ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?


Kashmir, a bleeding wound

Kashmir, a bleeding wound

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా?

సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా మారి దశాబ్దాలు గడిచిపోయింది. ఈ ఆర్టికల్ ఉద్దేశించిన లక్ష్యాలు వాటి నిజమైన అర్ధంలో అమలయి ఉన్నట్లయితే సమస్యే ఉండకపోను. అసలు సమస్యల్లా ఆర్టికల్ 370 నిజంగా అమలు కాకపోవడమే. కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను కత్తిరించి ఆర్టికల్ 370 ద్వారా తిరిగి ఇస్తున్నామని చెప్పిన భారత ప్రభుత్వం వాస్తవంలో దానిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. కాశ్మీర్ సమస్య ఇప్పటికీ రగులుతూ ఉండడానికి మూల కారణం అదే.

టెర్రరిజం అనేది గాలిలో నుంచి ఊడిపడదు. నిర్దిష్ట రాజకీయార్ధిక, సామాజిక లక్ష్యాలు లేకుండా టెర్రరిజం ఉనికిలో ఉంటుందనుకోవడం పొరపాటు. ఒకవేళ బైటివారు ప్రవేశపెట్టినపుడు కూడా టెర్రరిజం ఉంటే ఉండవచ్చు. కానీ అది ఉన్న చోటులో తగిన పునాది లేకుండా అది ఎంతోకాలం మనజాలదు. ఒకచోట టెర్రరిజం దీర్ఘకాలం పాటు కొనసాగిందంటే కారణం, అది అలా కొనసాగడానికి తగిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులు అక్కడ ఉన్నాయనే అర్ధం. ఇదొక విషయం అయితే పాలకులు న్యాయమైన ఉద్యమాలకు కూడా టెర్రరిజంగా చెప్పడం మరో విషయం. కాశ్మీర్ లో టెర్రరిజాన్ని ఆశ్రయించింది చాలా కొద్దిమందే. జె.కె.ఎల్.ఎఫ్ నాయకత్వంలో అక్కడ ఉధృతమైన ఉద్యమం నడిచింది. కానీ ప్రజా ఉద్యమాన్ని కూడా సైన్యాన్ని నియోగించి కర్కశంగా అణచివేయడంతో అక్కడి ప్రజలకు తమ సహజ ప్రజాస్వామిక జాతీయ ఆకాంక్షలు వెళ్ళబుచ్చడానికి తగిన వేదిక లేకుండా పోయింది. అందువలన టెర్రరిజం సజీవంగా ఉంది. పాకిస్తాన్ లో భారత వ్యతిరేక సెంటిమెంట్లు ప్రబలంగా ఉండడానికి కారణం కాశ్మీర్ లో సాగుతున్న అణచివేతే. ఈ భారత్ వ్యతిరేక సెంటిమెంట్లు చూపి ఇక్కడ పాక్ వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టడంలో హిందూత్వ శక్తులు, కాంగ్రెస్ శక్తులు సఫలం అవుతున్నాయి. ఇది చివరికి కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లు తయారయింది.

అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ కమిటీ రాజ్యాంగాన్ని రచించినప్పటికీ, ఆర్టికల్ 370 రూపకర్త మాత్రం ఒక తంజావూరు బ్రాహ్మణుడు అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందేమో గానీ అది నిజం. అప్పటి కాశ్మీరు రాజు మహారాజా హరిసింగ్ దివాణంలో దివాన్ గా పని చేసిన తంజావూరు బ్రాహ్మణుడు గోపాలస్వామి అయ్యంగార్ ఆర్టికల్ 370 రచయిత. అటు కాశ్మీర్ నేత షేక్ అబ్దుల్లా మరియు ఇతర కాశ్మీర్ నేతలతోనూ, ఇటు భారత ప్రధాని నెహ్రూ, హోమ్ మంత్రి పటేల్ తోనూ విస్తృతమైన చర్చలు, తగాదాలు, అలకలు, హెచ్చరికలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఆర్టికల్ 370 కి ఆయన ప్రాణ ప్రతిష్ట చేశారు. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ఎందుకన్న ప్రశ్నలు అప్పటి రాజ్యాంగ సభలోనే ఎదురయ్యాయి. దానికి అయ్యంగార్ సమాధానం ఇచ్చారు.

