భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ –పార్ట్ 6
(భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది ఆరవ భాగం. మొదటి 5 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్)
చాప్టర్ III
మీజీ పునరుద్ధరణ మరియు జపాన్ పెట్టుబడిదారీ మార్గం
1850ల వరకూ జపాన్ రాజకీయంగా మూసివేయబడ్డ సమాజం. యూరప్ లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న కేంద్రాలకు భౌగోళికంగా కూడా దూరంగా ఉన్న ప్రాంతం.
1868కి ముందు జపాన్ షోగన్ (‘సీ తైషోగన్’ అనే పదానికి పొట్టిరూపం. దీని అర్ధం ‘సైనికాధికారి’ అని. 12 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు జపాన్ లో ఉనికిలో ఉన్న వంశపారంపర్య పాలకులు. మీజీ చక్రవర్తులు వీరిని నియమించినా ఆ నియామకం నామమాత్రమే –అను) ల పాలనలో ఉన్నది. చాలావరకు నామమాత్రంగా ఉన్న చక్రవర్తులకు వారు ప్రతినిధులు. 16వ శతాబ్దంలో జపాన్ ప్రభువుల మధ్య జరిగిన సివిల్ వార్ లో విజేతలుగా వారు పాలనా పగ్గాలు చేపట్టారు.
వారి పాలనలో ప్రభుత్వానికి విధేయులైన కిందిస్ధాయి మిలట్రీ ప్రభువులు స్వంత ప్రాంతాలను పాలించారు. వాటిని హాన్ అంటారు. సమురాయ్ లు యుద్ధం చేసే తరగతికి చెందినవారు. వారు హాన్ లకు పరిపాలన మరియు రక్షణ బాధ్యతలు నిర్వహించారు.
సమురాయ్ లు రైతాంగ మెజారిటీని దోపిడి చేశారు. వారు స్వేచ్ఛగా వివిధ వృత్తులు చేపట్టడంపై నిషేధం విధించబడింది. షోగన్ లు విదేశీయులతో సంబంధాలను నిషేధించారు. 16వ శతాబ్దం నాటి యూరోపియన్ లు పెట్టుబడిదారులుగా కంటే ఎక్కువగా సుదూర ప్రాంతాల వ్యాపారులు. పైగా జపాన్ వారికి భౌగోళిక పరిమితులకు ఆవల ఉంది. దానితో షోగన్ లు విదేశీయులతో సంబంధాలను నిషేధించడంలో సఫలం అయ్యారు.
19వ శతాబ్దంలో పెట్టుబడిదారీ విధానం నిలదొక్కుకున్నాక, 1840ల నాటి ఓపియం యుద్ధాల అనంతరం చైనా ఓడించబడి లొంగుబాటుకు గురయింది. దానితో షోగన్ లకు తమ పరిస్ధితి ఏమిటో అర్ధం అయింది. అదే సమయంలో రైతాంగం తిరుగుబాట్లు లేవదీసింది. వర్గ ఉద్రిక్తతలు పెరిగాయి.
అప్పటి జపాన్ షోగన్ తోకుగావా యోషినొబు అమెరికా నావికా బలం చూసి ఖంగు తిన్నాడు. అమెరికా రుద్దిన అవమానకర ఒప్పందాలను అంగీకరించాడు. దానితో వారి సామాజిక వ్యవస్ధ బలహీనత లోకానికి వెల్లడి అయింది.
అయితే సమురాయ్ లు లొంగుబాటును అంగీకరించలేదు. “బార్బేరియన్లను తరిమి కొట్టండి, చక్రవర్తి గౌరవాన్ని నిలపండి” అన్న నినాదంతో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. 1868లో వాళ్ళు షోగన్ లను పదవీచ్యుతులను కావించారు. చక్రవర్తి పేరు మీదే వారది చేశారు. కొత్త పాలకులు పాత వర్గ వ్యవస్ధను, హాన్ ల అధికారాలను రద్దు చేశారు.
ఇక పన్నులను ప్రభువులకు బదులు ప్రభుత్వాలకు చెల్లించడం ప్రారంభించారు. సమురాయ్ యుద్ధ వీరులకు బదులు జాతీయ సిపాయిలుగా చేరడాన్ని ప్రవేశపెట్టారు.
జపనీయులు “ధనిక దేశం, శక్తివంతమైన సైన్యం” అని నినాదం ఇచ్చారు. ఈ నినాదంతో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నించారు.
