ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్
నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి నుంచి ఉక్రెయిన్ రాజధాని దాదాపు తగలబడుతోంది. మితవాద సంస్ధలు, పార్టీలకు చెందిన కార్యకర్తలు రాజధాని కీవ్ లో పోలీసులతో తలపడుతున్నారు. అనేక విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం గద్దె దిగాలని, వెంటనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ దేశాల్లో జనం కాస్త ఊరేగింపు తీస్తేనే విరుచుకుపడే అమెరికా, ఐరోపా దేశాలు కీవ్ వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్న అరాచక శక్తులకు మద్దతు ఇస్తున్నాయి. పోలీసుల చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఎంత తీవ్రంగా అంటే ఉక్రెయిన్ కు చెందిన వివిధ నేతలు, అధికారులపైన అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించింది. వారి ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఆందోళనలు జరుగుతోంది ఉక్రెయిన్ లో. పెట్రోల్ బాంబులు, బుల్ డోజర్లు, తుపాకులతో విరుచుకుపడుతున్న ఆందోళనకారులను ఎదుర్కొంటున్నది ఉక్రెయిన్ ప్రభుత్వం. మధ్యలో అమెరికాకి ఏం పని? నిజం ఏమిటంటే ఉక్రెయిన్ ఆందోళనలకు ప్రత్యక్ష, పరోక్ష సహాయ, సహకారాలు ఇస్తున్నది అమెరికా, ఇ.యులే. ఉక్రెయిన్, ఇ.యు లో చేరితే భారీ సహజ వనరులు, చమురు నిల్వలు, మార్కెట్ హస్తగతం కావడమే కాకుండా రష్యాను ఒక పని పట్టవచ్చని అమెరికా, ఇ.యులు ఆశించాయి.
(చూడండి: ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా?)
తమ ఆశ కాస్తా తల్లకిందులు కావడంతో పశ్చిమ దేశాలకు మహా కంపరం కలిగింది. ఉక్రెయిన్ ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని పంతం పట్టాయి. దాని ఫలితమే ఉక్రెయిన్ ఆందోళనలు. ఈ ఆందోళనలకు మద్దతుగా జాన్ మెక్ కెయిన్ లాంటి పలువురు అమెరికా సెనేటర్లు కీవ్ వచ్చి మద్దతు ప్రసంగాలు చేసి మరీ వెళ్లారు. పోలాండ్ లాంటి ఇ.యు సభ్య దేశాలు బహిరంగంగానే ఉక్రెయిన్ ఆందోళనకారులకు మద్దతుగా, ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు, పిలుపులు జారీ చేస్తున్నాయి.
ఉక్రెయిన్ ఆందోళనకారుల్లో నియో-నాజీ సంస్ధలు కూడా పాల్గొనడం విశేషం. నాజీ సంస్ధలను జర్మనీలోనే అనుమతించరు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ సంస్ధలు రోడ్డు మీదికి వస్తే అక్కడి ప్రభుత్వాలు నానా గందరగోళం సృష్టిస్తాయి. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం వారిని అనుమతించాలని అమెరికా, ఇ.యు లు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసుల పైకి బుల్ డోజర్లు నడిపిస్తూ, పెట్రోల్ బాంబులు విసురుతూ, తుపాకులతో కాల్పులు జరుపుతూ విధ్వంసాలకు పాల్పడుతున్న యూదు విద్వేష నయా నాజీలను శాంతియుత ఉద్యమకారులుగా అభివర్ణిస్తూ పూర్తి మద్దతు ఇస్తున్నాయి.