అనేక కారణాల రీత్యా భారత దేశంలో విలీనం కావడానికి కాశ్మీర్ లో పరిస్ధితులు పండలేదని అయ్యంగార్ చెప్పారు. జమ్ము & కాశ్మీర్ విషయంలోనే పాకిస్ధాన్ తో ఇండియా యుద్ధానికి దిగాక కాల్పుల విరమణ అమలులో ఉండడం, కాశ్మీర్ లో పరిస్ధితులు “ఇప్పటికీ అసాధారణంగా, విపరీతంగా కొనసాగుతుండడం”, రాష్ట్రంలోని ఒక భాగం “తిరుగుబాటుదారులు, శత్రువుల చేతుల్లో” ఉండడం, కాశ్మీర్ తగాదా ఐక్యరాజ్య సమితి దృష్టికి వెళ్ళిన ఫలితంగా సమస్యకు అంతర్జాతీయ కోణం వచ్చి చేరడం, కాశ్మీరు సమస్య సంతృప్తికరంగా పరిష్కారం అయితే తప్ప ఈ అంతర్జాతీయ కోణం తొలగని పరిస్ధితి ఉండడం… ఇవన్నీ ఆర్టికల్ 370 ని అత్యవసరం చేశాయని అయ్యంగార్ సమాధానం ఇచ్చారు.

కానీ అయ్యంగార్ ఇచ్చిన సమాధానంలో మనకు కనపడని విషయం కాశ్మీర్ ప్రజలు. ‘అసాధారణ, విపరీత పరిస్ధితులు’ అని అయ్యంగార్ చెప్పిన మాటల్లో కాశ్మీర్ ప్రజల సంగతి పరోక్షంగా ప్రస్తావించబడింది తప్ప ప్రత్యక్షంగా లేదు. ప్రజాస్వామ్యం అనేది నిజంగా ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత అయ్యే పనైతే కాశ్మీర్ ప్రజలు ఏమి కోరుతున్నారో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ కోణాన్ని ప్రధాని నెహ్రూ ‘ఫ్లెబిసైట్’ వాగ్దానం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆయన వాగ్దానాన్ని నమ్మిన షేక్ అబ్దుల్లా తదితర కాశ్మీర్ నాయకులు కాశ్మీర్ ను తాత్కాలికంగా భారత్ లో షరతులతో కూడిన విలీనం చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్ళప్పుడు పాకిస్తాన్ ను తమ ప్రజాస్వామిక జాతీయ ఆకాంక్షలకు ప్రమాదంగా చూశారు. ఇండియాను రక్షకునిలా చూశారు. పరిస్ధితులు స్ధిమిత పడ్డాక నెహ్రూ వాగ్దానం ఇచ్చినట్లు ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరపవచ్చని, ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఇండియాలో పూర్తిగా విలీనం కావడమా లేక స్వతంత్ర రాజ్యంగా అవతరించడమా తేల్చుకోవచ్చని వారు ఆశించారు.

ఈ నేపధ్యంలో కాశ్మీర్ ప్రజల ప్రతినిధిగా భావించిన షేక్ అబ్దుల్లా (ఈయనను కాశ్మీర్ సింహంగా కాశ్మీర్ ప్రజలు పిలుచుకుంటారు. ఆయన కొడుకు, మనవడు మాత్రం కనీసం పిల్లి కూడా కాలేకపోయారు) తోనూ, పటేల్, నెహ్రూ లతోనూ చర్చోపచర్చలు జరిపి ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఇది కాకుండా మహారాజా హరిసింగ్ తో భారత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆర్టికల్ 370 కి పునాది ఈ ఒప్పందమే. ఈ ఒప్పందం ప్రకారం జమ్ము & కాశ్మీర్ కేవలం పాక్షికంగానే విలీనం అవుతుంది. ఆచరణలో అది ప్రత్యేక దేశంగానే ఉంటుంది. భారత్ యూనియన్ చేతికి మూడు శాఖలు (విదేశీ, రక్షణ, సమాచార -వీటికి అనుబంధమైనవి) మాత్రమే అప్పగిస్తారు. కాశ్మీర్ కు ప్రధాని, రాష్ట్రపతి ఉంటారు. ఈ ఒప్పందం 1947 అక్టోబర్ లో కుదిరింది.

