“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.”
–
తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం కూడా కలిగిస్తున్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది.
రాజకీయాల్లో ఎవరి శైలి వారిదే అయినా జనం దృష్టిని, పత్రికల దృష్టిని ఎప్పుడూ తమపైనే ఉండేట్టు చూసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కొందరు అట్టే ప్రయత్నం లేకుండా అలవాటుగా, అలవోకగా పత్రికల్లో చోటు సంపాదిస్తుంటారు. గతంలో ఎన్.టి.ఆర్ సరికొత్త ప్రవర్తనలతో, అవతారాలతో, ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లోనూ, కార్టూనుల్లోనూ జీవించి ఉండేవారు. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో, హాస్యస్ఫోరక ప్రకటనలతో వార్తల్లో నిలిచేవారు. గడ్డి కుంభకోణం పుణ్యమాని ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నా ఆయన పత్రికల్లో ప్రభ మాత్రం కొనసాగించారు. ఈ మధ్య ఆయన కంటిలో నలుసైపోయారు.
మాయావతి స్టైలే వేరు. ప్రజలకు అభివాదం చేయడం దగ్గర్నుండి బ్యూరోక్రాట్ అధికారుల చేత గుంజీలు తీయించడం వరకు ఐదేళ్ల పాటు ఆమె ఉత్తర ప్రదేశ్ లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించారు. తాను జీవించి ఉండగానే పెద్ద ఎత్తున విగ్రహాలు నెలకొల్పుకుని పత్రికలకు బోలెడు మేత వేశారు. పార్కులని, అంబేడ్కర్ విగ్రహాలని వివిధ నిర్మాణాలు వినూత్న తరహాలో చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న అపప్రధనూ మూటగట్టుకున్నారు. అంతిమంగా ఏం చేసినా కార్టూనిస్టుల గీతల్లో నిత్యం జీవనదై ప్రవహించారు.
ఎన్.డి.ఎ భాగస్వామిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడల్లా మోడితో ఘర్షణ పడుతూ వార్తల్లో నిలవడం నితీష్ కుమార్ ప్రత్యేకత. బీహార్ రాష్ట్ర వెనుకబాటుతనాన్ని గ్లామరైజ్ చేసిన ఘనత కూడా ఆయనదే. బీహార్ సామాజిక పరిస్ధితులను అంతకుముందు లాలూ ప్రసాద్ తన శైలిలో డీ-గ్లామరైజ్ చేస్తే నితీష్ కుమార్ తద్విరుద్ధంగా గ్లామరైజ్ చేశారు. వెనుకబడి ఉన్నాం కాబట్టి భారీగా నిధులు ఇవ్వాలని కేంద్రంతో సంవత్సరాల తరబడి తలపడుతూనే భారత దేశ అభివృద్ధికి తమ రాష్ట్రాన్ని నమూనాగా నిలపడంలో గుజరాత్ తో పోటీ పడడం నితీష్ విశిష్టత. ఇంతకీ బీహార్ వెనకబడిందో, ముందు పడిందో నితీష్ మాటల్లో అర్ధం చేసుకోవడం ఒకింత కష్టం. నితీష్ ప్రత్యేకత అదే మరి!
వీళ్ళంత కాకపోయినా శక్తివంతమైన యువ నాయకుడుగా ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో దూసుకొచ్చిన అఖిలేష్ యాదవ్, ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా తీరా తండ్రి చాటు పదవిగా నిర్వహిస్తూ ప్రత్యేకత చాటుకున్నాడు. మతకల్లోలాలు చెలరేగినా, పోలీసు అధికారులే హత్యలకు గురయినా శాంతి భద్రతల అదుపులో తమను మించినవారు లేరనడం ఈ యువనేతకే చెల్లు. శాంతి భద్రతలు ప్రధాన సమస్యగా చూపి అధికారంలోకి వచ్చిన అఖిలేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఆయన అనుచరగణం హత్యలకు, దొమ్మీలకు పాల్పడ్డారు. అడపా దడపా తండ్రి చేత మొట్టికాయలు తినడం యు.పి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వినూత్న ఆచరణ.
ఇప్పుడు వీరందరికీ పోటీగా మారారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నది లగాయితు ఎఎపి గానీ, ఆ పార్టీ నేత అరవింద్ గానీ వార్తల్లో నిలవని రోజు అరుదనే చెప్పాలి. ఇతర నేతలకు భిన్నంగా తాను ఏం చేసినా ప్రజల ప్రయోజనాలకే కట్టుబడి చేస్తున్న చర్యలే అన్న నమ్మకాన్ని తెచ్చుకోవడం అరవింద్ ప్రత్యేకత.
