పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం


(2000 సం.ము మార్చి 24-25 తేదీల మధ్య రాత్రి దినాన కాశ్మీర్ కు చెందిన 5గురు అమాయక యువకులు సైనికుల కరకు గుళ్ళకు బలై చనిపోయారు. వారు సీమాంతర ఉగ్రవాదులని సైన్యం దేశానికి చెప్పింది. కాదు వారు అనంత్ నాగ్ ఏరియా నివాసులని సి.బి.ఐ నిర్ధారించింది. సైన్యం AFSPA చట్టాన్ని కవచంగా తెచ్చుకోగా సుప్రీం కోర్టు సరేనంది. కోర్టు మార్షల్ అయినా చెయ్యాలంది. ఆ కోర్టు మార్షల్ మొన్న ముగిసింది. తమవాళ్లు తప్పు చేయలేదని నిర్ధారించి కేసు మూసేసింది. ఈ అంశంపై ది హిందూ పత్రిక ఈ రోజు -జనవరి 27, 2014- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)  

***          ***          ***

జమ్ము & కాశ్మీర్ లోని పత్రిబాల్ లో చోటు చేసుకున్న అప్రతిష్టాకర బూటకపు ఎన్ కౌంటర్ లో ఐదుగురు పౌరులు మరణించడానికి దారి తీసిన కేసులో తమ అధికారులపై దాఖలు చేసిన కేసులను మూసేయడం ద్వారా భారత సైన్యం తమను తాము కీర్తిప్రతిష్టలతో ఏమీ కప్పిపుచ్చుకోలేదు. 2000 నాటి ఈ ఘటనపైన తీవ్ర ఆందోళనల అనంతరం పరిశోధన బాధ్యత చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక బ్రిగేడియర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు మరియు 7-రాష్ట్రీయ రైఫిల్స్ దళ సుబేదారు… అంతా కలిసి అనంత్ నాగ్ ప్రాంతం నుండి పౌరులను పట్టుకొచ్చి నెత్తుటి మడుగులో కాల్చి చంపి ఎన్ కౌంటర్ గా కట్టుకధ అల్లారని నిర్ధారించింది. ఆ ఐదుగురు పౌరులు విదేశీ మిలిటెంట్లు అనీ, అప్పటికి కొద్ది రోజుల క్రితం చత్తీసింగ్ పురా లో జరిగిన సిక్కుల ఊచకోతకు వారే పాల్పడ్డారని పోలీసులకు అబద్ధం చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ, అత్యున్నత సైన్యాధికారుల మద్దతుతో సి.బి.ఐ నిందించిన అధికారులు సి.బి.ఐ ఛార్జీ షీటును సవాలు చేశారు. ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (AFSPA) ప్రకారం తమను విచారించాలంటే మొదట అనుమతి తీసుకోవాలని వారు వాదించారు.

ఈ న్యాయ పోరాటం సంబంధిత ముగింపుకు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు సదరు అధికారుల వాదనను సమర్ధించింది. అధికారులను విచారించడానికి అనుమతి అన్నా ఇవ్వాలనీ లేదా తామే వారిని కోర్టు మార్షల్ ద్వారా విచారించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. 2001లో కూడా సైన్యానికి ఇదే అవకాశం ఇవ్వబడింది. కానీ న్యాయ పోరాటాన్ని సుదీర్ఘకాలంపాటు పొడిగించడానికే సైన్యం మొగ్గు చూపింది. ఈసారి, గోడకు కొట్టినట్లు అది మళ్ళీ తమవైపుకే రావడంతో సైన్యం (సుప్రీం కోర్టు ఇచ్చిన) రెండో అవకాశాన్ని ఎంచుకుంది. సైనిక కోర్టు సైతం మహా అతిశయంతో “రికార్డు చేయబడిన సాక్ష్యం నిందితుల్లో ఏ ఒక్కరూ నేరం చేసినట్లుగా ప్రాధమికంగా నిరూపించలేకపోయిందని” చెబుతూ కేసు ముగించింది. ఈ ముగింపు సి.బి.ఐ పరిశోధన చేసిన నిర్ధారణకు సరిగ్గా విరుద్ధం, కానీ ఆశించింది కూడా ఇంతకు మించిందేమీ కాదు. న్యాయం జరిగవచ్చన్న చనిపోయినవారి కుటుంబాల చివరి ఆశ ఆ విధంగా సమాధి చేయబడింది.

మచ్చిల్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఉన్నారని ఆరోపణలు వచ్చిన ముగ్గురు సైనికాధికారులపై కోర్టు మార్షల్ నిర్వహించాలని ఆదేశించినందుకు ఇటీవల డిసెంబర్ 2013 నెలలోనే సైన్యం తన భుజం తానే చరుచుకుంది. తమ మానవ హక్కుల రికార్డును మెరుగుపరుచుకునేందుకు తాము సుముఖంగానే ఉన్నామనడానికి ఇదే రుజువు అని చాటుకుంది. కానీ అనేక న్యాయపరమైన చిక్కులు, మలుపులు దాటుకుని కూడా చివరికి నిందితులైన అధికారులందరినీ నిర్దోషులుగా తేల్చిపారేసిన పత్రిబాల్ కేసు దానికి సరిగ్గా వ్యతిరేక సందేశాన్నే ఇస్తోంది. సాయుధ బలగాల ప్రత్యేకాధ్యికారాల చట్టం ఎందుకు దోషపూరితమైనదో తెలిసేందుకు ఈ కేసే ఒక పాఠ్యగ్రంధ వివరణతో సమానమైన ఉదాహరణ. ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేయాలనడానికి కాకపోతే, కనీసం, ఈ చట్టం ప్రకారం సైన్యాధికారులను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి “ముందస్తు అనుమతి” కావాలన్న నిబంధనను రద్దు చేయాలన్న వాదననైనా ఈ కేసు శక్తివంతం చేస్తోంది.

సైన్యం చేపట్టిన ‘వెల్లవేసే’ (whitewash) కార్యక్రమం కాశ్మీర్ లో మిలట్రీపై అసంతృప్తిని మరింత పెంచడానికే దోహదపడుతుంది. పరాయీకరణ భావనను మరింతగా పెంచి పోషిస్తుంది. దీనిని చక్కగానే అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, “పత్రిబాల్ కేసును మూసివేయడానికి, కొట్టివేయడానికి వీలు లేదు” అని సరిగ్గానే చెప్పారు. కాంగ్రెస్ కీలుబొమ్మగా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత తాజా దోష విమోచనం వలన మరింత రాజకీయ దుమారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాశ్మీరీల మనసులను, హృదయాలను గెలుచుకోవాలన్న విషయంలో కేంద్రం సీరియస్ గా ఉన్నట్లయితే జరిగిన నష్టాన్ని శుభ్రం చేయడానికి రంగంలోకి దిగాలి. కేసును తిరిగి తెరవడానికి తగిన న్యాయమార్గం వెతకాలి. పౌర విచారణకు మార్గాన్ని సుగమం చేయాలి.

3 thoughts on “పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం

  1. పింగ్‌బ్యాక్: పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s