ఉక్రెయిన్ లో ఆందోళనలు ప్రధానంగా స్వోబోడా అనే సంస్ధ నేతృత్వంలో జరుగుతున్నాయి. మూడు వేళ్ళు పైకి చూపిస్తూ సెల్యూట్ చేసే నాజీల గుర్తే ఈ సంస్ధ పతకాలపై కనిపిస్తున్నది. వీరు తీవ్ర హింసాత్మక పద్ధతులను పోలీసులపై ప్రయోగిస్తున్నారు. పెద్ద పెద్ద కర్రలు, ఇనుప రాడ్లు చేత బుచ్చుకుని పోలీసులపై దాడులు చేస్తున్నారు. పెట్రోల్ బాంబులను సర్వ సాధారణంగా వినియోగిస్తున్నారు. వీరి హింసాత్మక మార్చింగ్ అడ్డుకోవడానికి పోలీసులు మిలట్రీ తరహాలో ఒకరికొకరు తోడుగా షీల్డ్ లను అడ్డు పెట్టుకుని రక్షణ వలయంగా ఏర్పడాల్సి వస్తోంది. పోలీసుల వలయాన్ని ఛేదించడానికి స్వోబోడా కార్యకర్తలు బుల్ డోజర్లు తెచ్చి వారి మీదికి నడిపిస్తున్నారు. దానితో కీవ్ వీధుల నిండా తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి.
పశ్చిమ పత్రికలు ఉక్రెయిన్ ఆందోళనలకు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఆందోళనకారులకు సలహాలు సూచనలు ఇస్తున్నాయి. ఏ యే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాలో కూడా చెబుతున్నాయి. ఉదాహరణకి వాషింగ్టన్ పోస్ట్ ఎడిటోరియల్ లో ఇలా రాసింది:
ఉక్రెయిన్ ప్రతిపక్షాలకు (ఆందోళనకారులకు) మద్దతు ఇవ్వడం పశ్చిమ దేశాల రాయబారులు కొనసాగించి తీరాలి. అణచివేతకు పాల్పడరాదని యనుకోవిచ్ (ఉక్రెయిన్ అధ్యక్షుడు) ను హెచ్చరిస్తూ, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆందోళనకారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. పార్లమెంటు ఎన్నికలకు యనుకోవిచ్ పూనుకునే అవకాశం ఇంకా ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిగ్గింగ్ కు పాల్పడే అవకాశం ఉన్నప్పటికీ పశ్చిమ దేశాల ఒత్తిడి ద్వారా న్యాయమైన పోటీకి అవకాశం లేకపోలేదు. పుతిన్ ఆడుతున్న ఉక్రెయిన్ ఆట మరో శతాబ్దం నుండి అరువు తెచ్చుకున్న జీరో-సమ్ ఆట మాత్రమే. బందిపోటు రష్యన్, ఉక్రేనియన్ పాలకులను త్రోసిరాజంటూ పశ్చిమ రాజ్యాలు ఉక్రెయిన్ భవిష్యత్తును సొంతం చేసుకునే వ్యూహాలు రచించాలి. ఈ భవిష్యత్తు కీవ్ వీధుల్లో మనం వెతుక్కోవచ్చు.
ఇంతకంటే మించిన సామ్రాజ్యవాద, దురహంకార, జోక్యందారీ సలహా మరొకటి ఉండబోదు. పరాయి దేశ రాజధాని అయిన కీవ్ వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఆందోళనకారుల్లోనే (పశ్చిమ దేశాలకు కావలసిన) ఉక్రెయిన్ భవిష్యత్తు ఉందని దానిని సొంతం చేసుకునే వ్యూహాలు రచించాలని చెప్పే పత్రిక ఏ ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభం కాగలదు? పరాయి దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రజలకు పిలుపు ఇచ్చే పత్రిక చేసేది ప్రజాస్వామ్య విధ్వంసమా లేక నిర్మాణమా?
పశ్చిమ దాసుడి ప్రవాస ప్రభుత్వంపై ధాయ్ ప్రజల తిరుగుబాటు
విచిత్రం ఏమిటంటే ఇదే పత్రిక ధాయిలాండ్ లో జరుగుతున్న ఆందోళనలను తిట్టిపోస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం మూడో ప్రపంచ దేశాలలో ఒక దురదృష్టకర ధోరణిగా మారిందని కన్నీళ్లు పెట్టుకుంది. దానికి కారణం అక్కడ ప్రభుత్వం నెరుపుతున్న యింగ్లుక్ షినావాత్ర పశ్చిమ దేశాలకు నమ్మిన బంటు. 2001-2006 వరకు ధాయిలాండ్ ప్రధానిగా బాధ్యత నిర్వహించిన తకసిన్ షినావాత్రకు ఆమె స్వయానా సోదరి.