ఏప్రిల్ 1948లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారం జమ్ము & కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ (ఫ్లెబిసైట్) నిర్వహించాలి. ఇండియాలో కలవాడమా, పాకిస్ధాన్ లో కలవాడమా అన్నది ఈ ఫ్లెబిసైట్ ద్వారా తేల్చాలి. ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటామని భారత్, పాక్ ఇరు దేశాలు అంగీకరించాయి. అనంతరం దాన్ని బుట్టదాఖలు చేశాయి. ఐరాస తీర్మానం ప్రకారం, నెహ్రూ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరిన షేక్ అబ్దుల్లాను విడతలు విడతలుగా 17 సంవత్సరాలకు పైగా జైలులో నిర్బంధించారు. కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారం కోసం జైలు జీవితం అనుభవించిన షేక్ అబ్దుల్లా సహజంగానే కాశ్మీరీలకు ఆరాధ్యనీయుడు అయ్యాడు. ఆయన్ని కాశ్మీర్ సింహంగా పిలుచుకున్నారు.

కాశ్మీరు స్వతంత్ర సంస్ధానం. ఇది ఏనాడూ ఇండియాలో భాగంగా లేదు. బ్రిటిష్ వాడి ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం ప్రకారం స్వతంత్ర సంస్ధానాలకు ఇరు దేశాల్లో ఏదో ఒక దేశంలో కలవడమా లేక స్వతంత్రంగా ఉండడమా తేల్చుకునే హక్కును ఆయా స్వతంత్ర సంస్ధానాలకు కల్పించబడింది. మాహారాజ హరిసింగ్ హిందువు కనక కాశ్మీర్ ని ఇండియాలో కలిపేస్తాడన్న అనుమానంతో పాక్ గిరిజన తెగలను రెచ్చగొట్టి భారత్ కు వ్యతిరేకంగా పంపింది. వీరి నుండి రక్షణ కోసం హరిసింగ్ ఇండియాను అభ్యర్ధించాడు. ఇదే అవకాశంగా ఎంచిన భారత ప్రధాని హరిసింగ్ తో పాక్షిక విలీన ఒప్పందం చేసుకున్నాడు. ఫ్లెబిసైట్ ద్వారా పూర్తిగా కలిసే సంగతి తేల్చుకుందాం అని వాగ్దానం ఇచ్చాడు. ఐరాసకు కూడా అదే హామీ ఇచ్చాడు. తీరా అమలులోకి వచ్చేసరికి కాశ్మీర్ ప్రజలు నిలువునా మోసగించబడ్డారు.

500కు పైగా స్వతంత్ర సంస్ధానాలను రక్తపు చుక్క కారకుండా ఇండియాలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దే అని చెబుతూ ఆ కారణంతో ఆయనకు ఉక్కు మనిషి అన్న బిరుదు కూడా తగిలించారు. కానీ 500 పైగా చిన్నా, పెద్దా స్వతంత్ర సంస్ధానాలను ఇండియాలో కలిపిన ఘనత నిజానికి పటేల్ ది కాదు. ఆ ఘనత పూర్తిగా అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ దే. పటేల్ వాస్తవానికి స్వతంత్ర సంస్ధానాలను వదిలేసి మిగిలిన ప్రాంతానికి స్వతంత్రం ఇవ్వాలని కోరారు. ఇండియా, పాక్ లకు స్వతంత్రం ప్రకటిస్తే ఆ తర్వాత స్వతంత్ర సంస్ధానాలను కలుపుకునే బాధ్యత తాము తీసుకుంటాం అన్నట్లుగా చెప్పారు. స్వతంత్ర సంస్ధానాల్లో ప్రజలు తిరిగబడతారని, ఇండియాలో కలపాలని పోరాడతారని తద్వారా అవి ఇండియాలో కలుస్తాయని చెప్పారు.