19వ శతాబ్దం చివరిలో జపాన్ ప్రభుత్వం రైల్వేలను ప్రవేశపెట్టారు. భారీ పరిశ్రమలు నిర్మించారు. ‘జైబత్సు’ పేరుతో భారీ పారిశ్రామిక మరియు విత్త సంస్ధల కూటములను ప్రోత్సహించారు. తద్వారా పశ్చిమ దేశాలతో మిలట్రీ పరంగా పోటీ పాడడానికి తగిన పునాదిని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. పారిశ్రామిక కర్మాగారాలను నిర్మించడానికి రాజ్యం రైతాంగాన్ని వినియోగించింది. రైతాంగంతో పరిశ్రమలు నిర్మించి వాటిని నూతన పెట్టుబడిదారులకు అప్పగించింది.
మీజీ పునరుద్ధరణ ఈ విధంగా జపాన్ పెట్టుబడిదారీ పూర్వ శిస్తులు చెల్లించే రాజ్య వ్యవస్ధ నుండి నూతన పంధాలో అభివృద్ధి మార్గం పట్టడానికి దోహదపడింది. ఈ నూతన పంధా, సరుకుల ఉత్పత్తి మరియు వ్యాపారీకరణ గణనీయంగా పురోగతి సాధించడానికి మార్గం ఏర్పరిచింది. స్వతంత్ర పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం మునుముందుకే పయనించిన ఐక్య రాజ్యంగా జపాన్ అవతరించింది.
పరాయిల పైన ఆధారపడి అభివృద్ధి చెందే అర్ధ వలస పంధాను మీజీ పునరుద్ధరణ నిరోధించింది. తద్వారా జపాన్ ఒక దూకుడు కలిగిన పారిశ్రామిక పెట్టుబడిదారీ శక్తిగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం చేసింది.
జపనీయ అరిస్టోక్రాట్ సమాజంలో పై అంతస్ధులో ఉన్న షోగన్ ల వ్యవస్ధ గానీ దైమియో (విస్తారమైన భూములకు యజమానులు. వీరు షోగన్ లకు మాత్రమే విధేయులు. భూముల రక్షణకు సమురాయ్ లను నియమించుకునేవారు. -అను) వ్యవస్ధ గానీ ఇందులో ఎలాంటి ప్రగతిశీల పాత్రా పోషించలేదు. వారిని ఆధిపత్యం నుండి కూలదోసినప్పటికీ తమ ఆధిపత్యం వదులుకున్నందుకు వారికి భారీగానే ముట్టజెప్పారు.
యుద్ధవీరులుగా మన్ననలు అందుకున్న సమురాయ్ లు (వీరు తమ సేవలకు ప్రతిఫలంగా షోగన్, దైమియో ల నుండి ప్రధానంగా కొద్దిపాటి భూములను పొందారు.) కొన్నిసార్లు తిరుగుబాట్లు చేశారు. కానీ తమ సౌకర్యాలను నిలబెట్టుకోవడానికి విఫలయత్నాలు చేశాక వారిలో ఎక్కువమంది శాంతియుతంగా లొంగిపోయి దారికొచ్చారు. సమురాయ్ లుగా తాము అనుభవించిన సౌకర్యాలను రద్దు చేసుకోవడానికి అంగీకరించారు. జనం మాత్రం ఇరువైపులా సైనికులుగా పనిచేసినప్పటికీ ‘ఆధిపత్య వర్గాల నియంత్రణ’లోనే వారు పని చేశారు.
గ్రామాల జనాలు తమ నిర్దిష్ట డిమాండ్ల కోసం ఈ కాలమంతటా తిరుగుబాట్లకు సిద్ధంగా ఉండేవారు. కానీ రాజకీయ పరివర్తనలలో వారు ఎప్పుడూ స్వతంత్రంగా పాల్గొన్న చరిత్ర లేదు. జనం తమ సొంత డిమాండ్లు నెరవేర్చుకోవడానికి నిర్ణయాత్మకంగా సిద్ధపడ్డ ప్రమాదం తలెత్తినపుడు ‘విప్లవాత్మక సమురాయ్’ లు కాస్తా వారికి వ్యతిరేకంగా పనిచేసేవారు. రైతాంగ తిరుగుబాట్లను అణచివేయడానికి కూడా సమురాయ్ లు ప్రభుత్వాలకు సహాయం చేశారు.
