ద్రవ్య సమీక్ష: వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ


RBI policy review

ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మార్కెట్ పరిశీలకులను ఆశ్చర్యపరిచారు. పరిశ్రమ వర్గాలను నిరాశపరిచారు. తాను మాత్రం ‘వినాశకర ద్రవ్యోల్బణం’ పగ్గాలు బిగించే పనిలో ఉన్నానని చెప్పారు. ద్రవ్య సమీక్షలో భాగంగా ఆయన స్వల్పకాలిక వడ్డీ రేటు ‘రెపో రేటు’ ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతం నుండి 8 శాతానికి చేర్చారు.

2013-14 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువే ఉంటుందని చెప్పి ఆర్.బి.ఐ గవర్నర్ మరో బాంబు వేశారు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ లు కూడా గతంలో ఇదే అంచనా వేశాయి. అప్పుడు భారత ఆర్ధిక మంత్రి, ప్రధాన మంత్రులు తమ దేశ వృద్ధి రేటు అంచనాను తగ్గించినందుకు మహా యాష్టపోయారు. వృద్ధి రేటు అంచనా వేసేందుకు ప్రపంచ బ్యాంకు అనుసరిస్తున్న విధానాలను సవరించుకోవాలని కూడా కోరారు. తీరా చూస్తే ఇప్పుడు మన ఆర్.బి.ఐ గవర్నర్ కూడా సరిగ్గా అదే అంచనా వేస్తున్నారు.

“పాలసీ రేటు (రెపో రేటు) ను 25 బేసిస్ పాయింట్లు పెంచడం చాలా అవసరం. ప్రతిపాదిత ద్రవ్యోల్బణ వ్యతిరేక గమనంలో ఆర్ధిక వ్యవస్ధ భద్రంగా ప్రయాణించాలంటే ఈ పెంపుదల తప్పదు” అని విత్త విధాన (మానిటరీ పాలసీ) సమీక్షను విడుదల చేస్తూ అన్నారని ది హిందు తెలిపింది. మూడవ త్రైమాసిక ద్రవ్య సమీక్షలో భాగంగా ఆర్.బి.ఐ తాజా చర్యలు తీసుకుంది.

రెపో రేటు 8 శాతానికి పెంచినందున రివర్స్ రెపో రేటు కూడా 6.75 శాతం నుండి 7 శాతానికి పెరుగుతుంది. రెపో, రివర్స్ రెపో రేట్ల మధ్య 1 శాతం తేడా ఉండాలన్నది ఆర్.బి.ఐ ప్రకటిత విధానం. అలాగే ఎం.ఎస్.ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) రేటు కూడా 9 శాతానికి పెరుగుతుంది. రెపో రేటు కంటే ఎం.ఎస్.ఎఫ్ రేటు 2 శాతం అధికంగా ఉండాలన్నది ఆర్.బి.ఐ విధానం.

ఆర్.బి.ఐ మూడవ త్రైమాసిక ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లు యధాతధంగా కొనసాగిస్తుందని, పెంచడం గానీ తగ్గించడం గానీ చేయదనీ మార్కెట్ పరిశీలకులు, పరిశ్రమ వర్గాలు అంచనా వేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ రెపో రేటు పెంపుదలకు ఆర్.బి.ఐ మొగ్గు చూపింది. ద్రవ్యోల్బణం వినాశకర స్ధాయిలో ఉన్నదని అందుకే వడ్డీ రేటు పెంచాల్సి వచ్చిందని రఘురాం రాజన్ చెప్పారు.

అయితే ఆర్.బి.ఐ సి.ఆర్.ఆర్ ను ముట్టుకోలేదు. మార్కెట్ లో ద్రవ్య లభ్యత సౌకర్యవంతమైన స్ధాయిలో ఉన్నందున సి.ఆర్.ఆర్ ను యధాతధంగా 4 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

జి.డి.పి

జి.డి.పి వృద్ధి రేటు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 5 శాతం కంటే తగ్గుతుందని అంచనా వేసిన ఆర్.బి.ఐ వచ్చే ఆర్ధిక సంవత్సరం 2014-15లో మాత్రం 5.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. అప్పటికి అంతర్జాతీయ పరిస్ధితులు సైతం మెరుగుపడతాయని, తద్వారా భారత ఎగుమతులు పెరగడానికి అవకాశం వస్తుందని అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ అనుకున్నంతగా పుంజుకోలేదని అందుకే జి.డి.పి 5 శాతం కంటే తక్కువగా నమోదవుతుందని ఆర్.బి.ఐ తెలిపింది. “2013-14 ద్వితీయార్ధంలో వాస్తవ జి.డి.పి వృద్ధి పుంజుకుంటుందన్న ఆశలపై రెండు నెలలు వరుసగా క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి నీళ్ళు జల్లింది” అని ద్రవ్య సమీక్ష పేర్కొంది.

