ఉక్రెయిన్: రష్యాపై ఇ.యు కక్ష సాధింపు


Pro-EU protests in Ukain 17

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేసుకోవడంతో ఇ.యు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ద్వైవార్షిక ఇ.యు-రష్యా సమావేశాలను ముక్తసరిగా ముగించడం ద్వారా తన ఆగ్రహాన్ని చాటుకుంది. రష్యా ఒత్తిడితోనే ఇ.యు లో చేరడం ఉక్రెయిన్ వాయిదా వేసుకుందని ఇ.యు ఆరోపణ. అమెరికా, ఇ.యు దేశాల పత్రికలు సైతం ఈ ఆగ్రహాన్ని దాచుకోవడం లేదు. ఉక్రెయిన్ సహజవనరులను, మార్కెట్ ను చేజిక్కించుకునే అవకాశం జారిపోయిందన్న అక్కసునంతా రష్యాపై వెళ్లగక్కుతున్నాయి.

ఇ.యు, రష్యాల శిఖరాగ్ర సమావేశాలు రెండేళ్లకొకసారి జరుగుతాయి. యూరోపియన్ యూనియన్ కేంద్రం, బెల్జియం రాజధాని అయిన బ్రసేల్స్ లో జనవరి 28, 29 తేదీల్లో సమావేశాలు జరగవలసి ఉండగా దీనిని కేవలం 3 గంటల సమావేశానికి ఇ.యు కుదించింది. సమావేశాల ఎజెండాను ఏకపక్షంగా కత్తిరించేసింది. రష్యా అధ్యక్షుడితో సాంప్రదాయకంగా నిర్వహించే విందు సమావేశాన్ని సైతం రద్దు చేసుకుంది. ఉక్రెయిన్, ఆర్మీనియాలతో వాణిజ్య ఒప్పందం కుదరకుండా రష్యాయే అడ్డుకుందని ఈ సందర్భంగా ఒక ఇ.యు అధికారి ఆరోపించారని ది హిందు తెలిపింది. ఉక్రెయిన్ చర్యల నేపధ్యంలో రష్యాతో ఇక ముందు సంబంధాలు యధావిధిగా ఉండబోవని సదరు అధికారి ఆక్రోశం వెళ్ళగక్కాడు.

Yanukovych

Ukraine president Yanukovych

ఉక్రెయిన్ చేరిక వలన ఇ.యు కు మాత్రం పలు విధాలుగా లాభకరం. ఇ.యు రాజకీయ విస్తరణ, ఉక్రెయిన్ మార్కెట్ ఆక్రమణ, ఉక్రెయిన్ సహజవనరులపై ఆధిపత్యం ఇందులో ప్రధానమైనవి. ‘సొమ్మూ పోయే, శనీ పట్టే’ అన్నట్టుగా మారే పరిస్ధితిని ఉక్రెయిన్ ఆమోదించాలని ఇ.యు, అమెరికాలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ ఆలోచించుకున్న ఉక్రెయిన్ ప్రధాని యనుకోవిచ్ సహజంగానే ఇ.యు లో చేరే ఆలోచనను వాయిదా వేశాడు. ఈ కోపాన్నంతా ఉక్రెయిన్ లో ఆందోళనలు రెచ్చగొట్టడం ద్వారా చూపుతున్న అమెరికా, ఇ.యులు రష్యా మీదికి కూడా తమ ఆగ్రహాన్ని మళ్లించాయి.

ఫలితంగా రెండు రోజుల ఇ.యు-రష్యా శిఖరాగ్ర సమావేశం కాస్తా 3 గంటల సమావేశంగా మారింది. సమావేశంలో రష్యా నుండి అధ్యక్షుడు పుతిన్, విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ లు పాల్గొనగా ఇ.యు నుండి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రొంపి, యూరోపియన్ కమిషన్ అధిపతి జోస్ మాన్యువల్ బరోసో, ఇ.యు విదేశీ వ్యవహారాల అధిపతి కేధరీన్ యాష్టన్ హాజరయ్యారు. విస్తృత మంత్రివర్గ స్ధాయి సమావేశం జరగాల్సి ఉండగా దానిని రద్దు చేసేశారు.

“ఇరువురి సంబంధాలకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయనీ, పరిష్కరించుకోవాల్సిన మౌలిక సమస్యలు ఉన్నాయని చెబుతూ వాళ్ళు సమావేశాల కాలం తగ్గించారు” అని పుతిన్ విదేశీ విధాన సలహాదారు యూరీ ఉషకోవ్ చెప్పాడని పత్రికలు తెలిపాయి.