తకసిన్ షినావాత్ర విదేశాల్లో ఉంటూనే స్కైప్, ఈ మెయిల్, డజను సెల్ ఫోన్ల తో ధాయిలాండ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఈయన వాల్ స్ట్రీట్, ద సిటీ ఆఫ్ లండన్ కంపెనీలకు మాత్రమే జవాబుదారీ. పశ్చిమ దేశాల ప్రయోజనాలకు ధాయిలాండ్ ను పూర్తిగా దాసోహం చేసిన చరిత్ర తకసిన్ సొంతం. ఆయన నిరంకుశ విధానాలు నచ్చని దాయిలాండ్ ప్రజలు 2006లో తిరుగుబాటు చేసి మిలట్రీ సహకారంతో కూల్చివేశారు. అనంతరం ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూల్చడంలో తకసిన్ సఫలం అయ్యాడు. ఆయనపై అవినీతి కేసులు రుజువై ధాయ్ కోర్టులు శిక్ష వేయడంతో తాను దాయిలాండ్ కి రాకుండా తన సోదరి యింగ్లుక్ షినావాత్ర ను ప్రధానిగా నిలిపాడు తకసిన్.
యింగ్ లుక్ ప్రభుత్వం తకసిన్ శిక్షను రద్దు చేసి ఆయన తిరిగి ధాయిలాండ్ రావడానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో ధాయిలాండ్ ప్రజలు మళ్ళీ వీధుల్లోకి వచ్చారు. రెండు నెలలుగా ఆందోళలు నిర్వహిస్తూ తకసిన్ బంటుగా వ్యవహరిస్తున్నందుకు యింగ్లుక్ రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలపైన పశ్చిమ పత్రికలు విషం చిమ్ముతున్నాయి. ఒకవైపు కీవ్ వీధుల్లో సాగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి మద్దతు పలుకుతూ అదే నోటితో బ్యాంకాక్ వీధుల్లో అరాచకం రాజ్యమేలుతోందని తిట్టిపోస్తున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ ఎడిటోరియల్ చూడండి:
అనేక యేళ్లుగా పాతుకుపోయిన ధనిక వర్గాలను ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు సవాలు చేసిన మూడో ప్రపంచ దేశాల్లో ప్రజలు ప్రజాస్వామ్య వ్యతిరేక ఆందోళనలు చేయడం ఒక దురదృష్టకరమైన ధోరణిగా ముందుకు వచ్చింది. ఈ వరుసలో తాజాగా ధాయిలాండ్ చేరింది. స్వేచ్ఛగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని గద్దె దిగాలంటూ వేలాది మంది ప్రజలు వీధులకెక్కారు. ఎన్నిక కాని కౌన్సిల్ చేతికి అధికారం ఇవ్వాలని వచ్చే నెల జరగనున్న ఎన్నికలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వం రాజీనామా చేయడమో లేక మిలట్రీ రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని తొలగించడమో చేయాలని ఆందోళనకారుల వ్యూహంగా కనిపిస్తోంది.
ఇటువంటి ఎత్తుగడలే మాజీ ప్రధాని తకసిన్ షినావాత్ర నేతృత్వంలోని ప్రభుత్వాలను కూల్చడంలో రెండుసార్లు సఫలం అయ్యాయి. మూడో ప్రభుత్వం మోసపూరితమైన కోర్టు నిర్ణయం ద్వారా కూల్చబడింది. ఈసారి తకసిన్ సోదరి యింగ్లుక్ షినావాత్ర గట్టిగా నిలబడ్డారు. అలాగే నిలబడాలి కూడా. కాని వీధి మూకలు, ప్రజాస్వామ్య వ్యతిరేక మిలిటెంట్లు… సృష్టించిన ఈ సంక్షోభం నుండి అప్రజాస్వామిక ఫలితం రాకుండా ఆమె అమెరికా నుండి మరింత మద్దతు తీసుకోవాలి.