కానీ స్వతంత్ర సంస్ధానాలు అందుకు ఒప్పుకోవని లార్డ్ మౌంట్ బాటన్ హెచ్చరించాడు. బ్రిటిష్ బలగాల సాయం లేకుండా స్వతంత్ర సంస్ధానాలు ఇండియాలో కలవడం సాధ్యం కాదని, వారి బలగాలు కూడా పోరాడతాయనీ భారీ ప్రాణ నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ ఆ పని తామే చేస్తామని బ్రిటిష్ బలగాలను చూసి వారు అంగీకరిస్తారని తెలిపాడు. దానికి పటేల్ అంగీకరించి ‘అయితే యాపిల్స్ అన్నీ మా బుట్టలోకే వస్తాయా’ అడిగారు. ‘ఏమో కొన్ని చెడ్డ యాపిల్స్ కూడా ఉండొచ్చు. కానీ ప్రయత్నిస్తాను’ అని మౌంట్ బాటన్ సమాధానం ఇచ్చాడు. ఆ విధంగా స్వతంత్ర సంస్ధానాలను విలీనం చేసిన ఘనత లార్డ్ మౌంట్ బాటన్ కే దక్కుతుంది  (Frontline). రెండు మాత్రమే పేచీ పెట్టాయి. అవే హైద్రాబాద్, కాశ్మీర్. హైద్రాబాద్ ని విలీనం చేసుకునే పేరుతో సైన్యాన్ని దించిన పటేల్, నెహ్రూలు వాస్తవంగా చేసింది అప్పటి తెలంగాణలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటాన్ని నెత్తురుటేరుల్లో ముంచడం. అది వేరే కధ.

కాశ్మీరు విషయంలో మాత్రం చొరవ మనవాళ్లు తీసుకోలేదు. అది పాకిస్ధాన్ ప్రవేశపెట్టిన గిరిజన తెగల వల్ల ఆయాచితంగా మనకు కలిసి వచ్చిన అవకాశం మాత్రమే. ఒంటె, గుడారం సామెతలాగా మూడు శాఖలు అడిగిన భారత ప్రభుత్వం క్రమంగా గుడారం మొత్తం ఆక్రమించేసింది. ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా సైన్యంతో రాష్ట్రాన్ని నింపేసారు. Instrument of Accession లో ఒక అంశం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో ఆర్టికల్ 370 ని మృత శరీరంగా మార్చివేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1952 ఢిల్లీ అగ్రిమెంట్ ల ద్వారా ఆర్టికల్ 370 లోని సారాన్ని పీల్చి పిప్పిగా మిగిల్చారు. అనంతరం కూడా వివిధ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసి ఆర్టికల్ ను మరింతగా బలహీనం చేస్తూ పోయారు. కాశ్మీర్ లోయను సైనిక బ్యారక్ గా మార్చివేశారు. కాశ్మీర్ ఇప్పుడు భారత రాజకీయ నాయకులకే కాకుండా సైనిక నేతలకు కూడా ఒక గని. కాశ్మీర్ ద్వారా వీరు ఎంతగా లబ్ది పొందితున్నారంటే అక్కడి నుండి సైన్యాన్ని ఉపసంహరించే ప్రతి చర్యకూ వారు అడ్డం పడుతున్నారు. AFSPA చట్టాన్ని ఉపసంహరించాలంటే, కనీసం నేరాలకు పాల్పడుతున్న సైన్యాధికారులను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలన్న నిబంధనను తొలగించాలని కోరినా సైన్యం ఒప్పుకోవడం లేదు. ఆర్ధికమంత్రి చిదంబరం స్వయంగా ఈ సంగతి పార్లమెంటులో ఇటీవల (ఢిల్లీ అత్యాచారం సందర్భంగా జస్టిస్ వర్మ సిఫారసులను తిరస్కరిస్తూ) ఈ సంగతి చెప్పారు.

వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 ఒక్కటే కాదు. ఆర్టికల్ 371 (నాగాలాండ్), 371 (A) నుండి (I) వరకూ ఇలా వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రత్యేక హోదాలు కల్పించినవే. ఇందులో ఆర్టికల్ 371 (D) ఆంధ్ర ప్రదేశ్ కోసం రూపొందించడం తెలిసిన విషయమే.

తరాల తరబడి స్వతంత్రంగా బ్రతికిన జాతి ఒక్క సారిగా స్వతంత్రం కోల్పోయి స్వంత గడ్డపైనే కాందిశీకులుగా బతకాల్సిన దుర్భర పరిస్ధితిలో ఉంది. 1947 లో ఇండియా స్వతంత్రం సాధిస్తే అదే చారిత్రక ఘటన తమ పాలిట స్వతంత్ర హరణగా మారిందని కాశ్మీర్ ప్రజలు వాపోతున్నారు.