“అందువలన కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువే జి.డి.పి వృద్ధి నమోదవుతుంది” అని సమీక్ష తెలిపింది. 2013-14 మొదటి అర్ధ భాగంలో జి.డి.పి 4.6 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేయడం గమనార్హం. 2014-15లో జి.డి.పి క్రమంగా వృద్ధి చెందుతుందని 5-6 శాతం మధ్యలో నమోదు కావచ్చని తెలిపింది. కేంద్రం కూడా వచ్చే సం.కి 5.5 శాతం జి.డి.పి వృద్ధిని అంచనా వేసింది.

జి.డి.పి 5-6 శాతం పరిధిలోని పై స్ధాయికి చేరాలంటే మూడు షరతులను ఆర్.బి.ఐ పేర్కొంది. అవి:

  • కేబినెట్ కమిటీ 4 లక్షల కోట్ల పెట్టుబడుల మేర 130 ప్రాజెక్టులను ఆమోదించింది. ఇవి వాస్తవ పెట్టుబడులుగా మారాలి.
  • ప్రపంచ జి.డి.పి వృద్ధి మెరుగుపడాలి.
  • ద్రవ్యోల్బణం నెమ్మదించాలి.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం ‘వినాశకర రోగం’గా పరిణమించిందని ఆర్.బి.ఐ గవర్నర్ రెండు రోజుల క్రితం అభివర్ణించారు. దీనివలన దేశ జి.డి.పి వృద్ధి దెబ్బతింటోందని కావున ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.

“ద్రవ్యోల్బణం ఒక వినాశకర రోగం. పారిశ్రామికవేత్తలు వడ్డీ రేటు అధికంగా ఉందని ఫిర్యాదు చేస్తారు. ద్రవ్యోల్బణం 8 శాతం పైగా అధిక స్ధాయిలో ఉన్నపుడు ప్రజలు తమ పొదుపు కాపాడుకోవడానికి కనీసం 10 శాతం పొదుపు ఆశిస్తారు. తద్వారా అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి పొదుపు చేయాలని భావిస్తారు. కానీ పారిశ్రామికవేత్తలు 5% వడ్డీ రేటు ఉంటే అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తారు. ఈ రెండింటిని సంతృప్తిపరచడం సాధ్యం కాదు. ద్రవ్యోల్బణమే ఈ వైరుధ్యానికి కారణం” అని రఘురాం రాజన్ స్పష్టం చేశారు.

పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు ఎంత విరుద్ధంగా ఉంటాయో ఆర్.బి.ఐ గవర్నర్ వివరణ చక్కగా తెలియజేస్తోంది. ఆయన చెప్పని మరో విషయం ఏమిటంటే ద్రవ్యోల్బణం లేదా అధిక ధరల వలన లబ్ది పొందేదీ పారిశ్రామికవేత్తలు, దళారులే. వీరికి అధిక ధరల రూపంలో లాభాలు కావాలి. తక్కువ వడ్డీ రేట్ల రూపంలో బ్యాంకుల్లోని డబ్బులు కూడా కావాలి. రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు లాంటి సాధారణ జనం మాత్రం అధిక ధరల కింద నలుగుతూ అప్పులు పుట్టని బ్యాంకుల చుట్టూ గిరికీలు కొట్టాలి.

గత కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం అధిక స్ధాయిలో కొనసాగడానికి ప్రధాన కారణం అధిక ఆహార ధరలే అని రా (రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) నిర్వహించిన ఒక సెమినార్ లో మాట్లాడుతూ రఘురాం రాజన్ స్పష్టం చేశారు.

2 thoughts on “ద్రవ్య సమీక్ష: వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s