ఇలాంటి ప్రత్యేకత తెచ్చుకోవడం చాలా కష్టం. అధికారం రాకముందు వరకూ అయితే పాలక పార్టీపై వాడి, వేడి విమర్శలు సంధించి, ఆందోళనలు నిర్వహించి ప్రజానుకూలురన్న పేరు తెచ్చుకోవడం తేలిక. ఒకసారి అధికారం అంటూ వచ్చాక ఇక ప్రజల జోలికి రాకపోవడం ఇతర రాజకీయ నాయకులు చేసే పని. అధికారం చిక్కాక సంపాదనలో పడిపోతారు గనక వారికిక ప్రజలతో పని ఉండదు. వాళ్లేమి చేసినా ఐదేళ్ల వరకు జనం ఏమీ చేయలేరు గనక వారు ఆడిందే ఆట, పాడిందే పాట. అయితే ఆ క్రమంలో వారు పత్రికల్లో జొరబడడం తక్కువైపోతుంది. ఆ అవసరం కూడా వారికి ఉండదు కదా!
కానీ కేజ్రీవాల్ ఇందుకు భిన్నం. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాక కూడా 30 గంటలు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేయడమే కాకుండా ఒక రాత్రంతా ఢిల్లీ రోడ్డుపై పడుకుని సంచలనం సృష్టించారు అరవింద్ కేజ్రీవాల్. అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి మీటర్ వైర్ కత్తిరించి వార్తల్లో నిలిచిన అరవింద్, అధికారంలోకి వచ్చీ రాగానే విద్యుత్ చార్జీల్ని సగానికి కత్తిరించి తన వార్తా విలువ తగ్గలేదని చాటుకున్నారు. డెన్మార్క్ యువతిపై అత్యాచారం జరిగినప్పుడు మరో ముఖ్యమంత్రయితే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితిలో ఉండేవారు. కనీసం ‘బాధ్యత నాది కాదు, ఢిల్లీ పోలీసులది మొర్రో’ అని మొత్తుకుంటూ అయినా ఛానెళ్ల ముందు నిలబడేవారు.
కానీ అరవింద్ మాత్రం తన నియంత్రణలో లేని పోలీసులపై యుద్ధం ప్రకటించడమే కాకుండా ఆందోళనకు దిగి నేర నియంత్రణ తన చేతుల్లో లేదని ఆచరణాత్మకంగా చూపారు. పైగా సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితికి కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను నేట్టారు. కోర్టులు, పోలీసులు ఎఎపి నేతలపై ఎఫ్.ఐ.ఆర్ లు కడితే కట్టొచ్చు గానీ జనం మాత్రం తమ డిమాండ్ పట్టింపుకు నోచుకుందని సంబరపడ్డారు. ఆ మేరకు ఢిల్లీ ప్రభుత్వం జనం నమ్మకం నిలుపుకోవడంలో ఇప్పటి వరకూ విజయులయ్యారని చెప్పకతప్పదు. ఆంగ్ల మీడియా, ముఖ్యంగా ఆంగ్ల ఛానెళ్లు మాత్రం ధర్నా విషయంలో ఎఎపి/అరవింద్ వెనక్కి తగ్గారని చెప్పడానికే ఇష్టపడుతున్నాయి. అయితే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు… మొత్తం మీద వార్తల్లో, ముఖ్యంగా కార్టూన్లలోనూ, ఆంగ్ల ఛానెళ్లలోని పేరడీలలోనూ అరవింద్ ఇంకా హాట్ గానే ఉన్నారు.
అందుకే పాత కాపులు ఆందోళన చెందుతున్నారు (కార్టూన్ లో)!
పట్టమేలె రాజుపోయెను
మట్టి కలిసెను కోటపేటలు
పదం, పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్..
అని కన్యక లో గురజాడ గారు చెప్పినట్టు మహామహా రాజులే చరిత్ర పేజీల కింద నలిగిపోయారు. ఈ మరుగుజ్జులు, కుక్కమూతి పిందెలు ఎంతకాలం నిలబడతారు.
దేశంలో ఇప్పుడే మార్పు పవనాలు మొదలయ్యాయి. మరో పదేళ్లలో ఊహించని మార్పులు రావడం ఖాయం. అప్పుడు ఈ దొంగ రాజకీయ నేతలని ఆఖరుకు దొంగలు కూడా గుర్తుంచుకోరు.