తీర్మానం పెట్టారాయన. సి.ఎం అంటే వ్యక్తి కాదని, ఆయన ఒక వ్యవస్ధ అనీ కాబట్టి రూల్ నెంబర్ 77 కింద తీర్మానం ఇవ్వడానికి అవసరమైన 10 రోజుల కాల వ్యవధి ఆయనకు వర్తించదని మొన్న స్పీకర్ బి.ఎ.సి సమావేశంలో స్పష్టం చేశారు. దానితో తిరస్కరణ తీర్మానం సభకు వస్తుందని అర్ధమైపోయింది.

సి.ఎం తీర్మానాన్ని తాము ఊహించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పడం విశేషం. తిరస్కరణ తీర్మానం పార్లమెంటుకు లెక్కలోనిది కాదని, పార్లమెంటు యధావిధిగా తాను చేయదలుచుకున్నది చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు ఆమోదిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్ని రోజులుగా వివిధ నాటకాలకు తెర తీశారు. ఒక రోజు రాష్ట్రపతిని తప్పు పడతారు. ఒక రోజు మా అధిష్టానానిదే తప్పు అంటారు. మరో రోజు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం తెలియదు అంటారు. బిల్లు అంతా తప్పుల తడక అని పదే పదే వాపోతారు. నిన్నయితే ఏకంగా కేంద్రానికి సవాలు విసురుతున్నానని చెప్పారు. “మాకు పంపిన బిల్లే పార్లమెంటులో పెట్టండి చూద్దాం. అదే చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా” అని ఆయన సవాలు విసిరారు.

కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన సవాళ్ళ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. సీమాంధ్ర ప్రజలకు నష్టం అంటూ తెలంగాణ ఏర్పాటుపై ఆయన కార్చిన కన్నీళ్లు కూడా ఒట్టి వృధా ప్రయాస. తెలంగాణ ప్రజలకు కూడా ఇది నష్టమే అంటూ ఆయన చేసిన హితబోధ ఒట్టి మోసం. సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో జనానికి కాస్త వినోదం కలగొచ్చేమో గానీ ఒక పూచిక పుల్ల అటు కదలదు, ఒక నీటి చుక్క ఇటు రాదు.

నీటి పంపిణీ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో వినిపించిన వాదనలో అనేక అబద్ధాలను, కట్టు కధలను, పిట్ట కధలను ఆయన వినిపించారు. రాజ్యాంగ సూత్రాల పేరుతో పార్లమెంటు ప్రొసీజర్స్ పేరుతో ఆయన పడ్డ శ్రమ అంతా సీమాంధ్ర దోపిడీదారుల కోసం పడ్డదే. 66 యేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు వీసమెత్తు ప్రయోజనం లేనట్లే ఈ నాలుగు రోజులలో ఆయన వేసిన సర్కస్ ఫీట్ల వల్ల కూడా అటు తెలంగాణ జనానికి గానీ ఇటు సీమాంధ్ర జనానికి గానీ వీసమెత్తు ప్రయోజనం లేదు.

కానీ తెలంగాణకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు వ్యతిరేకంగా సీమాంధ్ర రాజకీయ నాయకులు మహా శబ్ద కాలుష్యాన్ని, రాజకీయ కాలుష్యాన్ని సృష్టించి ప్రజల ఛీత్కారాల్ని బాగానే అందుకున్నారు. వారి సవాళ్లను, కన్నీళ్లను, హెచ్చరికలను, ఆందోళనలను, నాటకాలను ప్రారంభంలో జనం ఆలకించారేమో గానీ అవన్నీ బూటకం అనీ, నాటకాలనీ వారు త్వరలోనే గ్రహించారు. ఆ తర్వాత జరిగిందంతా సీమాంధ్ర దోపిడీదారుల దింపుడు కళ్ళెం ఆశల కాకిగోల మాత్రమే. ఈ గోలను మొదలంటా తిరస్కరించే  రాజకీయ ప్రత్యామ్నాయం ఆంధ్ర ప్రదేశ్ జనానికి లేకపోవడమే వారి ప్రారబ్దం.

2 thoughts on “తెలంగాణ బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ

  1. నైతికంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడో….తన విలువను కోల్పోయారు.
    మూజువాణి ఓటుతో స్పీకర్ కూడా తాను నాదెండ్ల భాస్కర్ రావు గారి కొడుకునేనన్న సంగతి మరోసారి గుర్తు చేశారు. ఇక జరగబోయేదేమంటే….పార్లమెంట్ స్పీకర్ కూడా మూజువాణి ఓటుతోనే తెలంగాణ బిల్లు ఆమోదిస్తారట.
    నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా…అన్నారు కదా..!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s