ఇంతకంటే పచ్చి ద్వంద్వ విధానం ఉంటుందా? ఉక్రెయిన్ లోనేమో పచ్చి నియంతంగా ప్రపంచ చరిత్ర ఛీ కొట్టిన హిట్లర్ వారసులను ప్రజాస్వామ్య ఉద్యమకారులుగా సర్టిఫికేట్ ఇస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూల్చాలంటూ పిలుపు ఇవ్వడం, ధాయిలాండ్ లోనేమో జనమే పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తుంటే వారిని ‘వీధి మూకలు’ అనీ, ‘ప్రజాస్వామ్య వ్యతిరేక మిలిటెంట్లు’ అనీ నిందించడం.
ఘోరం ఏమిటంటే తకసిన్ షినావాత్ర అనుకూలురయిన ‘రెడ్ షర్ట్’ మిలిటెంట్లు తుపాకులు చేతబూని విద్యార్ధులపై కాల్పులు జరిపి చేసిన హత్యలను ఆందోళనకారులు చేసినవిగా పశ్చిమ పత్రికలు ప్రచారం చేయడం. ధాయిలాండ్ లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చినా హింసాత్మక చర్యలకు పూనుకోలేదు. అదే సమయంలో ‘రెడ్ షర్ట్’ పేరుతో ప్రభుత్వ అనుకూల అరాచకులు హింసాత్మక చర్యలకు దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న యూనివర్సిటీ విద్యార్ధులపైకి కాల్పులు జరిపి ఇద్దరినీ చంపేశారు. ఈ హత్యలను ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులపైకి నెట్టివేస్తూ పశ్చిమ పత్రికలు విషప్రచారం సాగిస్తున్నాయి. సిరియాలో టెర్రరిస్టులు సాగిస్తున్న పేలుళ్లు, సామూహిక దహనాలు, ఊచకోతలను బాషర్ ప్రభుత్వం మీదికి నెట్టివేసినట్లుగా.
వాషింగ్టన్ పోస్ట్ చెప్పినట్లుగా యింగ్ లుక్ షినావాత్ర ప్రభుత్వం స్వేచ్ఛగా నడుస్తున్న ప్రభుత్వం కాదని కొన్ని అమెరికా పత్రికలు కూడా అంగీకరించే సత్యం. ఉదాహరణకి న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ఈ వార్త చూడండి.
In Thailand, Power Comes With Help From Skype
సామూహిక హత్యలకు బాధ్యుడుగా ధాయ్ కోర్టులు నిర్ధారించిన తకసిన్ షినావాత్ర స్కైప్, డజను సెల్ ఫోన్ల ద్వారా ధాయ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని అమెరికా, ఐరోపా పత్రికలు సగర్వంగా చెప్పుకుంటాయి. శిక్ష తప్పించుకోవడానికే తకసిన్ షినావాత్ర విదేశాలకు పారిపోయాడన్నది బహిరంగ రహస్యం. అనగా పారిపోయిన హంతక ఖైదీ అన్నట్లు! ఇలాంటి రోసేసిన వ్యక్తి సొంత జెట్ విమానంలో పశ్చిమ దేశాలు చుట్టేస్తూ నడుపుతున్న ప్రభుత్వాన్ని స్వేచ్ఛాయుత ప్రభుత్వంగా వాషింగ్టన్ పోస్ట్ కొనియాడుతోంది. కనీసం దేశంలో కూడా లేని వ్యక్తి స్కైప్ ద్వారా ప్రభుత్వం నడుపుతుంటే దాన్ని ప్రజాస్వామ్యయుత ప్రభుత్వంగా కొనియాడే పత్రిక ఎంతకు దిగజారితే ఆ పని చేస్తుంది?!
పశ్చిమ దేశాల, పత్రికల ప్రజాస్వామ్య బోధనల హిపోక్రసీని వర్తమానంలో నలుగుతున్న రెండు దేశాల ఆందోళనలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
Good article
చాలా మంచి విశ్లేషణ. ఇటువంటి మీ దైన విశ్లేషణలు మరిన్ని వెలికితీయండి.
baagundi
finally my hunt for unbiased analysis reached its destination… thank you sir.
this site needs popularity so, friends please share the truth. in ramayana there is a saying “manchi ekkada unna danni panchu chedu ni akkade thunchi vesey” so tell your friends to read these articles.. it is really writer’s great effort we seldom see such courage and quality in blogs.. once again thanks alot.