కాశ్మీర్ ని భారత దేశంలో భాగంగా చేసుకోవాలంటే మొదట అక్కడి ప్రజల్ని గెలవాలి. వారి మనసుల్ని, హృదయాల్ని గెలుచుకోవాలి. నెహ్రూ చెప్పినట్లు కాశ్మీర్ ని ఒక సుందర ప్రకృతి లలామగా కాకుండా చీము-నెత్తురు-మాంసం ఉన్న మనుషులుగా చూస్తేనే ఇది సాధ్యం. చరిత్రను పరికిస్తే మనకు తెలిసేది అణచివేతకు గురవుతున్న జాతులు ఎంతోకాలం అణిగిమణిగి ఉండలేవు. అణచివేతకు గురవుతున్న జాతి తిరుగుబాటుకు ప్రయత్నించడం ఒక సహజ, ప్రాకృతిక, జాతీయ లక్షణం. ఆ లక్షణంతోనే భారత ప్రజలు బ్రిటిష్ వాడిపై తిరిగబడ్డారు. అదే లక్షణంతో కాశ్మీర్ ప్రజలు తమ అసంతృప్తిని వివిధ రూపాల్లో వెళ్లగక్కుతున్నారు.

కాశ్మీరీ ఒక ఆరని మంట. నెత్తురు ఓడుతున్న గాయం. ఈ మంట ఆరాలంటే, ఈ గాయం మానాలంటే కాశ్మీరీలను మనుషులుగా గుర్తిస్తూ మనమూ (భారత్) మనుషులుగా ఆలోచించి తదనుగుణంగా నిర్ణయాలు చేయాలి.

ఇప్పుడు కావలసింది ఆర్టికల్ 370 ని రద్దు చేయడం కాదు. రద్దు ఒక్కటే చేయలేదు గానీ అది ఒక మృత శరీరం. లేదా జీవచ్ఛవం. దానిని తన అసలు రూపంలో అసలు ఉద్దేశ్యాలు, లక్షాలను వాస్తవంగా అమలు చేయడమే కావాలి. ఆర్టికల్ 370 ని ఖచ్చితంగా అమలు చేసినట్లయితే కాశ్మీర్ లో సైన్యాన్ని పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అనేకమంది యువకులు మాయమై పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువయిన పరిస్ధితి దాపురించేది కాదు. కాశ్మీర్ ఈ రోజు ఉన్నట్లు దీనంగా, తన బిడ్డలను పోగుట్టుకుంటూ కంటికి మింటికి ధారగా విలపిస్తున్న వాస్తవ పరిస్ధితిని చూడలేనివారు ఇక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకుంటేనే మేలు.

2 thoughts on “ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

  1. ఎంత స్పష్టంగా చెప్పారు వాస్తవాన్ని. కాశ్మీర్ భౌగోళిక ఉనికి సమస్యను మరింత జటిలంగా చూపగలిగే అవకాశం ఇచ్చింది. ఈ రావణకాష్టం ప్రపంచం మారితే గాని చల్లారదు.

  2. మంచి సమాచారం. ఇలాంటి పోస్టులను బ్లాగులోకంలో కేవలం ఒకరిద్దరినుండిమాత్రమే ఆశించగలం.

    మనలో చాలామంది కాశ్మీర్‌ను భారత ప్రజలపక్షం నుండిమాత్రమే చూసి ఇలా 370వద్దు, అటానమీవద్దు అని చెబుతుంటారేకానీ. కాశ్మీరీల నుండి ఆలోచించం. తనదాకావస్తేగానీ తెలియదన్నట్లు సమస్యమనదైతే తప్పించి దాన్ని బాధితులకోణంలోంచీ అలోచించే లక్షణం కొరవడింది. కాశ్మీరుని మనం కేవలం ఒక వ్యూహాత్మక భూభాగంగానో, భావపరంగా భరతమాత కిరీతంగానో చూసి వాళ్ళు మనతో ఉండాలని బలవంతపెడుతున్నామేతప్ప వాళ్ళను మనం ఆదుకున్నది లేదు. వాళ్ళ కష్టాలను పట్టించుకున్నదిలేదు. అలాంటి అనుభవాలు మనకు ఎదురైనందుకే మనం తెల్లవాళ్ళతో స్వతంత్రంకోసం పోరాడాం. వారివీ అవే అనుభవాలు అయినా కాశ్మీరీలు భారత్‌ని ప్రేమించాలి. ఎంత విచిత్రం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s