ఉక్రెయిన్ లో సంక్షోభానికి ‘మీరే కారణం’ అని ఇ.యు, రష్యాలు పరస్పరం నిందించుకున్నారు. ఇ.యుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వాయిదా వేసుకోవడంతోనే ఆందోళనలు ప్రారంభం అయ్యాయి కనుక వాటికి రష్యా కారణం అయ్యే అవకాశం లేదు. పైగా ఆందోళనలను ఉద్దేశించి ప్రసంగించింది అమెరికా, ఇ.యు దేశాల నాయకులే తప్ప రష్యా నాయకులు కాదు. నిజానికి ఒక దేశంలో ఆందోళనలు జరుగుతుంటే పొరుగు దేశాల నేతలు వచ్చి సదరు ఆందోళనలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయడం మామూలుగా అయితే ఊహించలేని విషయం. అది ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో పచ్చిగా జోక్యం చేసుకోవడం తప్ప మరొకటి కాదు.

అమెరికాలో ‘వాల్ స్ట్రీట్ ని ఆక్రమిద్దాం’ ఉద్యమం జరుగుతున్నపుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూయార్క్ సందర్శించి సదరు ఆందోళనలకు ప్రోత్సహిస్తూ ఉపన్యసిస్తే ఎలా ఉండేది? గ్రీస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, సైప్రస్ ఇటలీ దేశాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న పొదుపు విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్రాన్స్ లో గత ఆదివారమే భారీ ప్రదర్శనలు జరిగాయి. గ్రీస్, ఇటలీ, స్పెయిన్, సైప్రస్ లలో తీవ్రస్ధాయి ఆందోళనలు జరిగాయి. బ్రిటన్ లో తోట్టెన్ హామ్ అల్లర్ల సంగతి చెప్పనే అవసరం లేదు. ఈ అన్నిచోట్లా రష్యా అధ్యక్షుడు గానీ ప్రధాని గానీ లేదా ఇతర మంత్రులు, పార్లమెంటు సభ్యులు గానీ వెళ్ళి ప్రోత్సాహపూర్వక ప్రసంగాలు చేసి ఉంటే ఎలా ఉండేది? సైప్రస్ అయితే రష్యాని సహాయం చేయాలని అర్ధించింది కూడాను.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే ప్రశ్న వేశారు. “మా విదేశీ మంత్రి గ్రీసు లోనూ, సైప్రస్ లోనూ జరిగిన ఇ.యు-వ్యతిరేక ఆందోళనలను ఉద్దేశించి ప్రసంగించి ఉంటే మా యూరోపియన్ భాగస్వాములు ఎలా స్పందించి ఉండేవారో నేను ఊహించగలను” అని పుతిన్ ఇ.యు దేశాల జోక్యందారీ విధానాలను విమర్శించాడు. అమెరికా, ఇ.యు దేశాల చట్ట సభల సభ్యులు స్వయంగా కీవ్ (ఉక్రెయిన్ రాజధాని) సందర్శించి ఆందోళనకారులను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించి, చిప్స్ పోట్లాలు పంచి మరీ వెళ్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఫలానా చోటి నుండి పోలీసుల్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాల్లాంటివి ఇస్తాడు.  

“ఇలా చేయడం సరైందని మేము అనుకోవడం లేదు. అది మాకు పూర్తిగా అనామోదనీయం. రష్యా-ఉక్రెయిన్ ల సంబంధాలను బట్టి చూస్తే అలా చేయడం మాకసలు సాధ్యం కానేకాదు” అని పుతిన్ పశ్చిమ దేశాల చర్యలను ఎత్తిపొడిచాడు. విచిత్రం ఏమిటంటే ఆందోళనకారులను రెచ్చగొట్టడానికి తమకు హక్కు ఉందని భావిస్తున్న పశ్చిమ నాయకులు, పత్రికలు ఉక్రెయిన్ అధ్యక్షుడికి రష్యా మద్దతు ఇవ్వడంపై తీవ్రంగా విరుచుకుపడడం. అమెరికా, ఐరోపా దేశాలు ఒక దేశంలో ఆందోళన రెచ్చగొట్టగానే ఇక ఆ దేశాల అధ్యక్షులు, ప్రభుత్వాలు అందరూ రాజీనామాలు చేసేసి వెళ్ళిపోవాలన్నమాట!

ఆందోళనలు తీవ్రం కావడంతో అధ్యక్షుడు యనుకోవిచ్ అధికారాలను ప్రతిపక్ష నేతలతో పంచుకోవడానికి ముందుకు వచ్చాడు. తమ ప్రధాని అజారోవ్ చేత రాజీనామా చేయించి ఆ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వజూపాడు. ఆందోళనకారుల డిమాండ్ మేరకు కొన్ని చట్టాలను రద్దు చేశాడు. అయితే అధ్యక్షుడు దిగేకోందీ ప్రతిపక్షాలు ఎంకా పైకి పైపైకి ఎక్కుతున్నాయి. అసలు అధ్యక్షుడే రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. నయా నాజీ సంస్ధలయిన యు.పి.ఏ, స్కోబోవా తదితర సంస్ధలు హింసాత్మక చర్యలను తీవ్రం చేశాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s