దీనికి కారణం సమురాయ్ లను భూములనుండి వేరుపరచడం వలన కావచ్చు. పాత హయాంలోని రాజకీయ శక్తులన్నీ రాజధానిలో షోగన్ లు మరియు వివిధ హాన్ ల చేతుల్లో కేంద్రీకరించబడడం వల్ల కావచ్చు. ఈ కాలమంతటా వ్యవసాయ ఉత్పత్తి మెల్లగా వృద్ధి చెందుతూపోవడం వలన పట్టణాలలో ఏ కాలంలోనూ గణనీయమైన ఆహార సంక్షోభం ఏర్పడలేదు. అందువలన రైతాంగం యొక్క తిరుగుబాటు ధోరణికి పట్టణాలలో మిత్రులు లభించలేదు.
నూతన జపాన్ రాజ్య నాయకులు పాత హయాంలోని శిస్తువారీ ఉత్పత్తి విధానానికి న్యాయ మరియు రాజకీయ మద్దతు అందకుండా ఒక పద్ధతి ప్రకారం నాశనం చేశారు. జపాన్ లోని పెట్టుబడిదారీ పూర్వ సమాజాల యొక్క రెండు లక్షణాలను ప్రత్యేకంగా గమనించాలి. మొదటిది: సమురాయ్ లు ఒక వర్గంగా భూ యజమానులుగా మారకుండా నిరోధించబడ్డారు. రెండవది: తోకూగావా బకు-హాన్ వ్యవస్ధ చట్రంలోనే ఆర్ధిక జీవనం వ్యాపారీకరణ చెందే ఒక విస్తారమైన ప్రక్రియ సంభవించింది. ఇది జపాన్ లో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి పురోగమనం సాధించడానికి అత్యంత సానుకూలమైన భూమికను ఏర్పరిచింది.
1860లలో ఉత్పత్తిదారుల వారీగా వినియోగం ఇలా ఉంది:
వరి – 10% నుండి 30% వరకు (అనగా వరి ఉత్పత్తి చేసినవారు తమ ఉత్పత్తిలో 10 నుండి 30 శాతం మాత్రమే సొంత వినియోగానికి వాడుకున్నారు అని అర్ధం -అను)
మొత్తం పంటలు – 31% నుండి 42% (పై విధంగానే)
జపాన్ వ్యవసాయ రంగం పండిందంతా తినడానికే సరిపోయే ఆర్ధిక వ్యవస్ధ నుండి వాణిజ్య (మిగులు) ఉత్పత్తి చేసే స్ధాయికి పరివర్తన చెందింది. మొత్తంగా చూస్తే పండినదానిలో సగానికి పైగా ఒక్కోసారి బహుశా మూడింట రెండు వంతుల వరకు రైతులే నేరుగా గానీ లేదా ఉత్పత్తులను పన్నుల రూపంలో పొందినవారు గానీ మార్కెట్ కు తరలించారు. దీనికి అదనంగా రైతుల్లో అనేకమంది గ్రామీణ పారిశ్రామిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉండేవారు. (వక్కాణింపు రచయితదే)
సమురాయ్ లకు రెవిన్యూ మరియు శ్రమ శక్తిల పైన స్వతంత్ర నియంత్రణ లేకుండా దూరంగా ఉంచారు. స్ధానికంగా సార్వభౌమత్వం ప్రకటించుకుని కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని సవాలు చేయడానికి జంకర్లు గానీ, గొప్ప బ్యారన్లు గానీ లేరు. సమురాయ్ లకు తమ ప్రయోజనాలన్నీ రాజ్యం సేవలతోనే ముడిపడి ఉంటాయి తప్ప ఎస్టేట్లకు కాదు. జాతీయ రాజ్యంతో పాటు శక్తివంతమైన వర్తక బూర్జువాల ఐక్యతతో కూడా సమురాయ్ ల ఉనికి గుర్తించబడడం, తోకుగావా కాలంలో అప్పటికే సిద్ధం చేయబడిన వైవిధ్య పరిశ్రమలు సంస్ధాగతంగా వ్యవస్ధీకృతం కావడం… ఇవి మీజీ పునరుద్ధరణ దరిమిలా రాజ్యం కేంద్రంగా పారిశ్రామికీకరణ సాధించడానికి మార్గం ఏర్పరిచాయి.
*** *** ***
మొదటి 5 భాగాల కోసం కింది లింక్ లలోకి వెళ్ళండి
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 1
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 2
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 3